జనాభాను నియంత్రించిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు తగ్గిస్తారా? - కేంద్రానికి మద్రాస్ హైకోర్టు ప్రశ్న: ప్రెస్ రివ్యూ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గించడంపై మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినట్లు ఆంధ్రజ్యోతి వార్తా పత్రిక కథనం ప్రచురించింది.
ఈ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పునరుద్ధరిస్తారా లేక తగిన ద్రవ్య పరిహారం చెల్లిస్తారో స్పష్టం చేయాలని జస్టిస్ ఎస్.కృపాకరన్, జస్టిస్ పి.పుగళేందితో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఈ మేరకు ఈ నెల 17వ తేదీన కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది(జస్టిస్ కృపాకరన్ ఇటీవలే పదవీవిరమణ చేశారు). నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
1962లో తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన చట్టం కింద లోక్‌సభ స్థానాల సంఖ్య 505 నుంచి 520కి పెరిగింది.
అయితే సభలో తమిళనాడు స్థానాల సంఖ్యను 41 నుంచి 39కి తగ్గించారు. ఉమ్మడి ఏపీ సీట్లు కూడా 43 నుంచి 41కి తగ్గాయి. (1977లో 42కి పెరిగాయి).
పునర్వ్యవస్థీకరించిన సీట్లతో 1967లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.
జనాభాను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లోక్‌సభలో రెండేసి స్థానాలను కోల్పోయాయని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తుచేసింది.
జన నియంత్రణ కార్యక్రమాలను సరిగా అమలు చేయలేని రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక ప్రాతినిధ్యం ఎందుకు కల్పించారని ప్రశ్నించింది.
ఈ రెండు రాష్ట్రాలకు అధిక రాజ్యసభ స్థానాలను ఇవ్వడం ద్వారా ఆ నష్టం ఎందుకు పూడ్చకూడదని అడిగింది.
లేదంటే ఆర్థిక సహాయం అందించాలని.. 1967 నుంచి రూ.400 కోట్లు.. ఆ లెక్కన 14 ఎన్నికలకు 28 స్థానాలు కోల్పోయినందున తమిళనాడుకు రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది' అని కోర్టు తెలిపిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రయాణికుడి పొట్టలో రూ.11 కోట్ల కొకైన్
రూ.11 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సూళ్లు మింగి.. నీళ్లు తాగినా సరే అవి బయటికి పోతాయేమోనని 10 గంటలకుపైగా కడుపు బిగబట్టి విమానంలో ప్రయాణించిన ఓ నిందితుడిని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రయాణికుడు విమానంలో జొహన్నెస్‌బర్గ్ నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకున్నాడు.
ప్రయాణ సమయంలో ఎయిర్ టికెట్ ప్యాకేజీలో భాగంగా అతడికి ఉచితంగా ఆహారం, నీరు, శీతల పానీయం ఇచ్చినా తీసుకోలేదు.
పైగా ప్రయాణ సమయంలో మొత్తం అసహనంగా కనిపించాడు. ఈ విషయం గుర్తించిన విమానయాన సంస్థ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తూ కస్టమ్స్ అధికారులకు తెలిపారు.
దీంతో విమానాశ్రయంలో దిగగానే అతడిని సోదా చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అతని కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు గమనించి స్కానింగ్ చేశారు.
అతడి పొట్టలో రూ.11 కోట్ల విలువైన 1.25 కిలోల క్యాప్సూళ్లు ఉన్నట్లు గుర్తించారు. విరేచనం ద్వారా బయటికి తీయించి కొకైన్‌గా తేల్చారు.
నిందితుడు దక్షిణాఫ్రికాలోనే వాటిని మింగాడని అధికారులు శనివారం రాత్రి వెల్లడించారని ఈనాడు రాసింది.

'పోస్ట్'లో ఆత్రేయపురం పూతరేకులు!
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు పోస్టల్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలు, చేనేత ఉత్పత్తుల పేరిట పోస్టల్ కవర్లు విడుదల చేస్తోంది.
ఇందులో భాగంగా ఆత్రేయపురం పూతరేకులు, ధర్మవరం చీరల ప్రత్యేకతను తెలియజేసే కవర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.
అంతేకాకుండా వీటిని జాతీయంగా, అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంటోంది.
ఆప్కో, లేపాక్షితో పాటు వివిధ ఆహార ఉత్పత్తుల సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఏపీ సర్కిల్ అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.సుధీర్‌బాబు తెలిపారు.
ఆప్కోతో ఒప్పందం ద్వారా ఇప్పటికే ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ తదితర చేనేత ఉత్పత్తులను దేశవ్యాప్తంగా డెలివరీ చేస్తున్నామని చెప్పారు.
బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు తదితర ఆహార ఉత్పత్తులను కూడా వేగంగా అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ముందుగా ఆత్రేయపురం పూతరేకులను సమీప ప్రాంతాలకు డెలివరీ చేసేందుకు అవసరమైన జాగ్రత్తలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
వీటన్నిటి కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నామని, గాంధీ జయంతి సందర్భంగా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వివిధ రంగాల్లో సేవలందించిన మహనీయుల పేరిట ప్రత్యేక కవర్లను పోస్టల్ శాఖ విడుదల చేస్తోందని సుధీర్‌బాబు చెప్పారని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, Twitter/meher ramesh
చిరంజీవి కొత్త సినిమా టైటిల్ 'భోళా శంకర్'
చిరంజీవి కొత్త సినిమాకు భోళా శంకర్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
రాఖీపౌర్ణమి పర్వదిన వేళ మెగాభిమానుల ఆనందం అంబరాన్నంటింది.
ఆదివారం అగ్ర కథానాయకుడు చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయన కొత్త సినిమాల పోస్టర్స్‌ను విడుదల చేశారు.
అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి 'భోళాశంకర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఏ కె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తిసురేష్ కీలక పాత్రధారి.
ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను ఆదివారం అగ్రహీరో మహేష్‌బాబు విడుదలచేశారు. చిత్రబృందం విడుదలచేసిన వీడియోలో చిరంజీవికి రాఖీ కడుతూ కీర్తిసురేష్ కనిపిస్తోంది.
నిర్మాత మాట్లాడుతూ 'కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న చిత్రమిది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందించనున్నాం. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా కీర్తిసురేష్ కనిపిస్తుంది.త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. 2022లో ఈ సినిమాను విడుదలచేస్తాం' అని తెలిపారు
'చిరంజీవితో కలిసి నటించాలనే నా కల ఈ సినిమాతో తీరనుంది. ఈ అద్భుతమైన ప్రయాణం ప్రారంభం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా' అని కీర్తిసురేష్ చెప్పారని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?
- కాందహార్: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన అఫ్గాన్‌లో రెండో అతిపెద్ద నగరం
- ‘వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - తాలిబన్లు
- భారత ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ హత్యకు ముందు, ఆ తర్వాత ఏం జరిగింది?
- మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్: తాలిబన్లతో పోరాడుతున్న 'అఫ్గాన్ సింహం'
- అఫ్గానిస్తాన్: తాలిబన్ల వశమైన ఐదు ప్రాంతీయ రాజధానులు
- అఫ్గానిస్తాన్: జైలును స్వాధీనం చేసుకుని ఖైదీలందరినీ వదిలేశామని ప్రకటించిన తాలిబన్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








