రాజస్థాన్: దళిత వధూవరులను గుడిలోకి రాకుండా ఆపిన పూజారి అరెస్ట్... అసలేమిటీ వివాదం?

ఫొటో సోర్స్, TARARAM MEGHWAL
- రచయిత, మెహర్ సింగ్ మీణా
- హోదా, బీబీసీ కోసం
రాజస్థాన్ లోని జలోర్ జిల్లా నీలకంఠ్ గ్రామంలో గుడికి వచ్చిన కొత్త జంటకు పూజారి నుంచి చేదు అనుభవం ఎదురైంది. దళిత వధూవరులు, వారి కుటుంబ సభ్యులు ఆలయ ప్రవేశం చేయడం, కొబ్బరికాయ కొట్టడంపై పూజారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పూజారి వేలా భారతి దళిత దంపతుల కుటుంబ సభ్యులను బెదిరించడం, గుడి బయట కొబ్బరికాయ కొట్టాలని ఆదేశించడం కనిపిస్తుంది.
ఏప్రిల్ 22 మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తర్వాత భాద్రాజూన్ పోలీస్ స్టేషన్‌లో వధువు తరపున లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఏప్రిల్ 23న ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూజారి వేలా భారతి ని అరెస్ట్ చేశారు.
ఏప్రిల్ 21న, జలోర్ జిల్లాలోని అహోర్ సబ్‌డివిజన్ ప్రాంతంలోని నీలకంఠ గ్రామానికి సాడణ్ ఊరు నుంచి పెళ్ళి కొడుకు కుకారామ్ బారాత్ వచ్చింది. పెళ్లి తర్వాత, మరుసటి రోజు ఏప్రిల్ 22న అప్పగింతల కార్యక్రమం ఉంది.
సంప్రదాయం, ఆచారం ప్రకారం, వీడ్కోలుకు ముందు, వధూవరులు ఆలయానికి వెళ్లి పూజలు చేసి, కొబ్బరికాయ కొడతారు.
"మేం ఆలయ ప్రధాన ద్వారం మెట్లు ఎక్కి కొంచెం ముందుకు వచ్చాము. కానీ పూజారి మమ్మల్ని ఆపి, మీరు కొబ్బరికాయ కొట్టడానికి, గుడిలో నైవేద్యం పెట్టడానికి వీలులేదు, వెళ్లిపొమ్మని చెప్పారు. బయటకు వెళ్లకపోతే గ్రామంలో అందరినీ పిలుస్తానని బెదిరించారు'' అని వధువు సోదరుడు 26 ఏళ్ల తారారామ్ మేఘ్వాల్ బీబీసీతో అన్నారు
ఈ సందర్భంగా ఆలయ పూజారికి, తారరామ్ మేఘ్వాల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి వధూవరులను ఆలయం నుండి బయటకు పంపారు. తనకు ఆలయంలోకి ప్రవేశం ఇవ్వలేదని తారరామ్ మేఘవాల్ ఆరోపించారు. దీనిపై వెంట వచ్చిన యువకులు నిరసన తెలపడంతో వాగ్వాదం, ఘర్షణ చెలరేగింది.
అయితే, గ్రామస్తులు వారిని శాంతింపజేశారు.
ఈ వివాదం తర్వాత ఆలయం వెలుపలే వధూవరులకు కొబ్బరికాయ కొట్టారు. ఈ సమయంలో కూడా, పూజారి వధూవరుల కుటుంబాలను దుర్భాషలాడడం కనిపించింది.
సంఘటన తర్వాత, కుటుంబ సభ్యుల అంగీకారంతో తారారామ్ మేఘవాల్ భద్రజూన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగానే ఏప్రిల్ 23 మధ్యాహ్నం డిప్యూటీ ఎస్పీ హిమ్మత్ చరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.
