Sri lanka crisis: పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు కూడా దివాలా అంచున ఉన్నాయా?

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సురంజనా తివారీ
    • హోదా, ఆసియా బిజినెస్ కరస్పాండెంట్

ఊహించని ఆర్థిక సంక్షోభం నడుమ శ్రీలంకను హింసాత్మక నిరసనలు కుదిపేశాయి. దేశ అధ్యక్షుడు కూడా విదేశాలకు పరారై, తన పదవికి రాజీనామా చేయాల్సిన స్థాయికి పరిస్థితి దిగజారింది. అయితే, మరికొన్ని దేశాల్లోనూ పరిస్థితి ఇలా దిగజారే ముప్పుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్చరించారు.

‘‘భారీ స్థాయిలో విదేశీ అప్పులతో పాటు విధాన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు లేని దేశాల్లో పరిస్థితి ఇలా దిగజారొచ్చు. శ్రీలంక సంక్షోభాన్ని మనం ఒక హెచ్చరికగా పరిగణించాలి’’ అని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జీవా శనివారం వ్యాఖ్యానించారు.

గత నాలుగు నెలలుగా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెట్టుబడులు వరుసగా తగ్గిపోతున్నాయని ఆమె చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు సాయం చేస్తాయనే ఆశలు క్రమంగా ఆవిరి అవుతున్నాయని వివరించారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

ఆహారం, ఇంధనం, ఔషధాలు లాంటి కీలకమైన వనరులను తమ 2.2 కోట్ల మంది జనాభాకు అందించడంలో శ్రీలంక అష్టకష్టాలు పడుతోంది. శ్రీలంక విదేశీ మారకపు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ద్రవ్యోల్బణం 50 శాతానికిపైగా పెరిగింది. మరోవైపు గత ఏడాదితో పోలిస్తే, ఆహారపు ధరలు 80 శాతానికిపైగా పెరిగాయి. డాలరుతోపాటు ఇతర ప్రధాన కరెన్సీలతో మారకపు విలువ కూడా దారుణంగా పతనమైంది.

ఆర్థిక సంక్షోభానికి మాజీ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష విధ్వంసకర విధానాలే కారణమని, కరోనావైరస్ వ్యాప్తి నడుమ పరిస్థితి మరింత తీవ్రమైందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

ఏళ్ల నుంచీ శ్రీలంక విదేశీ అప్పులు పెరుగుతూ వచ్చాయి. గత 20 ఏళ్లలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దివాలా తీసిన తొలి దేశంగా శ్రీలంక మారింది.

శ్రీలంక

ఫొటో సోర్స్, Reuters

మూడు బిలియన్ డాలర్లు (రూ.23,990 కోట్ల) ఆర్థిక సాయం కోసం ఐఎంఎఫ్‌తో శ్రీలంక అధికారులు చర్చలు జరుపుతున్నారు. కానీ రాజకీయ సంక్షోభం వల్ల ఈ చర్చలు ప్రస్తుతం నిలిచిపోయాయి.

అయితే, ఇలాంటి పరిస్థితులే ఈ ప్రాంతంలోని మరికొన్ని దేశాల్లోనూ కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, వడ్డీ రేట్ల పెంపు, కరెన్సీ మారకపు విలువల పతనం, భారీగా విదేశీ అప్పులు మరికొన్ని దేశాలనూ పీడిస్తున్నాయి.

ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఆ దేశాలకు ప్రధానంగా అప్పులు ఇచ్చిన దేశంగా చైనా పేరు వినిపిస్తోంది. అయితే, ఆ వడ్డీ రేటు ఎంత? ఎలాంటి షరతులు విధించారు? లాంటి అంశాల్లో స్పష్టత లేదు.

కొన్ని దేశాల్లో సంక్షోభానికి చైనా కూడా కారణమని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్‌కు చెందిన అలాన్ కీనన్ వ్యాఖ్యానించారు. ఈ దేశాల్లో ఎలాంటి ప్రయోజనాలూ లేని కొన్ని భారీ, ఖరీదైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు చైనా పెట్టుబడులు పెడుతోందని ఆయన చెప్పారు.

‘‘శ్రీలంకలోని రాజపక్ష కుటుంబానికి కూడా చైనా చాలా మద్దతు ఇచ్చింది. ప్రస్తుత సంక్షోభానికి రాజకీయ వైఫల్యమూ ఒక కారణం. రాజ్యాంగంలో మార్పులు చేయడం లేదా పటిష్టమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంటి చర్యలే ఈ సంక్షోభం నుంచి శ్రీలంకను గట్టెక్కించగలవు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఇలాంటి మార్గంలో ప్రయాణిస్తున్న మరికొన్ని దేశాల వివరాలివీ..

