హరియాణా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 30 ఏళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా ఎలా దాక్కున్నాడు? చివరికి ఎలా చిక్కాడు?

ఓం ప్రకాష్
ఫొటో క్యాప్షన్, పోలీసు కస్టడీలో ఉన్న ఓం ప్రకాష్.. తన మీద ఆరోపణలపై స్పందించలేదు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

అతడి పేరు ఓం ప్రకాష్. పాషా అని కూడా పిలుస్తారు. మాజీ సైనికోద్యోగి. హరియాణా రాష్ట్ర పోలీసుల 'మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్' జాబితాలో అతడి పేరు ఉంది.

ఒక దోపిడీ - హత్య కేసులో నిందితుడు. అతడు కళ్లముందే ఉన్నా 30 ఏళ్ల పాటు పోలీసులు పట్టుకోలేకపోయారు. పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కొత్త పేరుతో అధికారిక పత్రాలు సంపాదించుకున్నాడు. కొత్త జీవితం ప్రారంభించాడు. స్థానిక మహిళను పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడు.

ఇప్పుడు అతడి వయసు 65 సంవత్సరాలు. ఘాజియాబాద్ నగరంలోని ఓ స్లమ్‌లో నివసిస్తున్న అతడిని చివరికి గత వారంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టయ్యే వరకూ ఓం ప్రకాష్ అనేక రకాల వృత్తులు చేశాడని పోలీసులు చెప్పారు. ట్రక్ డ్రైవర్‌గా పనిచేశాడని, మత క్రతువుల్లో భక్తిపాటలు పాడే సంచార బృందం సభ్యుడిగా ఉన్నాడని తెలిపారు. అంతేకాదు.. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన 28 స్థానిక సినిమాల్లో కూడా అతడు నటించినట్లు వెల్లడించారు.

ఓం ప్రకాష్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించలేదు. అయితే.. అతడు నిందితుడిగా ఉన్న 1992 నాటి హత్య కేసులో తనతో పాటు మరొకరు ఉన్నారని, అతడే అసలు నిందితుడని ఓం ప్రకాష్ ఆరోపిస్తున్నట్లు సబ్-ఇన్‌స్పెక్టర్ వివేక్ కుమార్ బీబీసీకి చెప్పారు.

ఓం ప్రకాష్‌ని అరెస్ట్ చేసిన హరియాణా స్పెషల్ టాస్క్ ఫోర్స్‌లో ఎస్ఐ వివేక్ సభ్యుడు.

ఓం ప్రకాష్ అరెస్ట్ వార్త పతాక శీర్షికల్లో ప్రచురితమైన రెండు రోజుల తర్వాత.. అతడి కుటుంబాన్ని వెదుక్కుంటూ నేను వెళ్లాను. ఈ ఉదంతంలో వారి కథనం ఏమిటో తెలుసుకోవటానికి, ఆయనకు మద్దతుగా వారు ఏం చెప్తారో తెలుసుకోవటానికి వెళ్లాను.

ఓం ప్రకాష్
ఫొటో క్యాప్షన్, ఓం ప్రకాష్ 28 సినిమాల్లో నటించాడు.. పోలీసు వేషం కూడా వేశాడు

జనసమ్మర్థంతో నిండిన హర్బాన్స్ నగర్ స్లమ్‌లో ఇరుకుగా గజిబిజిగా ఉండే సందుల్లో చాలా ఇళ్లు ఉన్నాయి. ఆ ఇళ్లకు నంబర్లు ఓ వరుసలో లేవు. ఓం ప్రకాష్ ఇంటిని తెలుసుకోవటానికి, ఆయన కుటుంబ సభ్యులను వెదికి పట్టుకోవటానికి నాకు మూడున్నర గంటల సమయం పట్టింది.

ఓం ప్రకాష్ భార్య రాజకుమారిని కలిశాను. వారికి పెళ్లయి పాతికేళ్లయింది. వారి ముగ్గురు పిల్లల్లో ఇద్దరిని కూడా కలిశాను. కొడుకు వయసు 21 సంవత్సరాలు. కూతురు వయసు 14 ఏళ్లు.

రాజకుమారి పడకగదిలో పరుపు కింది నుంచి ఒక హిందీ వార్తాపత్రికను బయటకు తీశారు. తన భర్త మీద గల ఆరోపణల వివరాలు ఆ పత్రికలో ఉన్నాయి. తాము ఇంకా షాక్‌లోనే ఉన్నామని చెప్పారు. తన భర్త గతంలో 'నేర చరిత్ర ఆరోపణల' గురించి తమకు ఏమాత్రం తెలియదన్నారు. బయటపడుతున్న అంశాలను అర్థం చేసుకోవటానికి, అంగీకరించటానికి తాము ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నామన్నారు.

