ఆంధ్రప్రదేశ్‌కు పదే పదే ఎందుకీ వరద కష్టాలు.... ఏమిటి దీనికి పరిష్కారం?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
భౌగోళికంగా గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి ప్రధాన నదులకు చివరలో ఉండే ఆంధ్రప్రదేశ్‌కు అనేక ముప్పులు పొంచివున్నాయి. నీటి కొరత ఏర్పడినా, నదికి వరదలు వచ్చినా తొలి ప్రభావం ఏపీ మీదనే ఉంటుంది.
గడిచిన రెండు మూడు సీజన్లలో ఏటా వరదలతో అపార నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ చవిచూస్తోంది. రైతులు, తీర ప్రాంత ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.
గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత రీతిలో జులైలో అతి పెద్ద వరదలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి వరదల తాకిడి తగ్గినా వరద ముప్పు మాత్రం ఇంకా పోలేదు.
సహజంగా ఆగష్టులో ఎక్కువగా వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో.. గోదావరి తీరం ఇంకా ప్రమాదం ముంగిట్లో ఉన్నట్టుగానే భావించాలి.
సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా వరదల ప్రమాదం ఎదుర్కొనే కృష్ణా నదీ తీరం కూడా రాబోయే రెండు నెలల పాటు దినదినగండంగా గడపాల్సిందే. అక్టోబర్, నవంబర్ మాసాల్లో పెన్నా తీరంలో ప్రమాదం పొంచి ఉంటుంది. గత నవంబర్‌లో ఎగువన కురిసిన భారీ వర్షాలకు పెన్నా నదీ తీరం పొడవునా అవస్థలు ఎదురయ్యాయి.
ఏటా వరుసగా నాలుగైదు నెలల పాటు ఏదో నదికి వరదల ప్రమాదం అంచున ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అయితే, దీర్ఘకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ.. తగిన పరిష్కారం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే నష్టం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ముఖ్యంగా కరకట్టల పరిస్థితిపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరాన్ని ఇది చాటుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి ఏటిగట్లు, కృష్ణా కరకట్ట, పెన్నా సహా పలు నదీ తీరాల్లో పరిస్థితిపై బీబీసీ పరిశీలన చేసింది.

గోదావరి ముప్పు నుంచి గట్టెక్కినట్టేనా
1986 తర్వాత 2006లో గోదావరికి ప్రమాదకర స్థాయిని మించి వరదలు వచ్చాయి. అపార నష్టానికి కారణమయ్యాయి. అధికారికంగా 1986లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2006లో 70 మంది మరణించారు. ఆ తర్వాత 2022 జులై 16న అత్యధికంగా నీటిమట్టం నమోదయ్యింది. ఈసారి మాత్రం స్వల్ప సంఖ్యలోనే ప్రాణనష్టంతో గోదావరి తీరం ఊపిరిపీల్చుకునే అవకాశం దక్కింది.
ఇంత పెద్ద వరదల్లో గతానికి, ఇప్పటికీ ఉన్న ఏకైక తేడా ఏటిగట్లు బలోపేతం కావడం. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీకి ఎగువన అఖండ గోదావరిగా పిలుస్తారు. ఆ ప్రాంతంలో ఏటి గట్ల పొడవు 81.80 కి.మీ. ఉంటుంది. నదికి ఎడమ వైపు కొంత భాగాన్ని అంగుళూరు ఫ్లడ్ బ్యాంకు అంటారు. దాని పరిధి 1.93 కి.మీ..
ఇక బ్యారేజీ దిగువన గౌతమి ఏటి గట్లు 204.70 కి.మీ. పరిధిలో ఉన్నాయి. వశిష్ఠ గోదావరి గట్లు 246.30 కి.మీ. పొడవు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వైనతేయ సహా ఇతర నదీపాయల గట్లు కూడా కలిపితే దాదాపుగా 700 కిలోమీటర్లు ఉంటాయి.
భద్రాచలం వద్ద 71 అడుగులకు చేరిన నీటి మట్టం కారణంగా, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సుమారుగా 27 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలాల్సి రావడంతో గోదావరి నదీ ప్రవాహం నిండుకుండను తలపించింది.
అయినప్పటికీ పెద్ద ముప్పు రాకుండా నివారించేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. రాత్రి, పగలూ వివిధ శాఖల సిబ్బంది పలు చోట్ల పహారా కాయాల్సి వచ్చింది. స్థానికుల సహకారంతో గట్లు పరిరక్షించాల్సి వచ్చింది. ఈ ప్రయత్నాలే గోదావరి వాసులను ముప్పుల నుంచి తప్పించాయని చెప్పాలి.

