కొందరు భారతీయులకు పాస్‌పోర్టులు ఇవ్వకుండా భారత్, బ్రిటన్ ఎందుకు కుమ్మక్కయ్యాయి

జమైకాలో భారత వలస కూలీలు

ఫొటో సోర్స్, Print Collector/Getty Images

ఫొటో క్యాప్షన్, జమైకాలో భారత వలస కూలీలు
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘పాస్‌పోర్టులను పొందడం, విదేశాలకు వెళ్లడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు’’అని 1967లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఇది చరిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే అంతకుముందు వరకు పాస్‌పోర్టు అనేది ఒక హోదా లాంటిది. భారత్‌ను విదేశాల్లో ఉన్నతంగా చూపించే ‘‘గౌరవనీయులు లేదా గొప్పవారికి’’ మాత్రమే దీన్ని ఇచ్చేవారు.

‘‘దీన్ని ఒక ‘పౌర హోదా’గా పరిగణించేవారు. చదువుకున్న వారికి, డబ్బులు ఉండేవారికి, పలుకుబడి ఉండేవారికి మాత్రమే అప్పట్లో పాస్‌పోర్టులు ఇచ్చేవారు’’అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన చరిత్రకారిణి రాధికా సింఘా చెప్పారు.

ముఖ్యంగా మలయా, సిలోన్ (శ్రీలంక), బర్మా (మియన్మార్)లకు వెళ్లే కూలీలకు పాస్‌పోర్టులు ఇచ్చేవారుకాదని రాధికా తెలిపారు. ‘‘బ్రిటిష్ పాలనా కాలంలో వెట్టిచాకిరీ చేయించేందుకు వీరిని ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లేవారు. వీరి సంఖ్య కూడా లక్షల్లో ఉండేది’’అని ఆమె చెప్పారు.

‘‘బ్రిటిష్ పాలనా కాలంలో మొదలైన ఈ వివక్షాపూరిత వ్యవస్థ 1947 తర్వాత కూడా కొనసాగింది’’అని యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్‌టెర్‌కు చెందిన కళాత్మికా నటరాజన్ తెలిపారు.

మహాత్మా గాంధీ పాస్‌పోర్టు దరఖాస్తు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, మహాత్మా గాంధీ పాస్‌పోర్టు దరఖాస్తు

ఇలాంటి వివక్ష పూరిత పాస్‌పోర్టు జారీ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు పురావస్తు విభాగంలోని పత్రాలను నటరాజన్ పరిశీలించారు. బ్రిటిష్ పాలన తర్వాత కూడా పరిస్థితులు పెద్దగా మారలేదని ఆమె చెప్పారు. ‘‘కొన్ని వర్గాల ప్రజలను అనర్హులైన పౌరులుగా పరిగణించేవారు. వారిని వలసవాద కళ్లద్దాలతోనే చూసేవారు’’అని ఆమె చెప్పారు.

‘‘ముఖ్యంగా విదేశాలకు వెళ్లడం అనేది దేశ గౌరవంతో ముడిపడిన అంశంగా భావించేవారు. పాస్‌పోర్టు ఉండేవారు విదేశాల్లో భారత్‌కు ప్రతినిధ్యం వహించేవారిగా చూసేవారు’’అని ఆమె వివరించారు.

ముఖ్యంగా విదేశాల్లో భారత్‌కు చెడ్డపేరు తీసుకురాని వారిని గుర్తించి, వారికే పాస్‌పోర్టు ఇవ్వాలని రాష్ట్రాల్లోని అధికారులకు భారత ప్రభుత్వం సూచించేది. 1954 వరకు రాష్ట్ర ప్రభుత్వాలే ఈ పాస్‌పోర్టులను జారీచేసేవి.

చాలా మందికి పాస్‌పోర్టులు ఇవ్వకుండా అడ్డుకోవడం ద్వారా విదేశాల్లో అర్హులైన తమ దేశానికి చెందిన పౌరులు మాత్రమే ఉండేవారని భారత్ గర్వంగా చెప్పేది.

1962లో బ్రిటన్‌లో ఇంగ్లిష్ క్లాసుల్లో భారత పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1962లో బ్రిటన్‌లో ఇంగ్లిష్ క్లాసులో భారత పిల్లలు

ఎందుకు ఇలా?

1947 తర్వాత దిగువ మధ్య తరగతి ప్రజలు బ్రిటన్‌తోపాటు ఇతర బ్రిటన్ పాలిత ప్రాంతాలకు వలస వెళ్లకుండా నియంత్రించడమే లక్ష్యంగా బ్రిటన్, భారత్.. రెండు దేశాల అధికారులు సంయుక్తంగా ఇలాంటి వ్యవస్థను అమలు చేశారని డాక్టర్ నటరాజన్ చెప్పారు.

బ్రిటిష్ నేషనాలిటీ యాక్ట్-1948 ప్రకారం.. స్వాతంత్ర్యం తర్వాత స్వేచ్ఛగా భారతీయులు బ్రిటన్‌లోకి అడుగుపెట్టొచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్‌ లోపల, వెలుపల ఉండే ప్రజలను బ్రిటిష్ సబ్జెక్టులుగా భావించేవారు. దీంతో బ్రిటన్‌లోకి అడుగుపెట్టేందుకు ‘‘అర్హులైన’’ వారికి మాత్రమే పాస్‌పోర్టులు ఇచ్చేలా పాస్‌పోర్టు జారీ వ్యవస్థను తీసుకొచ్చారు.

