భారతీయులు తక్కువ మంది పిల్లల్ని కంటున్నారా?

జనాభా

ఫొటో సోర్స్, IMAGESBAZAAR/GETTYIMAGES

    • రచయిత, సుశీలా సింగ్, షాదాబ్ నజ్మీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

"నేను ఒక బిడ్డను మాత్రమే కనాలనుకున్నా. రెండో బిడ్డను కని, పెంచే ఆర్థిక స్తోమత మాకు లేదు" అన్నారు సల్మా (పేరు మార్చాం).

రెండో బిడ్డను కనమని అత్తమామల నుంచి, సొంత తల్లిదండ్రుల నుంచి కూడా ఒత్తిడి వస్తోందన్నారామె.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నివసిస్తున్నారు సల్మా.

"నాకు ఒక పాప ఉంది. నాకు 40 ఏళ్లు వచ్చేశాయి. అయినప్పటికీ, రెండో పిల్లని కనమని ఒత్తిడి తెస్తున్నారు. రెండో బిడ్డకు అయ్యే ఖర్చులు మీరు భరిస్తారా అని అడుగుతున్నా. ఉన్న పిల్లని బాగా చూసుకుని, మంచి జీవితం ఇవ్వగలిగితే చాలని నేను, నా భర్త నిర్ణయించుకున్నాం" అన్నారామె.

జైపూర్‌కు చెందిన రాఖీదీ ఇదే కథ. ఒక బిడ్డ చాలని అనుకుంటున్నారు.

ఇది ఒక్క సల్మా, రాఖీల కథే కాదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) గణాంకాలు పరిశీలిస్తే ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. అన్ని మతాలు, వర్గాల్లో పిల్లల్ని కనే రేటు తగ్గుతోందని NFHS-5 డేటా చెబుతోంది.

NFHS-4 (2015-2016)లో సంతానోత్పత్తి రేటు 2.2 శాతం ఉంటే, NFHS-5 (2019-2021)లో అది 2.0 శాతానికి తగ్గింది.

అంటే జంటలు సగటున ఇద్దరు పిల్లలకు జన్మనిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, ఆర్థిక ఒత్తిడి.. సంతానోత్పత్తి తగ్గిపోవడానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు అంటున్నారు.

అయితే, సమాజంలో మరో వర్గం కూడా ఉంది. మగపిల్లాడు కావాలనే ఆశతో ఆపకుండా పిల్లల్ని కనేవాళ్లూ ఉన్నారని నిపుణులు అంటున్నారు.

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్‌ (IIPS)లో ప్రొఫెసర్, ఈ రిపోర్టర్ రాసినవారిలో ఒకరైన ఎస్‌కే సింగ్ ఈ రేటు తగ్గడానికి పలు కారణాలను వివరించారు.

"ఆడపిల్లల వివాహ వయస్సు పెరిగింది. స్కూలుకు వెళ్లే సంవత్సరాల సంఖ్య పెరిగింది. గర్భనిరోధకాల వినియోగం పెరిగింది. శిశు మరణాల రేటు తగ్గింది. అయితే, పేదరికం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న వర్గాల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగానే ఉంది" అని ఆయన చెప్పారు.

అన్ని మతాల్లో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. గత సర్వేతో పోలిస్తే శాతాలో మార్పు . .

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యత్యాసం

పట్టణాల్లో సంతానోత్పత్తి రేటు 1.6 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 2.1 శాతం ఉంది. ముస్లింలలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిందని NFHS తాజా సర్వే చెబుతోంది.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముట్రేజా మాట్లాడుతూ, "50వ దశకంలో (1951), భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) సుమారు 6 శాతం ఉంది. ఇప్పుడు అది బాగా తగ్గడం ప్రగతి అనే చెప్పుకోవాలి. మహిళల విద్యావకాశాలు పెరిగిన చోట సంతానోత్పత్తి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రారంభించిన 'మిషన్ పరివార్ యోజన' కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించింది" అన్నారు.

సంతానోత్పత్తి రేటును ఒక మతానికి ముడిపెట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

"దేశంలో అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో హిందూ కుటుంబాల్లో TFR 2.29 శాతం ఉండగా, తమిళనాడులోని ముస్లిం మహిళల్లో ఇది 1.93 శాతం ఉంది. దీన్ని మతానికి ముడిపెట్టే బదులు, విద్య, ఆర్థిక పరిస్థితులతో ముడిపెట్టి చూడాలి. మహిళలు ఎక్కడైతే బాగా చదువుకుంటారో, అక్కడ సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంటుంది.

కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ 2016 సంవత్సరంలో 'మిషన్ పరివార్ వికాస్'ను ప్రారంభించింది. అధిక సంతానోత్పత్తి ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లోని 145 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2025 నాటికి ఈ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటును 2.1 కన్నా కిందకు తీసుకురావడం ఈ మిషన్ లక్ష్యం.

TFR 2.1 శాతానికి చేరుకుంటే దానిని 'రిప్లేస్‌మెంట్ లెవల్ ఫెర్టిలిటీ' అంటారు. ఆ రేటు సాధించడం అంటే వచ్చే మూడు నాలుగు దశాబ్దాల్లో దేశ జనాభా స్థిరపడుతుందని అర్థం.

వివిధ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు . . .

కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో అంతరాలు

మహిళలు, పురుషుల మధ్య గర్భనిరోధకాల వినియోగంలో పెద్ద వ్యత్యాసం ఉంది. 15-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో కుటుంబ నియంత్రణ సాధనాల వినియోగం (కాపర్ టీ, గర్భనిరోధక మాత్రలు వగైరా) 37.9 శాతం కాగా, పురుషులలో ఈ రేటు చాలా తక్కువగా 0.3 శాతం మాత్రమే ఉంది. అయితే పురుషుల్లో కండోమ్ వాడకం పెరిగింది. NFHS-4లో ఇది 5.6 శాతం కాగా, NFHS-5కు 9.5 శాతానికి పెరిగింది.

35 ఏళ్లు దాటిన మహిళలలో 27 శాతం మహిళలు ఒకరి కన్నా ఎక్కువమంది పిల్లలని కనాలని కోరుకుంటున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది.

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్‌- IIPSలోని సీనియర్ రీసెర్చ్ ఫెలో నంద్‌లాల్ బీబీసీతో మాట్లాడుతూ, కుటుంబ నియంత్రణలో పురుషులకు సమాన భాగస్వామ్యం లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

"1994లో జనాభా, అభివృద్ధిపై ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. దీనిలో, కుటుంబ నియంత్రణను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని పిలుపునిచ్చారు. కానీ 25 సంవత్సరాల తరువాత కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. మహిళలు కుటుంబ నియంత్రణ విషయంలో నిర్ణయం తీసుకోలేని వాతావరణం ఉన్న చోట పరిస్థితులు మరింత దిగజారాయి" అని చెప్పారు.

గర్భనిరోధకాలను అధికంగా వినియోగించిన రాష్ట్రాలు . 2019-21, 2015-16 సర్వేల మధ్య కంపారిజన్. .

దీని ప్రభావం ఎలా ఉంటుంది?

ప్రజారోగ్య రంగంలో 18 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రాచీ గార్గ్ మాట్లాడుతూ, భారతదేశంలో గర్భనిరోధకాలు వాడాలన్న ఒత్తిడి మహిళలపైనే ఎక్కువగా ఉంటుందని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై పనిచేసే ఆర్గనాన్ ఇండియాలో దక్షిణాసియా హెడ్‌గా ఉన్నారామె.

"భారతదేశంలో సుమారు 65 శాతం యువత ఉన్నారు. ప్రస్తుతం ఇది దేశానికి ప్రయోజనకరమే. కానీ, భవిష్యత్తులో యువకుల సంఖ్య తగ్గి, వృద్ధుల జనాభా పెరగుతుంది. దానివల్ల సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది. ఆసియాలోని జపాన్, చైనా, తైవాన్ వంటి దేశాలతో పోలిస్తే, భారత్‌లో యువత క్రియాశీలకంగా ఉన్నారు. అయితే, ఇది కుటుంబ పరిణామంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కుటుంబం, కెరీర్, ఇతర అంశాల పట్ల సమతుల్యం సాధించడం వారికిప్పుడు పెద్ద సవాలుగా నిలిచింది" అని ప్రాచి అన్నారు.

చైనాలోని 'వన్ చైల్డ్ పాలసీ ' ప్రపంచంలోని అతిపెద్ద కుటుంబ నియంత్రణ కార్యక్రమాలలో ఒకటి. ఈ విధానం 1979లో ప్రారంభమై, సుమారు 30 సంవత్సరాల పాటు కొనసాగింది.

ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, 2000లో చైనా సంతానోత్పత్తి రేటు 2.81 శాతం నుంచి 1.51 శాతానికి పడిపోయింది. ఇది చైనా లేబర్ మార్కెట్‌పై పెద్ద ప్రభావాన్ని చూపింది.

భారత్ విషయానికొస్తే, సంతానోత్పత్తి రేటు తగ్గడం వల్ల ఆరోగ్యం, విద్య రంగాల్లో మహిళలకు లాభం చేకూరుతుందని, లేబర్ మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యం పెరిగి, దేశ ఆర్థికాభివృద్ధికి సహకరిస్తుందని ప్రాచీ గార్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం భారతదేశానికి జనాభా స్థిరత్వం చాలా ముఖ్యమైని ప్రొఫెసర్ ఎస్‌కే సింగ్ అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నప్పటికీ, జనాభా స్థిరీకరించడానికి దాదాపు 40 సంవత్సరాలు పడుతుంది. అంటే 2060కి జనాభాలో స్థిరత్వం వస్తుంది.

భారతదేశంలో ప్రస్తుతం యువత సంఖ్య ఎక్కువగా ఉండడం లాభదాయమని ఎస్‌కే సింగ్ అన్నారు. దీని తరువాత, ప్రతీ వయసులో వృద్ధి రేటు స్థిరంగా మారి, సమతుల్యం వస్తుంది. భారత్‌ను ఇతర ఆసియా దేశాలతో పోల్చడం సరికాదని ఆయన అన్నారు.

సంతానోత్పత్తి రేటు తరుగుదల విషయంలో విశ్లేషకులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, భారతదేశంలో ఉన్న సామాజిక వాతావరణంలో చిన్న కుటుంబాలు పరస్పర సంబంధాలను కొనసాగించాలని వారు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, నచ్చినప్పుడు, నచ్చిన వ్యక్తి ద్వారా గర్భం దాల్చే అవకాశం మహిళలకు వస్తే ఏం జరుగుతుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)