మన పూర్వీకులు 70 లక్షల సంవత్సరాల క్రితమే నిటారుగా నడవడం మొదలుపెట్టారు - తాజా అధ్యయనంలో వెల్లడి

పరిణామక్రమం

ఫొటో సోర్స్, COURTESY FRANK GUY

మన పూర్వీకులు నాలుగు కాళ్లపై నడిచారు. అయితే, ఇప్పటివరకు మనకు తెలిసిన అత్యంత పురాతన జాతి సుమారు 70 లక్షల సంవత్సరాల కిందటే రెండు కాళ్లపై నడిచిందని కొత్త అధ్యయనం చెబుతోంది.

20 ఏళ్ల క్రితం మధ్య ఆఫ్రికాలోని చాడ్‌లో లభ్యమైన ఎముకల అవశేషాలపై ఇటీవల జరిపిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది.

ఈ అవశేషాలు 60-70 లక్షల సంవత్సరాల క్రితం జీవించిన 'సహెలాంత్రపస్ ట్చెడెన్సిస్' అనే హోమినిడ్ సమూహానికి చెందినవని పరిశోధకులు చెబుతున్నారు. హోమినిడ్ అంటే మానవులను, వారి పూర్వీకుల అవశేషాలను, కొన్ని ఏప్స్‌ను కలుపుకున్న సమూహం.

హోమినిన్ పరంపరకు చెందిన అత్యంత పురాతన సమూహం ఈ సహెలాంత్రపస్ ట్చెడెన్సిస్. హోమినిన్ అనేది మానవులు, చింపాజీలకు ఉన్న ఉమ్మడి పూర్వీకుల నుంచి ఆధునిక మానవుల వరకు విస్తరించిన పరిణామ శాఖ.

2002లో పుర్రె భాగంపై పరిశోధన జరిపారు. దీని యజమానికి 'టౌమై' అని నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. అంటే చాడియన్ భాషలో 'జీవితం మీదున్న ఆశ' అని అర్థం.

తాజాగా, తొడ ఎముక సహా మిగతా ఎముకలపై అధ్యయనం చేశాక, ఫలితాలను 'నేచర్' జర్నల్‌లో ప్రచురించారు. సహెలాంత్రపస్ ట్చెడెన్సిస్ జాతి రెండు కాళ్లపై నడిచిందా, లేదా అన్న దానిపై ఎన్నో సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది.

దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసిందీ కొత్త అధ్యయనం.

పుర్రె

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్, పుర్రె

అవశేషాలు ఎప్పుడు దొరికాయి?

ఫ్రాన్స్, చాడ్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 2001 జులైలో ఆఫ్రికా దేశానికి ఉత్తరాన ఉన్న జౌరాబ్ ఎడారిలో జరిపిన తవ్వకాల్లో ఈ ఎముకలు బయటపడ్డాయి.

2002లో పుర్రెపై తొలి అధ్యయనం జరిపినప్పుడు, ఫ్రాన్స్‌లోని పోయిటీర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పాలియోఆంత్రోపాలజిస్ట్ మిచెల్ బ్రూనెట్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైన విషయాలను కనుగొన్నారు.

టౌమై పుర్రె, చింపాజీ పుర్రె పరిమాణంలో చిన్నదిగా ఉన్నా, హోమినిన్ జాతి లక్షణాలు పోలిన ముఖం, దంతాలు దానికి ఉన్నాయని కనుగొన్నారు.

అలాగే, పుర్రెకు దిగువ భాగాన ఉన్న గుంత బట్టి టౌమై నిటారుగా నడిచి ఉంటుందని భావిస్తున్నారు.

2001 తవ్వకాల్లో పరిశోధకులు వందలకొద్దీ అవశేషాలను కనుగొన్నారు. ఎడమ తొడ ఎముకలో కొంత భాగం, ఎడమ, కుడి మోచేతుల ఎముకలపై తాజా పరిశోధన జరిపామని శాస్త్రవేత్తలు తెలిపారు.

2004లో తొడ ఎముకపై పోయిటియర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి ఆడే బెర్గెరెట్-మదీనా కొంత పరిశోధన జరిపారు.

ఈ ఎముక సహెలాంత్రపస్ ట్చెడెన్సిస్ జాతికి చెంది ఉంటుందని బెర్గెరెట్-మదీనా సూపర్వైజర్, పాలియోఆంత్రోపాలజిస్ట్ అయిన రాబర్టో మాకియారెల్లి అప్పట్లో భావించారు.