వీడియో క్యాప్షన్, భార‌త్ నుంచి దోచుకెళ్లిన సంప‌ద‌తో ఇంగ్లండ్‌లో ఈ భ‌వ‌నాలు నిర్మించారు

‘‘దీని వల్ల రెండు దేశాలు లబ్ధి పొందేవి. ముఖ్యంగా కూలీలు, పేద భారతీయులు.. పశ్చిమ దేశాల్లో అడుగుపెడితే తమకు చిన్నచూపుగా భారత్ భావించేది. మరోవైపు బ్రిటన్‌కు కూడా వలసల ముప్పు తగ్గుతుంది. ముఖ్యంగా కూలీల వలసలను అడ్డుకోవచ్చు’’అని నటరాజన్ చెప్పారు.

బ్రిటన్‌కు పోటెత్తిన వలసదారులపై 1958లో ఒక నివేదిక వెలువడింది. ‘‘దీనిలో రెండు రకాల వలసదారుల గురించి ప్రస్తావించారు. వీరిలో మొదటిది పశ్చిమ భారత వలసదారులు. వీరు ఆంగ్లంలో మాట్లాడుతూ తేలిగ్గానే బ్రిటిష్ సమాజంలో కలిసిపోగలరు. ఇక రెండో వర్గంలోనూ కొందరు భారతీయలతోపాటు పాకిస్తానీ పౌరులు కూడా ఉన్నారు. వీరికి ఆంగ్లం అంతంత మాత్రంగానే వచ్చివుంటుంది. వీరిలో నైపుణ్యాలు చాలా తక్కువగా ఉండేవి’’అని పేర్కొన్నారు.

పాస్‌పోర్టు

నైపుణ్యాలు తక్కువ ఉండేవారు ఎక్కువ...

భారత ఉప ఖండం నుంచి బ్రిటన్‌లోకి అడుగుపెట్టే వారిలో ఎక్కువమంది నైపుణ్యాలు తక్కువగా ఉండే రైతు కూలీలే ఉండేవారు. వీరికి ఇంగ్లిష్ చాలా తక్కువగా వచ్చేది. వీరిని బ్రిటిష్ ప్రభుత్వం తలనొప్పిగా భావించేదని నటరాజన్ చెప్పారు.

ఈ విషయంలో 1950లలో భారత అధికారులకు బ్రిటన్‌లోని కామన్వెల్త్ వ్యవహారాల కార్యాలయానికి చెందిన ఒక అధికారి లేఖ రాశారు. కొందరు వలసదారులను విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

ప్రస్తుతం భారత్‌లోని 140 కోట్ల జనాభాలో షెడ్యూల్ కులాలు లేదా దళితులు జనాభా 23 కోట్ల వరకు ఉంటుంది. అప్పట్లో ఇలాంటి అణగారిన వర్గాలనే పాస్‌పోర్టులు పొందేందుకు అనర్హులుగా ప్రకటించారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, కొందరు మేధావులకు కూడా పాస్‌పోర్టులు ఇచ్చేవారు కాదు.

పాస్‌పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఎలా ఇవ్వమని చెప్పేవారు?

పాస్‌పోర్టుల జారీ నిరాకరణకు చాలా కారణాలు ఉండేవి. ముందుగా అభ్యర్థులు ఇంగ్లిష్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత సరిపడా డబ్బులు కూడా కట్టాలి. మరోవైపు ఆరోగ్య పరీక్షలు కూడా తప్పనిసరి.

తనకు మంచి విద్యార్హతలు, ఆర్థిక పరమైన రిఫరెన్సులు ఉన్నప్పటికీ పాస్‌పోర్టు పొందేందుకు తనకు ఆరు నెలలు పట్టిందని బ్రిటిష్ ఇండియన్ రచయిత దిలిప్ హీరో అప్పట్లో చెప్పారు.

మరోవైపు ఇలాంటి వివక్షపూరిత పాస్‌పోర్టుల జారీ వ్యవస్థతో కొన్ని ఊహించని సమస్యలు కూడా ఎదురయ్యాయి. కొందరు నకిలీ పాస్‌పోర్టులు సంపాదించేవారు. ఆ విషయం బయటపడిన తర్వాత 1959 నుంచి 1960 మధ్య ఇంగ్లిష్ రాని వారు (చదువుకోని వారు, అంతంత మాత్రం చదువుకున్న వారు) పూర్తిగా పాస్‌పోర్టు పొందడానికి అనర్హులని ప్రకటించారు.

స్వాతంత్ర్యం తర్వాత మొదటి రెండు దశాబ్దాలు విదేశాలకు వెళ్లడం అనే కల అందరికీ సాధ్యమ్యేది కాదు.

అయితే, 2018లో ‘‘ఆరెంజ్ పాస్‌పోర్టు’’లను తీసుకొస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించడంతో మళ్లీ పాతకాలం నాటి సంగతులు ఒకసారి గుర్తుకువచ్చాయి. ముఖ్యంగా తక్కువ నైపుణ్యాల గల భారతీయుల కోసం ఈ పాస్‌పోర్టులు తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన చెప్పారు.

అయితే, విమర్శల నడుమ ఈ విధానాన్ని పక్కన పెట్టేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి పాస్‌పోర్టులతో ‘‘చదువుకున్న వారు, ఉన్నత వర్గాల వారే విదేశాల్లో భారత ప్రతిష్టను ఇనుమడింపజేయగలరు’’అనే భారత్ దృక్పథానికి మళ్లీ ఊపిరి పోసినట్లు అవుతుందని నటరాజన్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)