జంతర్ మంతర్: నక్షత్ర వీధికి భారత ముఖద్వారం ఇదేనా, కళ్లతోనే గ్రహాల దూరాలను చెప్పేయవచ్చా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శల్భా సర్దా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 300 ఏళ్ల కిందట ఆరుబయట కట్టిన సంక్లిష్ట నిర్మాణాల సముదాయం. ఆ కట్టడాలన్నీ భారీ అంతరిక్ష పరిశోధన పరికరాలే. కేవలం కళ్లతోనే విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలను చూసి కొలిచేలా వీటిని డిజైన్ చేశారు.
అవి ఇప్పటికీ కచ్చితత్వంతో ఉన్నాయి. ఆ నిర్మాణాల సముదాయం 'జంతర్ మంతర్'. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉంది.
వసంతకాలపు సమరాత్రిందివకాలం తర్వాత వారం రోజులకు, ఆకాశం నిర్మలంగా ఉన్న ఓ వేడి మధ్యాహ్న సమయమది. రాజస్థాన్ ఎడారి రాజధాని జైపూర్‌లో వీక్షణా విహారం కోసం బయటకు వెళ్లటానికి అది సరైన సమయం కాకపోవచ్చు. కానీ సూర్యుడి వల్ల పడే నీడలను కొలవటానికి అదే సరిగ్గా సరైన టైమ్.
నగరంలోని ప్రధాన మార్కెట్ జోహ్రీ బజారులో కోలాహలం మీదుగా.. ఆ బజారు పగడపు గోడలు, వాటి మీద సున్నితమైన జాలీలు మధ్య నుంచి.. మొఘలుల తోరణాలను దాటుకుంటూ వడివడిగా జంతర్ మంతర్ కేసి నడిచాను. అది నక్షత్రవీధికి భారతదేశపు అంతుచిక్కని ముఖద్వారం.
ఈ ఆరుబయలు నిర్మాణాల సముదాయాన్ని తొలిసారి చూసినపుడు.. ఏదో విచిత్రమైన త్రికోణాకృతి గోడలుగా, ఎక్కడికీ దారితీయని మెట్ల వరుసలుగా కనిపిస్తాయి. అవి అక్కడ అసంబద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సమీపంలోని సిటీ ప్యాలెస్ లాగా అలంకరించి ఉండదు. హవా మహల్ లాగా ఒద్దికగానూ ఉండదు.
ఇక్కడ ఉన్నవి 300 ఏళ్ల కిందటి నిర్మాణాలు. అందులో ఉన్న 20 నిర్మాణాలు శాస్త్రీయ శిల్పాలు. వాటిని యంత్రాలు అని పిలుస్తారు. అవి నక్షత్రాలు, గ్రహాల స్థితిగతులను కొలుస్తాయి. సమయాన్ని కచ్చితంగా చెప్తాయి.
జైపూర్‌లో నా చిన్నపుడు వీటిని చూస్తే ఆనందాశ్చర్యాలు కలిగేవి. నా స్కూల్ జామెట్రీ కిట్‌లో ఉండే సున్నితమైన పరికరాలకు భారీ ప్రతిరూపాలుగా కనిపించేవి. కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్‌గా ఇప్పుడు నేను వీటి ఉపయోగాన్ని మరింత సులభంగా అవగతం చేసుకోగలను.
గ్రహ నక్షత్ర రాశుల యంత్రగతిశాస్త్రాన్ని అర్థం చేసుకోవటానికి మేధోసంపన్నమైన వాస్తునిర్మాణ పరిష్కారాలివి. హిందూ జ్యోతిష్యులు జాతకాల రూపకల్పనకు, శుభ ముహూర్తాలను ముందుగా చెప్పటానికి ఉపకరించే సంప్రదాయ పరికరాలు కూడా.
1727లో ఈ ప్రాంతపు రాజు సవాయ్ జై సింగ్.. జైపూర్‌ను తన రాజధానిగా చేసుకోవాలని భావించినపుడు.. ఈ నగరం భారత ఉపఖండంలో తొలి ప్లాన్డ్ సిటీ అయింది.
ఈ నగరాన్ని వాస్తుశాస్త్ర సూత్రాలకు అనుగుణంగా నిర్మించాలని ఆయన కోరుకున్నారు. ఎక్కడ ఏ నిర్మాణం ఉండాలో, ఎలా ఉండాలో అనేదానిని ప్రకృతి, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రాలను ఆధారంగా చేసుకుని నిర్ధారించే సూత్రాలవి.