అయితే, ఆ తొడ ఎముక, మోచేతి ఎముకలు, పుర్రె ఒకే జీవికి చెందినవని అప్పటికి నిరూపణ కాలేదు.

కాగా, చాడ్‌లో దొరికిన ఇతర అవశేషాలపై పరిశోధన చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది?

2017 వరకు మిగతా భాగాల అధ్యయనం ఊపందుకోలేదు.

"అది మా ప్రాధాన్యాలలో లేదు" అని పోయిటీర్స్‌కు చెందిన పాలియోఆంత్రోపాలజిస్ట్ ఫ్రాంక్ గై అన్నారని నేచర్ జర్నల్ తెలిపింది. తాజ అధ్యయనం గై నేతృత్వంలోనే జరిగింది.

"మిగతా అవశేషాలపై పరిశోధన మందగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. మిగతా ఎముకలను కనుగొనడానికి, ఇతర పనులకు సమయం కేటాయించాం. వీటిని విశ్లేషించడానికి మరికొన్ని ఆధారాలు, విశ్లేషణలు కావలసి వచ్చింది. అందుకే పరిశోధన ఆలస్యమైంది. 2017లో వీటిపై పరిశోధన తిరిగి ప్రారంభించిన తరువాత, పూర్తవడానికి అయిదేళ్లు పట్టింది" అని అధ్యయన పరిశోధకులు 'ది కాన్వర్జేషన్' పత్రికకు రాసిన వ్యాసంలో వివరించారు.

టౌమై

ఫొటో సోర్స్, CHRISTIAN JEGOU / SCIENCE PHOTO LIBRARY

టౌమై నిటారుగా నడించిందన్న దానికి ఆధారాలేంటి?

ఈ అధ్యయనానికి ముందు, మనకు తెలిసిన అత్యంత పురాతనమైన, రెండు కాళ్లపై నడిచిన హోమినిడ్ 'ఒర్రోరిన్ టుగెనెన్సిస్'. 60 లక్షల సంవత్సరాల క్రితం జీవించిన ఈ జీవి అవశేషాలు కెన్యాలో దొరికాయి.

అయితే, టౌమై తొడ ఎముక, మోచేతి ఎముకలు పరిశీలిస్తే అది నిటారుగా నడిచినట్టు తెలుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ ఎముకలను, ఇతర మానవ పూర్వీకుల అవశేషాలతో పోల్చి చూశారు.

"ఈ పొడవాటి ఎముకలను ఎక్కువకాలం దాచి ఉంచడం మంచిది కాదు. అది సరైన ఫలితాలనివ్వదు. అందుకని, వాటిని అన్ని కోణాల నుంచి పరిశోధించాం" అని పరిశోధకులు చెప్పారు.

టౌమై ఎముకలను, ఇతర నమూనాలు, అవశేషాలతో పోల్చి చూడడానికి శాస్త్రవేత్తలు 20 కంటే ఎక్కువ ప్రమాణాలను ఉపయోగించారు.

వీటన్నిటి తరువాత, టౌమై నిటారుగా నడిచిందని, సహెలాంత్రపస్ ట్చెడెన్సిస్ జాతికి అలా నడిచే లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు తేల్చారు.

టౌమై తొడ ఎముక లక్షణాలు ఏప్స్ కన్నా, మానవులకు దగ్గరగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు.

2002లో టౌమా పుర్రెపై అధ్యయనం చేసిన పరిశోధకుల్లో ఒకరైన స్పానిష్ శాస్త్రవేత్త పాబ్లో పెలేజ్-కాంపోమాన్స్, మాడ్రిడ్‌లోని మ్యూజియం ఆఫ్ నేచురల్ సైన్సెస్‌లో పరిశోధకుడు.

"తొడ ఎముక గట్టిదనం, దాని లోపలి భాగాలు, కండరాల శ్రేణి, కదలికల బట్టి టౌమై నిటారుగా రెండు కళ్లపై నడిచి ఉండవచ్చని భావిస్తున్నాం" అన్నారు కాంపోమాన్స్.

"అయితే, మోచేతి ఎముకలు మాత్రం రెండు కాళ్ల లక్షణాలను చూపట్లేదు. బహుశా, వృక్షాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలకు (అంటే చెట్ల పైకి ఎక్కే అలవాటు) అనుగుణంగా తమ చేతి నిర్మాణాన్ని మార్చుకున్న జాతికి చెందినది అయి ఉండవచ్చు. ఈ రెండు ఎముకలు, పుర్రె మీద చేసిన పరిశోధన కలిపి చూస్తే, ఇది రెండు కాళ్లపై నడిచిన జీవి అని, వృక్షాలకు సంబంధించిన అలవాట్లను పోగోట్టుకోలేదని తేలింది" అని కాంపోమాన్స్ వివరించారు.

