దిశ అత్యాచారం కేసు: 'ఫేక్' ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుల కుటుంబాలు ఏం చెబుతున్నాయంటే...

ఫొటో సోర్స్, UGC
- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
"దిశ సంఘటన తరువాత, నేను బయటకి వెళితే చాలు, నన్ను చూసి జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చెన్నకేశవులు భార్య అట, చెన్నకేశవులు అలా చేశాడట అని నా గురించి కూడా ఘోరంగా మాట్లాడుకుంటారు. అందుకే, నేను ఊరు వదిలి ఎక్కడికీ వెళ్ళను. ఇలా మాట్లాడే వారు మమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని భయం వెంటాడుతూ ఉంటుంది."
దిశ హత్య కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక చెప్పిన మాటలివి.
డిసెంబర్ 6న జరిగిన దిశ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ మైనర్లు కాగా, ఈ కేసులోని ప్రధాన నిందితుడు ఆరిఫ్ మొహమ్మద్ వయసు 23 ఏళ్లు అని మొహమ్మద్ తల్లి తండ్రులు చెప్పారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన తరువాత నిందితులను పోలీస్ ఎన్‌కౌంటర్ చేయడం వివాదాస్పదమైంది.
దిశను హత్య చేసిన వారిని పట్టుకున్నామని పోలీసులు చెప్పడం ఒక ఎత్తు అయితే, వారిని ఎన్‌కౌంటర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న వాదన బలం పుంజుకుంది.
కాగా, హైదరాబాద్‌లో దాదాపు మూడేళ్ల కిందట సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను 'ఎన్‌కౌంటర్'లో కాల్చి చంపామన్న పోలీసుల కథనం అవాస్తవమని, అది బూటకపు ఎన్‌కౌంటర్ అని సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిషన్ తేల్చింది.
ఆ ఘటనకు సంబంధించి 10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టి విచారించాలని కమిషన్ సిఫారసు చేసింది.

"2019లో దిశ ఘటన తరువాత, పోలీసులు వచ్చి ఇంట్లో ఉన్న తమ కొడుకుని తీసుకుపోయారు. ఆ తరువాత అతడితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు" అని ఆరిఫ్ తల్లిదండ్రులు చెప్పారు.
తమ తన కొడుకుకి పెట్టిన అసలు పేరు మొహమ్మద్ అయితే, పోలీసులు ఇచ్చిన పేరు ఆరిఫ్ మొహమ్మద్ అని మొహమ్మద్ తండ్రి హుస్సేన్ అన్నారు.
"ఆరిఫ్ మొహమ్మద్ తల్లిదండ్రులుగా మేం మిగిలిపోయాము" అని ఆయన వాపోయారు.
"ఆరోజు సాయంత్రం మోహమ్మద్ పని చేస్తున్న లారీ ఓనర్ శ్రీనివాస్ వచ్చారు. పని ఉందని తోలుకుపోయారు. ఆ తరువాత నా కొడుకు బట్టలు పోలీస్ స్టేషన్‌కు తీసుకు రమ్మని చెప్పారు. తరువాత బస్సు ఎక్కించి ఇంటికి పంపించేశారు. ఆ మరుసటి రోజు ఈ వార్త వచ్చింది" అని హుస్సేన్ చెప్పారు.
"మా వాడు అలాంటిది ఏమైనా చేస్తే వాడిని చంపేయండని నేనే చెప్పాను" అని మొహమ్మద్ తండ్రి హుస్సేన్ అంటుండగా, "మా వాడు అలాంటిది ఏమీ చేయలేదు. అసలు తాను చేశాడో లేదో చెప్పడానికి మా వాడు ఉండాలి కదా" అని తల్లి మౌలాంబి ప్రశ్నించారు.

