కాంగ్రెస్, బీజేపీల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఎలా జరుగుతుంది?

కాంగ్రెస్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాంగ్రెస్ తదుపరి అధ్యక్షులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం అక్టోబర్‌లో దొరుకుతుంది. కానీ, ఇప్పుడే దానిపై చర్చ మొదలైంది.

ఇప్పటివరకు బీజేపీ మాత్రమే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై ప్రశ్నలు వేస్తూ ఉంది. కానీ, ఇప్పుడు ఈ ప్రక్రియపై కాంగ్రెస్‌లోనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అందరి కన్నా ముందుగా, ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆనంద్ శర్మ దీనిపై ప్రశ్న లేవనెత్తారు.

బుధవారం మరో సీనియర్ నాయకుడు మనీష్ తివారీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగాలన్న వాదనపై ప్రశ్నలు లేవనెత్తారు.

ట్విట్టర్‌లో మధుసూదన్ మిస్త్రీని ట్యాగ్ చేస్తూ, పార్టీలో ఓటర్ల జాబితా బహిరంగంగా అందుబాటులో లేనప్పుడు ఎన్నికలు ఎలా నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరుగుతాయని ప్రశ్నించారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల నిర్వహణ బాధ్యతలను మధుసూదన్ మిస్త్రీ నిర్వర్తిస్తున్నారు.

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే ఓటర్ల పేర్లు, చిరునామాలను కాంగ్రెస్ వెబ్‌సైట్‌లో పారదర్శకంగా ప్రచురించాల్సిన అవసరం ఉందని తివారీ అన్నారు.

అయితే, ఓటర్ల జాబితా చూడాలనుకునేవాళ్లు ఆ రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీల నుంచి తీసుకోవచ్చని మధుసూదన్ మిస్త్రీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసినవారికి కూడా ఆ జాబితాను అదిస్తామని అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి ఎన్నికల విధానాన్ని అర్థం చేసుకోవడానికి బీబీసీ మధుసూదన్ మిస్త్రీతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ, ఆయన స్పందించలేదు.

ఇంతకీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు?

దీనికి సమాధానం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో దొరుకుతుంది.

కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, మధుసూదన్ మిస్త్రీ, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్

కాంగ్రెస్ పార్టీ

వివిధ కమిటీల సమాహారమే కాంగ్రెస్ పార్టీ. అవి..

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC)

జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో దాదాపు 1500 మంది సభ్యులు ఉన్నారు. వీరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి 24 మంది సభ్యులను ఎన్నుకుంటారు.

భారతదేశం మొత్తంగా 30 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు, అయిదు కేంద్రపాలిత ప్రాంతాల కమిటీలు ఉన్నాయి. వీటిల్లో 9000 కంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, ANI

అధ్యక్ష పదవి ఎన్నికల బాధ్యత

కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నియమావళి ప్రకారం, అధ్యక్ష పదవి ఎన్నికల కోసం ముందుగా సెంట్రల్ ఎలక్షన్ అథారిటీని ఏర్పటు చేస్తారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో మూడు నుంచి అయిదుగురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరిని ఈ అథారిటీ చైర్‌పర్సన్‌గా నియమిస్తారు.

ప్రస్తుతం కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ దీనికి చైర్మన్‌గా ఉన్నారు.

ఎన్నికలు ముగిసే వరకు అథారిటీ సభ్యులు పార్టీలో ఏ పదవినీ నిర్వహించలేరు. ఈ అథారిటీ పదవీకాలం మూడేళ్లు ఉంటుంది.

ఈ ఎలక్షన్ అథారిటీ వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్ అథారిటీలను ఏర్పాటు చేస్తుంది. వీళ్లు మళ్లీ జిల్లా, బ్లాక్ ఎలక్షన్ అథారిటీలను ఏర్పాటుచేస్తారు.

2022 కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలు

చాలా ఏళ్ల తరువాత కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీలు వెలువడ్డాయి.

సెప్టెంబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.

సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ తేదీలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేయవచ్చు.

నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం, అక్టోబర్ 1న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తారు.

నామినేషన్లను వెనక్కు తీసుకోవడానికి అక్టోబర్ 8 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది.

అక్టోబర్ 17న ఎన్నికల పోలింగ్ జరగుతుంది.

అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, Reuters

ఎన్నికలు ఎలా జరుగుతాయి?

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి 10 మంది సభ్యుల మద్దతు ఉండాలి. అలా ఉన్నవారెవరైనా నామినేషన్ వేయవచ్చు.

కాంగ్రెస్ పార్టీ నియమావళి ప్రకారం, అధ్యక్ష పదవి ఎన్నికల కోసం మొదట రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్‌నే రిటర్నింగ్ అధికారిగా ఉంటారు.

ఏ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులైనా అధ్యక్ష పదవికి ఒక పేరును ప్రతిపాదించవచ్చు. అయితే, కనీసం 10 మంది సభ్యులు ఉమ్మడిగా ప్రతిపాదించాలి.

ఇలా ప్రతిపాదించిన పేర్లను రిటర్నింగ్ అధికారి ముందు ఉంచుతారు.

ఏడు రోజుల గడువులోగా ఎవరైనా తమ పేరును వెనక్కు తీసుకోవచ్చు.

నామినేషన్ల ఉపసంహరణ తరువాత ఒకే ఒక్క అభ్యర్థి మిగిలి ఉంటే, ఆయన లేదా ఆమెను అధ్యక్షుడిగా లేదా అధ్యక్షురాలిగా పరిగణిస్తారు.

