బంగ్లాదేశ్:వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి, కానీ అక్కడ పెట్రోలు ధర వారంలో 50శాతం పెరిగింది, ఏం జరుగుతోంది

ఫొటో సోర్స్, FUTURE PUBLISHING/GETTY IMAGES
- రచయిత, రజిని వైద్యనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బంగ్లాదేశ్‌లో ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. కేవలం వారం రోజుల్లో సుమారు 50శాతం ధరలు పెరిగాయి.
ఊహించని రీతిలో లీటరు పెట్రోలు ధరల 86 టాకాల నుంచి 130 టాకాలకు చేరింది. డీజిల్, కిరోసిన్ ధరలు 42.5 శాతం పెరిగాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో బంగ్లాదేశ్ ఒకటి. కానీ, అక్కడి పరిస్థితులు శ్రీలంకలా మారతాయేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మహ్మద్ నురుల్ ఇస్లాం(35) బతుకు దెరువు కోసం ట్రక్కు నడుపుతుంటారు. ఇంధన ధరలు భరించలేని స్థాయికి చేరాయని, ఇది ఇలాగే కొనసాగితే తాను వీధుల్లో అడుక్కునే పరిస్థితి రావొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంధన ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు ప్రియంగా మారి, జీవనం కష్టంగా మారుతోందని మహ్మద్ అంటున్నారు. ఆయన దీనాజ్‌పుర్‌లో ఉంటారు. ప్రతి రోజూ కూరగాయలను ఢాకాలోని దుకాణాలకు తోలుతుంటారు.
మహ్మద్‌కు ఇద్దరు పిల్లలు. తల్లిదండ్రులను కూడా ఆయనే చూసుకోవాలి. డీజిల్ రేట్లు పెరగడం వల్ల యజమాని తనకు పూర్తి జీతం ఇచ్చే స్థితిలో లేరని ఆయన చెబుతున్నారు.
'ఇంట్లోకి నిత్యావసర వస్తువులు కొనడం భారంగా మారుతోంది. ఇలాగే ఇంధన ధరలు పెరుగుతూ పోతే మా అమ్మనాన్నను చూసుకోలేను. నా పిల్లలను బడికి పంపలేను' అని మహ్మద్ అన్నారు.
'ఉద్యోగం పోగొట్టుకుంటే నేను ఇక వీధిలో అడుక్కోవాల్సిందే' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు మహ్మద్ వంటి ఎంతో మందిని భయపెడుతున్నాయి.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో భారత్, శ్రీలంక మాదిరిగానే బంగ్లాదేశ్‌లో కూడా చమురు రేట్లు భారీగా పెరుగుతున్నాయి.
'ఇంధన ధరలు పెరగడమనేది పెద్ద సమస్యనే విషయం మాకు తెలుసు. ఇతర దేశాల్లోనూ ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు మేం మాత్రం ఏం చేయగలం?' అని బీబీసీతో బంగ్లాదేశ్ ఇంధనశాఖ మంత్రి నస్రుల్ హమీద్ అన్నారు.
ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, ఆర్థికవ్యవస్థ విషయంలో అలసత్వం పాటించడం వంటి వాటి వల్లే ఇంధనలు ధరలు పెరిగాయనే ఆరోపణలున్నాయి. అయితే వీటిని హమీద్ తోసిపుచ్చారు. ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు గతంలో ప్రజలకు సబ్సిడీ కూడా ఇచ్చామని, కానీ ఇప్పుడు పరిస్థితులు తమ చేయి దాటి పోయాయని ఆయన అన్నారు.
అంతర్జాతీయంగా ముడిచమురులు కొంతమేరకైనా దిగొస్తే తాము ఇంధన ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని హమీద్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
పెట్రోలు ధరలు పెరుగుతుండటం, విదేశీ మారకపు నిల్వలు తరిగిపోతుండటం వంటి పరిణామాల వల్ల బంగ్లాదేశ్ కూడా శ్రీలంక మాదిరిగానే ఆర్థిక సంక్షోభంలో పడుతుందని కొందరు భయపడుతున్నారు.
అయితే విదేశీ మారకపు నిల్వలు తగ్గిపోవడం అంత ప్రమాదకరమైన విషయమేమీ కాదని, తమకు శ్రీలంక పరిస్థితి రాదని హమీద్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా జులైలో ప్రశంసలు పొందిన బంగ్లాదేశ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) నుంచి అప్పు కోరింది. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్ ఐఎంఎఫ్‌ను రుణం కోసం సంప్రదించాయి.

పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. తన బిడ్డ చికిత్స కోసం రోజూ బస్సులో తిరిగే మొస్సామద్ జకియా సుల్తానాకు ఇది చాలా కష్ట సమయం. డీజిల్ ధరలు పెరగడంతో బస్సు టికెట్ ధరలు పెరిగాయి.
'బస్సు టికెట్ మాత్రమే కాదు. మార్కెట్‌లో అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. ఇప్పుడు మాకు బతకడమే కష్టంగా ఉంది. రిక్షా, ఆటో వంటి వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు పోవాలంటేనే కష్టంగా మారుతోంది' అని జకియా సుల్తానా అన్నారు.
తమ ఇంట్లోకి అవసరమైన తిండి గింజలు కొనుక్కోవడం కూడా ఇప్పుడు భారంగా మారిందని, వ్యవసాయ కూలీగా పని చేసే హజ్దా చెప్పారు.
పెరుగుతున్న ఇంధనలు ధరలు బంగ్లాదేశ్ ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- దువ్వూరి సుబ్బమ్మ: స్వాతంత్ర్య పోరాటంలో జైలు పాలయిన తొలి తెలుగు నాయకురాలు
- కార్తికేయ 2 రివ్యూ: శ్రీకృష్ణుడి కాలి కడియం కథను నమ్ముకున్న నిఖిల్ సీక్వెల్ సినిమా హిట్టవుతుందా?
- బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన చెంచులు, ఆదివాసీలను స్వాతంత్ర్య సమరయోధులుగా ఎందుకు గుర్తించలేదు?
- ఎవరీ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా? ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’ అని ఎందుకు అంటారు
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీల నిర్వహణకు కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు ఎందుకు కోరుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













