‘How To Murder Your Husband’ Author: 'మీ భర్తను చంపటం ఎలా' అని రాసిన రచయిత్రికి భర్తను చంపిన కేసులో జీవితాంతం జైలు శిక్ష

నాన్సీ

ఫొటో సోర్స్, MULTNOMAH COUNTY SHERIFF'S OFFICE

    • రచయిత, శాం కాబ్రాల్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

భర్తను చంపటం ఎలా అని ఆమె రాశారు. భర్తను చంపినందుకు ఆమె జైలుకు వెళుతున్నారు.

ప్రణయ కథల రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ తన క్రైమ్ స్టోరీని ముందే చెప్తున్నట్లుగా 'భర్తను హత్య చేయటం ఎలా' అని ఒక వ్యాసం రాశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు తన భర్తను తుపాకీతో కాల్చి చంపారు. ఇప్పుడు ఆమెకు జీవిత కాలం జైలు శిక్ష విధిస్తూ అమెరికాలోని ఓరెగాన్ జడ్జి ఒకరు తీర్పుచెప్పారు.

నాన్సీ వయసు ఇప్పుడు 71 సంవత్సరాలు. భర్తను హత్య కేసులో ఆమె దోషి అని గత నెలలో కోర్టు నిర్ధారించింది.

ఆమె 26 ఏళ్ల పాటు సహజీవనం చేసిన తన భర్తను 2018లో 15 లక్షల డాలర్ల (సుమారు రూ.11.71 కోట్ల) జీవిత బీమా సొమ్ము కోసం కాల్చి చంపినట్లు జ్యురీ గుర్తించింది.

ఈ నేరానికి ముందు నాన్సీ సస్పెన్స్‌తో కూడిన ప్రణయ కథలతో నవలు రాసి ప్రచురించేవారు. ఆమె రచనల్లో 'ద రాంగ్ హజ్బండ్', 'ద రాంగ్ లవర్' పుస్తకాలు కూడా ఉన్నాయి.

డానియెల్ బ్రోఫీ

ఫొటో సోర్స్, DANIEL BROPHY/LINKEDIN

ఫొటో క్యాప్షన్, హత్యకు గురైన నాన్సీ భర్త డానియెల్

ఆమె భర్త డానియెల్ బ్రోఫీ ఓరెగాన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌లో చెఫ్‌గా, ‘గౌరవనీయమైన’ టీచర్‌గా పని చేసేవారు.

ఆయన 2018 జూన్‌లో ఇన్‌స్టిట్యూట్ కిచెన్‌లో తుపాకీ కాల్పుల గాయాలతో చనిపోయి కనిపించారు. ఆయనను హత్య చేసింది ఆయన భార్య నాన్సీయేనని గత నెలలో కోర్టు నిర్ధారించింది.

ఈ నేరానికి కొన్నేళ్ల ముందు.. 'మీ భర్తను హత్య చేయటం ఎలా' అనే పేరుతో నాన్సీ ఒక వ్యాసం రాశారు. అందువల్ల ఈ హత్య కేసు చాలా మందిలో ఆసక్తి రేకెత్తించింది.

''హత్య చేయటం గురించి నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. తగినంతగా రెచ్చగొడితే మనలో ప్రతి ఒక్కరూ ఆ పని చేయగలరు'' అని నాన్సీ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆమె రాసిన ఈ వ్యాసాన్ని ఇప్పుడు తొలగించారు.

నాన్సీ

ఫొటో సోర్స్, DAVE KILLEN / THE OREGONIAN / POOL

భర్తను హత్య చేయటానికి పలు మార్గాల గురించి ఆమె రాశారు. తుపాకులతో కాల్చటం నుంచి కత్తులతో పొడవటం వరకూ, విషం పెట్టటం నుంచి కాంట్రాక్టు హంతకులను నియమించటం వరకూ ఆమె పెద్ద జాబితానే ఇచ్చారు.

''ఎవరైనా చనిపోతే బాగుండని కోరుకోవటం ఈజీయే కానీ వారిని నిజంగా చంపటం ఈజీ కాదు'' అని కూడా వ్యాఖ్యానించారు.

''ఈ హత్య వల్ల నాకు స్వేచ్ఛ లభించాల్సి ఉన్నపుడు.. నేను జైలు శిక్ష అనుభవించాలని కచ్చితంగా కోరుకోను'' అని కూడా పేర్కొన్నారు.

ఈ కేసులో విచారణ సందర్భంగా.. ఈ వ్యాసాన్ని సాక్ష్యంగా ఆమోదించటానికి జడ్జి తిరస్కరించారు. కొన్నేళ్ల ముందు ఒక రచనా సదస్సులో భాగంగా రాసిన వ్యాసం కనుక ఇది నేరానికి సాక్ష్యంగా చెల్లదన్నారు.

కానీ నాన్సీ నేరాన్ని రుజువు చేయటానికి ప్రాసిక్యూటర్లకు ఈ వ్యాసం అవసరపడలేదు.

నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ తన భర్తను హత్య చేయటానికి ఆమెకు కారణ, సాధనాలు ఉన్నాయని వారు విజయవంతంగా వాదించారు. ఈ దంపతులు ఆర్థికంగా కష్టాల్లో పడ్డారని, డానియెల్ మరణం తర్వాత నాన్సీకి భారీగా బీమా సొమ్ము లాభించనుందని చూపించారు.

నాన్సీ రాసిన ఓ నవల

ఫొటో సోర్స్, NANCY BROPHY SITE

ఫొటో క్యాప్షన్, నాన్సీ రాసిన ఓ నవల

ఆ నేరం జరిగిన సమయంలో నాన్సీ హత్య జరిగిన ఇన్‌స్టిట్యూట్‌కు కారు నడుపుతూ వెళ్లివచ్చిన సీసీటీవీ దృశ్యాలను కోర్టులో చూపించారు.

హత్యకు ఉపయోగించిన ఆయుధం పోలీసులకు ఇంతవరకూ దొరకలేదు. కానీ హత్య చేయటానికి ఉపయోగించిన తరహా మోడల్ తుపాకీని నాన్సీ కొనుగోలు చేసినట్లు చూపించారు.

నాన్సీ ఈ కేసులో వాంగ్మూలం చెప్తూ.. డానియెల్ బ్రోఫీ చనిపోయిన రోజు ఉదయానికి సంబంధించి తనకు ఏమీ గుర్తు లేదన్నారు. అయితే ఇన్‌స్టిట్యూట్ పరిసరాల్లో డ్రైవ్ చేస్తున్నది తానేనని ఆమె నిరాకరించలేకపోయారు.

ఈ కేసులో వాదప్రతివాదనలు విన్న 12 మంది సభ్యుల జ్యురీ.. దాదాపు రెండు రోజుల పాటు చర్చించి ఆమెను హత్య కేసులో దోషిగా నిర్ధారించింది.

ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం ఆమెకు 25 ఏళ్ల తర్వాత పెరోల్ అవకాశం ఉంది. దీనిపై పైకోర్టులో అప్పీలు చేస్తామని ఆమె తరఫు న్యాయవాదులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)