స్మార్ట్ వాటర్: గృహ హింస, లైంగిక దాడులకు పాల్పడినవారిని దీనితో పట్టుకోవచ్చా

ఈ ద్రవం ఎండిపోతే మామూలు కంటికి కనిపించదు. అతినీలిలోహిత కిరణాలు కింద మాత్రమే కనిపిస్తుంది.
ఫొటో క్యాప్షన్, ఈ ద్రవం ఎండిపోతే మామూలు కంటికి కనిపించదు. అతినీలిలోహిత కిరణాల కింద మాత్రమే కనిపిస్తుంది.
    • రచయిత, షియోనా మెక్‌కల్లం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బ్రిటన్‌లో గృహహింసకు పాల్పడిన ఒక వ్యక్తిని "స్మార్ట్ వాటర్" అని పిలిచే ఒక ద్రవం సహాయంతో దోషిగా నిర్ధరించి, జైలుశిక్ష విధించారు.

దీన్ని "ఇంటెలిజెంట్ వాటర్" అంటున్నారు. ఇది ఒక ఫోర్సెనిక్ ద్రవం. ఒకసారి చల్లితే ఆరు వారాల వరకు చర్మంపై దీని ఆనవాళ్లు ఉంటాయి. బట్టలపై ఇంకా ఎక్కువ కాలమే ఉంటాయి.

లైంగిక హింస, వేధింపులకు గురయ్యే మహిళలను కాపాడేందుకు ఈ ద్రవాన్ని ఉపయోగించవచ్చని అంటున్నారు. దీన్ని బ్రిటిష్ పోలీసులు పరీక్షిస్తున్నారు.

ఈ కిట్‌లో హ్యాండ్ స్ప్రే, తలుపులకు రాయడానికి ఒక చిక్కటి పదార్థం, దానంతట అదే తెరుచుకుని ద్రవాన్ని పిచకారీ చేసే ఒక సాధనం ఉంటాయి.
ఫొటో క్యాప్షన్, ఈ కిట్‌లో హ్యాండ్ స్ప్రే, తలుపులకు రాయడానికి ఒక చిక్కటి పదార్థం, దానంతట అదే తెరుచుకుని ద్రవాన్ని పిచికారీ చేసే ఒక సాధనం ఉంటాయి.

ఈ ద్రవాన్ని ఇంగ్లండ్‌లోని 200 కంటే ఎక్కువ మంది మహిళలకు అందించారు. ఇది ఒక కిట్. ఇందులో హ్యాండ్ స్ప్రే, తలుపులకు, గొళ్లాలకు రాయడానికి ఒక చిక్కటి పదార్థం, ఎవరైనా ఇంటిని సమీపించిన వెంటనే దానంతట అదే తెరుచుకుని ద్రవాన్ని పిచికారీ చేసే ఒక సాధనం.

పై కేసులో బాధితురాలికి కూడా ఈ కిట్ అందింది. ఆమె ఉత్తర ఇంగ్లండ్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌ నివాసి.

"గృహ హింస నేరాన్ని పట్టుకోవడం చాలా కష్టం. చాలాసార్లు ఇది తలుపుల వెనకే జరుగుతుంది. దీన్ని ఫోరెన్సిక్‌పరంగా గుర్తించగలిగితే నేరస్థులను కొంతమేరకు పట్టుకోవచ్చు. బాధితులు ఎవరు, నేరస్థులు ఎవరు అన్నది కూడా తెలుసుకోవచ్చు" అని వెస్ట్ యార్క్‌షైర్ పోలీస్ డిటెక్టివ్ కమిషనర్ లీ బెర్రీ బీబీసీకి తెలిపారు.

'ఈ కిట్‌లతో లైంగిక, గృహ హింస సమస్యలను ఎదుర్కొంటున్నారు'

బ్రిటన్‌లో ఇతర ప్రాంతాల్లోని పోలీసులు కూడా లైంగిక హింస, గృహ హింస సమస్యలను ఎదుర్కోవడానికి ఈ కిట్‌లను వాడుతున్నారు.