ఓం ప్రకాష్‌ను సమర్థిస్తూ ఆయన కుటుంబం ఏమన్నా చెప్తుందని నేను ఆశించినట్లయితే.. అది నిరర్థకమే అవుతుంది. ఎందుకంటే.. అతడి గురించి మంచిగా చెప్పటానికి ఆ కుటుంబ సభ్యుల దగ్గర ఏమీ లేదు.

అతడు తమను మోసం చేశాడని వారు కూడా ఆరోపిస్తున్నారు. ''అతడికి అప్పటికే పెళ్లయిందని, హరియాణాలో అతడికి ఓ కుటుంబం ఉందని తెలియకుండా 1997లో అతడిని నేను పెళ్లిచేసుకున్నా'' అని రాజకుమారి ఆరోపించారు.

ఓం ప్రకాష్
ఫొటో క్యాప్షన్, ఓం ప్రకాష్ కొడుకు.. తమ కుటుంబ ఆల్బంలోని తన తండ్రి ఫొటోను చూపించారు

ఓం ప్రకాష్ ఎవరు? అతడి మీద ఆరోపణలేమిటి?

ఎస్ఐ వినోద్ కథనం ప్రకారం.. హరియాణాలోని పాణిపట్ జిల్లాలో నారైనా గ్రామ నివాసి ఓం ప్రకాష్. ''అతడు భారత సైన్యంలోని స్పెషల్ కోర్‌లో 12 సంవత్సరాల పాటు ట్రక్ డ్రైవర్‌గా పనిచేశాడు. తర్వాత నాలుగేళ్ల పాటు విధులకు గైర్హాజరు కావటంతో 1988లో అతడిని ఆర్మీ నుంచి డిస్మిస్ చేశారు'' అని తెలిపారు.

ఓం ప్రకాష్ నిందితుడని ఆరోపిస్తున్న హత్య ఉదంతానికి ముందు కూడా అతడు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్లు వినోద్ కుమార్ చెప్పారు. 1986 లో ఒక కారు దొంగిలించాడని, నాలుగేళ్ల తర్వాత ఒక మోటార్‌బైక్‌ను, ఒక కుట్టు మిషన్‌ను, ఒక స్కూటర్‌ను తస్కరించాడని ఆరోపించారు. ఈ నేరాలు హరియాణాలోని వేర్వేరు జిల్లాల్లో జరిగాయని, కొన్ని కేసుల్లో అతడు అరెస్టయ్యాడని, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడని వివరించారు.

1992 జనవరిలో ఓం ప్రకాష్, మరొక పురుషుడు కలిసి.. బైక్ మీద ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని దోపిడీకి ప్రయత్నించారని ఎస్‌ఐ చెప్తున్నారు.

''బైక్ మీద వెళుతున్న ఆ వ్యక్తి ప్రతిఘటించటంతో వీరు అతడిని కత్తితో పొడిచారు. గ్రామస్తులు కొందరు తమ వైపు పరుగున రావటం చూసి, వీరు తమ స్కూటర్ వదిలేసి పారిపోయారు'' అని ఆరోపించారు.

ఈ కేసులో రెండో వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. ''ఏడు - ఎనిమిది సంవత్సరాలు జైలులో'' గడిపిన తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడు.

కానీ ఓం ప్రకాష్ కనిపించకుండా మాయమయ్యాడు. ఆ కేసు అటకెక్కింది. అతడిని 'ప్రకటిత నేరస్తుడు'గా పోలీసులు చాటింపువేశారు. అతడి ఫైలు మీద దుమ్ము పేరుకుంది.

ఓం ప్రకాష్‌ను అరెస్టయ్యాక.. ఆ ఆరోపిత హత్య అనంతరం తను ఎలా గడిపిందీ తమకు వివరించాడని పోలీసులు చెప్తున్నారు. వారి కథనం ప్రకారం.. మొదటి ఏడాది దక్షిణాదిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో దేవాలయాల్లో ఆశ్రయం పొందుతూ గడిపాడు.

ఓ సంవత్సరం తర్వాత ఉత్తర భారతదేశానికి తిరిగి వచ్చాడు కానీ ఇంటికి వెళ్లలేదు. తన ఊరికి 180 కిలోమీటర్ల దూరంలో ఘాజియాబాద్‌లో స్థిరపడ్డాడు. అక్కడ ట్రక్కులు నడిపే పని అతడికి దొరికింది.