లావోస్

ఫొటో సోర్స్, Getty Images

లావోస్

75 లక్షల మందికిపైగా జనాభా కలిగిన ఈ తూర్పు ఆసియా దేశం కూడా గత కొన్ని నెలలుగా విదేశీ అప్పులను ఎగవేసే పరిస్థితికి వచ్చింది.

యుక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల చమురు ధరలు పెరగడంతో పెట్రోలుతోపాటు ఆహార ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో మూడో వంతు ప్రజలు పేదరికంలో గడుపుతున్నారు.

ఇక్కడ చమురు కోసం ప్రజలు భారీగా వరుసలు కడుతున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. చాలా మంది కరెంటు బిల్లులు కూడా కట్టలేకపోతున్నారని వాటిలో పేర్కొంటున్నారు.

లావోస్ కరెన్సీ ‘‘ద కిప్’’ నానాటికీ పతనం అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం విలువలో మూడో వంతు పతనమైంది.

అమెరికాలో వడ్డీ రేట్లు పెంచడంతో డాలరు బలపడింది. ఫలితంగా ఇతర దేశీల కరెన్సీల విలువలు పతనం అయ్యాయి. దీంతో విదేశీ అప్పులు పెరగడంతోపాటు దిగుమతుల బిల్లులు కూడా పెరుగుతున్నాయి.

ఇప్పటికే భారీ అప్పులతో సతమతం అవుతున్న లావోస్.. దిగుమతుల బిల్లులు ఎలా చెల్లించాలో తెలియక కష్టాలు పడుతోంది. గత ఏడాది డిసెంబరు నాటికి లావోస్ దగ్గర విదేశీ కరెన్సీ రిజర్వులు 1.3 బిలియన్ డాలర్లు (రూ.1,03,97 కోట్లు)కు పడిపోయాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

వీడియో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్షుడి అధికారిక నివాసంలో నిరసనకారులు, స్విమ్మింగ్ పూల్లో స్నానాలు

మరోవైపు 2025 వరకు లావోస్ చెల్లించాల్సిన విదేశీ అప్పుల విలువ దేశ రెవెన్యూలో సగానికిపైగా ఉంది. దీంతో ఈ దేశాన్ని రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ ‘‘జంక్’’ కేటగిరీలోకి చేర్చింది.

లావోస్‌లో జల విద్యుత్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టుల పేరుతో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. గత ఏడాది మొత్తంగా 16 బిలియన్ డాలర్లు (రూ. 1,27,958 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ షిన్‌హువా ఒక కథనం ప్రచురించింది.

2021లో స్థూల జాతీయోత్పత్తిలో ప్రభుత్వ అప్పుల వాటా 80 శాతం వరకు ఉందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ అప్పులో సగం చైనాకే చెల్లించాలని పేర్కొంది.

ఇక్కడ 1975 నుంచి అధికారంలోనున్న దేశంలోని ఏకైక పార్టీ ‘‘ద లావోస్ పీపుల్స్ రివొల్యూషనరీ పార్టీ సరిగ్గా ఆర్థిక వ్యవస్థను నడిపించలేకపోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అయితే, చైనాతో వాణిజ్యం, జల విద్యుత్ అమ్మకం లాంటి పరిణామాలు దేశానికి కొంత ఊరటను ఇస్తున్నాయని మూడీస్ తెలిపింది. ‘‘డేంజర్ జోన్‌లోకి రాకుండా ఉండేందుకు లావోస్ పోరాడుతోంది. అయితే, ప్రస్తుతం దేశానికి బెయిల్ అవుట్ ప్యాకేజీ అవసరం’’అని తాజా నివేదికలో ఆర్థిక వేత్త హెరాన్ లిమ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, చాయ్ తాగడం తగ్గిస్తే ఆర్థికవ్యవస్థ మెరుగుపడొచ్చన్న పాకిస్తాన్ మంత్రి

పాకిస్తాన్

ఇంధనంపై ప్రభుత్వం రాయితీలను నిలిపివేయడంతో గత మే చివరి నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్‌లో చమురు ధరలు 90 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం ఐఎంఎఫ్‌తో దేశ అధికారులు చర్చలు జరుపుతున్నారు.

అయితే, వస్తువుల ధరలు మాత్రం పాకిస్తాన్‌లో విపరీతంగా పెరుగుతున్నాయి. వార్షిక ద్రవ్యోల్బణ రేటు 21.3 శాతానికి పెరిగింది. గత 13ఏళ్లలో ఇదే అత్యధికం.

శ్రీలంక, లావోస్‌లానే పాకిస్తాన్‌లో కూడా విదేశీ కరెన్సీ నిల్వలు పూర్తిగా పడిపోయాయి. గత ఏడాది ఆగస్టు నుంచి దాదాపు సగానికి నిల్వలు తగ్గిపోయాయి.