ఈ కిట్‌కు ఒక వ్యక్తికి ఒక నెలకు సుమారు రూ.15,000 ఖర్చు అవుతుంది. మామూలుగా నేరస్థులను పట్టుకోవాడానికి అయ్యే ఖర్చు కన్నా ఇది చాలా తక్కువ అని డిటెక్టివ్ షెరిఫ్ బెర్రీ అంటున్నారు.

ఈ స్మార్ట్ వాటర్ కిట్‌తో సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తోందని చాలామంది బాధితులు పోలీసులకు చెప్పారు. 94 శాతం మహిళలు దీన్ని ఇతరులకు సిఫార్సు చేస్తామని ఒక సర్వేలో వెల్లడించారు.

"వెస్ట్ యార్క్‌షైర్‌లో మేం అమలుచేస్తున్న విధానాన్ని ఇతర ప్రాంతాల పోలీసులు కూడా అనుసరిస్తారని ఆశిస్తున్నాం. ఎంతమంది బాధితులను రక్షించగలిగితే అంత మంచిది. అదే నిజమైన విజయం" అని షెరిఫ్ బెర్రీ అన్నారు.

బ్రిటన్‌లో ఇప్పటివరకు మూడు పోలీసు బలగాలు ఈ సాంకేతికతను ఉపయోగించాయి.

దొంగతనాల నుంచి గృహ హింస వరకు

కొన్నేళ్లుగా, చాలా విలువైన వస్తువులను దొంగల నుంచి కాపాడడానికి ఈ స్మార్ట్ వాటర్‌ను ఉపయోగిస్తున్నారు.

ఈ ద్రవం ఎండిపోతే మామూలు కంటికి కనిపించదు. కానీ పోలీసులు ఉపయోగించే అతినీలలోహిత కిరణాల కింద ఇది మెరుస్తూ కనిపిస్తుంది.

దొంగతనం చేసిన వస్తువులు దొరికినప్పుడు, శాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపించి పరీక్షిస్తారు. తద్వారా దొంగలనే కాకుండా వస్తువుల యజమానులెవరో కూడా కనిపెట్టవచ్చు.

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ పోలీస్ చీఫ్స్ సమాచారం ప్రకారం, ఇప్పటికే, ఈ టెక్నాలజీతో కాటలిటిక్ కన్వర్టర్ల (ఖరీదైన ఆటో భాగాలు) దొంగతనాలు సగానికి తగ్గిపోయాయి.

వీడియో క్యాప్షన్, నటి భావనపై లైంగిక దాడి కేసు: ఆ రోజు ఏం జరిగింది? నిందితులు ఎవరు?

దీన్ని గృహ హింసకు వినియోగించడం మొదటిసారి.

పైన చెప్పుకున్న కేసులో నేరస్థుడు తన మాజీ ప్రియురాలిని వేధిస్తున్నాడు. కోర్టు నిబంధనలను ఉల్లంఘించాడు.

నేరస్థుడు ఆమె ఇంట్లోకి జొరబడేందుకు ప్రయత్నిస్తుండగా, కిటికీలోంచి ఆమె ఈ ద్రవాన్ని స్ప్రే చేశారు.

ఈ స్మార్ట్ వాటర్ సహాయంతో పోలీసులు నేరస్థుడిని పట్టుకోగలిగారు. కోర్టు ఆయనకు 24 వారాల జైలుశిక్ష విధిస్తూ, రెండేళ్ల పాటు ఆమెను కలుసుకోకూడదనే నిబంధన పెట్టింది.

ఈ ఫోర్సెనిక్ గుర్తుల వల్ల ఎలాంటి సందేహాలకూ తావు ఉండదని స్మార్ట్ వాటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ డైరెక్టర్ రేచెల్ ఓక్లే అన్నారు.

"స్మార్ట్ వాటర్ తయారుచేయడానికి ఉపయోగించే పదార్థాలు ప్రకృతి సహజంగా లభించేవి కావు. ప్రతీ సీసాలో ఈ పదార్థాలు వేర్వేరు మోతాదుల్లో ఉంటాయి. ప్రతీ బ్యాచ్ ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ఒక సీసా ఏ బ్యాచులోంచి వచ్చిందో సులువుగా చెప్పగలం" అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)