ఫొటో సోర్స్, Prasad
2006 వరదల నుంచి నేర్చుకున్న పాఠం
2006 వరదల సమయంలో అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి గన్నవరం మండలం మొండెపులంక వద్ద గట్లు తెగిపోయాయి. వరద ప్రవాహంతో ఊళ్లన్నీ జలమయమయ్యాయి. ఊరూ, ఏరూ ఏకం కావడంతో అపారనష్టం సంభవించింది. ఆ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటుగా యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా పర్యటించారు. ఆ సమయంలో గోదావరి గట్లు ఆధునికీకరిస్తామని శానపల్లిలంకలోనే సీఎం వైఎస్సార్ ప్రకటించారు.
దానికి తగ్గట్టుగా 1983 వరదల తీవ్రతను ప్రామాణికంగా తీసుకున్నారు. అప్పట్లో దాదాపు 35 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించిన నేపథ్యంలో అలాంటి వరదలు మళ్లీ వచ్చినా ఎదుర్కోగల సామర్థ్యంతో గట్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 2006 వరదల నుంచి నేర్చుకున్న పాఠంతో సుమారుగా రూ.600 కోట్ల వ్యయంతో 535 కిలోమీటర్లు మేర ఆధునికీకరణ పనులు జరిగాయి. గట్లు ఎత్తు అందుకు తగ్గట్టుగా పెంచారు.
ఆనాటి నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునికీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక ఆధారంగా ఈ పనులు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఆరు మీటర్లుగా ఉన్న ఏటిగట్లు మరో రెండు అడుగులు పెంచి ఆధునికీకరించారు. గోదావరి బండ్ ఎత్తు ఎక్కడ చూసినా ఎనిమిది మీటర్లు ఉండేలా పెంచారు. నాలుగు మీటర్లు వెడల్పున్న ఏటిగట్లను ఆరున్నర మీటర్ల వరకూ విస్తరించారు. అదే సమయంలో ఏటిగట్లు కోతకు గురికాకుండా మరో రూ.112 కోట్లతో నదీ పరివాహకం వెంబడి గ్రోయిన్స్ కూడా నిర్మించారు.

భవిష్యత్తు మీద బెంగ పెంచేలా...
గోదావరి ఏటిగట్ల ఆధునికీకరణ పనుల ఫలితం దక్కింది. తదుపరి 2013, 2020లో వచ్చిన వరదలే కాకుండా ఇటీవల వరదల నుంచి కూడా కోనసీమ, పశ్చిమ గోదావరిలతోపాటు ప్రస్తుతం 5 జిల్లాల పరిధిలో ప్రజలకు ఉపశమనం దక్కేందుకు ఆనాటి పనులు తోడ్పడ్డాయి.
కానీ రానురాను గట్ల పరిస్థితికి నానాటికీ తీసికట్టు చందంగా మారుతోంది. అప్పట్లో పనులు పూర్తికాని చోట ఈసారి ప్రమాద సంకేతాలు వెలువడ్డాయి. వశిష్ఠ కుడి గట్టు నరసాపురం, వశిష్ఠ ఎడమ గట్టు పరిధిలో 48వ కిలోమీటరు నుంచి 90వ కిలోమీటరు వరకు మూడు ప్యాకేజీలు ఆనాటి నుంచి అసంపూర్ణంగా వదిలేశారు. రాజోలు, అప్పనరామునిలంక వంటి ప్రాంతాల్లో తీవ్ర ముప్పు భయంతో జనం వణికిపోవాల్సి వచ్చింది. రాజోలులో అయితే ఏటిగట్టుకి ఇసుకబస్తాలు వేసి, జనం కాపలాగా నిలిచి గట్టుని కాపాడుకునే పరిస్థితి ఎదురయ్యింది.
కే గంగవరం మండలంలోని సుందరపల్లి, కాళ్ల ప్రాంతాల్లో కూడా గౌతమీ నది కలవరపరిచింది. ఇక పశ్చిమ గోదావరి పరిధిలోని అయోధ్యలంక సహా వివిధ ప్రాంతాల్లో పరుగులు పెట్టించింది. ఈ పరిణామాలు భవిష్యత్తు మీద బెంగ పెంచేలా కనిపిస్తున్నాయి. మొన్నటి వరదల నుంచి ఊపిరిపీల్చుకున్నప్పటికీ ఇంకా వరదలు సీజన్ ఎదురుగా ఉండడంతో ఎలాంటి ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయం సర్వత్రా కనిపిస్తోంది.

ఇసుక తవ్వకాలతోనే తలనొప్పులు..
