వారెన్ బఫెట్, రాకేశ్ ఝుంఝున్‌వాలా ఎలా స్టాక్ మార్కెట్స్‌లో కోట్లు సంపాదించారు... వాళ్ళ పోర్ట్‌ఫోలియోల నుంచి ఏం నేర్చుకోవాలి?

ఫొటో సోర్స్, FACEBOOK/RAKESHJHUNJHUNWALAS
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
మదుపు అనే పదానికి పర్యాయపదంగా మారిన వ్యక్తి వారెన్ బఫెట్. తన తొమ్మిదవ ఏటనే మదుపు చేయడం మొదలుపెట్టిన బఫెట్ అచిరకాలంలోనే ఒక బలమైన పోర్ట్ ఫోలియో నిర్మించుకున్నారు. కొన్ని దశాబ్దాల పాటు లాభాలు గణించే యంత్రం లాంటి పోర్ట్ ఫోలియో తయారు చేసుకున్నారు. మదుపరిగా తన ఆరుదశాబ్దాల ప్రయాణం ఎంతోమంది ఔత్సాహిక మదుపరులకు స్పూర్తిగా నిలిచింది.
వారెన్ బఫెట్ గత ఇరవై ఏళ్లల్లో లాభాల స్థాయిని ఎలా పెంచుకున్నారో, అందుకు ఆయన పోర్ట్ ఫోలియోలో చేసిన మార్పులు ఏమిటో చూద్దాం. కింద ఇచ్చిన పట్టికలో వివిధ సంవత్సరాలలో బఫెట్‌కు చెందిన బెర్క్ షైర్ హాత్వే కంపెనీ పోర్ట్ ఫోలియో వివరాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, IVBKARTHIKEYA
ఈ పట్టికలో గమనించాల్సిన ముఖ్య విషయాలు
అమెరికన్ ఎక్స్‌ప్రెస్, కోకాకోలా కంపెనీల షేర్లు బఫెట్ కొనసాగిస్తూనే ఉన్నారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీలో పదిహేను కోట్ల షేర్లు, కోకాకోలా కంపెనీలో ఇరవై కోట్ల షేర్లను గత కొన్ని దశాబ్దాలుగా బఫెట్ తనవద్ద ఉంచుకున్నారు. మదుపు చేసే సమయంలో దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అనేది పర్సనల్ ఫైనాన్స్‌లో మౌలిక సూత్రం. దాన్ని బఫెట్ తూచా తప్పకుండా పాటిస్తున్నారు.
కోకాకోలా కంపెనీ గిరాకీ తగ్గే అవకాశం లేకపోవడం, ఆ కంపెనీకి పోటీనిచ్చే మరొక కంపెనీ లేకపోవడం బఫెట్ ఆ కంపెనీ షేర్లు కొనసాగించడానికి ప్రధాన కారణం.
2017 దాకా యాపిల్ కంపెనీ షేర్లు కొనలేదు. ఇదే కాక, ఎలాంటి టెక్నాలజీ కంపెనీల షేర్లు కొనలేదు. తనకు అర్థం కాని వ్యాపారంలో తాను మదుపు చేయనని బఫెట్ తరచూ చెబుతుంటారు. అందుకే 2011 దాకా ఎలాంటి టెక్నాలజీ కంపెనీలలో మదుపు చేయలేదు. ఎప్పటికప్పుడు వ్యాపార పరిస్థితుల్లో పెను మార్పులు సంభవించే టెక్నాలజీ రంగం బఫెట్ ఆలోచనా విధానానికి నప్పలేదు.
డెల్టా ఎయిర్‌లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ లాంటి విమానయాన సంస్థల్లో మదుపు చేసిన కొన్ని రోజులకే తన పెట్టుబడిని వెనక్కు తీసుకున్నారు. గిరాకీ తక్కువగా ఉండే ఎయిర్‌లైన్స్ కంపెనీలు బఫెట్‌కు అనుకున్న లాభాలను ఇవ్వలేకపోయాయి.
2011లో కొన్న ఐబీయం షేర్లను 2017లో అమ్మేశారు. బఫెట్ అమ్మేసిన కొన్ని రోజులకే ఐబీయం షేర్లు భారీగా పతనం అయ్యాయి.
ప్రస్తుతం బఫెట్ పోర్ట్ ఫోలియోలో 41 శాతం యాపిల్ కంపెనీ షేర్లు ఉన్నాయి. ఇది, గతంతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన మదుపు. కానీ, కోవిడ్ కాలంలో కంప్యూటర్లకు పెరుగుతున్న గిరాకీ చూస్తుంటే బఫెట్ మదుపు లాభదాయకమే అనిపిస్తోంది.
రాకేశ్ ఝుంఝున్‌వాలా పోర్ట్ ఫోలియో
భారత స్టాక్ మార్కెట్లో స్టార్ మదుపరిగా ఎదిగిన రాకేశ్ ఝుంఝున్‌వాలా స్టాక్ మార్కెట్ గమనాన్ని అంచనా వేయడంలో సిద్దహస్తుడు. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో కూడా నష్టభయం లేని పోర్ట్ ఫోలియో నిర్మించుకున్నారు. కింద ఇచ్చిన పట్టికలో గత రెండేళ్లల్లో ఝుంఝున్ వాలా పోర్ట్ ఫోలియో ప్రధాన షేర్లు చూద్దాం.

