ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ వెబ్‌సైట్లను రెండు, మూడేళ్లుగా అప్‌డేట్ చేయడం లేదు, ఎందుకు?

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook.com/AndhraPradeshCM

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ సమగ్రాభివృద్ధి సాధిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పేర్కొన్నారు. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ వెబ్‌సైట్ల నిర్వహణ తీరు అందుకు నిదర్శనమనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఆధునిక సమాజాల్లో ప్రజాస్వామ్యం అంటే పారదర్శకంగా సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడమే. ప్రభుత్వ వ్యవహారాల గురించి సామాన్యుడు తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తేనే పారదర్శకత ఉన్నట్టుగా భావిస్తుంటారు. అందుకు అనుగుణంగానే సమాచార హక్కు చట్టం వంటివి అమలులోకి వచ్చాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అధికారిక వెబ్‌సైట్ల విషయంలో తగిన శ్రద్ధ పెడుతున్నట్టుగా కనిపించడం లేదు. సమాచారం అందరికీ అందుబాటులో ఉంచేందుకు సిద్ధపడుతున్నట్టుగా లేదు.

ఏపీ ప్రభుత్వ వెబ్‌‌సైట్ల తీరును ఒకసారి పరిశీలిద్దాం.

వ్యవసాయ శాఖ వెబ్‌సైట్‌

ఫొటో సోర్స్, Department of Agriculture, AP govt.

ఫొటో క్యాప్షన్, వ్యవసాయ శాఖ వెబ్‌సైట్‌

వ్యవసాయ శాఖకు చెందిన వెబ్ సైట్

ఆంధ్రప్రదేశ్ సహజంగానే వ్యవసాయక రాష్ట్రం. వ్యవసాయ శాఖ వెబ్ సైట్‌లో వ్యవసాయదారులకు, ఇతరులకు సమాచారం పూర్తిగా అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ పథకాలు, వాటిని అమలు చేసే తీరు వంటివి ప్రస్తావించాలి. ఎవరికి సందేహం వచ్చినా ప్రస్తుతం డేటా అందుబాటులో ఉన్న వారంతా క్లిక్ చేసి చూసుకునే సౌకర్యం కల్పించాలి.

కానీ, అధికారిక వెబ్ సైట్ చూస్తే దానికి చాలా దూరంగా ఉంది. ఇందులో ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి చివరిగా అప్ లోడ్ చేసింది 2020 పిబ్రవరి 20వ తేదీగా కనిపిస్తోంది. అంటే రెండున్నరేళ్లుగా ఈ సైటులో సంబంధిత శాఖ ఉత్తర్వులు ఏవీ పోస్ట్ కాలేదు.

ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌

ఫొటో సోర్స్, Department of Finance, AP govt.

ఫొటో క్యాప్షన్, ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌

జనాభాలో సగం మందికి పైగా ఉన్న బీసీలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్టుగా చెబుతోంది. అనేక పథకాలు, ప్రభుత్వ పదవుల్లో బీసీలకు ఎక్కువ సంఖ్యలో అవకాశాలు కల్పించారు. కానీ బీసీ సంక్షేమ శాఖ వెబ్‌సైట్ లో మాత్రం వివరాలు కనిపించడం లేదు.

బీసీ సంక్షేమ శాఖలో భాగంగా దాదాపు మూడేళ్ల క్రితం వివిధ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. కులాల వారీగా వాటిని ప్రారంభించారు. అంతకుముందు నుంచే కాపు కార్పోరేషన్ కూడా బీసీ సంక్షేమ శాఖలో భాగంగా ఉంది. కానీ వీటిలో ఒక్క కార్పోరేషన్‌కు కూడా అధికారిక వెబ్ సైట్ ఏర్పాటు చేసిన వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. అధికారిక సైట్‌లో కూడా వాటి గురించి సమాచారం లేదు. ఏర్పాటు చేసిన కార్పోరేషన్లకు వెబ్‌సైట్లు సిద్ధం చేయలేదు. వాటి వివరాలను అప్ లోడ్ చేసిన దాఖలాలు లేవు. చివరకు, సంబంధిత శాఖ కమిషనర్ కార్యాలయానికి సంబంధించిన వివరాలతో సైట్ అడ్రస్ లింక్‌ను కూడా ఇక్కడ పొందుపరచలేదు.

