JubileeHills Gang Rape: సాయంత్రం 6.15 నుంచి 7.30 మధ్య ఏం జరిగిందంటే

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసు వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి వెల్లడించారు.

అత్యాచారం జరిగిన రోజు జరిగిన ఘటనల క్రమాన్ని ఆనంద్ చెప్పారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

మార్చ్ 28న ఇదంతా మొదలైంది. బెంగళూరులో నివసించే ఒక అబ్బాయి హైదరాబాద్‌లో పార్టీ ఇవ్వడానికి ఇక్కడి ముగ్గురు మిత్రులను సంప్రదించాడు. దాంతో వారు ఇన్సోమ్నియా పబ్‌ను సూచించారు.

ఆ తరువాత ‘యూఫోరియా కమింగ్ సూన్’ అని ఆ బెంగళూరు అబ్బాయి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

వేరే మిత్రుల ద్వారా పబ్‌ నిర్వాహకులను సంప్రదించగా వారు ఒక్కొక్కరికి రూ. 1300 ధర చెప్పారు... రూ. 900 చొప్పున బేరమాడుకుని పార్టీ నిర్వహించేందుకు బుక్ చేసుకున్నారు.

ఆ తరువాత ‘మే 28న పార్టీ’ అని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా 100 మందికి పైగా రెస్పాండయ్యారు. వారందరి నుంచి రూ. 1200, రూ. 1300 వసూలు చేసి పబ్‌కు మాత్రం రూ. 900 ధర చొప్పునే చెల్లించాడు బెంగళూరు అబ్బాయి.

పోలీస్ ప్రెస్ మీట్

బాధిత బాలిక కూడా ఎంట్రీ టికెట్‌కు రూ. 1300 చెల్లించి మే 28 మధ్యాహ్నం పబ్‌కు చేరుకుంది.

అదే రోజు నేరం జరిగింది. అయితే, మే 31 సాయంత్రం వరకు ఆమె తన తల్లిదండ్రులకు విషయం చెప్పలేదు. ఆమె ఒంటిపై గాయాలు చూసి తల్లిదండ్రులు అడిగినా ఆమె ఏమీ చెప్పలేదు.

31 రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాలిక వివరాలు చెప్పకపోవడంతో భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ ఆమె వివరాలు వెల్లడించింది.

ఆ తరువాత ఆమెను నీలోఫర్ ఆసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు చేశారు.

మే 3 రాత్రి 9 గంటలకు సాదుద్దీన్ మాలిక్‌ను అరెస్ట్ చేశాం. ఇతను మేజర్. ఆ తరువాత ఇందులో నిందితులైన మిగతా మైనర్లను అదుపులోకి తీసుకున్నాం.

అనంతరం అన్ని సీసీ టీవీ కెమేరాలను పరిశీలించి, బాధిత బాలిక స్టేట్మెంట్‌తోనూ పోల్చి సరిచూసుకుని ఆ వివరాలు వెల్లడిస్తున్నాం..

వీడియో క్యాప్షన్, ఎన్ని చట్టాలున్నా నేరాలు ఎందుకు తగ్గడం లేదు

ఏ నిమిషానికి ఏం జరిగింది?

మే 28 మధ్యాహ్నం 1.30కి బాధిత బాలిక, మరో బాలుడు పబ్‌లోకి వెళ్లారు. ఇద్దరూ లోపల డ్యాన్స్ చేశారు.

3 గంటలకు: ఆ బాలుడు వెళ్లిపోయాడు. తరువాత మరో బాలిక ఈ బాధిత బాలికను కలిసింది.

3.15 గంటలు: మరో మైనర్ ఆమెను అప్రోచ్ అయ్యాడు. ఆయనకు సాదుద్దీన్ జత కలిశాడు. వారిద్దరూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

5 గంటలు: తరువాత బాధిత బాలిక మరో బాలికతో కలిసి బయటకు వచ్చేసింది.