గోదావరి ఏటిగట్లు పటిష్ట పరిచినప్పటికీ వాటి లక్ష్యం దెబ్బతింటోందని ఇటీవలి వరదలు చాటుతున్నాయి. ముఖ్యంగా ఇసుక తవ్వకాలతో నదీ ప్రవాహం, ఒడి పెరగడమే కాకుండా ఏటిగట్లు బలహీన మవుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇసుక తవ్వకాల విషయంలో నిబంధనలు అనుసరించకపోతే అనేక అనర్థాలు చవిచూడాల్సి వస్తుందని ఇరిగేషన్ రంగం పరిశీలకుడు, సీనియర్ జర్నలిస్ట్ జి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
"1986 వరద నాటికి ఇసుక తవ్వకాల తీవ్రత లేదు. 2006నాటికి ఇలాంటి ముప్పు ఎదురుకాలేదు. కానీ ప్రస్తుతం గోదావరి ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. యంత్రాలు వినియోగించకూడదనే నిబంధన కేవలం పేపర్లకే పరిమితం. పైగా గట్లుని ఆనుకుని తవ్వేస్తుండడంతో గ్రోయిన్లు దెబ్బతింటున్నాయి. ఏటిగట్లు బలంగా ఉండేందుకు వాటిని నిర్మిస్తే ఇసుక తవ్వకందారులు వాటిని కొల్లగొట్టేస్తున్నారు. గట్లకి రక్షణ లేకుండా పోతోంది. ఏటిగట్లు మీద భారీ వాహనాల రాకపోకల కోసం బాటల పేరుతో గట్లు దెబ్బతీస్తున్నారు. ఫలితంగా వరదలు వచ్చినప్పుడు ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో ఎక్కువగా భయాందోళనలు ఎదుర్కోవాల్సి వస్తోందని" ఆయన అన్నారు.
ఇసుక తవ్వకాల విషయంలో నిబంధనలు అనుసరించకపోతే అవుట్ ఫాల్ స్లూయిజ్‌లతో పాటుగా గ్రోయిన్లు ధ్వంసం కావడం, గట్లు బలహీనపడడం వంటి వాటితో పెను ముప్పు తప్పదని ఆయన బీబీసీతో చెప్పారు.

కృష్ణా తీరంలోనూ అదే కథ..
గోదావరి వరదల తాకిడికి కోనసీమ వాసులు ఎక్కువగా కలత చెందుతుంటే కృష్ణా వరదల వల్ల అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాలు వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది. విజయవాడ నగరంలోని పలు ప్రాంంతాలు కూడా వరద తాకిడికి తల్లడిల్లిపోవాల్సిన దుస్థితి నేటికీ ఉంది.
కృష్ణా నదికి 2009లో భారీ వరదలు వచ్చాయి. ఆ వరదల మూలంగా కృష్ణా తీరమంతా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. 2020లో కూడా వరద తాకిడి ఎక్కువగా నమోదయ్యింది. కానీ అంత పెద్ద ముప్పు లేకుండానే ప్రజలు బయటపడ్డారు. 2009 తర్వాత కృష్ణా నది కరకట్ల విషయంలో కూడా కొంత దృష్టి పెట్టారు. కానీ ఇసుక తవ్వకందారుల తీరుతో నదీ గర్భం కొల్లగొట్టడం, కరకట్ట దెబ్బతినడం వంటివి ఎదురవుతున్నాయి.
"రాష్ట్రంలో గోదావరి, కృష్ణా వంటి నదులకు వరదలు తప్పవు. ఒక ఏడాది తప్పినా, ఎప్పటికయినా ముప్పు ఉంటుంది. దానికి మనం సన్నద్ధంగా ఉండాలి. కానీ అనేక అనుభవాల తర్వాత కూడా పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. ఏటా వరదలు వస్తున్నాయనగానే వందల గ్రామాలు వణికిపోవాల్సి వస్తోంది. ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం చూడాలి. అసాధారణంగా ఎప్పుడయినా వరద వస్తే తప్ప, సాధారణ వరదలకు పెద్దగా భయపడాల్సిన పరిస్థితి లేకుండా చేయాలి. అందుకు కరకట్టలు బలోపేతం చేయడం, వాటిని పరిరక్షించడమే మార్గం. కోట్లు వెచ్చించి పనులు చేసిన తర్వాత ఇసుక కాంట్రాక్టర్ల వ్యాపారం కోసం భారీ వాహనాలతో వాటిని బలహీనపరిస్తే ఏమి ఉపయోగం ఉంటుంది. కాబట్టి యంత్రాంగం అటువైపు దృష్టి సారించాలి"అన్నారు ఇరిగేషన్ రిటైర్డ్ ఎస్ ఈ పీవీ రామారావు.
