Hyder Ali: ఆంగ్లేయులను 26 నిమిషాల్లోనే ఓడించిన అమెరికా ‘హైదర్ అలీ’ ఎవరు?

ఫొటో సోర్స్, HULTON ARCHIVE
- రచయిత, ఫైజల్ మొహమ్మద్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ సంగతి 200 ఏళ్ల కంటే కూడా పురాతనమైనది. అమెరికా స్వాతంత్ర్య సమరంలో 26 నిమిషాల పాటు సాగిన యుద్ధంలో ఒక అమెరికన్ యుద్ధ నౌక, అతిపెద్ద బ్రిటన్ ఓడ 'జనరల్ మాంక్'ను ఓడించింది.
ఆ అమెరికా నౌక పేరు 'హైదర్ అలీ'. మైసూర్ పాలకుడు హైదర్ అలీ పేరును కొద్దిగా సవరించి దానికి ఆ పేరును పెట్టారు.
ఆంగ్లంలో Ally అనే పదానికి 'మిత్రుడు' అని అర్థం.
1782 ఏప్రిల్ 8వ తేదీ ఉదయం జరిగిన ఈ ఘటన వివరాలు అమెరికా నేవీ చరిత్రలో లిఖించారు.
అమెరికన్ యాచ్ కెప్టెన్ జోషువా బర్నీకి చెందిన 'ఫ్యామిలీ అసోసియేషన్' ప్రకారం, 'గల్ఫ్ ఆఫ్ డెలావేర్'లో జరిగిన ఈ యుద్ధానికి సంబంధించిన పేయింటింగ్ కూడా అమెరికా నావల్ అకాడమీలో ఉంది.
అమెరికా నేవీ చరిత్రలో అమెరికా జెండా కింద జరిగిన అత్యంత ప్రభావంతమైన సంఘటనల్లో ఒకటిగా దీన్ని జేమ్స్ ఫెనిమోర్ కూపర్ అభివర్ణించారు. 'బ్రిటన్‌పై అమెరికా సాధించిన మొదటి భారీ నావికా విజయం' అయినందున ఆయన ఇలా వర్ణించి ఉండొచ్చు.
దీనికంటే ముందు 1781లో భూభాగంలో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ జనరల్ లార్డ్ చార్ల్స్ కార్న్‌వాలిస్, అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ జార్జ్ వాషింగ్టన్ ముందు మోకరిల్లాడు.

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
హైదర్ అలీ పేరు అమెరికాకు ఎలా వెళ్లింది?
"దక్షిణ భారత రాష్ట్రమైన మైసూరుకు 18వ శతాబ్దం మధ్య నుంచే ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది" అని బీబీసీతో మైసూర్ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ సెబాస్టియన్ జోసెఫ్ చెప్పారు.
ఈ అంశం గురించి బీబీసీతో ఆయన మాట్లాడారు. "1757 ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్టిండియా కంపెనీ, ఉత్తర భారతదేశంలో ప్రాంతీయ శక్తిగా అవతరించింది. అయితే, హైదర్ అలీతో పాటు ఆయన వారసుడు టిప్పు సుల్తాన్, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 30 ఏళ్లలో నాలుగు యుద్ధాలు చేసి ఆంగ్లేయులను దక్షిణాదిలో అధిక భాగానికి దూరంగా ఉంచారు. ఇదే సమయంలో 1783లో అమెరికా స్వాతంత్ర్య సంగ్రామం ముగిసింది. కొత్త దేశంగా అమెరికా ఏర్పడింది'' అని ఆయన చెప్పారు.
అయితే, ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే భారతదేశానికి వందల మైళ్ల దూరంలో ఉన్న అమెరికా దేశానికి, అమెరికా స్వాతంత్ర్య సంగ్రామానికి భారత్‌కు చెందిన 'హైదర్ అలీ' పేరు ఎలా చేరింది?

ఫొటో సోర్స్, BONHAMS
బ్రిటన్‌లో టిప్పు, హైదర్ అనే పేర్లను ఎందుకు పెట్టారు?
కెనడాలోని ఎడ్మాంటన్ నుంచి ఫోన్‌లో బీబీసీతో మాట్లాడిన చరిత్రకారుడు అమీన్ అహ్మద్... ఈ పేర్లు బ్రిటన్‌కు రావడానికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు.
అందులో ఒకటి గుర్రాలు. రెండోది.. ఫ్రెంచ్ సైనిక అధికారులు, అమెరికా స్వాతంత్ర్య సంగ్రామంలోని కీలక వ్యక్తులకు రాసిన లేఖలు అని అన్నారు.
బ్రిటిష్ సైన్యంలో జనరల్, లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేసిన 'డ్యూక్ ఆఫ్ అంకాస్టర్' ప్రిన్స్ బెర్టీ, గుర్రపు పందేలను చాలా ఇష్టపడేవారు. ఆయన గుర్రాలలో ఒకదానికి హైదర్ అలీ (1765) అని పేరు పెట్టారు.
దీనికి కొన్ని సంవత్సరాల ముందు హైదర్ అలీ, మైసూర్ పాలకుడిగా ప్రకటించుకున్నారు. అదే సమయంలో త్రివాదీ (పాండిచ్చేరి సమీపంలోకి ఒక ప్రదేశం) వద్ద ఈస్టిండియా కంపెనీని ఓడించారు. టిప్పు సుల్తాన్ కూడా చిన్నప్పటి నుంచే ఈస్టిండియా కంపెనీ స్థావరాలపై వరుస దాడులను మొదలుపెట్టారు.
ఈ సమయంలో ఇంగ్లండ్‌కు చెందిన రేసు గుర్రాల పెంపకందారుడు ఒకరు, ఇక్కడ జన్మించిన గుర్రానికి 'టిప్పు సాహెబ్' అని పేరు పెట్టారు. తర్వాత, ఈ వంశానికి చెందిన గుర్రాలను అమెరికాకు పంపారు. దీంతో అక్కడ కూడా మైసూర్ పాలకుల పేర్లను గుర్రాలకు పెట్టే ప్రక్రియ ప్రారంభమైంది.
'హైదర్ అలీ' అనే గుర్రపు సంతతి గురించి అమెరికాలోని పోర్ట్స్‌మౌత్‌లో ముద్రించిన ఒక కరపత్రం గురించి అమీన్ అహ్మద్ ఒక వ్యాసంలో ప్రస్తావించారు. అమెరికా పార్లమెంట్ లైబ్రరీలో దీని కాపీ ఉంది.

