నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?

మోదీ-కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Hindustan Times

    • రచయిత, అనంత్ ప్రకాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2014లో సోషల్ మీడియా, టీవీ ఛానెళ్లలో ఇద్దరు నాయకుల గురించి చాలా చర్చ జరిగింది. వీరిలో ఒకరు నరేంద్ర మోదీ కాగా, రెండో వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్.

వరుసగా మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ప్రధాన మంత్రి పదవికి 2014లో నరేంద్ర మోదీ పోటీచేశారు. మరోవైపు మూడుసార్లు దిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఓడించి అప్పటికే ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చరిత్ర సృష్టించారు.

ఇద్దరు నాయకులూ వారణాసి వేదికగా నేరుగా కూడా లోక్‌సభ ఎన్నికల్లో తలపడ్డారు. అయితే, ఇక్కడ మోదీ పైచేయి సాధించారు.

సరిగ్గా పదేళ్ల తర్వాత, అంటే 2024లో మరోసారి నరేంద్ర మోదీకి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసురుతున్నారు. 2014లో మోదీ మిషన్ తరహాలోనే భారత్‌ను మరోసారి గొప్ప దేశంగా మారుస్తానని కేజ్రీవాల్ అంటున్నారు.

‘‘ప్రపంచంలో భారత్‌ను అగ్రదేశంగా మార్చేవరకూ మేం ప్రశాంతంగా కూర్చోలేం. దీని కోసం దేశంలోని మూలమూలకు వెళ్లి 130 కోట్ల మందినీ మాతో కలుపుకుంటాం’’అని కేజ్రీవాల్ అన్నారు.

ఇదివరకటి ప్రభుత్వాలను విమర్శిస్తూ.. ‘‘ఈ నాయకులు, పార్టీలకు అధికారాన్ని అప్పగిస్తే, దేశం ముందుకు వెళ్లడం కష్టం అవుతుంది. అందుకే అందరమూ కలిసి పనిచేయాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు ఆప్ నాయకులు మనీష్ సిసోదియా నుంచి రాఘవ్ చడ్ఢా, సంజయ్ సింగ్‌ల వరకు.. ‘‘ఇదివరకు మోదీ వర్సెస్ ఎవరు? అనే చర్చ జరిగేది.. కానీ నేడు ఈ చర్చ మోదీ వర్సెస్ కేజ్రీవాల్‌కు మారింది’’అని చాలాసార్లు చెబుతున్నారు.

అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు ప్రభావం చూపించగలవు?

కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Hindustan Times

ఎవరి ప్రభావం ఎంత?

2014లో నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆయనకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవముంది.

తన దగ్గర గుజరాత్ మోడల్ ఉందని, అక్కడ అమలుచేసిన కార్యక్రమాలు, వాణిజ్య విధానాలు, వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లాంటి సదస్సులను జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు.

ఈ రాజకీయేతర కార్యక్రమాల్లో పారిశ్రామిక దిగ్గజాలు ముఖేశ్ అంబానీ నుంచి గౌతమ్ అదానీల వరకు పాల్గొనేవారు. దీనిపై దేశ వ్యాప్తంగా మీడియాలో వార్తలు వచ్చేవి.

2014లో ప్రధాన మంత్రి పదవికి పోటీ చేసేనప్పుడు, ‘‘హిందూ హృదయ సామ్రాట్’’గా, గుజరాత్‌లో మూడుసార్లు వరుసగా ఎన్నికల్లో విజయం సాధించిన నాయకుడిగా మోదీని ముందుకు తీసుకొచ్చారు.

అయితే, ఇప్పుడు ఆప్ నాయకుడు కేజ్రీవాల్ కూడా మూడుసార్లు దిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా పంజాబ్‌ ఎన్నికల్లోనూ ఆయన పార్టీ విజయం సాధించింది.

దిల్లీలోని స్కూళ్లు, హాస్పిటళ్ల పరిస్థితులను మెరుగుపరిచినట్లు కేజ్రీవాల్‌కు పేరుంది.

అయితే, ఈ అనుభవంతోపాటు దిల్లీ మోడల్‌ను ఆధారంగా తీసుకొని 2021 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యామ్నాయంగా మారుతారని చెప్పొచ్చా?

జాతీయ రాజకీయాలను ఏళ్ల నుంచి విశ్లేషిస్తున్న సీనియర్ జర్నలిస్టు నీరజా చౌధరి ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు. కేజ్రీవాల్ ప్రయత్నాల్లో తనకు ఒక లోతైన అవగాహన కనిపిస్తోందని ఆమె అన్నారు.

