డేటా సేకరణలో భారత్ చరిత్ర ఏంటి... ఇప్పుడు గణాంకాల వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందా?

ఫొటో సోర్స్, Courtesy Indian Statistical Institute
భారత్‌లోని అధికారిక డేటా విశ్వసనీయతపై చాలా ప్రశ్నలు వస్తున్నాయి. కోవిడ్-19 టీకాల నుంచి ఉద్యోగాల వరకు లెక్కలపై నిపుణులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే, ఒకప్పుడు డేటా సేకరణలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచేది. ఆ సంగతులపై రచయిత, చరిత్రకారుడు నిఖిల్ మేనన్ అందిస్తున్న కథనమిది.
బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సోవియట్ యూనియన్ ఆర్థిక వ్యవస్థను భారత్ అనుసరించింది. సోవియట్ తరహాలో పంచవర్ష ప్రణాళికలను మొదలుపెట్టింది. దీంతో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కచ్చితమైన, క్షేత్రస్థాయి సమాచారం సేకరించడం అనివార్యమైంది.
అయితే, ఈ డేటా సేకరణలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ‘‘మన దగ్గర డేటా లేదు. మనం చీకట్లో పనిచేస్తున్నాం’’అని తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కూడా వ్యాఖ్యానించారు. డేటా వనరులను ఏర్పాటుచేసుకోవడం అనివార్యమని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ దిశగా పడిన తొలి విప్లవాత్మక అడుగుగా ‘‘1950లో నేషనల్ శాంపిల్ సర్వే ఏర్పాటు’’ను చెప్పుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ప్రజల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే బాధ్యతలను దీనికి అప్పగించారు.
అయితే, దేశంలోని ప్రతి మూలకు వెళ్లి గణాంకాలను సేకరించడం అసాధ్యం. అందుకే అన్ని వర్గాల డేటా వచ్చేలా ఒక శాంపిల్‌ను తయారుచేయాలని భావించారు.
‘‘అది ప్రపంచంలోనే అతిపెద్ద, సమగ్రమైన శాంపిల్ సర్వే’’అని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక 1953లో ఓ వార్త ప్రచురించింది.

ఫొటో సోర్స్, Courtesy Indian Statistical Institute
ఆ సర్వే బాధ్యతలను భారత స్టాటిస్టిక్స్ పితామహుడు పీసీ మహలనోబిస్‌కు నెహ్రూ అప్పగించారు. అప్పుడే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌ను మహలనోబిస్ మొదలుపెట్టారు.
అయితే, ఈ సర్వేలో మహలనోబిస్‌కు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. మొత్తంగా 5,60,000 గ్రామాల్లో ఆయన బృందం 1833 గ్రామాలను ఎంచుకొంది. దీని కోసం 15 భాషల్లో మాట్లాడుతూ, 140 వివరాలను సేకరించాల్సి వచ్చింది.
ఆ సంక్లిష్ట ఆపరేషన్ గురించి మహలనోబిస్ తన డెయిరీలో ప్రస్తావించారు. ‘‘ఒడిశాలో కొన్ని అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాల సహాయంతో పరిశోధకులు డేటా సేకరించాల్సి వచ్చింది. కొన్నిసార్లు హిమాలయాల్లోని ఎత్తైన పర్వత మార్గాల గుండా వెళ్లాల్సి వచ్చింది’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Courtesy Indian Statistical Institute
అప్పట్లో ప్రజల స్థితిగతులను కూడా మహలనోబిస్ వివరించారు. అస్సాంలో సర్వేయర్లకు మెరుగైన నాగరిక ప్రజలతోపాటు నగ్నంగా ఉండే గిరిజనులు కూడా తారసపడ్డారు. ఆ గిరిజనులు మాట్లాడే భాష కూడా సర్వేయర్లకు తెలియదు. అసలు కరెన్సీ అంటే ఏమిటో కూడా ఆ గిరిజనులకు తెలియదని మహలనోబిస్ రాసుకొచ్చారు. ‘‘ఆర్థిక అభివృద్ధి’’లాంటి పదాలను చెబితే వారు నవ్వేవారని వివరించారు.
మరికొన్నిచోట్ల నేషనల్ శాంపిల్ సర్వే సిబ్బందిని నేరస్థుల ముఠాలు వేధించాయి కూడా. ‘‘అడవుల్లో కొన్నిసార్లు జంతువుల భయం ఉండేది. వ్యాధుల ముప్పు కూడా వెంటాడేది’’అని ఆయన పేర్కొన్నారు. ‘‘కొన్ని ప్రాంతాల్లో పెద్దపెద్ద అటవీ, నరమాంస భక్షక జంతువులను కూడా దాటుకు వెళ్లాల్సి వచ్చేది’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Courtesy Indian Statistical Institute
అద్భుతమైన ఫలితాలు..