1990లలో అతడు సినిమాల వీడియో క్యాసెట్ రికార్డర్లు (వీసీఆర్‌లు) అద్దెకు ఇచ్చే, విక్రయించే షాపు నడిపాడని.. ఆ షాపు పేరు మీద స్థానికంగా అతడిని బజరంగ్ బలి అని, బజరంగి అని పిలుస్తారని రాజకుమారి చెప్పారు. 'ఫౌజీ తావు' (సిపాయి మామ) అని కూడా పిలిచేవారు.

అతడు 2007 నుంచి స్థానిక హిందీ భాషా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించటం కూడా చేస్తున్నాడు. గ్రామ పెద్ద, ప్రతినాయకుడు పాత్రలతో పాటు పోలీసు వేషం కూడా వేశాడు.

అతడు నటించిన టాక్రావ్ అనే సినిమాకు యూట్యూబ్‌లో 76 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఆ సినిమాకు సంబంధించిన క్లిప్‌లకు మరిన్ని లక్షల వ్యూస్ కూడా ఉన్నాయి.

''అతడు ఓటరు కార్డు, ఆధార్ కార్డు వంటి అధికారిక పత్రాలను సరికొత్తగా సంపాదించుకున్నాడు'' అని ఎస్ఐ వినోద్ కుమార్ చెప్పారు.

కానీ ఓం ప్రకాష్ ఒక దారుణమైన పొరపాటు చేశాడు. అతడి కొత్త పత్రాలన్నిటిలోనూ అతడి అసలు పేరు, అతడి తండ్రి అసలు పేరు ఉన్నాయి. అవే అతడిని పట్టించాయి.

ఓం ప్రకాష్ ఇంటి వెలుపల రాజకుమారి

రాజకుమారి కథ

ఓం ప్రకాష్‌ 'నేరపూరిత గతం' గురించి అతడి కొత్త కుటుంబానికి కానీ, అతడి ఇరుగుపొరుగు వారికి కానీ తెలియదని పోలీసులు చెప్తున్నారు.

తమ పెళ్లయిన తర్వాత ఓం ప్రకాష్ ఏదో దాస్తున్నాడని తనకు అర్థమైనట్లు రాజకుమారి చెప్పారు.

అతడు తనను నారైనా గ్రామానికి తీసుకు వెళ్లాడు. తన సోదరుడికి, తన కుటుంబానికి ఆమెను పరిచయం చేశాడు. వారు తన స్నేహితులని ఆమెకు చెప్పాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత.. ''అతడి మొదటి భార్య మా ఇంటి ముందు అకస్మాత్తుగా ప్రత్యక్షమై గొడవ గొడవ చేసింది.. అతడికి గతంలోనే పెళ్లయిందన్న విషయం అప్పుడు నాకు తెలిసింది'' అని రాజకుమారి వెల్లడించారు.

''అతడికి వేరే జీవితం ఉందని, ఒక భార్య, ఒక కొడుకు ఉన్నారని, వారిని దాచి పెట్టేశాడని.. నాకు, మా ఇరుగుపొరుగు వారందరికీ అప్పుడే తెలిసింది. మమ్మల్ని దగా చేశాడని మేం బాధపడ్డాం'' అని ఆమె పేర్కొన్నారు.

పెళ్లయిన తర్వాత అతడు చాలా రోజుల పాటు ఇంటికి వచ్చేవాడు కాదని.. ఎక్కువ దూరాలు ట్రక్ నడిపే డ్రైవర్ పని కాబట్టి, ఆ పని మీద వెళ్లాడని తాను భావించేదానిని చెప్పారు. కానీ అతడు తన మరో కుటుంబాన్ని కలవటానికి వెళుతుండటం వల్లే అన్నేసి రోజులు ఇంటికి వచ్చేవాడు కదని ఇప్పుడు ఆమె గట్టిగా చెప్తున్నారు.

వారి సంబంధం దెబ్బతిన్నది. ఈ జంట మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. మళ్లీ 2007లో అతడు కనిపించకుండా మాయమయ్యాడు.

''నేను చాలా విసిగిపోయాను. అతడితో సంబంధాలు తెంచుకున్నా. నేను స్థానిక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి.. అతడితో నాకు ఇక ఏమాత్రం సంబంధం లేదని రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చా. కానీ అతడు ఏడేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. అప్పటి నుంచీ వస్తూ పోతూ ఉన్నాడు'' అని ఆమె తెలిపారు.

''అతడు మమ్మల్ని తిడుతుంటాడు. కానీ అతడు ఎప్పుడు ఇంటికి వచ్చినా మేం అతడికి జాలితో తిండి పెడతాం. ఎందుకంటే అతడు మా నాన్న. పైగా వయసైపోయింది కూడా'' అని అతడి 14 ఏళ్ల కూతురు చెప్పింది.