‘‘నేడు ఎవరైనా బీజేపీకి సవాల్ విసురుతున్నారంటే.. అది కచ్చితంగా కేజ్రీవాలే. ప్రస్తుతం మమతా బెనర్జీకి అంత ఉత్సాహం ఉన్నట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్‌ను బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం లేదు. మరోవైపు ప్రాంతీయ పార్టీలకు కూడా బీజేపీ అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇప్పుడు మోదీకి పోటీ ఇచ్చే వారి రేసులో అరవింద్ కేజ్రీవాల్ ముందు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు’’అని ఆమె చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Hindustan Times

ఆప్ గ్రాఫ్

మరోవైపు కేజ్రీవాల్‌ను రాజకీయంగా మంచి అవగాహన ఉన్న నాయకుడిగా నీరజా చౌధరి అభివర్ణించారు.

‘‘ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలను అలానే కొనసాగిస్తే, ప్రధాన మంత్రి పదవిని చేరుకునేందుకు ఆయనకు 15ఏళ్లు పడుతుంది. ఎందుకంటే ఆయన కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటుచేసుకుంటూ వస్తున్నారు. దీనికి కాస్త సమయం పడుతుంది’’అని ఆమె చెప్పారు.

‘‘అయితే, ఆయనకు రాజకీయంగా మంచి అనుభవముంది. దేశ ప్రజల నాడి ఎలా పట్టుకోవాలో ఆయనకు తెలుసు. ఇదివరకటి సెక్యులర్ నిర్వచనాలకు కట్టుబడి ఉంటే పని జరగదని ఆయనకు అవగాహన ఉంది. ఇప్పుడు ఆయన హిందూ అనుకూల ఇమేజ్ (ప్రో-హిందూ ఇమేజ్) కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ముస్లిం వ్యతిరేకి అనే ముద్ర కూడా పడకుండా చూసుకుంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి వారు అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్లి హిందువుల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రజలను ఎలా తనవైపు తిప్పుకోవాలో కేజ్రీవాల్‌కు తెలుసు. బీజేపీకి కూడా భవిష్యత్‌లో తమను ఢీకొట్టబోయేది కేజ్రీవాలేనని అవగాహన ఉంది’’అని ఆమె వివరించారు.

భగవంత్ మాన్

ఫొటో సోర్స్, Hindustan Times

అయితే, కొన్నిసార్లు తన వైఖరి వల్ల అరవింద్ కేజ్రీవాల్ కూడా విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా దిల్లీ ఘర్షణలు, ఎన్‌ఆర్‌సీ-సీఏఏ లాంటి అంశాలపై కేజ్రీవాల్ మౌనాన్ని విపక్షాలు తప్పుపట్టాయి.

మరోవైపు ఆప్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో నెమ్మదిగా పెరుగుతోందని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్, పీపీఆర్ ఇండియా పరిశోధకుడు రాహుల్ వర్మ కూడా చెప్పారు.

‘‘తాజాగా ఆగస్టులో రెండు సర్వేల ఫలితాలు బయటకు వచ్చాయి. ఇదివరకు జాతీయ స్థాయిలో ఆప్ సభ్యత్వం ఒకటి నుంచి 1.5 శాతం చొప్పున పెరిగేదని.. కానీ, ఇప్పుడు అది 6.5 నుంచి 8 శాతానికి వెళ్లిందని వీటిలో పేర్కొన్నారు’’అని రాహుల్ అన్నారు.

‘‘దీని ప్రకారం, వచ్చే రెండేళ్లలో ఆప్ ప్రజాదారణ మరింత పెరగొచ్చు. అదే సమయంలో మోదీ ప్రజాదారణ కాస్త తగ్గొచ్చు. కానీ, ప్రస్తుతానికి అయితే, ఇద్దరు నాయకుల మధ్య అంతరం చాలా ఎక్కువే ఉంది. మరోవైపు ఈ రెండు పార్టీలను ఒకరికి మరొకరు పోటీ అని కూడా చెప్పలేం’’అని ఆయన వివరించారు.

కేజ్రీవాల్, మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, Hindustan Times

మోదీకి పోటీగా..

అటల్ బిహారీ వాజ్‌పేయీ, నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్ లాంటి వారు దశాబ్దాల రాజకీయ అనుభంతో ప్రజలపై తమదైన ముద్ర వేశారు.

అయితే, అరవింద్ కేజ్రీవాల్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి కేవలం పదేళ్లు మాత్రమే గడిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో మోదీకి పోటీగా ఇమేజ్‌ను సృష్టించుకోవడం ఆయనకు ఎంత కష్టం? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

ఈ విషయంపై ప్రజాభిప్రాయల నిపుణుడు దిలీప్ చెరియన్ బీబీసీతో మాట్లాడారు.

