ఒక ఆదివాసీ తెగకు చెందిన ఆఖరి మనిషి... గత 26 ఏళ్ళు ఒంటరిగా బతికి చనిపోయాడు

"మ్యాన్ ఆఫ్ ది హోల్"

ఫొటో సోర్స్, VINCENT CARELLI/CORUMBIARA

    • రచయిత, వనేసా బూషల్టర్
    • హోదా, బీబీసీ న్యూస్

ఈ అడవిలో కొన్నేళ్లుగా ఆయనొక్కరే నివసిస్తున్నారు. ఆయనకు బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు. బ్రెజిల్ లోని ఒక ఆదివాసీ తెగకు చెందిన ఆఖరి వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు.

పేరు తెలియని ఈ వ్యక్తి గత 26 ఏళ్ళుగా ఒంటరిగానే ఉంటున్నారు.

అడవిలో లోతైన గోతులు తవ్వడం వల్ల ఆయనను 'మ్యాన్ ఆఫ్ ది హోల్' అని పిలుస్తారు. ఈ గోతులను అడవిలో జంతువులను బంధించేందుకు వాడేవారు. కొన్నిటిని ఆయన రక్షణ కోసం తవ్వుకున్నట్లుగా కనిపిస్తున్నాయి.

ఆగస్టు 23న ఆయన నివాసం ఉండే గడ్డి పాక ముందు ఆకులు, పక్షి ఈకలతో కప్పిన మృత దేహం కనిపించింది.

రొండోనియా రాష్ట్రంలోని ఉన్న తనారు తెగలు నివసించే ప్రాంతంలో నివాసమున్న ఈ వ్యక్తి ఈ తెగకు చెందిన ఆఖరు మనిషి అని చెబుతున్నారు.

ఈ జాతిలో చాలా మంది 1970ల మొదట్లోనే భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన పశువుల కాపర్ల చేతిలో మరణించారు. ఈ జాతిలో మిగిలిన ఆరుగురు గిరిజనులు 1995లో అక్రమ గనుల తవ్వకాలు చేసే వారి చేతుల్లో మరణించారు. వీరందరి మరణం తర్వాత ఈ జాతికి చెందిన 'మ్యాన్ ఆఫ్ ది హోల్' ఒక్కరే మిగిలిపోయారు.

ఈయన బ్రతికి ఉన్నట్లు బ్రెజిల్ ఇండైజినెస్ అఫైర్స్ ఏజెన్సీ (ఫునాయి)కు 1996లో తెలిసింది. అప్పటి నుంచి ఈయన రక్షణ కోసం ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తోంది.

ఫునాయి ఉద్యోగి ఈ ప్రాంతంలో రోజువారీ గస్తీ నిర్వహిస్తుండగా గడ్డి పాక ముందు మకావ్ పక్షి రెక్కలతో కప్పిన మృతదేహం కనిపించింది.

గడ్డి పాక

ఫొటో సోర్స్, J PESSOA/SURVIVAL INTERNATIONAL

"తనకు మరణం దగ్గరపడుతుందనే స్పృహతోనే ఆయన ముందుగానే తన ఒంటి పై ఈ పక్షి ఈకలను కప్పుకుని ఉండవచ్చు" అని ఆదివాసీ నిపుణులు మార్సెలో డోస్ సాంటోస్ స్థానిక మీడియాకు తెలిపారు.

"ఆయన మరణం కోసం ఎదురు చూశారు. ఆయన హింసకు గురైన జాడలేవీ లేవు. ఈయన చనిపోయి 40-50 రోజులు అయి ఉండవచ్చు" అని ఆయన అన్నారు.

ఆయన నివాసం ఉండే ప్రాంతంలోకి ఇతరులెవరూ ప్రవేశించినట్లు, లేదా ఆయన గుడిసెలో వస్తువులను చెల్లా చెదురు చేసినట్లు కానీ ఆనవాళ్లు లేవని అధికారులు చెప్పారు.

ఒకవేళ ఏదైనా రోగం బారిన పడి మరణించారేమో తెలుసుకునేందుకు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు.

బయటి ప్రపంచంతో ఆయనకు ఎటువంటి సంబంధాలు లేకపోవడంతో ఆయన ఏ భాష మాట్లాడేవారో, ఏ తెగకు చెందిన వారో కూడా తెలియదు.

