Contact Lens: కాంటాక్ట్స్ లెన్స్ కంప్యూటర్ స్క్రీన్లు కాబోతున్నాయా? స్మార్ట్ లెన్స్‌లలో రాబోతున్న కొత్త ఫీచర్లేంటి?

స్మార్ట్ కాంటాక్ట్స్ లెన్స్ లు మీకు కావాల్సిన సమాచారాన్ని మీ కళ్ల ముందు ఉంచగలవని మోజో సంస్థ చెబుతోంది

ఫొటో సోర్స్, MOJO

ఫొటో క్యాప్షన్, స్మార్ట్ కాంటాక్ట్స్ లెన్స్ లు మీకు కావాల్సిన సమాచారాన్ని మీ కళ్ల ముందు ఉంచగలవని మోజో సంస్థ చెబుతోంది
    • రచయిత, ఎమ్మా వూల్లాకాట్
    • హోదా, బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్

మీరు ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాలనుకున్నారనుకోండి. ప్రసంగం చదవివేటప్పడు మాటిమాటికి పేపర్ మీద చూడాల్సి వస్తుంటుంది. అలా కాకుండా, మీరు ఎటు తిరిగినా, ఎటు చూసినా, మీ ప్రసంగంలోని పదాలు మీ కళ్ల ముందు కనిపిస్తుంటే ఎలా ఉంటుంది? ఇది ఆశ్చర్యంగా ఉన్నా, నిజమయ్యే అవకాశం ఉంది.

స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్‌ల తయారీదారులు భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుందని చెబుతున్న అనేక ఫీచర్లలో ఇది ఒకటి.

''మీరు మ్యుజీషియన్ అయితే, మీ కళ్ల ముందే సాహిత్యం కనిపిస్తుంటుంది. మీరు అథ్లెట్ అయితే, మీ లక్ష్యం ఎంత దూరంలో ఉందన్న సమాచారం మీ కళ్లలో కనిపిస్తుంటుంది'' అని స్టీవ్ సింక్లైర్ అన్నారు. ఆయన స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్‌లను డెవలప్ చేసే మోజో సంస్థలో పని చేస్తున్నారు.

మనుషుల్లో స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ వాడకం పై మోజో కంపెనీ సమగ్రమైన పరీక్షలు చేస్తోంది. వీటిని ధరించిన వారికి అన్నీ వారి కళ్ల ముందే తేలుతున్నట్లు డిస్‌ప్లేలో కనిపిస్తుంది.

స్క్లెరల్ లెన్స్ (కంట్లో తెల్లటి గుడ్డు వరకు విస్తరించి ఉండే పెద్ద లెన్స్) అనే ప్రోడక్ట్ యూజర్ల దృష్టిని సరిచేస్తుంది. అంతేకాదు, ఇందులో మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే, స్మార్ట్ సెన్సార్‌లు, బ్యాటరీలు కూడా ఉంటాయి.

కాంటాక్ట్ లెన్స్‌లు మీకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వగలవు

ఫొటో సోర్స్, MOJO

ఫొటో క్యాప్షన్, కాంటాక్ట్ లెన్స్‌లు మీకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వగలవు

"మేం వీటిని ఫీచర్-కంప్లీట్ ప్రోటోటైప్ అని పిలుస్తున్నాం. ఇవి చక్కగా పని చేస్తున్నాయి. వీటిని ధరించవచ్చు. త్వరలో అంతర్గతంగా పరీక్షించబోతున్నాం" అని సింక్లైర్ చెప్పారు.

''ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వీటి పని తీరును పరీక్షించడానికి, ఇవి రోజంతా పని చేయగలవని నిరూపించడానికి మేం వీటిని ఎక్కువసేపు ఉపయోగిస్తున్నాం'' అని సింక్లైర్ అన్నారు.

మరికొన్ని స్మార్ట్‌లెన్స్‌లను హెల్త్ డేటాను సేకరించేందుకు డెవలప్ చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ఈ కారు పది నిమిషాల్లో విమానంలా మారిపోతుంది

''కొన్ని లెన్స్‌లు కంటి ఆరోగ్యాన్ని నిరంతరం మానిటర్ చేస్తుంటాయి. ఉదాహరణకు ఇంట్రా-ఓక్యులర్ ప్రెజర్, గ్లూకోజ్‌ లాంటి వాటిని ఇవి ట్రాక్ చేయగలవు" అని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆప్టోమెట్రిక్ సైన్స్ బోధించే రెబెక్కా రోజాస్ అన్నారు.