‘‘రెండు రాష్ట్రాల్లో అనుభవం ఆధారంగా జాతీయ స్థాయిలో ఇమేజ్ సృష్టించుకోవడం కాస్త పెద్ద లక్ష్యమే. ఇప్పుడు కేజ్రీవాల్‌ను పక్కన పెడితే, గతంలో పెద్దపెద్ద రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి’’అని ఆయన అన్నారు.

ప్రజలపై చెరగని ముద్ర వేయాలంటే తప్పకుండా కొత్త విధానాలతో ముందుకు రావాలని దిలీప్ భావిస్తున్నారు.

‘‘ఇప్పుడు కేజ్రీవాల్ నడిపిస్తున్న కార్యక్రమాల్లో చాలావరకు ఆయన సొంతంగా సృష్టించినవి లేవు. కాబట్టి ఆయన కొత్తగా ఏదైనా చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో భారత్‌ను మోదీ మెరుగ్గా నడిపిస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’అని ఆయన అన్నారు.

‘‘ఉదాహరణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇది ఒక రాజకీయేతర కార్యక్రమం. ఇలాంటి ఆలోచన ఇదివరకు ఏ పార్టీకి రాలేదు. కేజ్రీవాల్ కూడా ఇలాంటి కొత్త కార్యక్రమాలతో ముందుకు రావాలి. ముఖ్యంగా దిల్లీ లేదా పంజాబ్ ప్రజలను ఆయన పూర్తిగా ఆకట్టుకోవాలి’’అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, అమిత్ షా చెప్పులు మోశారంటూ ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు బండి సంజయ్ జవాబు ఏంటి?

విపక్షాలు ఎలా చూస్తున్నాయి?

బీజేపీ తరహాలో వనరులు లేదా వ్యవస్థ ఆప్‌కు లేవని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి కేజ్రీవాల్‌ను తమ అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

అయితే, అలాంటి అవకాశం లేదని నీరజా చౌధరి తోసిపుచ్చారు.

‘‘విపక్షాలు దానికి సిద్ధంగా లేవు. మరోవైపు తాను ఒంటరిగానే బరిలోకి దిగుతానని కేజ్రీవాల్ కూడా స్పష్టం చేశారు. కొన్ని విపక్షాలు కూడా ఆయన్ను ముప్పుగానే పరిగణిస్తున్నాయి’’అని ఆమె అన్నారు.

ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్షాల అభ్యర్థి కాకపోతే.. మరి ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.

వీడియో క్యాప్షన్, KTR: ‘‘TRSను ఓడించాలని ప్రజలు అనుకుంటే, ఏ వ్యూహకర్తా మమ్మల్ని కాపాడలేరు’’

‘‘బహుశా నితీశ్ కుమార్ అవుతారేమో.. ఆయన వైపే విపక్షాలు మొగ్గుచూపొచ్చు. మోదీ ఎదగడంలో ఆరెస్సెస్ క్రియాశీల పాత్ర పోషించినట్లే.. ప్రతిపక్షాలన్నీ కలిసి ఆయన్ను ముందుకు తీసుకురావొచ్చు. ఇక మమతా బెనర్జీ విషయానికి వస్తే, ఆమె సొంత పార్టీలో చాలా తలనొప్పులు ఉన్నాయి’’అని నీరజ అన్నారు.

‘‘నితీశ్‌కు కొన్ని అంశాలు కలిసి రావొచ్చు. ముఖ్యంగా ఆయన అనుభవం, హిందీ మాట్లాడే రాష్ట్రం నుంచి రావడం, మంచి పాలకుడిగా గుర్తింపు.. ఇవన్నీ కలిసొచ్చే అంశాలు. ఎందుకంటే ముందుగా హిందీ రాష్ట్రాల నుంచి బీజేపీని కూకటివేళ్లతో పెకలించాలి. మరోవైపు నితీశ్ వయసు కూడా 70ఏళ్లు దాటింది. దీంతో విపక్షాల్లోని యువ నేతలు ఆయనకు ఎంత మద్దతు ప్రకటిస్తారో చూడాలి’’అని ఆమె వివరించారు.

‘‘నితీశ్‌కు కాంగ్రెస్ మద్దతు పలకొచ్చు. ఎందుకంటే రాహుల్‌కు విపక్షాలు సిద్ధంగా లేవని కాంగ్రెస్‌కు కూడా తెలుసు. మరోవైపు రాహుల్ గాంధీకి పోటీగా తమ పార్టీలోని మరొకరిని ముందుకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. దీంతో కచ్చితంగా కాంగ్రెస్ బయటి వ్యక్తులనే ముందుకు తేవాలి. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి బయటకువెళ్లి పార్టీలు పెట్టిన శరద్ పవార్, జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ లాంటి వారికి కూడా పార్టీ మద్దతు ఇవ్వకపోవచ్చు’’అని ఆమె విశ్లేషించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)