ఏపీ రెవెన్యూ శాఖ

ఫొటో సోర్స్, AP CCLA

ఫొటో క్యాప్షన్, ఏపీ రెవెన్యూ శాఖ

అన్ని చోట్లా అదే తీరు..

సివిల్ సప్లయిస్ శాఖకు చెందిన ఏపీప్యాడీ ప్రొక్యూర్ మెంట్ పోర్టల్‌లో 2021 నుంచి వివరాలే లేవు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో గ్యాలరీ పేరుతో మంత్రికి సంబంధించిన నాలుగు కార్యక్రమాలను మూడు నెలలకు ముందు అప్ లోడ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అప్ డేట్ చేసిన ఆనవాళ్లు కనిపించడం లేదు.

ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో ఇంపార్టెంట్ ఫైనాన్స్ జీవో అనే సెక్షన్‌లో 2018 నాటిదే 'న్యూ' అని కనిపిస్తోంది.

కీలకమైన రెవెన్యూ శాఖలోని సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అయిదంటే అయిదు మాత్రమే జీవోలు అప్‌లోడ్ చేసి ఉండడం విశేషం.

సీఎం డ్యాష్ బోర్డ్

ఫొటో సోర్స్, AP CM DASHBOARD

ఫొటో క్యాప్షన్, సీఎం డ్యాష్ బోర్డ్

సీఎం డ్యాష్ బోర్డ్ సంగతి కూడా అంతే..

వివిధ శాఖల వెబ్‌సైట్లు మాత్రమే కాకుండా, సీఎం డ్యాష్ బోర్డ్ సంగతీ ఈ తీరునే ఉంది. దేశంలో తొలిసారిగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అని ప్రారంభించి సీఎం డ్యాష్ బోర్డ్ పేరుతో గత ముఖ్యమంత్రి హడావిడి చేశారు.

ప్రస్తుతం ఈ సీఎం డ్యాష్ బోర్డ్ సైట్ కూడా అలంకారప్రాయంగా మారింది. ఆర్టీజీఎస్ ద్వారా సకల శాఖల సమాచారం సింగిల్ క్లిక్ దూరంలో అందుబాటులోకి తెస్తామని పెద్ద మొత్తం ఖర్చు చేసి చేపట్టిన ప్రాజెక్టు కూడా ప్రస్తుతం వినియోగంలో ఉన్నట్టు కనిపించడం లేదు.

సీఎం డ్యాష్ బోర్డులో దాదాపు సగం శాఖలకు సంబంధించిన సమాచారమే కనిపించదు. విద్యుత్ వంటి శాఖలకు సంబంధించిన సమాచారం 2021 నాటిది.

మొత్తంగా, ఆంధ్రప్రదేశ్‌లోని అత్యధిక శాఖలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్లలో సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం జరుగుతున్నట్టుగా లేదు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్లో ఉంచేందుకు నిరాకరించడం వివాదానికి దారితీసింది. దానిపై ఏపీ హైకోర్టు ఆదేశాలతో, జీవోఐఆర్ స్థానంలో ఏపీ గెజిట్ అనే సైట్‌లో కొన్ని జీవోలను మాత్రం ఉంచుతున్నారు. కానీ ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన సమాచారంతో వెబ్‌సైట్లను అప్ డేట్ చేయాలనే ప్రయత్నం కనిపించడం లేదు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: బందరు పోర్టు.. నిర్మాణం ఎప్పుడు?

ప్రచారానికి వేల కోట్లు ఎందుకు?

సామాన్యులకు సైతం వెబ్‌సైట్ ద్వారా సమాచారం సులువుగా అందించే అవకాశం ఉన్నప్పటికీ దాని మీద దృష్టి సారించకపోవడం ప్రభుత్వ తీరుని చాటుతోందని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర రావు అన్నారు.

"ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు కోట్ల రూపాయలు వెచ్చించి పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసమే ప్రజాధనం వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. అంతకన్నా సులువైన మార్గంలో ప్రభుత్వ పథకాలు, వాటికి అర్హతలు, లబ్దిదారులకు సంబంధించిన వివరాలన్నీ వెబ్‌సైట్లలో పొందుపరిస్తే అందరికీ అర్థం చేసుకునే వీలుంటుంది. గతంలో కొంత అప్‌డేటెడ్‌గా ఉండేవి. ఇటీవల పూర్తిగా అశ్రద్ద కనిపిస్తోంది. ప్రభుత్వం పాలనా వ్యవహారాల్లో ఎంత పగడ్బందీగా ఉందన్నది ఆయా వెబ్‌సైట్లు చాటి చెబుతాయి. డిజిటల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న ప్రభుత్వం డిజిటల్ రంగంలో చేయాల్సిన ప్రయత్నం మీద ఎందుకు దృష్టిపెట్టడం లేదు" అంటూ ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన బీబీసీతో అన్నారు.