హరియాణా పోలీసులు గతంలో కూడా ఒకసారి.. ఓ అనుమానిత దొంగతనం కేసులో అతడిని పట్టుకెళ్లారని రాజకుమారి చెప్తున్నారు.

''అప్పుడు ఆరు, ఏడు నెలలు జైలులో ఉన్నాడు. కానీ తిరిగి వచ్చాడు. తన మీద కేసులన్నీ ఎత్తేశారని మాతో చెప్పాడు'' అని ఆమె తెలిపారు.

అలా గతంలో అరెస్టయినా కూడా.. హత్య కేసులో మాత్రం అతడు పరారీ నిందితుల జాబితాలోనే ఉన్నాడు. ఎందుకంటే పోలీసు రికార్డులు చాలా వరకూ డిజిటల్ రూపంలోకి మారలేదు. వేర్వేరు జిల్లాల పోలీసులు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవటం కూడా అరుదుగానే జరుగుతుంది.

పోలీసులు అరెస్ట్ చేశాక ఓం ప్రకాష్‌
ఫొటో క్యాప్షన్, పోలీసులు అరెస్ట్ చేశాక ఓం ప్రకాష్‌

అతడి ఆచూకీని ఎలా కనిపెట్టారు?

హరియాణా రాష్ట్రం 2020లో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాలు, ఉగ్రవాదం కేసులను, అంతర్రాష్ట్ర కేసులను దర్యాప్తు చేయటం ఈ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యం. ఆ క్రమంలో ఓం ప్రకాష్ ఫైలును మళ్లీ తెరిచారు.

అతడిని తమ 'మోస్ట్ వాంటెడ్' నేరస్తుల జాబితాలో టాస్క్ ఫోర్స్ చేర్చింది. అతడిని పట్టించగల సమాచారం అందిస్తే 25,000 రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించింది.

నేరస్తులు చాలా ఏళ్లుగా.. కొన్నిచోట్ల దశాబ్దాల పాటు పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయి.

అయితే.. పాత కేసులకు ఉగ్రవాదానికి సంబంధం ఉంటేనో, సీరియల్ హత్యలతో సంబంధం ఉంటేనో, ఆ కేసుకు సంబంధించి ఏదైనా ఉప్పందితేనో తప్ప అటకెక్కిన కేసులను పోలీసులు మళ్లీ తెరవరని సీనియర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్ట్ అమిల్ భట్నాగర్ పేర్కొన్నారు. ఆయన చాలా ఏళ్లుగా ఘాజియాబాద్‌లో నేర వార్తలు, కథనాలు రాస్తున్నారు.

హరియాణా టాస్క్ ఫోర్స్ ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని ఎందుకు నిర్ణయించుకుందనే అంశంపై పూర్తిగా స్పష్టత లేదు.

కానీ రెండు నెలల కిందట పోలీసులు నరైనా గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ''50లు, 60ల వయసులో ఉన్న గ్రామస్తులతో మాట్లాడారు - అంటే ఓం ప్రకాష్‌ గుర్తుండే అవకాశమున్న వారి దగ్గర ఆరా తీశారు''.

అక్కడే వారికి తొలి ఆధారాలు లభించాయి. ఓం ప్రకాష్ ఓ ఇరవై ఏళ్ల కిందట గ్రామానికి వచ్చాడని, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడో నివసిస్తూ ఉండి ఉండొచ్చని వారికి తెలిసింది.

వారు రెండోసారి ఆ గ్రామానికి వెళ్లినపుడు.. ఓం ప్రకాష్ పేరుతో రిజిస్టరై ఉన్న ఒక ఫోన్ నంబర్ వారికి లభించింది. దానిద్వారా ఎట్టకేలకు అతడి కొత్త అడ్రస్‌ను పోలీసులు పట్టుకోగలిగారు.

''పోలీసులు వారం రోజుల పాటు ఆ ప్రాంతాన్ని గాలించారు. అతడి కొత్త ఇంటిని కనుక్కున్నారు. అతడిని గుర్తుపట్టటం కూడా కష్టమైందని వాళ్లు చెప్తున్నారు. ఎందుకంటే వారి దగ్గర ఉన్న అతడి ఫొటో 30 ఏళ్ల కిందటిది. ఇప్పుడు అతడు చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు'' అని ఎస్ఐ వివేక్ కుమార్ వివరించారు.

''ఈ ఆపరేషన్‌ను అత్యంత రహస్యంగా అమలు చేశాం. ఎందుకంటే.. ఒక్క పొరపాటు చేస్తే అతడు మరో 30 ఏళ్ల పాటు పారిపోతాడని మాకు తెలుసు'' అని ఎస్ఐ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)