అంటే, సహెలాంత్రపస్ జీవులు నేలపై రెండు కాళ్లతో నడుస్తూ, సులువుగా చెట్లు కూడా ఎక్కగలవు.

"నేలపై ఉన్నప్పుడు రెండు కాళ్లతో నడవడానికే మొగ్గుచూపవచ్చు. కానీ, కొన్నిసార్లు చెట్లు ఎక్కడానికి ఇష్టపడి ఉండవచ్చు. లక్షణాలు అన్నీ చూస్తే ఈ ప్రవర్తన కనిపిస్తోంది" అని ఫ్రాన్ గై చెప్పారు.

హోమినిడ్‌కు ఉపకుటుంబంగా చెప్పే హోమినిన్స్‌లో భాగంగా సహెలాంత్రపస్ జాతి ఏర్పడి ఉంటుందని కాంపోమాన్స్ సూచించారు.

"సులువుగా చెప్పాలంటే, ఈ అధ్యయనం ప్రకారం, సహేలంత్రోపస్ ట్చెడెన్సిస్ జాతి హోమినిన్‌ల మొదటి తరం ప్రతినిధి కావచ్చు" అన్నారు కాంపోమాన్స్.

సహేలంత్రోపస్ ట్చాడెన్సిస్

ఫొటో సోర్స్, FRANCK GUY/PALEVOPRIM/CNRS - UNIVERSITY OF POITIER

ఫొటో క్యాప్షన్, 2001లో కనుగొన్న సహేలంత్రోపస్ ట్చాడెన్సిస్ తొడ ఎముక (ఎడమ), మోచేతి ఎముక.. రెండు కోణాల నుంచి

అధ్యయన ఫలితాలపై భిన్నాభిప్రాయాలు ఎందుకు వినిపిస్తున్నాయి?

"సహెలాంత్రపస్ తొడ ఎముక.. నాలుగు కాళ్లపై నడిచే ఏప్ కన్నా రెండు కాళ్లపై నడిచే హోమినిన్‌కు దగ్గరగా ఉంది" అని హార్వర్డ్ యూనివర్శిటీలోని పాలియోఆంత్రోపాలజిస్ట్ డేనియల్ లైబర్‌మాన్ అన్నారు.

అయితే, 2020లో ఆడే బెర్గెరెట్-మదీనా, రాబర్టో మాకియారెల్లి.. కొలతలు, ఛాయాచిత్రాల ఆధారంగా ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. దీనిలో ఈ తొడ ఎముక యజమాని నిటారుగా నడవలేదని వారు వాదించారు.

నేచర్‌లో వచ్చిన ఒక కథనం ప్రకారం, టౌమై నిటారుగా నడిచిందన్న వాదనతో మాకియారెల్లి ఏకీభవించట్లేదు.

ఎన్నో ఏళ్లుగా ఈ అవశేషాలు భూమిలో కలిసిపోయి ఉండడం వల్ల కుంచించుకుపోయి ఉండవచ్చు. అందువల్ల తొడ ఎముక లక్షణాలు రెండు కాళ్లతో నడిచే జీవిని పోలి ఉన్నాయని అధ్యయనంలో తేలి ఉండవచ్చని మాకియారెల్లి అభిప్రాయపడ్డారు.

లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన ఫ్రెడ్ స్పూర్ న్యూ సైంటిస్ట్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ, సహెలాంత్రపస్ రెండు కాళ్లపై నడిచిందని చెప్పడానికి కొత్త అధ్యయనం సహాయపడుతుంది కానీ, అదే తుది నిర్ణయం కాదని, దీనిపై చర్చ కొనసాగాలని అన్నారు.

"రాబోయే రోజుల్లో స్వతంత్ర పాలియోఆంత్రోపాలజిస్టుల బృందాలు ఈ ఎముకలపై అధ్యయనం చేయడం చాలా అవసరమని" న్యూయార్క్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కు చెందిన కెల్సీ పగ్ అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, ఈ దేశాన్ని సముద్రం మింగేస్తోంది.. ఎక్కడికి వెళ్లాలో తేల్చుకోని ప్రజలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)