జైపూర్ నగరాన్ని కచ్చితంగా గ్రహనక్షత్రాల స్థితిగతులకు అనుగుణంగా నిర్మించటానికి, ఖగోళశాస్త్ర అధ్యయనానికి సాయం చేయటానికి, పంటలకు కీలకమైన వాతావరణ పరిస్థితులను ముందుగా అంచనా వేయటానికి.. కచ్చితమైన, అందుబాటులో ఉండే పరికరాలు అవసరమని సవాయ్ జై సింగ్ అర్థం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లామిక్, యూరోపియన్ శాస్త్రవేత్తల విజ్ఞానం ప్రాతిపదికగా సమాచార సేకరణ కోసం సవాయ్ జై సింగ్ పరిశోధకుల బృందాలను మధ్య ఆసియా, యూరప్ ప్రాంతాలకు పంపించారు. అయితే ఆ కాలంలో విస్తృతంగా ఉపయోగించే ఇత్తడి పరికరాలతో చేసే కొలతల్లో తేడాలు ఉన్నట్లు ఆయన గుర్తించారు.
కచ్చితత్వాన్ని పెంచటం కోసం ఆ పరికరాల పరిణామాన్ని ఆయన పెంచేశారు. ఆ పరికరాల్లో కదిలే భాగాలను తగ్గించటం ద్వారా వాటిని స్థిరీకరించారు. ఆ పరికరాలను పాలరాయిని, స్థానిక రాతిని ఉపయోగించి రూపొందించటం ద్వారా అవి అరిగిపోవటాన్ని, శిథిలం కావడాన్ని తట్టుకునేలా చేశారు.
ఈ వినూత్న ఆవిష్కరణలతో భారతదేశంలోని జైపూర్, దిల్లీ, ఉజ్జయిని, వారణాసి, మధుర నగరాల్లో ఐదు ఆరుబయలు వేదశాలలు (నక్షత్ర పరిశోధన శాలలు) నిర్మించారు. వీటినే జంతర్ మంతర్ అని పిలిచారు.
మధుర జంతర్ మంతర్‌ను గతంలో ధ్వంసం చేశారు. ప్రస్తుతం నాలుగు జంతర్ మంతర్‌లు ఉన్నాయి. అయితే 1734లో నిర్మాణం పూర్తయిన జైపూర్ జంతర్ మంతర్ అతి పెద్దదీ, అత్యంత సమగ్రమైనది కూడా.
ఇప్పుడిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇండియాలో అత్యుత్తమంగా సంరక్షితమైన వేదశాల కావటం వల్ల మాత్రమే కాదు.. ఆర్కిటెక్చర్, ఆస్ట్రానమీ, కాస్మాలజీ శాస్త్రాలలోనూ.. పాశ్చాత్య, మధ్యప్రాచ్య, ఆసియా, ఆఫ్రికా సంస్కృతుల్లో అభ్యసనాలు సంప్రదాయాల్లో వినూత్న ఆవిష్కరణలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుండటం వల్ల కూడా ఇద ప్రపంచ వారసత్వ సంపద కేంద్రమైంది. ఇది యునెస్కో చెప్తున్న మాట.
సంస్కృతంలో జంతన్ అంటే పరికరాలు అని అర్థం. మంతర్ అంటే గణించేది అని అర్థం. అంటే.. ఈ సముదాయంలోని ప్రతి ఒక్క యంత్రానికి ఒక గణిత ఉపయోగం ఉంది.
కొన్ని సన్‌డయల్స్. అంటే సూర్యగడియారాలు స్థానిక కాలాన్ని చెప్పటానికి, అర్థభూగోళంలో సూర్యుడి స్థానాన్ని సరిగ్గా గుర్తించటానికి ఉపయోగపడేవి.

ఫొటో సోర్స్, Getty Images
ఇంకొన్ని పరికరాలు నక్షత్ర రాశులను, గ్రహాల గమనాలను లెక్కించటానికి, రాశిచక్రాలను గుర్తించి జోస్యాలను మార్గదర్శనం చేయటానికి ఉపయోగించే పరికరాలు.
వీటన్నిటిలోకీ అత్యంత ప్రముఖమైన యంత్రం.. భారీగా ఉండే సూర్యగడియారం సామ్రాట్ యంత్రం. ఇందులో 27 మీటర్ల ఎత్తున త్రిభుజాకార గోడ, దానికి ఇరువైపుల నుంచి రెక్కల తరహాలో పరుచుకున్నట్లుగా ఉండే రెండు సన్నని అర్థగోళాకార ర్యాంపులు ఉంటాయి.
నా గైడ్ దాని కింద నిల్చుని.. ఒక ర్యాంపు మీద నీడను నాకు చూపించారు. ఆ నీడ ప్రతి సెకనుకూ కచ్చితంగా ఒక మిల్లీమీటరు జరుగుతోంది. అది రెండు సెకన్ల తేడాతో స్థానిక సమయాన్ని కచ్చితత్వంతో చూపుతోంది.
మరో యంత్రం జై ప్రకాష్ - జాతకచక్రాలను నిర్ధారించటానికి.. భారత వేద రాశిచక్రాల చిహ్నాల గుండా సూర్యుడి గమనాన్ని లెక్కిస్తుంది.