అయితే, సర్వే ఫలితాలు అద్భుతంగా వచ్చాయి. భారతీయుల రోజువారీ జీవితానికి సంబంధించిన చిన్నచిన్న అంశాలను కూడా సర్వేయర్లు రికార్డు చేయగలిగారు.
తమిళనాడులోని ఒక మారుమూల గ్రామంలో చిదంబరం ముదళై, ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు, అత్తగారు ఎలా అన్నం, గోధుమలు, ఉప్పు, టీ, మిరప ఇతర ఆహార దినుసులతో బతికేవారో రెండో సర్వేలో పేర్కొన్నారు.
అయితే, ఈ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఏమీలేదు. ఇలాంటి వేల కొద్దీ కుటుంబాల సమాచారాన్ని కలిపి చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో విధానకర్తలు అంచనావేసేవారు. దీంతో ఆర్థిక వ్యవస్థను ఒక కొత్త కోణంలో వారు చూడగలిగారు.
అప్పటి నుంచీ భారత్‌లోని సామాన్యుల ఆర్థిక స్థితిగతులపై నేషనల్ శాంపిల్ సర్వే వివరాలను సేకరిస్తోంది. దీని ద్వారా పేదరికం, ఉపాధి కల్పన, వినియోగం, ఖర్చులు తదితర అంచనాలను వెల్లడిస్తోంది.
మరోవైపు ప్రపంచ స్థాయిలో విధాన నిర్ణయాలు తీసుకునే వారికీ నేషనల్ శాంపిల్ సర్వే సాయం చేస్తోంది. ప్రస్తుతం ఈ విధానాలను ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి కూడా ఉపయోగిస్తున్నాయి. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆంగస్ డేటన్, వెలరీ కోజెల్‌లు 2005లో ఈ విషయంపై స్పందించారు.
‘‘శాంపిల్ సర్వేలో మహలనోబిస్, భారత్.. ప్రపంచానికి మార్గ నిర్దేశం చేశారు. భారత్ అనుసరించే పద్ధతులు, విధానాలనే చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. ఈ విషయంలో మనం భారత్‌పై ప్రశంసలు కురిపించాలి’’అని వారు అన్నారు.
మొత్తంగా దేశీయంగా అభివృద్ధి చేసిన విధానాలతో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ తప్ప మరొకటి లేదని ఆర్థిక వేత్తలు టీఎన్ శ్రీనివాసన్, రోహిణీ సోమనాథన్, ప్రణబ్ బర్ధన్ కూడా చెప్పారు. ఈ విషయాన్ని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ కూడా అంగీకరించారు.
ఇక్కడ ఆధునిక భారత డేటా సామర్థ్యాన్ని మహలనోబిస్ చరిత్ర నుంచి విడదీయలేం. ఆయన కేంబ్రిడ్జి నుంచి కలకత్తా వచ్చి భారత డేటా మౌలిక సదుపాయాలకు పునాది వేశారు.
కలకత్తాలోని స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌కు ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు వచ్చేలా ఆయన చేశారు. అంతర్జాతీయ ప్రముఖ సంస్థగా దీన్ని ఆయన మార్చేశారు. వీరంతా కలిసి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని గణించడంలో సాయం అందించారు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, నేషనల్ శాంపిల్ సర్వేలకూ వీరు పునాదులు వేశారు. తొలి డిజిటల్ కంప్యూటర్లతో వీరు ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి.
కానీ, నేడు భారత డేటా సంక్షోభంలో పడినట్లు కనిపిస్తోంది. ‘‘బిగ్ డేటా’’ దిశగా ప్రపంచం పరుగులు పెడుతుంటే భారత్ కాస్త వెనుకబడింది. ‘‘భారత స్టాటిస్టికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కుప్పకూలే స్థితిలో ఉంది’’అని ఇటీవల ఆర్థికవేత్తలు హెచ్చరించారు.
కోవిడ్-19 మరణాలతో మొదలుపెట్టి, విద్య, పేదరికం ఇలా చాలా గణాంకాలపై నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ విశ్వసనీయతపైనే సందేహాలు వస్తున్నాయి.
ఒకప్పుడు ఈ రంగంలో మార్గదర్శిగా ఉండే భారత్ ఇలాంటి పరిస్థితికి రావడం శోచనీయం. మళ్లీ ఈ రంగానికి పాత వైభవం తీసుకొచ్చేందుకు భారత్ చేయాల్సిన కృషి చాలా ఉంది.
(‘ప్లానింగ్ డెమొక్రసీ: హౌ ఎ ప్రొఫెసర్, ఎన్ ఇన్‌స్టిట్యూట్ అండ్ ఎన్ ఐడియా షేప్డ్ ఇండియా’ పుస్తకాన్ని నిఖిల్ మేనన్ రాశారు. నోట్రెడామ్ యూనివర్సిటీలో హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆయన పనిచేస్తున్నారు.)
ఇవి కూడా చదవండి:
- అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