అదే జరిగితే, ఈసారి అక్టోబర్ 8నే కొత్త అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు ఎవరో తెలిసిపోతుంది.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, ANI

ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది అభ్యర్థులు ఉంటే..

అక్టోబర్ 8 తరువాత ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ నామినేషన్లు మిగిలితే, అప్పుడు రిటర్నింగ్ అధికారి ఆ పేర్లను పీసీసీకి పంపుతారు.

పీసీసీ సభ్యులందరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఓటింగ్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు ఉంచుతారు.

అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉంటే - సభ్యులు తమకు నచ్చినవారి పేరును రాసి, బ్యాలెట్ బాక్సులో వేయాలి.

ఇద్దరు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే - సభ్యులు కనీసం ఇద్దరి పేర్లను రాసి బ్యాలెట్ బాక్సులో వేయాలి. తమ ప్రిఫరెన్సుల వారీగా పేర్లను రాయాలి.

రెండు పేర్లు రాయని వారి ఓటు చెల్లదు. రెండు కన్నా ఎక్కువ పేర్లు కూడా రాయవచ్చు.

ఓటింగ్ తరువాత పీసీసీ నుంచి బ్యాలెట్ బాక్సును ఏఐసీసీ కార్యాలయానికి పంపుతారు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఓట్ల లెక్కింపు

ఏఐసీసీకి బ్యాలెట్ బాక్సు వచ్చిన తర్వాత రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న ఓట్లను లెక్కిస్తారు.

వాటిల్లో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని అధ్యక్షుడిగా ప్రకటిస్తారు.

ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ల లెక్కింపులో ఎవరికీ 50 శాతం ఓట్లు రాని పక్షంలో, అందరి కన్నా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు.

ఈ రకమైన 'ఎలిమినేషన్' పద్ధతి ద్వారా అధ్యక్ష పదవికి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

చివరికి, ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని అధ్యక్షుడిగా ప్రకటిస్తారు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, PTI

కాంగ్రెస్ చరిత్రలో పార్టీ అధ్యక్ష ఎన్నికలు చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది.

ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ రాజకీయాలను పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్టు రషీద్ కిద్వాయ్ మాట్లాడుతూ, "ఇప్పటివరకు పీసీసీ ప్రతినిధుల జాబితా వెలువడలేదు. వివిధ రాష్ట్రాల కమిటీల జాబితా చూస్తే ప్రతినిధుల జాబితా తెలియకపోవచ్చు. ఎవరైనా అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలంటే రాష్ట్ర కమిటీలకు వెళ్లి జాబితా చూడాల్సి వస్తుంది" అని చెప్పారు.

రషీద్ కిద్వాయ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

2000లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జితేంద్ర ప్రసాద్‌, సోనియా గాంధీపై పోటీ చేసినప్పుడు, ప్రచార సమయంలో భోపాల్‌లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు తెరిచిలేదు. చాలాచోట్ల ఆయనకు నల్ల జెండాలు చూపించారు. పీసీసీ సభ్యులకు ఫోన్లు చేసి ఎవరికి ఓటు వేయాలో సూచించారు. అదేవిధంగా 1997లో సీతారాం కేసరిపై శరద్‌పవార్‌, రాజేష్‌ పైలట్‌లు పోటీ చేసినప్పుడు, వాళ్లు చాలా చోట్ల ప్రచారాలు చేశారు. కానీ, సీతారాం కేసరి70 శాతం ఓట్లతో గెలిచారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఎప్పుడూ పారదర్శకంగానే జరిగాయని, జరుగుతాయని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ఆగస్టు 28న అన్నారు.

బీజేపీ

ఫొటో సోర్స్, ANI

బీజేపీలో ఎన్నికలు ఎలా జరుగుతాయి?

బీజేపీ నియమావళి ప్రకారం, కనీసం 15 ఏళ్ల పాటు పార్టీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి మాత్రమే పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవికి పోటీ చేయగలరు.

జాతీయ మండలి సభ్యులు, రాష్ట్ర మండలి సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా జాతీయ అధ్యక్షుడి 'ఎన్నిక' జరుగుతుంది.

అలాగే, జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి పేరును ఎలక్టోరల్ కాలేజీకి చెందిన ఇరవై మంది సభ్యులు ఉమ్మడిగా ప్రతిపాదించవచ్చు.

అయితే ఈ ఉమ్మడి ప్రతిపాదన కనీసం అయిదు రాష్ట్రాల నుంచి రావాలి. అక్కడ జాతీయ మండలి ఎన్నికలు పూర్తయి ఉండాలి.

నామినేషన్ పత్రంపై అభ్యర్థి ఆమోదముద్ర తప్పనిసరిగా ఉండాలి.

అయితే, బీజేపీలో అధ్యక్ష పదవికి ఎన్నిక ఏకాభిప్రాయంతో జరుగుతుందని బీజేపీ వ్యవహారాలను పరిశీలించే విశ్లేషకులు అంటున్నారు. ఇందులో ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. బీజేపీ నేతలందరూ కలిసి ఒక పేరును నిర్ణయిస్తారు. చివరిగా ఆర్ఎస్ఎస్ దాన్ని ఆమోదించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, కేసీఆర్ ఉన్నట్లుంది మోదీపై స్వరం ఎందుకు పెంచారు? కేసీఆర్ దిల్లీ కల ఫలిస్తుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)