మధుమేహం ఉన్నవారు గ్లూకోజ్ స్థాయిలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

''ఇవి ఎక్స్‌టెండెడ్ డ్రగ్-డెలివరీ ఆప్షన్లు కూడా ఇస్తున్నాయి. ఇది రోగ నిర్ధారణ, చికిత్సలలో ప్రయోజనకరంగా ఉంటుంది. సాంకేతికత ఈ స్థాయికి రావడం, రోగుల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడటం చాలా సంతోషం కలిగిస్తుంది'' అని రోజాస్ అన్నారు.

యూనివర్సిటీ ఆఫ్ సర్రే తయారు చేసిన కాంటాక్ట్ లెన్స్ యూజర్ ఆరోగ్య సమాచారాన్ని సేకరించగలదు

ఫొటో సోర్స్, UNIVERSITY OF SURREY

ఫొటో క్యాప్షన్, యూనివర్సిటీ ఆఫ్ సర్రే తయారు చేసిన కాంటాక్ట్ లెన్స్ యూజర్ ఆరోగ్య సమాచారాన్ని సేకరించగలదు

అనేక వ్యాధులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి అంటే కంటి సమస్యల నుంచి క్యాన్సర్ కణాల గుర్తింపు వరకు అనేక ప్రయోజనాలను అందించగల లెన్స్‌లను తయారు చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.

ఉదాహరణకు, సర్రే విశ్వవిద్యాలయంలోని ఒక బృందం ఒక స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్‌ను రూపొందించింది. దీనిలో కంటి సమాచారాన్ని తీసుకోవడానికి ఫొటో-డిటెక్టర్, కార్నియల్ డిసీజ్‌లను నిర్ధారించడానికి ఉష్ణోగ్రతలను గుర్తించే సెన్సర్‌లు, కంటి ద్రవాలలో గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షించే సెన్సర్‌లు‌ ఉన్నాయి.

''మేము దీన్ని చాలా సన్నని మెష్ పొరతో అల్ట్రా-ఫ్లాట్‌గా చేస్తాము. సెన్సర్ లేయర్‌ను నేరుగా కాంటాక్ట్ లెన్స్‌పై ఉంచవచ్చు. తద్వారా ఇది కంటిని నేరుగా తాకుతుంది. కంటి ద్రవాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది" అని సర్రే విశ్వవిద్యాలయంలో ఎనర్జీ స్టోరేజ్ బయోఎలక్ట్రానిక్స్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్న యున్‌లాంగ్ జావో చెప్పారు.

"ఇది ధరించడం మరింత సౌకర్యవంతంగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మరింత సరళమైనది. కంట్రి ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నందున ఇది మరింత ఖచ్చితమైన సెన్సింగ్ ఫలితాలను అందిస్తుంది" అని డాక్టర్ జావో చెప్పారు.

గూగుల్ స్మార్ట్ గ్లాస్ 2014లో విడుదలైంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గూగుల్ స్మార్ట్ గ్లాస్ 2014లో విడుదలైంది

అయితే, ఈ పరిణామాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, స్మార్ట్ లెన్స్ టెక్నాలజీ ఇంకా అనేక అడ్డంకులను అధిగమించవలసి ఉంది.

ప్రధానమైన సమస్య ఏంటంటే, ఇవి ఏదైనా ముఖ్యమైన పని చేయడానికి అవసరమైనప్పుడు ఆ పవర్ వీటికి అందుతుందా అన్నది. ఎందుకంటే ఇవి బ్యాటరీలతోనే పని చేస్తాయి.

మోజో ఇంకా తన ప్రోడక్ట్‌లను పరీక్షిస్తోంది. అయితే, కస్టమర్‌లు మాత్రం తమ లెన్స్‌లను రీఛార్జ్ చేయకుండా రోజంతా వాడుకునేలా ఉండాలని కోరుకుంటున్నారు.

''మీరు లెన్స్ నుండి సమాచారాన్ని నిరంతరం ఉపయోగించరు. రోజులో అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటారు. అంటే ఇవాళ మనం వాడుతున్న స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్‌లాగా. ఇది ఎంత తక్కువ ఉపయోగిస్తే, అంత ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉంటుంది'' అని మోజో కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, పాత కంప్యూటర్లు, టీవీల నుంచి బంగారం తయారు చేసే కొత్త టెక్నాలజీ

2014లో గూగుల్ స్మార్ట్ గ్లాసెస్‌ను ప్రారంభించినప్పటి నుండి ప్రైవసీ వ్యవహారంపై ఆందోళనలు మొదలయ్యాయి. ప్రైవసీ విషయంలో ఇవి విఫలమయ్యాయని అని ప్రచారం జరిగింది.