మొహమ్మద్ తల్లిదండ్రులను కలిసే ముందు జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు కుటుంబాలను బీబీసీ కలిసింది.
హైదరాబాద్‌కు సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి వెళ్ళగానే, దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి ఇళ్లు ఎక్కడ అని అడిగాం. అందరూ మొదట జొల్లు శివ ఇంటికి దారి చూపించారు. మిగితా రెండు కుటుంబాలూ శివ ఇంటికి దగ్గర్లోనే ఉంటాయని చెప్పారు.
మేము వెళ్లినప్పటికి జొల్లు శివ తల్లి రొట్టెలు చేసుకుంటూ, తన భర్త కోసం ఎదురు చూస్తున్నారు.
"ఇంట్లో మేమిద్దరమే ఉంటాం. శివ చనిపోయిన తరువాత మేం ఒంటరైపోయాం. మా వాడు బతుకుంటే అసలు ఏం జరిగిందో తెలిసేది కదా. ఈ వయసులో ఇలా ఒంటరిగా మేం మిగిలిపోవడానికి పోలీసులే కారణం. మా పెద్ద కొడుకు మమ్మల్ని వదిలి వేరో చోట ఎక్కడో ఉన్నాడు. మా దగ్గరే ఉంటున్న శివను చంపేశారు" అని శివ తల్లి జొల్లు మణెమ్మ చెప్పారు.

జొల్లు నవీన్, చెన్నకేశవులు కుటుంబంలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి.
నవీన్ తల్లి లక్ష్మి మాట్లాడుతూ, "దిశ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో మాకూ అంతే అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇది భూటకపు ఎన్‌కౌంటర్ అని తేలింది. మా నవీన్ బతికి ఉంటే జైలులో ఉండేవాడు. కనీసం చూసుకునే వాళ్ళం. అసలు సంఘటన జరిగిన 8 రోజులకే చంపేశారు. 14 రోజులు కస్టడీలో ఉంచలేదు. ఒకవేళ నవీన్ బతికి ఉంటే ఆరోజు ఏం జరిగిందో మీడియా ముందు చెప్పేవాడు. వారే నేరం చేశారో లేక ఏం జరిగిందో తెలిసేది. లాయర్ రజని, కృష్ణమాచార్య సారు అన్నీ చూసుకుంటున్నారు. తరువాత ఏం జరుగుతుందో మాకు తెలీదు" అన్నారు.

ఈ కుటుంబాలు కోరుకుంటున్నది ఒక్కటే.. "కోర్టు చెప్పినట్టు ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అయితే, మాకు న్యాయం జరగాలి" అంటున్నారు.
"మా వాళ్ళు తప్పు జరిగితే విచారణ జరిపి నిజాలు తేల్చాక శిక్ష పడాలి. కానీ, విచారణ జరగకుండానే దోషులు అని తేల్చి చంపేశారు" అన్నది వారి వాదన .

మరో వైపు, చిన్న వయసులోనే చెన్నకేశవులను పెళ్లి చేసుకున్న రేణుక ఇంటి బాధ్యతలు నెత్తికెతుకున్నారు.
రేణుక, చెన్నకేశవులు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాదిన్నరగా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఎన్‌కౌంటర్ జరగడానికి ఎనిమిది నెలల ముందు వీరిద్దరికీ వివాహం జరిగింది. పెళ్లికి అతడి తల్లితండ్రులు మొదట ఒప్పుకోలేదు. కానీ, తరువాత ఒప్పుకున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో రేణుక ఏడు నెలల గర్భవతిగా ఉన్నారు. ఇప్పుడు తనకు ఒక పాప.
చెన్నకేశవులు ఎన్‌కౌటర్‌లో చనిపోయిన తరువాత అతడి తండ్రి కూడా మరణించారు. దాంతో, అత్త, పాప బాధ్యతలు రేణుక మీద పడ్డాయి. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారామె.
"నేను ఇప్పుడు నా పాప కోసమే బతుకుతున్నాను. తనకు ఏమి కాకూడదు. పాపను బాగా చూసుకోవాలి అన్నదే నా తపన" అని రేణుక అన్నారు.
ఈ కేసులో ఏం జరుగుతోందో కూడా వీరికి పెద్దగా తెలిసినట్టు అనిపించలేదు. కేసు విషయాలను తమ లాయర్లు చూస్తున్నారని, మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలుస్తున్నాయని చెప్పారు. అయితే తమకు కూడా అన్యాయం జరిగింది కనుక న్యాయం కావాలని అడుగుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబు: 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు చర్చ జరుగుతోంది
- మంకీపాక్స్: ఈ పాత వైరస్ కొత్తగా వ్యాపిస్తోంది.. మనం భయపడాలా? అవసరం లేదా?
- డ్రైవర్ మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని అరెస్ట్ చేస్తాం: కాకినాడ జిల్లా ఎస్పీ
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారా, బౌద్ధ ఆరామాలను కూల్చి గుడులు కట్టారా? చరిత్ర ఏం చెబుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














