కోబ్రా రివ్యూ: ఏడు గెటప్‌లు... విక్రమ్‌లోని ‘అపరిచితుడు’ ఇంకా బయటపడడం లేదా

ఫొటో సోర్స్, Twitter/ChiyaanVikram
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
`అపరిచితుడు` తర్వాత 'చియాన్' విక్రమ్ శైలి పూర్తిగా మారిపోయింది. కథలు ఎంచుకొనే విధానంలో మార్పు వచ్చింది. ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ కొత్త గెటప్‌లో కనిపించాలన్న తాపత్రయం కనిపిస్తోంది.
ఒక్కో సినిమాలో నాలుగైదు వేషాలతో మ్యాజిక్ చేయాలని చూడటం ఎక్కువైంది. కమల్ హాసన్ తర్వాత గెటప్‌లపై అంత మమకారం పెంచుకున్న నటుడు విక్రమే అనుకోవాలి.
అయితే, తెరపై ఎన్ని వేషాల్లో కనిపిస్తున్నా, విక్రమ్‌కి `అపరిచితుడు` తర్వాత సరైన హిట్టు పడలేదు.
ఈసారి `కోబ్రా` కోసం ఏడు అవతారాలు ఎత్తారు. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డారు. ప్రచార చిత్రాల్లో విక్రమ్ కష్టం స్పష్టంగా కనిపిస్తోంది.
మరి ఈ గెటప్‌లు విక్రమ్‌ని కాపాడాయా? ఎన్నాళ్ల నుంచో చియాన్ ఎదురు చూస్తున్న విజయం దక్కిందా? కోబ్రా కరుణించిందా? కాటేసిందా..?
మది (విక్రమ్) ఓ లెక్కల మాస్టారు. అంకెలతో ఆటాడుకుంటాడు. ఆశ్రమంలో పెరుగుతాడు. ఆశ్రమంలోని పిల్లలకు లెక్కల పాఠాలు నేర్పుతుంటాడు.
మరోవైపు కోబ్రా వరుస హత్యలు చేస్తూ పోలీసులకు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు సవాలు విసురుతుంటాడు.
తన ప్రతి అడుగులోనూ ఓ పజిల్ ఉంటుంది. మ్యాథ్స్‌ని ఉపయోగించి, ఆ సూత్రాలతో తెలివిగా ఎవరికీ దొరకకుండా హత్యలు చేస్తుంటాడు. ఈ కోబ్రా ఎవరు? కోబ్రాకీ మదికీ ఉన్న సంబంధం ఏమిటి? కోబ్రాని పట్టుకోవడానికి వచ్చిన ఇంటర్‌పోల్ ఆఫీసర్ (ఇర్ఫాన్ పఠాన్)కు ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో ఎలాంటి నిజాలు తెలిశాయి? ఇదంతా మిగిలిన కథ.

ఫొటో సోర్స్, SonyMusic/you tube
విక్రమ్‌కి గెటప్‌ల పిచ్చి. దానికి తగిన కథ ఇది. రకరకాల గెటప్పులు వేసే చాన్స్ ఈ కథలో దక్కింది.
ఒకట్రెండు గెటప్‌లలో విక్రమ్‌ని అస్సలు గుర్తు పట్టలేం. ప్రతి హత్యకూ ఓ గెటప్.. ఓ ప్లాన్. కథని చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు.