'' ఫార్వర్డ్ ఫేసింగ్ కెమెరాతో ఫొటోలు తీయడానికి లేదా వీడియో రికార్డ్ చేయడానికి యూజర్‌ను అనుమతించే ఏదైనా స్మార్ట్ పరికరం ప్రేక్షకుల గోప్యతకు ప్రమాదాన్ని కలిగించగలదు" అని డిజిటల్ రైట్స్ క్యాంపెయిన్ గ్రూప్ యాక్సెస్ నౌలో సీనియర్ పాలసీ ఎనలిస్ట్ డేనియల్ లూఫర్ చెప్పారు.

ప్రైవసీ సమస్యలతోపాటు, లెన్స్‌లు ధరించిన వ్యక్తుల డేటా-భద్రతపై కూడా తయారీదారుల దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

మోజో కాంటాక్ట్ లెన్స్ లలో చిన్న తెర ఉంటుంది

ఫొటో సోర్స్, MOJO

ఫొటో క్యాప్షన్, మోజో కాంటాక్ట్ లెన్స్ లలో చిన్న తెర ఉంటుంది

స్మార్ట్‌లెన్స్‌లు యూజర్ కంటి కదలికలను ట్రాక్ చేసినప్పుడు మాత్రమే వాటి పనిని పూర్తి చేయగలవు. కానీ, దీనితోపాటు డేటా కూడా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

''నేను వేటిని చూస్తున్నాను, ఎంత సేపు చూస్తున్నాను, వాటిని చూసినప్పుడు నా హృదయ స్పందన రేటు పెరుగుతుందా, లేదా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు నాకు చెమట పట్టిందా అన్న సమాచారాన్ని కూడా ఈ పరికరాలు సేకరిస్తే ఏం చేయాలి'' అని లూఫర్ ప్రశ్నించారు.

"ఈ రకమైన డేటాను మన సెక్సువల్ ఓరియంటేషన్ (లైంగిక ఆసక్తులలు) నుంచి మనం ఇంటరాగేషన్ సమయంలో సరైన సమాధానాలు చెబుతున్నామా లేదా అన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడం వరకు కూడా ఉపయోగించవచ్చు'' అని లూఫర్ అన్నారు.

"నా ఆందోళన ఏమిటంటే, ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) గ్లాసెస్ లేదా స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్‌ వంటి పరికరాలు మన డేటా తస్కరణకు వినియోగించవచ్చు'' అన్నారు లూఫర్.

అయితే, మోజో మాత్రం మొత్తం డేటా భద్రంగా ఉంటుందని చెబుతోంది.

ఇవి కాక మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. "ఏ రకమైన కాంటాక్ట్ లెన్స్ అయినా జాగ్రత్తగా మెయింటెయిన్ చేయకపోయినా, సరిగ్గా అమర్చకపోయినా కంటి ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తాయి. ఇతర వైద్య పరికరాల మాదిరిగానే, రోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నామని మనం నిర్ధరించుకోవాలి'' అని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన రోజాస్ చెప్పారు.

''ఎక్కువగా ఉపయోగించకపోవడం, పరిశుభ్రంగా ఉంచకపోవడం, లేదా అతిగా వాడడం వంటి వాటి నుంచి కూడా సమస్యలు వస్తాయి. ఇవి దురద, మంట, ఇన్ఫెక్షన్‌లు లేదా కంటి ప్రమాదాలకు దారి తీయవచ్చు'' అని రోజాస్ చెప్పారు.

రెబెక్కా రోజాస్

ఫొటో సోర్స్, COLUMBIA UNIVERSITY

ఫొటో క్యాప్షన్, రెబెక్కా రోజాస్

మోజో కంపెనీ తయారు చేస్తున్న లెన్స్‌లు ఏకబిగిన సంవత్సరం వరకు ఉపయోగించవచ్చన్న అంచనాలు ఉండటంతో, ఇదొక సమస్య కావచ్చని సింక్లైర్ అంగీకరించారు.

కానీ, ఇవి స్మార్ట్‌లెన్స్ కాబట్టి, అవి తగినంత శుభ్రంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి యూజర్లను హెచ్చరించే ప్రోగ్రామ్ కూడా అందులో ఉంటుందని ఆయన అన్నారు.

ప్రిస్క్రిప్షన్, పర్యవేక్షణ కోసం కంటి నిపుణులతో కలిసి పనిచేయాలని కూడా మోజో సంస్థ భావిస్తోంది.

'' వీటిని నేరుగా విడుదల చేసి, అందరూ మొదటి రోజే వీటిని కొనుక్కోవాలని మేం కోరుకోవడం లేదు. అన్ని కొత్త ప్రోడక్టుల మాదిరిగానే వీటికి కొంత సమయం పడుతుంది. కానీ, కంటికి వాడే మా ప్రోడక్ట్‌లన్నీ చివరికి స్మార్ట్‌గా మారడం అనివార్యమని మేము భావిస్తున్నాము" అని సింక్లైర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)