ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
అపరిమితంగా, ఉచితంగా ఇంటర్నెట్ సర్వీసులుంటే మన మొబైల్ ఫోన్లు ఎంత డేటా వాడుతున్నాయనేది పెద్దగా పట్టించుకోం. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు.
బ్రాడ్‍బాండ్ లైన్లు కాస్తంత చౌకగానే అందినా, మొబైల్ డేటా ప్యాకేజీ రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి.
మొబైల్ యాప్స్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం వల్ల కూడా డేటా బిల్ పెరుగుతుంది.
కాబట్టి డేటా వృథా ఆపడానికి ఫోన్లలో సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలో చూద్దాం.

ఫొటో సోర్స్, AFP
మొబైల్ ఫోన్లలలో ఇంటర్నెట్ సర్వీసులు
మొబైల్ ఫోన్లలో దాదాపు ప్రతి యాప్‍కు ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఈ ఇంటర్నెట్‍ను రెండు విధాలా అందించవచ్చు:
1) వై-ఫై నెట్‍వర్క్: ఇది తక్కువ ఖరీదుతో పాటు చాలా వేగవంతంగా పనిచేస్తుంది. అయితే వై-ఫై రౌటర్ ఉన్న చోటే ఫోన్ కూడా ఉండాలి. అప్పుడే పనిచేస్తుంది. ఉదా: ఇల్లు, ఆఫీసు, కేఫె లాంటి పబ్లిక్ ప్లేసెస్.
2) మొబైల్ నెట్‍వర్క్: మనం ఫోనులో వేసిన సిమ్ కార్డ్ ఏ నెట్‍వర్క్ అయితే ఆ నెట్‍వర్క్ వారు ఇచ్చే ఇంటర్నెట్ సర్వీసులు. వీటి కోసం నెలనెలా డేటా ప్లానులని కొనుక్కుని వాడుకోవాలి. ఈ నెట్‍వర్క్ టవర్ ఉన్న చోటల్లా ఇంటర్నెట్ నిరంతరంగా వస్తూనే ఉంటుంది.
ఆండ్రాయిడ్ ఫోనుల్లో మొబైల్ డేటా ఎంత వాడాం, ఏ ఆప్స్ వల్ల డేటా ఎక్కువ ఖర్చు అయింది, ఒక పరిమితి దాటాక డేటా ఉపయోగించకుండా ఉండేలా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇవి తెలుసుకోవడం వల్ల డబ్బుకు డబ్బూ ఆదా అవుతుంది, అలానే అవసరమైన యాప్స్ అవసరమైన వేళల్లో అందుబాటులోనూ ఉంటాయి.

మొబైల్ డేటా యూసేజ్ వివరాలు ఎక్కడ ఉంటాయి?
- మీ ఫోన్‍లో “సెట్టింగ్స్” యాప్‍కు వెళ్లండి
- నెట్‍వర్క్‌కు సంబంధించిన సెట్టింగ్‍కు వెళ్లి (Connections/Network & Internet లాంటి పేర్లతో ఉన్న ఆప్షన్) మీద క్లిక్ చేయండి.
మొబైల్ డేటా యూసేజ్ ఎంత అయ్యిందో చూసుకోవడమెలా?
- పైన చెప్పిన విధంగా కనెక్షన్స్/నెట్‌వర్క్ అండ్ ఇంటర్నెట్ మెనూకి వెళ్లాలి.
- అక్కడ “డేటా యూసేజ్” (Data Usage) అన్నదాని మీద క్లిక్ చేస్తే, ప్రస్తుత నెలలో ఎంత డేటా వాడాం, మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇంకా ఎంత డేటా మిగులుంది? లాంటి వివరాలను అక్కడ చూపిస్తారు.
- అక్కడే ఉన్న మరో ఆప్షన్, “మొబైల్ డేటా యూసేజ్” (Mobile Data Usage) పై నొక్కితే కింద చూపించిన విధంగా గ్రాఫులు కూడా ఉంటాయి. ఏ యాప్ ఎంత వాడుతుందో కూడా చూపించడం ద్వారా మనకి అవసరం లేకపోతే ఆ యాప్‍ని తీసేయచ్చు. లేదా, దాని వాడకం తగ్గించవచ్చు.