ఆ బాలిక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయింది. ఆ తరువాత బాధిత బాలికను నలుగురు మైనర్లు ట్రాప్ చేశారు..

5.45 గంటలు: ఈమెను తీసుకుని బెంజ్ కారులో వెళ్లారు. అదే సమయంలో సాదుద్దీన్, మరో ముగ్గురు మైనర్లు ఇన్నోవాలో బయలుదేరారు.

దారిలో బెంజ్ కారులోని నలుగురు మైనర్లు బాధిత బాలికకు బలవంతంగా ముద్దులు పెట్టారు. ఈ వీడియోలన్నీవారే తీశారు.

5.51 గంటలు: రెండు కార్లూ బేకరీకి చేరాయి.

5.54: బాధిత బాలిక బెంజ్ దిగి ఇన్నోవాలోకి వెళ్లింది.

5.57:రెండూ పార్కింగ్ చేశారు.

6.15: ఇన్నోవా బయటకు వెళ్లింది... అందులో సాదుద్దీన్ ఉన్నాడు. బాధిత బాలిక, మరో అయిదుగురు మైనర్లు వెళ్లారు..

6.18: ఒక మైనర్ బేకరీకి తిరిగి వచ్చేశాడు.

సాదుద్దీన్, నలుగురు మైనర్లు, బాధిత బాలికను తీసుకుని అక్కడి నుంచి వెళ్లి జూబిలీ హిల్స్ పెద్దమ్మ గుడి వెనుక వాహనం ఆపారు.

ఒక మైనర్ ఆమెను రేప్ చేశాడు.. ఆ తరువాత మిగతా నలుగురు రేప్ చేశారు. ఈ క్రమంలో ఆమెకు మెడపై, వేరే ప్రాంతాల్లో తీవ్ర గాయాలయ్యాయి.

7.31:ఇన్నోవా పబ్ దగ్గరకు తిరిగి వచ్చి బాధిత బాలికను డ్రాప్ చేసి వెళ్లిపోయింది.

ఆ తరువాత ఆమె తన తండ్రికి ఫోన్ చేసి పార్కింగ్ నుంచి బయటకు రాగా రోడ్ నంబర్ 36కి తండ్రి వచ్చి ఆమెను తీసుకెళ్లారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏం మారింది? యువతీయువకులు ఏం చెబుతున్నారు?

దర్యాప్తు పూర్తయింది...

ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ మలిక్‌ను అరెస్ట్ చేశాం.

మిగతా నలుగురిని స్పెషల్ టీంలతో పట్టుకున్నాం. ఒకరు పరారీలో ఉన్నారు. మైనర్ నిందితులను జువైనల్ హోంకు పంపిస్తున్నాం.

376డీ గ్యాంగ్ రేప్, 323 కాజింగ్ హర్ట్, పోక్సో చట్టం.. 366ఏ కిడ్నాపింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశాం..

ఈ కేసులో సామూహిక అత్యాచారానికి పాల్పడినవారిపై నేరం నిరూపణ అయితే మరణం వరకు యావజ్జీవ కారాగార శిక్ష కానీ మరణ శిక్ష కానీ పడే అవకాశాలూ ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

ఆరో సీసీఎల్ (చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా) రేప్‌లో లేడు... కిస్సింగ్ వీడియోలలో ఉన్నాడు.

ఐపీసీ 354, 324 ఐపీసీ, 9జీ రెడ్ విత్ సక్షన్ 10 పోక్సో యాక్ట్ పెడుతున్నాం... నేరం నిరూపణ అయితే కనీసం 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల శిక్ష పడొచ్చు.

హోం మంత్రి సంబంధీకులు ఎవరూ లేరు

ఈ కేసులో తెలంగాణ హోం మంత్రి సంబంధీకులు ఎవరూ లేరని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

అలాగే, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ వీడియోలను విడుదల చేసిన తరువాతే తమకూ ఆ వీడియోలు లభించాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)