ఫొటో సోర్స్, SOTHEBY'S
'బ్రేవ్ మొఘల్ ప్రిన్స్'
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీతో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ సుదీర్ఘంగా పోరాడారు. అయితే, బ్రిటిష్ వారితో హైదర్ అలీకి వాణిజ్య, సైనిక ఒప్పందాలు కూడా ఉన్నాయనే సంగతి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అమీన్ అహ్మద్ చెప్పారు.
కొంతమంది బ్రిటన్ వ్యక్తులు తమ జంతువులకు లేదా ఇతరాలకు మైసూర్ పాలకుల పేరు పెట్టడానికి ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు అని అన్నారు.
బ్రిటిష్ వారు తమ రేసు గుర్రాలకు తమ శత్రువుల పేర్లను ఎందుకు పెట్టారని ప్రశ్నించగా అమీన్ అహ్మద్ పై విధంగా బదులిచ్చారు.
అమెరికా స్వాతంత్ర్య సంగ్రామంలోని ప్రధాన నాయకులకు లేఖ రాయడం గురించిన ప్రస్తావన 1777 నాటిది.
ఇందులో ఫ్రెంచ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ నెకోమ్టే డి త్రెసాన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్‌కు రాసిన లేఖలో హైదర్ అలీని 'బ్రేవ్ మొఘల్ ప్రిన్స్' అని వర్ణించారు. హైదర్ అలీతో కలిసి పనిచేసే యూరోపియన్లతో మీకు సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తానని ఆయన లేఖలో పేర్కొన్నారు.
సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో భారత ఉపఖండం గురించి బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇతర యూరోపియన్ దేశాల మధ్య సుదీర్ఘ పోరాటాలు జరిగాయి. ఇందులో చివరి వరకు ఫ్రాన్స్, బ్రిటన్ నిలవగా... ఆఖరుకు విజయం బ్రిటన్‌ను వరించింది.

ఫొటో సోర్స్, SOTHEBY'S
హైదర్ అలీ కథను రాసిన అమెరికా విప్లవ కవి
ప్రొఫెసర్ సెబాస్టియన్ జోసెఫ్ ప్రకారం... మైసూర్ పాలకులకు, అమెరికా స్వాతంత్ర్య సంగ్రామానికి మధ్య ఫ్రాన్స్ ప్రధాన వారధిగా వ్యవహరించింది.
ఫ్రెంచ్ అందించిన ఆర్థిక, సైనిక సహాయంతో అమెరికా యుద్ధం సాధ్యమైంది. మరోవైపు సైనిక శిక్షణ కోసం హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఇద్దరూ ఫ్రాన్స్ వారితో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు.
బహుశా ఈ మూడు దేశాల స్నేహం కారణంగానే అమెరికన్ విప్లవ కవిగా పేరు పొందిన ఫిలిప్ ఫ్రెనో... హైదర్ అలీ కథను రాశారు.
1781 అక్టోబర్ 19న అమెరికా సైన్యం చేతిలో బ్రిటిష్ సైన్యం ఓడిపోయిన తర్వాత న్యూజెర్సీలోని ట్రెంటన్‌లో విజయోత్సవాలు జరిగాయి. అప్పుడు హైదర్ అలీ పేరిట కూడా సంబరాలు జరుపుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- రోడ్డెక్కిన శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య: ‘గోటాబయ నీ కోట కూలిపోయింది.. ఈ రోజే వెళ్లిపో’
- Investment: మ్యూచువల్ ఫండ్స్ నుంచి రుణం తీసుకొని ఇల్లు కొనుక్కోవచ్చా?
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- బ్రిటన్ ప్రధానమంత్రి రేసులోకి ప్రవేశించిన రిషి సునక్
- ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక ఫోన్ కాల్‌తో చైనా ఎందుకు కలవరపడుతోంది?
- Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని విజయ రహస్యం ఏమిటి, సుదీర్ఘ కాలం ప్రధానిగా ఎలా కొనసాగారు?
- SpiceJet: ఈ విమానయాన సంస్థను మూసేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










