Sri Lanka Protests-Gotabaya Rajapaksa: శ్రీలంక: దేశాధ్యక్షుడు, ప్రధాని నివాసాలపై ప్రజల దండయాత్ర.. పారిపోయిన గొటాబయ రాజపక్ష, రాజీనామాకు సిద్ధమన్న ప్రధాన మంత్రి

శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో ఆందోళనకారులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో నిరసనకారులు

శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష అధికారిక నివాసంలోకి నిరసనకారులు ప్రవేశించారు. 'గొటా గో హోమ్‌' అంటూ నినాదాలు చేశారు.

పోలీసుల రక్షణ వలయాలను చేధించుకుని, బారికేడ్లు దాటుకుని నిరసనకారులు అధ్యక్ష నివాసంలోకి వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది.

అయితే, అధ్యక్షుడు రాజపక్ష సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారని, ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే దానిపై అధికారిక సమాచారం అందుబాటులో లేదని నివేదికలు తెలుపుతున్నాయి.

‘‘అధ్యక్షుడు సురక్షిత ప్రాంతానికి వెళ్లారు’’ అని ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో ఒక సీనియర్ సైన్యాధికారి చెప్పారు. ‘‘ఇప్పటికీ ఆయనే అధ్యక్షుడు. ఆయన ఒక సైనిక యూనిట్ రక్షణలో ఉన్నారు’’ అని ఆ అధికారి వెల్లడించారు.

‘రాజీనామాకు సిద్ధం’ - ప్రధాన మంత్రి ప్రకటన

తాజా సమాచారం ప్రకారం ఆందోళనకారులు ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే అధికారిక నివాసాన్ని కూడా చుట్టుముట్టారు.

పరిస్థితులు అదుపుతప్పుతున్న నేపథ్యంలో అత్యవసరంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నిర్ణయించారు. అన్ని పార్టీల నాయకులకు ఆహ్వానం పంపించారు. పార్లమెంటును కూడా సమావేశపర్చాలని నిర్ణయించారు.

శ్రీలంకలో అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకుగాను ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని రణిల్ విక్రమ సింఘే నిర్ణయించారని పీఎం కార్యాలయం ప్రకటించింది.

శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లోకి ఆందోళనకారులు..
ఫొటో క్యాప్షన్, మెయిన్ గేట్ ఎక్కి అధ్యక్ష భవనం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తోన్న నిరసనకారులు

కొందరు నిరసనకారులు అధ్యక్ష నివాసం మెయిన్ గేట్ ఎక్కి లోపలికి ప్రవేశించారు. దీంతో కొలంబోలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసన చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ఆర్మీని రంగంలోకి దించారు.

ఈ ప్రాంతంలో సైనికులు పెద్ద ఎత్తున ఉన్నారు.

పెరుగుతున్న ధరలు, నిత్యావసర వస్తువుల కొరతకు వ్యతిరేకంగా శ్రీలంకలో చాలా కాలంగా నిరసనలు జరుగుతున్నాయి.

వీడియో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్షుడి అధికారిక నివాసంలో నిరసనకారులు, స్విమ్మింగ్ పూల్లో స్నానాలు

వీధుల్లోకి వచ్చిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపారు.

మరోవైపు, పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని రణిల్‌ విక్రమసింఘే పార్టీ నేతల అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరారు.

ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కొలంబో చేరుకున్నారు.

అధ్యక్షుడు రాజపక్ష రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఆందోళనకారుల ర్యాలీ

ఫొటో సోర్స్, Getty Images

శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు నిరసనకారులు శ్రీలంక రాజధాని కొలంబోలోని అధ్యక్షుని అధికారిక నివాసంలోకి ప్రవేశించడం మొదలుపెట్టారు. కొందరు నిరసనకారులు ప్రధాన గేటు ఎక్కి ప్రాంగణంలోకి ప్రవేశించారు.

నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించారు.

గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోంది.

దేశంలో పెట్రోలు, ఆహార పదార్థాలు, ఔషధాల కొరత ఏర్పడింది.

శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో ఆందోళనకారులు

పలువురికి గాయాలు

అధ్యక్ష నివాసాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై శ్రీలంక పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. నిరసనకారులపైకి పోలీసులు వాటర్ క్యానన్స్ కొట్టడంతో పలువురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. టియర్ గ్యాస్ షెల్స్‌ కారణంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం అక్కడి వీడియో ఫుటేజీలలో కనిపిస్తోంది.

ఒక సెక్యూరిటీ గార్డు సహా 33 మంది గాయపడినట్లు కొలంబో నేషనల్ హాస్పిటల్ తెలిపింది.

శ్రీలంకలో అధిక ద్రవ్యోల్బణంతో పాటు ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతకు నిరసనగా శనివారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.

అధ్యక్ష భవనం ముందు మోహరించిన పోలీసులు
ఫొటో క్యాప్షన్, అధ్యక్ష భవనం ముందు మోహరించిన పోలీసులు

శుక్రవారం రాత్రి 9 గంటల నుంచే కొలంబోతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ఫ్యూను విధించారు.

తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, ప్రజలు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు.

శ్రీలంక ప్రస్తుత స్థితికి అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష కారణమని ఆరోపిస్తూ ఆయన పదవికి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

గత కొన్ని నెలలుగా శ్రీలంకలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి.

అధ్యక్ష భవనంలో నిరసనకారులు

ఫొటో సోర్స్, SAJID NAZMI

ఫొటో క్యాప్షన్, అధ్యక్ష భవనంలోని సోఫాపై కూర్చొని నిరసనకారుల నినాదాలు

సంక్షోభానికి కారణం

శ్రీలంకలో విదేశీ మారక నిల్వలు వేగంగా క్షీణించడంతో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. కరోనా మహమ్మారితో పాటు ఆర్థిక విధానాల్లో ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.

విదేశీ మారక నిల్వల కొరత కారణంగా చమురు, ఆహార పదార్థాలు, ఔషధాలు వంటి ముఖ్యమైన వస్తువులను శ్రీలంక దిగుమతి చేసుకోలేకపోతోంది.

శ్రీలంక చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది మే నెలలో రుణ వాయిదా చెల్లించడంలో విఫలమైంది. అదనంగా 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ కూడా శ్రీలంక చెల్లించలేకపోయింది.

నిరసనకారుడు

శ్రీలంక ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి దాదాపు 3.5 బిలియన్ డాలర్ల (రూ. 27,751 కోట్లు) సహాయాన్ని కోరుతూ చర్చలు జరుపుతోంది. ఐఎంఎఫ్‌తో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి తమకు ఈ సంవత్సరం 5 బిలియన్ డాలర్ల (రూ.39,645 కోట్లు) సహాయం అవసరమని శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది.

రోడ్డుపై ఆందోళనకారులతో శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్య

ఫొటో సోర్స్, Twitter

రోడ్డెక్కిన శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య

శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య సైతం రోడ్డుపైకి వచ్చి, నిరసనకారులతో కలసి ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

తన అభిమానులు, నిరసనకారులతో కలసి సెల్ఫీలు, ఫొటోలు దిగారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

‘‘ఒక విఫల నాయకుడిని అధికారం నుంచి తోసిపారేయడానికి దేశమంతా ఏకం కావడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నీ అధికారిక నివాసం గోడలపైనే నినాదం రాసి ఉంది. శాంతియుతంగా ఈరోజే వెళ్లిపో’’ అని అధ్యక్షుడు గొటాబయ రాజపక్షను ఉద్దేశిస్తూ సనత్ జయసూర్య ఒక ట్వీట్ చేశారు.

‘‘నేను శ్రీలంక ప్రజల కోసం ఎల్లప్పుడూ నిలబడ్డారు. త్వరలోనే మనం విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలాంటి హింస లేకుండా ఇది కొనసాగుతుంది’’ అని మరొక ట్వీట్ చేశారు.

‘‘ముట్టడి ముగిసింది. నీ కోట కూలిపోయింది. ప్రజల శక్తి గెలిచింది. రాజీనామా చేసి నీ గౌరవం కాపాడుకో’’ అని ఇంకొక ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)