మిఖాయిల్ గోర్బచెవ్: సోవియెట్ యూనియన్ చివరి అధినేత మృతి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మ్యాట్ మర్ఫీ, రాబర్ట్ గ్రీనాల్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రచ్ఛన్న యుద్ధానికి శాంతియుత ముగింపు పలికిన సోవియెట్ నాయకుడు మిఖాయిల్ గోర్బచెవ్ మంగళవారం మృతి చెందారు. ఆయనకు 91 ఏళ్ళు.
గోర్బచెవ్ 1985లో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (యూఎస్‌ఎస్‌ఆర్) అధికార పగ్గాలను చేపట్టారు. ప్రపంచానికి సోవియట్ యూనియన్ ద్వారాలు తెరిచారు. దేశంలో అనేక సంస్కరణలను ప్రవేశ పెట్టారు.
కానీ, సోవియెట్ యూనియన్ పతనాన్ని మాత్రం ఆపలేకపోయారు. సోవియెట్ పతనం తర్వాత రష్యా ఏర్పడింది.
మిఖాయిల్ గోర్బచెవ్ మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
"చరిత్ర గమనాన్ని మార్చారు" అని యూఎన్ అధినేత ఆంటోనియో గూటియెరెజ్ అన్నారు.
గోర్బచెవ్ మృతికి నివాళులు సమర్పిస్తూ, "గోర్బచెవ్ విలక్షణమైన రాజకీయ నాయకుడు" అని ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
"ప్రపంచం అంతర్జాతీయ నాయకుడిని, శాంతి స్థాపనకు అలుపెరగని ప్రచారకుడు, విభిన్న దేశాలను ఒకే తాటి పై నడిపించగలిగే నాయకుడిని కోల్పోయింది."
ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో ఆయన తరచుగా ఆస్పత్రి పాలవుతున్నారు.
జూన్‌లో కిడ్నీ సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు అంతర్జాతీయ మీడియా ప్రచురించింది. అయితే, ప్రస్తుతం ఆయన మరణానికి కారణాన్ని మాత్రం వెల్లడి చేయలేదు.
గోర్బచెవ్ మృతి పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం వ్యక్తం చేసినట్లు పుతిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోప్ రష్యన్ వార్తా సంస్థ ఇంటర్ ఫ్యాక్స్ కు తెలిపినట్లు రాయిటర్స్‌కు తెలిపింది.
"స్వేచ్చాయుత యూరప్‌కు దారి తెరిచిన నమ్మశక్యమైన, గౌరవప్రదమైన నాయకుడు" అని అంటూ యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఉర్సులా ఒన్‌డెర్ లేయెన్ అన్నారు.
"గోర్బచెవ్ మిగిల్చిన వారసత్వాన్ని ఎవరూ మర్చిపోరు" అని ఆమె అన్నారు.
"గోర్బచెవ్ ప్రదర్శించిన ధైర్యం, నిబద్ధత ప్రశంసనీయం" అని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.
"సోవియెట్ సమాజాన్ని ప్రపంచానికి తెరిచేందుకు గోర్బచెవ్ ప్రదర్శించిన అలుపెరుగని నిబద్ధత మనందరికీ ఒక ఉదాహరణనగా నిలుస్తోంది" అని అన్నారు.
గోర్బచెవ్ 54 ఏళ్ల వయసులో సోవియెట్ కమ్యూనిస్ట్ పార్టీకి జనరల్ సెక్రెటరీ అయ్యారు. అప్పటి నుంచే ఆయన దేశానికి డిఫ్యాక్టో నాయకునిగా వ్యవహరించేవారు. అప్పటికి ఆయన పాలక మండలిలో అత్యంత చిన్న వయసున్న వ్యక్తి. అప్పటి వరకు వృద్ధులతో నిండిపోయిన పాలకమండలిలోకి గోర్బచెవ్ ప్రవేశం కొత్త ఊపిరిని తీసుకొచ్చింది.
గోర్బచెవ్ అమలు చేసిన గ్లాస్‌నోస్త్ విధానం ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అనుమతించింది. అంతకు ముందు రష్యాలో ప్రభుత్వాన్ని విమర్శించడం ఊహించడానికి కూడా కష్టం.