RTI

ఫొటో సోర్స్, RTI.GOV.IN

ఆర్టీఐ దరఖాస్తులు తగ్గిపోతాయి

పారదర్శకంగా ఉంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని సమాచార హక్కు చట్టం కార్యకర్త పప్పు దుర్గా రమేష్ అన్నారు.

"ప్రభుత్వ వెబ్‌సైట్లలో అన్ని వివరాలు అందుబాటులో ఉంచాలి. ప్రతీ శాఖకి సంబంధించిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఆయా పోర్టల్స్ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. అది జరిగితే ఆర్టీఐ కోసం వచ్చే దరఖాస్తులు తగ్గిపోతాయి. సమాచారం అంతా అందుబాటులో ఉంచితే, మళ్లీ వాటి కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది. కానీ సమాచారం దాచిపెట్టడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. పైగా సమాచార హక్కు చట్టం అమలు తీరు కూడా అరకొరగా ఉంటోంది. అనేక శాఖల్లో పదే పదే అప్పీళ్లు చేసినా అధికారులు కదలడం లేదు. అలాంటి సమస్యలన్నింటికీ ప్రభుత్వ పోర్టళ్లను అప్‌డేట్ చేయడమే పరిష్కారం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ వెబ్‌సైట్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నందున దానిని తక్షణమే సరిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: ఒకే వీధి.. రెండు జిల్లాలు

ప్రభుత్వం ప్రాధాన్యాలను గుర్తించాలి

మారుతున్న సమాజంలో డిజిటల్ రంగం అభివృద్ధి చెందుతుండగా, అందులో సమాచారం అందించడం ప్రభుత్వాల బాధ్యత అనేది గుర్తించాలని ఏపీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు డి సోమసుందర్ అన్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్లలో ప్రజలకు అందించాల్సిన సమాచారం కూడా అందుబాటులో ఉంచకపోవడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు.

"సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. అందుకే సమాచార హక్కు చట్టం వచ్చింది. అందుకు తగ్గట్టుగా, ప్రభుత్వం అన్ని వేదికల మీద సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయాలి. ఇటీవల అన్నింటికీ ఆన్‌లైన్ మీద ఆధారపడే పరిస్థితి పెరుగుతోంది. అలాంటి సమయంలో ఆన్‌లైన్‌లో పాత సమాచారం మాత్రమే ఉంచడం సమంజసం కాదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. ఇటీవల ఆర్థిక శాఖకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాగ్ వంటి వాటికి పూర్తిగా అందించడం లేదనే ఆరోపణలున్నాయి. దానికి తోడుగా రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన సమాచారం విషయంలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీనిని ప్రభుత్వం తన బాధ్యతగా గుర్తించి, ప్రాధాన్యతనివ్వాలి" అని సోమసుందర్ అన్నారు.

'సమాచారం అందిస్తున్నాం'

రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రజలకు అందించాల్సిన సమాచారం విషయంలో ఎటువంటి లోపం లేదని ఏపీ సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు.

"రాష్ట్రంలో, ప్రజలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటోంది. ప్రతీ పథకాన్ని లబ్దిదారులకు చేరువ చేసేందుకు ప్రయత్నించాం. గతంలో ఎన్నడూ లేని రీతిలో సోషల్ ఆడిట్ జరుగుతోంది. లబ్దిదారులకు ఏ ఒక్క పథకం అందకపోయినా, ప్రత్యేకంగా వారి కోసం డ్రైవ్ నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేస్తున్నాం. సమాచారం ప్రజలకు చేరువగా లేదనడం సమంజసం కాదు. అధికారిక వెబ్‌సైట్లను అప్‌డేట్ చేస్తున్నాం. డిజిటల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు కావాల్సిన అన్ని అంశాలను పొందుపరుస్తున్నాం. ఈ సమాచారం మరింత మెరుగ్గా అందేలా చూస్తాం" అని బీబీసీకి తెలిపారు.

ప్రభుత్వ వాదన ఎలా ఉన్నప్పటికీ, వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్నిపొందుపరచడం అత్యవసరమని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)