2018లో ఫునాయి సిబ్బంది ఆయన అడవిలో సంచరిస్తుండగా చిత్రించగలిగారు. ఆ వీడియోలో ఆయన గొడ్డలిలా కనిపిస్తున్న ఆయుధంతో చెట్టును కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

"మ్యాన్ ఆఫ్ ది హోల్"

ఫొటో సోర్స్, FUNAI

అప్పటి నుంచి ఆయన తిరిగి ఎవరికీ కనిపించలేదు. కానీ, ఫునాయి సిబ్బంది ఆయన నివాసముండే గుడిసె, తవ్విన గోతులను మాత్రం చూస్తూ ఉండేవారు.

కొన్ని గోతుల్లో అడుగున పదునైన ఆయుధాలు ఉన్నాయి. వీటిని వేటాడిన అడవి ఎలుగుబంట్లు లాంటి వాటిని బంధించేందుకు వాడి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈయన ఇప్పటి వరకు కనీసం 50కు పైగా గుడిసెలను నిర్మించినట్లు ఫునాయి ఉద్యోగి చెబుతున్నారు. వీటిలో 10 అడుగుల లోతైన గోతులు కూడా ఉండేవని చెప్పారు.

స్వీయ రక్షణ కోసం కూడా ఈ గోతులను వాడి ఉంటారని కొంత మంది భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, J PESSOA/SURVIVAL INTERNATIONAL

ఈ ఆదివాసీకి గోతులతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఉండి ఉండవచ్చని ఫునాయి ఉద్యోగి భావిస్తున్నారు. కానీ, స్వీయ రక్షణ కోసం కూడా ఈ గోతులను వాడి ఉంటారని కొంత మంది భావిస్తున్నారు.

ఈ ప్రాంతంలో జొన్న, కర్ర పెండలం లాంటివి పండించినట్లు కూడా ఆధారాలున్నాయి. తేనె, బొప్పాయి, అరటిపళ్ళు లాంటి వాటిని సేకరించేవారని తెలుస్తోంది.

బ్రెజిల్ రాజ్యాంగం ప్రకారం ఆదివాసీలకు తమ వారసత్వ, నివాస భూమి పై హక్కులు ఉంటాయి. తనారు ఆదివాసీ ప్రాంతంలోకి ఇతరులు ప్రవేశించకుండా 1998 నుంచి నియంత్రణలు విధించారు.

8070 హెక్టార్ల విస్తీర్ణానికి అవతల ఉన్న ప్రాంతాన్ని వ్యవసాయం కోసం వినియోగించేవారు. గతంలో ఈ ఆదివాసీ ప్రాంతంలోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించడం పట్ల భూస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ్యాన్ ఆఫ్ ది హోల్‌కి ముప్పు వాటిల్లకుండా ఫునాయి ఏజెంట్లు చేసిన ప్రయత్నాలలో భాగంగా 2009లో ఫునాయి స్థావరం ధ్వంసం కూడా అయింది. ఈ విధ్వంసానికి గుర్తుగా ఇక్కడ బుల్లెట్ల జాడలు మిగిలిపోయాయి.

వీడియో క్యాప్షన్, అమెజాన్ ఆదివాసీ తెగ: వీరి జనాభా 120 మాత్రమే

ఈ ప్రాంతం పై విధించిన నియంత్రణలను కొన్నేళ్ళకొకసారి పునరుద్ధరిస్తూ ఉండాలి. ఈ నియంత్రణలను ఆమోదించేందుకు ఆదివాసీ తెగకు చెందిన సభ్యుల సమక్షం కూడా అవసరం.

మ్యాన్ ఆఫ్ ది హోల్ మరణంతో ఆదివాసీ హక్కుల సంఘాలు తనారు రిజర్వ్ ప్రాంతానికి శాశ్వత రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

బ్రెజిల్ లో సుమారు 240 రకాల ఆదివాసీ తెగలున్నాయి. వీరిలో చాలా మంది అక్రమ గనుల తవ్వకందారులు, అడవులను నరికేవారు,

వ్యవసాయదారుల ఆక్రమణ వల్ల ముప్పు పొంచి ఉందని సర్వైవల్ ఇంటర్నేషనల్ హెచ్చరిస్తోంది. సర్వైవల్ ఇంటర్నేషనల్ ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతోంది.

ఇటీవల గ్లాస్గోలో జరిగిన సీఓపీ-26 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న ముప్పు గురించి మాట్లాడిన హక్కుల ప్రచారకర్త సాయి సురుయ్ చేసిన ప్రసంగానికి గాను ఆమెను చంపేస్తామని బెదిరింపులు ఎదుర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)