ఓ పజిల్‌ను సాల్వ్ చేస్తున్నట్టే ఆ సన్నివేశాలు ఉంటాయి. హత్యలు చేస్తోంది ఎవరో ముందే తెలిసిపోతుంది. కాబట్టి ఆ విషయంలో ఎలాంటి సస్పెన్స్ లేదు. కానీ ఆ హత్యలు ఎవరి కోసం, ఎందుకు? అనేదే పజిల్. పైగా ఇంటర్‌పోల్ ఆఫీసర్ (ఇర్ఫాన్ పఠాన్)కు ఎవరో అపరిచిత వ్యక్తి కొన్ని లీడ్స్ ఇస్తుంటాడు. ఆ వ్యక్తి ఎవరు? కోబ్రాని పట్టుకోవడానికి పోలీసులకు ఎందుకు సహకరిస్తున్నాడు? అనేది మరో ఆసక్తికరమైన అంశం. దాంతో ఈ చిక్కుముడుల చుట్టూ ప్రేక్షకుడు ప్రయాణిస్తుంటాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్టు కచ్చితంగా కిక్ ఇస్తుంది. సెకండాఫ్‌కి ఆ ట్విస్ట్ ఓ రహదారి వేసింది.
అయితే ద్వితీయార్థంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ కాస్తా ఫ్యామిలీ డ్రామాగా మారిపోతుంది.
సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్‌లో చూపించే కథ ఆసక్తికరంగానే ఉన్నా, నిడివి మరీ ఎక్కువైపోయి రాన్రాను ఆ ఆసక్తి తగ్గిపోతుంటుంది.
ఈ విషయంలో దర్శకుడు తప్పుమీద తప్పు చేసుకుంటూ వెళ్లాడు. దర్శకుడి ఆలోచనలు, తెలివితేటలు అమోఘం. ఇందులో డౌటే లేదు.
కానీ చాలా చోట్ల తన అతి తెలివి లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంటుంది. ప్రేక్షకుడికి సన్నివేశాన్ని చిక్కుముడిలా వేసి ఇవ్వడం వరకూ ఓకే. అయితే, ఆ చిక్కుముడి మరీ చిక్కులు పడిపోయి ప్రేక్షకుల్లో అసహనం రేకెత్తించకూడదు.
`కోబ్రా`లో ఉన్న ప్రధాన సమస్య ఇదే. చాలా సన్నివేశాలు గందరగోళంలో పడేస్తాయి. మధ్యలో మది (విక్రమ్) హలూసినేషన్ ఒకటి. రకరకాల పాత్రల్ని, మనుషుల్ని మది ఊహించుకోవడం... ఆ పాత్రలన్నీ తెరపై కనిపించడం.. ఆ డ్రామాతో ప్రేక్షకుడు మరింత అసహనానికి లోనవుతాడు.
ఈ కథలో ఎప్పుడు ఏం జరిగిందో, దానికి కారణమేమిటో విడమరచి చెప్పాలనే ప్రయత్నం చేసినా.. వాటిలోనే చాలా కన్ఫ్యూజన్ ఉంది. మది తాలుకూ ప్రవర్తన చివరి వరకూ అర్థం కాదు.
మనకు మనం వెదుక్కోలేని, దర్శకుడు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఇంకొన్ని ఈ కథలో మిగిలిపోయాయి.

ఫొటో సోర్స్, Shreyas media/fb
ఇంటర్‌పోల్ ఆఫీసర్ కూడా చేసేది ఏమీ ఉండదు. థ్రిల్లర్స్‌లో ట్విస్టుని రివీల్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. దాన్ని డైలాగ్ రూపంలో ఎప్పుడూ చెప్పకూడదు. ఆ సమస్యని ఎవరో సాల్వ్ చేసినట్టు చూపించాలి. కానీ, కోబ్రాలో అది జరగదు. ఈసినిమా నిండా గెటప్‌లు ఉంటాయి అని చిత్రబృందం ముందు నుంచీ ఊరిస్తూనే ఉంది.
అయితే తొలి నాలుగైదు సన్నివేశాలకే విక్రమ్ గెటప్‌లన్నీ అయిపోతాయి. అసలు ఈ సినిమాకి మ్యాథ్స్ నేపథ్యం, గెటప్పులు అవసరమా? అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.
