అరవింద్ కేజ్రీవాల్: ‘నేనొక స్వీట్ టెర్రరిస్టును’ అని దిల్లీ సీఎం ఎందుకన్నారు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో 'ఖలిస్తాన్' అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల్లో గెలవడానికి వేర్పాటువాద శక్తుల మద్దతు తీసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన కుమార్ విశ్వాస్ ఆరోపించారు.
"తాను పంజాబ్ ముఖ్యమంత్రిని అవుతానని లేదా స్వతంత్ర దేశానికి మొదటి ప్రధాని అవుతానని ఒకరోజు ఆయన నాతో చెప్పారు" అంటూ ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమార్ విశ్వాస్ అన్నారు.
ఇదో వివాదంగా మారుతోందని గుర్తించిన అరవింద్ కేజ్రీవాల్ దీనిపై శుక్రవారం స్పష్టత ఇచ్చారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, తనను తాను ఒక 'తీపి ఉగ్రవాది'గా అభివర్ణించుకున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కేజ్రీవాల్ వివరణ
ప్రతిపక్షాలు తనపై కుట్ర పన్నుతున్నాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
“వీళ్లంతా కుమ్మక్కై నా మీద ఆరోపణలు చేస్తున్నారు. 'గత పదేళ్లుగా కేజ్రీవాల్ దేశాన్ని రెండు ముక్కలు చేయాలనే ఆలోచనతో ఉన్నారని' వారు ఆరోపిస్తున్నారు. ఈ రెండు ముక్కల్లో ఒకదానికి నేను ప్రధానమంత్రిని కావాలని అనుకుంటున్నానట. ఇంతకన్నా హాస్యాస్పద ఆరోపణ మరొకటి ఏమైనా ఉంటుందా? గత పదేళ్లలో 3 ఏళ్లు కాంగ్రెస్, 7 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉన్నాయి. మరి ఇంతకాలంగా ఈ ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా? ప్రభుత్వ నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? వీళ్ల మాటలు వింటుంటే నవ్వొస్తోంది” అని కేజ్రీవాల్ అన్నారు.
“బహుశా నేను ప్రపంచంలోనే అత్యంత ‘తీపి’ ఉగ్రవాదిని కావచ్చు. ఎందుకంటే, ఆసుపత్రులు కట్టిస్తాను. పాఠశాలలు నిర్మిస్తాను. ప్రజల కోసం రోడ్లు వేయిస్తాను. ఉచిత విద్యుత్తు, నీటిని అందిస్తుంటాను.
100 ఏళ్ల కిందట బ్రిటిష్ వారు భగత్ సింగ్‌ను టెర్రరిస్టు అని పిలిచారు. నేడు భగత్ సింగ్ శిష్యుడిని ఉగ్రవాదిగా నిరూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్ వివరణపై కుమార్ బిశ్వాస్ మళ్లీ స్పందించారు. ఖలిస్తాన్‌పై తన వైఖరిని కేజ్రీవాల్ స్పష్టం చేయాలని కుమార్ విశ్వాస్ శుక్రవారం డిమాండ్ చేశారు.
"గత ఎన్నికల్లో, ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులు, వారితో మాట్లాడేందుకు సహకరించేవాళ్లు మీ ఇంటికి వచ్చారో, లేదో దేశానికి చెప్పండి. ఈ అంశంపై నేను అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు నన్ను పంజాబ్ సమావేశాల నుంచి తొలగించారా లేదా? " అని బిశ్వాస్ ప్రశ్నించారు
కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఆయన ఇచ్చిన వివరణతో ఈ వివాదం ప్రభావం ఓటింగ్‌పై ఏమేరకు ఉంటుందన్నది చెప్పడం కష్టమే. కానీ, ప్రచార ఘట్టం చివరలో ఈ వివాదంతో పంజాబ్ రాజకీయాలు వేడెక్కాయి.

ఫొటో సోర్స్, TWITTER/@BJP4INDIA
విమర్శలు
కుమార్ విశ్వాస్ ప్రకటనపై అరవింద్ కేజ్రీవాల్ వివరణ ఇచ్చిన వెంటనే ఆయనపైన, ఆమ్ ఆద్మీ పార్టీ పైన బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు అన్ని రాజకీయ పక్షాలు విమర్శలు గుప్పించాయి.
ఫజిల్కా బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “గత ఎన్నికల్లో పంజాబ్‌కు ఇంచార్జిగా ఉన్న నాయకుడు, ఆయన (కేజ్రీవాల్) పాత మిత్రుడు నిన్న ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నొప్పి ఉంది కాబట్టే కేజ్రీవాల్ దాని మీద వివరణ ఇచ్చారు. ఆ పాత మిత్రుడు చెప్పిన మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.
“వీళ్లు పంజాబ్‌ను విచ్ఛిన్నం చేయాలని కలలుగంటూ ఉంటారు. అధికారం కోసం వేర్పాటువాదులతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉంటారు. అధికారం కోసం దేశాన్ని ముక్కలు చేయడానికి కూడా వీరు వెనుకాడరు. వీరి అజెండా, పాకిస్తాన్ అజెండా ఒక్కటే” అని కూడా మోదీ అన్నారు.
కాంగ్రెస్ కూడా కేజ్రీవాల్ మీద దాడి చేయడానికి వెనుకాడలేదు. కుమార్ విశ్వాస్ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం లేఖ రాశారు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ.
కుమార్ విశ్వాస్ చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకుని, పంజాబ్‌లోని బస్సీ పఠాన్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా దిల్లీ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు.
“ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాక సభ్యుడు కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై కేజ్రీవాల్ ఎందుకు పెదవి విప్పడం లేదు? ఆయన చేసిన ఆరోపణలు నిజమా, కాదా అన్నది కేజ్రీవాల్ స్పష్టం చేయాలి” అని రాహుల్ గాంధీ అన్నారు.
ఇదిలా ఉంటే, కుమార్ విశ్వాస్ ఆ ఆరోపణలు చేసిన మరునాడు, ఆయన మాట్లాడిన వీడియోను టీవీలో కానీ, సోషల్ మీడియా వేదికల్లో కానీ ప్రసారం చేయకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఆయన ఇంటర్వ్యూ మతపరమైన ఉద్వేగాలు రెచ్చగొట్టేదిగా, ద్వేషపూరితంగా ఉందని కమిషన్ వ్యాఖ్యానించింది. అయితే, కొన్ని గంటల తరువాత ఆ నిషేధాన్ని తొలగించారు.

ఇవి కూడా చదవండి:
- పాన్ కార్డు స్కాం: సన్నీ లియోనికి తెలియకుండానే ఆమె పాన్ కార్డుపై లోను ఎలా తీసుకున్నారు?
- అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు: 38 మందికి మరణశిక్ష విధించిన కోర్టు.. 56 మంది మృతికి కారణమైన ఆ రోజు ఏం జరిగింది?
- 30 ఏళ్ల తర్వాత బయటపడ్డ ఘోస్ట్ సిటీ.. ‘భయానకం. కానీ, ఇదే వాస్తవం’
- వేప చెట్లకు వింత వ్యాధి, ఎండాకాలంలో వేప చెట్టు నీడ ఉండదా... 10 ప్రశ్నలు
- మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో కోళ్లను ఎందుకు ఎగరేస్తున్నారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