దేశంలో వరద తాకిడి నుంచి గట్టెక్కడానికి వివిధ రాష్ట్రాల్లో చేసిన ప్రయత్నాలను మనం పాఠంగా తీసుకొవచ్చని ఆయన బీబీసీతో అన్నారు. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో వరద నియంత్రణ చర్యలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రమాదం అంచున పెన్నా తీరం...
గోదావరి, కృష్ణా నదులతో పాటుగా వంశధార, నాగవళి సహా వివిధ నదుల మూలంగానూ వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాటిలో పెన్నా ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో 2021 నవంబర్‌లో వచ్చిన వరదలు చాటిచెప్పాయి.
ఏకంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయే దశ నుంచి, సోమశిల ప్రాజెక్టు పరిస్థితి గురించి ప్రశ్నలు ఎదురయ్యే వరకూ వచ్చింది. భవిష్యత్తులో మరింత ముప్పు తప్పదనే అంచనాలు ఉన్నాయి. దాంతో దానికి అనుగుణంగా చర్యలు అవసరమనే వాదన ఉంది.
"అన్ని నదులకు కొన్ని సహజ లక్షణాలుంటాయి. 20, 30 ఏళ్లలో ఓసారి అసాధారణంగా ప్రవాహం వస్తుంది. వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటికి అనుగుణంగా మనం అప్రమత్తం కావాలి. వరద వచ్చినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత దానిని వదిలేయడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. నిరుడు పెన్నా వరదలు, ఈ ఏడాది గోదావరి వరదలు వంటివి మనకు మేలుకొలుపు కావాలి. భారీ వరదలు వచ్చినా తట్టుకునేలా అన్ని నదీ తీరాలను ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయాలి. వాటిని ఎప్పటికప్పుడు పరిరక్షణ జరగాలి" అంటూ పర్యావరణ వేత్త సీహెచ్ శ్రీనివాసరావు అన్నారు.
పర్యావరణంలో వస్తున్న అనూహ్య మార్పులను అర్థం చేసుకుని, నదులకు దిగువన ఉన్నందున తగిన సన్నద్ధత చాలా అవసరం అంటూ ఆయన బీబీసీ వద్ద అభిప్రాయపడ్డారు.
బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పనులు
గోదావరి వరద తీవ్రత పెరుగుతున్న సమయంలో పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంది. ఓవైపు వరద నీరు వెల్లువలా వచ్చి పడుతుంటే అప్పటికప్పుడు 2 మీటర్లు ఎత్తు పెంచినట్టు చెప్పడం విస్మయకరంగా కనిపించిందని, వరద నివారణ విషయంలో ప్రభుత్వ సన్నద్ధతను ఈ పరిణామం చాటుతుందని జి శ్రీనివాస్ అన్నారు.
అయితే డెల్టా ఆధునికీకరణలో భాగంగా వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని ఇటీవల సీఎం జగన్ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులను ఆదేశించారు.
"డెల్టా ఆధునికీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం అందజేసిన డీపీఆర్‌పై టెక్నికల్ ఎస్టిమేట్స్ వెంటనే తయారుచేయాలి. రాజమహేంద్రవరం నగరంలోకి ఎలాంటి వరదనీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన నివేదిక రాగానే పనులు ప్రారంభించాలి. దీనికోసం నిపుణులతో కూడిన టెక్నికల్ కమిటీని నియమించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం. బండ్‌లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి నవంబర్ నుంచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. శాశ్వత చర్యలపై దృష్టిపెడతాం. నవంబర్ కల్లా మనం టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలుపెడదాం" అంటూ ఆయన అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సీఎం ఆదేశాలకు అనుగుణంగా శాశ్వత వరద నివారణ చర్యలకు సర్కారు సిద్ధమయితే గోదావరి తీర వాసుల భయాందోళనలు తగ్గుతాయి. అదే సమయంలో ఇతర ప్రధాన నదుల వెంబడి కరకట్టల తీరు మీద కూడా దృష్టి పెట్టాలనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ హెపటైటిస్ డే: సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- కామన్వెల్త్ గేమ్స్ 2022: పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈసారి మెడల్స్ తెస్తారా?
- ‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’
- టెంపెస్ట్: పైలట్ మెదడును చదివేసే విమానం
- రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోల వివాదం మన నైతిక విలువల గందరగోళాన్ని సూచిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