ఫొటో సోర్స్, IVBKARTHIKEYA/CNBC
ఈ పట్టికలో ఉన్న ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం.
టైటన్ కంపెనీలో రాకేశ్ ఝుంఝున్‌వాలా 5 శాతం షేర్లు నిలకడగా ఉన్నాయి. టైటన్ కంపెనీ పనితీరు బాగుండటం, ఆ సంస్థ వ్యాపారానికి గిరాకీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ షేర్లకు నష్టభయం లేదు. కంపెనీలలో కాకుండా వ్యాపారాలలో మదుపు చేయాలి అనే సూత్రం ఇక్కడ ప్రస్తావించక తప్పదు.
2021 డిసెంబర్‌లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో 17.5 శాతం షేర్లు కొన్నారు. కోవిడ్ తర్వాత ప్రజలలో బీమా గురించి ఎంతో అవగాహన పెరిగింది. ఈ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం.
ఫోర్టిస్ ఆసుపత్రులను నిర్వహించే కంపెనీలో కూడా ఝుంఝున్‌వాలా షేర్లు చాలా కాలంగా ఉన్నాయి. పెరుగుతున్న జనాభాకు తగిన వైద్యసేవలు అందించే కంపెనీలో మదుపు చేయడం హేతుబద్దమైన నిర్ణయం.
2021 డిసెంబర్‌లో మెట్రో బ్రాండ్స్ కంపెనీలో 14.5 శాతం షేర్లు కొనుగోలు చేశారు. ఇది ఒక ఆసక్తికరనమైన మదుపు, ఎందుకంటే పోటీ ఎక్కువగా ఉండే రీటెయిల్ రంగంలో ఎలాంటి లాభాలు వస్తాయో వేచి చూడాల్సిందే.
ఇండియన్ హోటల్స్ కంపెనీలో మదుపు చేయడం కూడా కోవిడ్ అనంతరం వచ్చే గిరాకీని దృష్టిలో పెట్టుకుని చేసిందేనని ఝుంఝున్‌వాలా స్వయంగా చెప్పారు.
ప్రస్తుతం నడుస్తున్న ఇంఫ్రాస్ట్రక్చర్ అభివృధ్ధికి తగినట్టుగా నాగర్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో 12.6 శాతం షేర్లు కొనసాగిస్తున్నారు.

ఫొటో సోర్స్, KUNAL PATIL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
ఈ రెండు పోర్ట్ ఫోలియోల నుంచి నేర్చుకోవలసిన పాఠాలు
1. దీర్ఘకాలిక ప్రణాళిక
బఫెట్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్, కోకాకోలా షేర్లు కొన్ని దశాబ్దాలుగా అట్టిపెట్టుకున్నారు. అంటే అన్ని సంవత్సరాలుగా ఆ సంస్థలు ఇస్తున్న డివిడెండ్ పొందుతున్నారు. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న మదుపు మార్గాలను దీర్ఘకాలం పాటూ కొనసాగించాలి. చాలామంది మదుపరులు నష్టం వస్తుందేమో అన్న ఆలోచనతో మదుపును ఆపేస్తుంటారు. ఇది సరైన ఆలోచనా ధోరణి కాదు.
2. భవిష్యత్తు మీద ఆలోచన:
రాకేశ్ ఝుంఝున్‌వాలా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలో ఏకంగా 17.5 శాతం షేర్లు కొన్నారు. అలాగే ఫోర్టిస్ ఆసుపత్రలలో కూడా మదుపు చేశారు. ఇది కోవిడ్ లాంటి ఆరోగ్య సంక్షోభం తర్వాత ప్రజలలో ఆరోగ్య బీమ మీద పెరుగుతున్న ఆవగాహనను గమనించి చేసిన తెలివైన మదుపు. సంస్థలలో కాకుండా వ్యాపారాలలో మదుపు చేయాలనే మౌలిక సూత్రం ఇక్కడ ప్రస్తావనార్హం.
3. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ
రాకేశ్ ఝంఝన్‌వాలా నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో గత కొన్నేళ్లుగా స్థిరంగా మదుపును కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ఉండటం ముఖ్యంగా రహదారుల నిర్మించడంలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నెలకొల్పుతుండటం వల్ల ఈ రంగం కూడా చాలా తెలివైన మదుపు అవకాశం.
4. హేతుబద్దమైన మదుపు
బఫెట్ ఐబీయం షేర్లు ఆరేళ్ల తర్వాత అమ్మేశారు. ఎంతో ఖ్యాతిగాంచిన ఐబీయం సంస్థ షేర్లను కొన్ని త్రైమాసిక ఫలితాలు అనుకున్న విధంగా రాకపోవడంతో అమ్మేశారు. ఐబీయం సంస్థకు ఉన్న పేరు ప్రతిష్ఠలకు ఎలాంటి విలువ ఇవ్వలేదు. కేవలం సంస్థ పనితీరును మాత్రమే పరిగణలోకి తీసుకుని మదుపు నిర్ణయం తీసుకున్నారు. ఒక సంస్థ గతంలో మంచి ఫలితాలు అందించింది అంటే మళ్లీ అవే పునరావృతం అవుతాయన్న నమ్మకం లేదు. కేవలం ఆ సంస్థ పనితీరు మాత్రమే మదుపుకు కొలమానం కావాలి.
ఇవి కూడా చదవండి:
- 'బిన్ లాడెన్ తల తీసుకురా': అల్ ఖైదా అధినేతను వేటాడటానికి అమెరికా పంపిన సీఐఏ గూఢచారి
- బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది, లోపం ఎక్కడుంది?
- సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్‌ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా
- గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టెల్ అవీవ్‌పై రాకెట్లు ప్రయోగించిన పీఐజే: పాలస్తీనా పౌరులు, మిలిటెంట్ల మృతి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