కానీ, ఇదే విధానం దేశంలో చాలా ప్రాంతాల్లో జాతీయవాదానికి తెరలేపి యూఎస్‌ఎస్‌ఆర్ పతనానికి దారి తీసింది.
గోర్బచెవ్ అమెరికాతో ఆయుధ నియంత్రణ ఒప్పందాలను కూడా చేసుకున్నారు. తూర్పు యూరోపియన్ దేశాలు కమ్యూనిస్ట్ పాలకులకు వ్యతిరేకంగా గొంతు విప్పినప్పుడు వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
గోర్బచెవ్‌ను 1991లో ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికే పరిస్థితులను సృష్టించిన నాయకునిగా పశ్చిమ దేశాల్లో సంస్కరణలకు రూపకర్తగా చూస్తారు. సోవియట్ యూనియన్ నేతృత్వంలోని కమ్యూనిస్టు దేశాలకు, అమెరికా, పాశ్చాత్య దేశాలకు మధ్య ఒకప్పుడు తీవ్రమైన ఘర్షణ జరిగేది.
తూర్పు- పశ్చిమ దేశాల మధ్య సంబంధాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినందుకు గాను గోర్బచెవ్‌కు 1990లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
1991లో రష్యా ఆవిర్భావం తర్వాత రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుని విద్య, మానవత్వానికి సంబంధించిన ప్రాజెక్టుల పై దృష్టి పెట్టారు.
1996లో ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టాలని ప్రయత్నించి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకు కేవలం 0.5% ఓట్లు మాత్రమే వచ్చాయి.
గోర్బచెవ్ మిగిల్చిన రాజకీయ వారసత్వం ఆయన మరణం తర్వాత వెల్లువెత్తుతున్న సంతాప సందేశాల్లో ప్రతిబింబిస్తోంది.
"మిఖాయిల్ గోర్బచెవ్ యూఎస్‌ఎస్‌ఆర్‌ను ప్రజాస్వామ్యం వైపు నడిపించిన వ్యక్తి. కానీ, యూఎస్‌ఎస్‌ఆర్ పతనం తర్వాత దేశంలో ఏర్పడిన కల్లోలానికి మాత్రం రష్యన్ ప్రజలు ఆయనను ఎన్నటికీ క్షమించలేకపోయారు" అని జర్మనీ విలీనం గురించి గోర్బచెవ్ ప్రభుత్వానితో చర్చలు జరిపిన జేమ్స్ బేకర్ అన్నారు.
గోర్బచెవ్ సోవియెట్ యూనియన్‌ను ఉద్దేశ్యపూర్వకంగానే పతనం చేశారని ఆయనొక మోసగాడని రష్యా ఆక్రమిత యుక్రెయిన్‌లో రష్యన్ అధికారిగా నియమితులైన వ్లాదిమిర్ రోగోవ్ అన్నారు.
గోర్బచెవ్‌ను మాస్కోలోని నోవోదెవీచీ స్మశానంలో ఆయన భార్య సమాధి పక్కనే సమాధి చేస్తారని టాస్ వార్తా సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఒక ఆదివాసీ తెగకు చెందిన ఆఖరి మనిషి... గత 26 ఏళ్ళు ఒంటరిగా బతికి చనిపోయాడు
- హార్దిక్ పాండ్యా స్టయిలే వేరు... జీవితాన్ని రాజాలా జీవించాలంటాడు
- భారత్‌లో చరిత్ర సృష్టించిన అయిదు బ్రాండ్లు... ఇవి కోట్లాది ప్రజలను ఎలా ఆకట్టుకున్నాయి?
- ‘కావాలంటే మమ్మల్ని చంపేయండి... అంతేకానీ, ఆ నరకంలోకి మాత్రం పంపించొద్దు’
- స్పెయిన్‌లో తీవ్ర కరవు.. ఆలివ్ ఆయిల్ ధరలు ఇంకా పెరుగుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