అపరిచితుడులో ఓ కోర్ పాయింట్ ఉంటుంది. సమాజాన్ని ప్రశ్నిస్తాడు అపరిచితుడు. సినిమా చూస్తున్నప్పుడు, చూసి బయటకు వచ్చాక కూడా ఆ పాత్ర వెంటాడుతుంది.
కానీ...కోబ్రాలో అలాంటిది లేదు. కథానాయకుడి లక్ష్యం ఏమిటో అర్థం కాదు. ఈ హత్యలు చేయడం వెనుక బలమైన కారణమూ లేదు. కాకపోతే, విక్రమ్ అభిమానులకు నచ్చే సన్నివేశాలు కొన్ని ఈ సినిమాలో ఉన్నాయి. వాటిని విక్రమ్ ఫ్యాన్స్ ఆస్వాదిస్తారు.
విక్రమ్ వన్ మ్యాన్ షో ఈ సినిమా. ఈ వయసులోనూ ఆయన కష్టపడిన విధానం చూస్తే ముచ్చటేస్తుంది. గెటప్‌ల విషయంలో మేకప్ నిపుణుల్ని కూడా అభినందించాలి.
ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉన్నారు. వాళ్లలో నిధి శెట్టి పాత్రే కాస్త బలహీనంగా ఉంది. ఆ లవ్ ట్రాక్‌తో కొత్తగా వచ్చిన ప్రయోజనం లేదు.
జూడీ పాత్రని కూడా మ్యాథ్స్ జీనియస్‌గా చూపించారు. ఇంటర్ పోల్ ఆఫీసర్ కంటే జూడీ పాత్రే ఈ కేసుని సీరియస్‌గా స్టడీ చేసినట్టు అనిపిస్తుంది. విక్రమ్‌ను మినహాయిస్తే విలన్ సహా మిగిలిన పాత్రల్ని సరిగా ప్రజెంట్ చేయలేదు.

ఫొటో సోర్స్, Sony music/you tube
రెహమాన్ నుంచి ఓ మంచి పాట వచ్చి ఎంత కాలమైందో? ఆ ఎదురు చూపులు ఈ సినిమాకీ ఫలించలేదు.
ఈ సినిమాలో పాటలు స్పీడు బ్రేకర్లలా మారిపోయాయి. నేపథ్య సంగీతంలో మాత్రం రెహమాన్ మార్క్ కనిపిస్తుంది.
సినిమా చాలా రిచ్‌గా ఉంది. ఫారిన్ లొకేషన్లలో చాలా లావీష్‌గా ఈ సినిమాని తీశారు. చేపల మార్కెట్ యాక్షన్ సీన్ దాదాపు అరగంట సాగుతుంది.
ఇలాంటి చోట.. దర్శకుడు నిడివి గురించి ఆలోచించుకోవాల్సింది. తొలిసగం పాసైపోతుంది.
ద్వితీయార్థం అంతు చిక్కని పజిల్‌లా మారిపోతుంది. విక్రమ్ నుంచి గత ఆరేడేళ్లుగా సరైన సినిమా రాలేదు. ఆ సినిమాలతో పోలిస్తే కోబ్రా బెటరే. కాకపోతే, విక్రమ్ అభిమానులకు సైతం పూర్తి స్థాయి సంతృప్తి ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి:
- ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి, అసలేం జరిగింది?
- భారత్ ఉత్పత్తులపై నిషేధాన్ని పాకిస్తాన్ ఎత్తివేయక తప్పదా?
- మిఖాయిల్ గోర్బచెవ్: సోవియెట్ యూనియన్ చివరి అధినేత మృతి
- అమెరికా డ్రోన్లు పాకిస్తాన్ గగనతలం నుంచి అఫ్గానిస్తాన్‌లోకి ప్రవేశిస్తున్నాయా?
- గోర్బచెవ్ కథ ఎలా ముగిసింది, అమెరికాను సవాలు చేసిన అత్యంత శక్తిమంతమైన దేశం ఎలా పతనమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