గిన్నె ఆకారంలో ఉండే ఈ కట్టడం భూమి లోపలికి ఉంటుంది. ఆకాశపు మ్యాప్‌ను తిరగేసినట్టు ఉంటుంది. దానికి అడ్డుగా కట్టిన తీగ మీద ఒక చిన్న లోహపు ప్లేటు వేలాడదీసి ఉంటుంది. ఆ ప్లేటు నుంచి పడే నీడ.. ఎంపిక చేసిన నక్షత్రం లేదా గ్రహం స్థానాన్ని చూపుతుంది.
''నేను నా రెండేళ్ల మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ పరికరాలను చాలాసార్లు ఉపయోగించాను'' అని చెప్పారు నేహా శర్మ. ఆమె రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి జ్యోతిష్య శాస్త్రంలో డాక్టరేట్ పొందారు.
''జ్యోతిష్యశాస్త్రాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలని భావించే వారెవరికైనా.. ఈ పరికరాలను చదవటం, వీటి ద్వారా గ్రమగమనాలను లెక్కించటం వారి పాఠ్యాంశాల్లో ఇంకా ఒక తప్పనిసరి భాగంగా ఉంది'' అని నేహా శర్మ తెలిపారు.

ఫొటో సోర్స్, Shalbha Sarda
అయితే.. జంతర్ మంతర్ వేధశాలలను ఆధునిక సైన్స్ ప్రపంచం చాలా వరకూ వీటిని గతకాలపు అవశేషాలుగానే చూసేది. ఈ జంతర్ మంతర్ యంత్రాలు ఇప్పటికీ కచ్చితత్వంతో పనిచేస్తున్నాయని ప్రఖ్యాత భారత ఖగోళభౌతికశాస్త్రవేత్త డాక్టర్ నందివాడ రత్నశ్రీ ప్రపంచానికి చాటిచెప్పారు.
ఆమె దిల్లీలోని నెహ్రూ ప్లానెటోరియానికి 1999 నుంచి 2021లో తను చనిపోయేటప్పటి వరకూ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో విద్యార్థులు వివిధ జంతర్ మంతర్ యంత్రాలను ఉపయోగిస్తూ నక్షత్ర స్థితిగతుల ఖగోళశాస్త్రంలో ప్రత్యక్ష అనుభవం సంపాదించాలని ఆమె ప్రోత్సహించేవారు. ఈ యంత్రాలకు విద్యా రంగంలో, అంతర్జాతీయంగా గుర్తింపు సాధించటానికి కృషి చేశారు.
''శాస్త్రీయ వర్గంలో జంతర్ మంతర్‌ను వెలుగులోకి తీసుకువచ్చింది నందివాడ రత్నశ్రీ. జైపూర్ జంతర్ మంతర్‌కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు సాధించటంలో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషించారు'' అని ఆర్కియాలజిస్ట్ రిమా హూజా చెప్పారు. ఆమె జైపూర్ సిటీ ప్యాలస్‌లోని మహారాజా స్వామి మాన్ సింగ్ 2 మ్యూజియానికి కన్సల్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు.
నేడు అనేక రంగాలకు చెందిన, ప్రపంచంలోని అనేక సంస్కృతులకు చెందిన విద్యార్థులు, శాస్త్రవేత్తలు, పర్యాటకులు.. జైపూర్ జంతర్ మంతర్ ఒక చారిత్రక కట్టడానికన్నా చాలా విశిష్టమైనదని అర్థం చేసుకుంటున్నారు. కోటలు, రాజభవనాలతో నిండిన ఈ ప్రాచీన నగరంలో జంతర్ మంతర్ ఏక శిలా నిర్మాణాలు ఇప్పటికీ అంతరిక్షాన్ని ప్రతిబింబిస్తూనే ఉన్నాయి.
(బీబీసీ ట్రావెల్ విభాగం.. భూగోళంపై గడచిన నాగరికతల్లో నిర్మించిన విశిష్టమైన వినూత్నమైన నిర్మాణాలు, కట్టడాలపై ప్రత్యేక కథనాలను అందించే 'ఏన్షియంట్ ఇంజనీరింగ్ మార్వెల్స్' సిరీస్‌లో భాగంగా ఈకథనం ప్రచురితమైంది.
ఇవి కూడా చదవండి:
- సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే...ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల బరువైన అతిపెద్ద బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- జూలై 1: కొత్త కార్మిక చట్టాలతో ఉద్యోగుల జీవితాల్లో, జీతాల్లో వచ్చే మార్పులు ఇవీ...
- ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- ఉన్నత చదువులకు ప్రపంచంలోని టాప్-10 'స్టూడెంట్స్ ఫ్రెండ్లీ' నగరాలివే...
- ఆ డ్రైవర్ చేసిన చిన్న తప్పు 53 మంది ప్రాణాలను బలి తీసుకుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