ఈ మొత్తం ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఒకరు ఈ ఘటనను వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫొటో సోర్స్, TARARAM MEGHWAL
పోలీసు యంత్రాంగం ఏం చెప్పింది
ఏప్రిల్ 25 సాయంత్రం జరిగిన ఈ ఘటనపై జలోర్ పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. "షెడ్యూల్డ్ కులాలకు చెందిన కొత్తగా పెళ్లైన వరుడిని నీలకంఠ్ మహాదేవ్ ఆలయంలోకి ప్రవేశించకుండా ఆపలేదు. ఇది సంఘటన సమయంలో తీసిన వీడియోలో కనిపిస్తుంది" అని పోలీసులు తెలిపారు.
"కొత్తగా పెళ్లయిన వరుడు ఆలయంలో కొబ్బరికాయ కొట్టే విషయంలో అసభ్యకరంగా ప్రవర్తించి, వరుడితో పాటు వచ్చిన వారిని ఆలయ పూజారి కుల దూషణలతో కించపరిచారు" అని చెప్పారు.
ఈ కేసులో 61 ఏళ్ల ఆలయ పూజారి వేలా భారతిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపారు.
గ్రామస్తులు రాజీ కి తమపై ఒత్తిడి తెస్తున్నారని తారారామ్ మేఘ్వాల్ చెప్పారు. పోలీసులు కూడా గ్రామంలోని అగ్రవర్ణాల ఇళ్లకు వెళ్లి మాట్లాడుతున్నారని, తమతో మాత్రం మాట్లాడడం లేదని ఆయన ఆరోపించారు.
ఈ కేసులో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరక్కుండా నిరంతరం నిఘా పెడతామని జలోర్ జిల్లా కలెక్టర్ నిశాంత్ జైన్ అన్నారు. భద్రజూన్ పోలీస్ స్టేషన్‌లో, ప్రెసిడెంట్ ప్రతాప్ సింగ్ సమక్షంలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
తారారామ్ మేఘవాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఫొటో సోర్స్, TARARAM MEGHWAL
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
ఈ ఘటనకు సంబంధించిన మూడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో పూజారి వేలా భారతి వధూవరులతో, వారి కుటుంబ సభ్యులతో గుడిలో వాదిస్తూ గ్రామస్తులను పిలిపించి శిక్షించాలంటూ అరుస్తున్నట్లు కనిపిస్తోంది. దాదాపు మూడు నిమిషాల ఈ వీడియోలో ఆలయంలో గొడవ, కుల దూషణలు కూడా కనిపిస్తున్నాయి.
బయటనే పూజలు చేసి కొబ్బరికాయ కొట్టాలని పూజారి అడగడంతో తారారామ్, పూజారి మధ్య వాగ్వాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. మరో వీడియోలో, పూజారులు ఆలయం వెలుపల వేదికపై నిలబడి ఉన్నారు.
ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చిన అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులు పూజలు చేయిస్తున్నారు.

ఫొటో సోర్స్, TARARAM MEGHWAL
ఎఫ్ఐఆర్ లో ఏముంది
భాద్రాజూన్ పోలీస్ స్టేషన్‌లో తారారామ్ మేఘ్వాల్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో, "మేము పెళ్లి కోసం గుడిలో కొబ్బరికాయ కొట్టడానికి వెళ్లాము, ఆలయ పూజారి మమ్మల్ని బయట ఆపారు. మీరు అంటరానివారు అని అన్నారు. నువ్వు తక్కువ కులానికి చెందినవాడివి, గుడి లోపల కొబ్బరికాయ కొట్టకూడదు. బయటనే కొట్టాలి'' అని పేర్కొన్నారు.
ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పోలీసులు షెడ్యూల్డ్ కులాల సెక్షన్లు కింద కేసు పెట్టారు. షెడ్యూల్డ్ తెగల (అట్రాసిటీల నిరోధక) చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఎవరెస్ట్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ శిఖరంపై యుక్రెయిన్ యుద్ధ ప్రభావం
- మనకు తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- మెన్స్ట్రువల్ కప్: నెలసరి సమయంలో దీనిని ఎలా వాడాలి? ఇక శానిటరీ ప్యాడ్ల అవసరం ఉండదా? 5 ప్రశ్నలు, సమాధానాలు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