1.93 బిలియన్ డాలర్లు (రూ.15,435 కోట్లు) సమీకరించేందుకు భారీ పరిశ్రమలపై పాకిస్తాన్‌లో పది శాతం అదనపు సుంకాన్ని ఏడాది పాటు విధించారు. ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల మధ్య అసమానతను తగ్గించేందుకు ఈ పన్ను విధించాలని ఐఎంఎఫ్ సూచించింది.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఈ నిధులను పాకిస్తాన్ సమీకరించగలిగితే, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు కూడా మరిన్ని రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావొచ్చు’’అని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్‌కు చెందిన విశ్లేషకుడు ఆండ్రూ వుడ్ చెప్పారు.

ఆర్థిక సమస్యలను ఎలాగైనా పరిష్కరిస్తానని పాకిస్తాన్ ఇదివరకటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. కానీ, ఆయన పదవీచ్యుతుడయ్యారు. దీనికి ఆర్థిక సమస్యలు ఒక్కటే కారణమని చెప్పలేం.

గత నెలలో పాకిస్తాన్ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి... ప్రజలు టీ తాగడం తగ్గించాలని సూచించారు. ఫలితంగా దిగుమతి బిల్లు తగ్గుతుందని అన్నారు.

ఇక్కడ కూడా చైనా ప్రధాన పాత్ర పోషిస్తోంది. పాకిస్తాన్ మొత్తం అప్పుల్లో మూడో వంతు చైనా నుంచే తీసుకుంది.

‘‘పాకిస్తాన్‌కు ఎప్పుడు అప్పులు కావాలంటే అప్పుడు చైనాను ఆశ్రయిస్తోంది. ఈ ఏడాది చివర్లో మరోసారి రుణాల కోసం చైనాను పాక్ ఆశ్రయించే అవకాశముంది’’అని వుడ్ అన్నారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, EPA

మాల్దీవులు

ఇటీవల కాలంలో మాల్దీవుల ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం ఇవి జీడీపీలో వంద శాతానికి చేరుకున్నాయి.

శ్రీలంక లానే ఇక్కడ కూడా కరోనావైరస్ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ఇక్కడి పర్యటక రంగాన్ని కుదేలు చేసింది.

పర్యటకంపైనే ఎక్కువగా ఆధారపడే దేశాల అప్పులు ప్రస్తుతం విపరీతంగా పెరిగాయని ప్రపంచ బ్యాంకు ఇటీవల వెల్లడించింది. మరోవైపు పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలిపింది.

2023చివరి నాటికి మాల్దీవులు దివాలా తీసే ముప్పుందని అమెరికా ఇన్వెస్టిమెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ అంచనా వేసింది.

వీడియో క్యాప్షన్, శ్రీలంక సంక్షోభం: తినడానికి ఏమీ లేక సముద్రం నీటిని తాగి స్పృహ తప్పి పడిపోయిన వృద్ధ జంట

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో ద్రవ్యోల్బణం గత మే నెలలో ఎనిమిదేళ్ల గరిష్ఠానికి పెరిగి, 7.42 శాతానికి చేరుకుంది.

విదేశీ మారకపు నిల్వలు క్రమంగా పడిపోవడంతో నిత్యావసరేతర వస్తువులను దిగుమతి చేసుకోవడంపై బంగ్లాదేశ్ ఆంక్షలు విధించింది. మరోవైపు విదేశాల్లో స్థిరపడిన తమ దేశ పౌరుల నుంచి ఆదాయం అర్జించేందుకు నిబంధనలు సులభతరం చేసింది. విదేశీ పర్యటనలు కూడా తగ్గించుకోవాలని దేశ పౌరులకు సూచించింది.

‘‘కరెంటు ఖాతా లోటులో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలు సబ్సిడీల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంక సాయం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాయి’’ అని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్‌కు చెందిన కిమ్ ఎంగ్ టాన్ చెప్పారు.

‘‘ప్రభుత్వ ఖర్చులను బంగ్లాదేశ్ బేరీజు వేసుకుంటోంది. విలాసవంతమైన వస్తువుల వినియోగదారులపైనా ఆంక్షలు అమలు చేస్తోంది’’ అని ఆయన చెప్పారు.

కరోనావైరస్ మహమ్మారితో సతమతమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి. ఏళ్లుగా భారీ రుణాలు తీసుకుంటూ పరిస్థితులను చక్కదిద్దాలని చూసిన దేశాల ఆర్థిక వ్యవస్థలు నేడు దివాలా ముప్పును ఎదుర్కొంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)