ఎక్కువ డేటా వాడకుండా యాప్స్‌ని నివారించడమెలా?
అసలు యాప్స్ అవసరానికి మించిన డేటా ఎందుకు వాడుకుంటాయి? అన్న ప్రశ్న మొదట వస్తుంది. ఎందుకంటే, మనకి చేసిపెట్టే పనులకే కాకుండా, వాడకంలో లేనప్పుడు కూడా యాప్స్ మన వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తుంటూ ఉంటాయి.
ఈ సమాచారాన్ని తమ తమ సర్వర్లకు అందజేయడానికి మన మొబైల్‌లోని డేటానే వాడుకుంటాయి. ఇట్లా వాడుకునే వాటిలో సోషల్ మీడియా యాప్స్, న్యూస్ యాప్స్ ఎక్కువగా ఉంటాయి.
మన డేటా ఎక్కువగా వాడేయకుండా యాప్స్‌ని నివారించాలంటే:
- పైన చెప్పుకున్నట్టు ముందు మొబైల్ డేటా యూసేజ్ మెనూకి వెళ్లాలి.
- అక్కడ ఎక్కువగా డేటా యూస్ చేస్తున్న యాప్‍పైన క్లిక్ చేస్తే వివరాలు కనిపిస్తాయి. యాక్టివ్‍గా ఉన్నప్పుడు (foreground) ఎంత డేటా వాడింది, లేనప్పుడు (background) ఎంత, మొత్తం(total) ఎంత అనేవి అక్కడ కనిపిస్తాయి.
- “బాక్‍గ్రౌండ్”లో ఎక్కువ డేటా వాడుతుందనిపిస్తే “Allow background data usage”ని ఆఫ్ చేసుకుంటే ఇక ఆ యాప్ వాడనప్పుడు మొబైల్ డేటాని ఉపయోగించుకోదు.
- “Allow data usage while Data saver is on” అన్నది కూడా ఆఫ్ చేసుకుంటే డేటా సేవర్ మోడ్‌లో ఉన్నప్పుడు మొబైల్ డేటాని ఈ యాప్ వాడదు.
ఇలా చేయడం ద్వారా యూట్యూబ్, ఫేస్‌బుక్, క్రోమ్ లాంటి భారీ యాప్స్‌ని అదుపులో పెట్టచ్చు. అప్పుడు వై-ఫై నెట్‍వర్క్ ఉంటే తప్పించి మొబైల్ డేటాని ఎక్కువ వాడవు.

డేటా సేవర్ అంటే ఏంటి?
పైన చెప్పిన విధానంలో ఒక్కో ఆప్‍కు వెళ్లి బాక్‍గ్రౌండ్ డేటాను ఆఫ్ చేయాలి. అలా కాకుండా అన్నింటికీ ఒకే సెట్టింగ్ ద్వారా చేయచ్చు. అదే “డేటా సేవర్” సెట్టింగ్. ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏ యాప్ అయినా బాక్‍గ్రౌండ్‍లో మొబైల్ డేటాని వాడకుండా ఉంటాయి. ముఖ్యంగా, వీడియోలు ఇమేజీలు ఎక్కువగా ఉండే యాప్స్‌ని దీని సాయంతో నిలువరించొచ్చు.
ఈ సెట్టింగ్ పెట్టుకుంటే దాదాపు 50% డేటా ఖర్చులు తగ్గుతాయని గూగుల్ కూడా చెప్పింది. ఎందుకంటే ఈ సెట్టింగ్ వల్ల లైట్ వీడియోలు, ఇమేజీలు చూపిస్తుంది. దానితో డేటా అవసరం తక్కువ పడుతుంది.

డేటా వార్నింగ్, యూసేజ్ లిమిట్ సెట్ చేసుకోవడమెలా?
- ముందు డేటా యూసేజ్ మెనూకి వెళ్తే, “Billing cycle and data warning.” అని ఉంటుంది. దానిపైన నొక్కాలి.
- Set data limit ని ఆన్ చేయాలి.
- Data Warning అన్నదాంట్లో GB/MB సెలెక్ట్ చేసుకుని, ఎంత డేటా వాడకం అయ్యేటప్పటికి మీకు అలెర్ట్ కావాలో పెట్టుకోవచ్చు. ఉదా: 2 GB.
- పైన చెప్పిన విధంగానే Set data limit కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి ఈ పరిమితి దాటిదంటే మొబైల్ డేటా నెట్‍వర్క్ అదే ఆపేస్తుంది. దీని వల్ల అనసరపు బిల్లుల బెడద ఉండదు.
ఇవి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చే ఆప్షన్లు. అలా కాకుండా కొన్ని వేరే కంపెనీల యాప్స్ కూడా దొరుకుతాయి. వాటిని వాడిని కూడా మొబైల్ డేటా యూసేజ్‍ని కనిపెట్టుకోవచ్చు. అయితే ఆ యాప్స్ నమ్మదగినవై ఉండి, అవి డేటా ఎక్కువ వాడనివై ఉంటేనే వేసుకోవాలి. లేకపోతే ఏ సమస్యను పరిష్కరించడానికి ఆ యాప్ వేసుకున్నామో, అదే సమస్యగా మారుతుంది.
ఇవి కూడా చదవండి:
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- ద్రవ్యోల్బణం: పెట్రోలు ఖర్చని బంధువుల ఇంటికి వెళ్లడం లేదు, ఎవరైనా పెళ్లికి పిలిచినా వెళ్లలేకపోతున్నారు
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- అఫ్గానిస్తాన్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి ఏమిటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















