ఈజిప్టు మమ్మీలకన్నా పురాతనమైన చించోరో మమ్మీలు... అక్కడ పునాదుల కోసం తవ్వుతుంటే బయటపడుతుంటాయి

చిలీలో చించోరో మమ్మీలు

ఫొటో సోర్స్, Sergio Donoso/EyeEm/Getty Images

చిలీలోని అటకామా ఎడారి.. భూమి మీద అత్యంత పొడి ప్రదేశం. ఇక్కడ కొన్ని మమ్మీలను కనుగొన్నారు. అవి ఈజిప్టు మమ్మీల కన్నా 2,000 ఏళ్ల పురాతనమైన మమ్మీలు.

అంటే.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈజిప్టు మమ్మీలకన్నా ప్రాచీన మమ్మీలు చిలీ ఎడారిలో ఉన్నాయి.

''చిలీ ఉత్తర ప్రాంతంలో, పెరూ దక్షిణ ప్రాంతంలో నివసించిన తొట్టతొలి మానవులు చించోరో ప్రజలు'' అని బెర్నార్డో అరియాజా చెప్పారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ టారాపాకాలో ఫిజికల్ ఆంత్రోపాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

''అటకామా ఎడారిలో ఆది మానవులు వాళ్లు. మనకు తెలిసినంత వరకూ.. చనిపోయిన తమ వారిని మమ్మీలుగా మార్చి భద్రం చేసే సంస్కృతి ఉన్న తొలి సముదాయం కూడా వీరే. సాధారణ శకానికి పూర్వం (BCE - బిఫోర్ కామన్ ఎరా) 5,000 సంవత్సరాల నాటికే వీరు ఆ పని చేసేవారు'' అని ఆయన పేర్కొన్నారు.

ఆరు లేదా ఏడు సంవత్సరాల వయసున్న బాలుడి మమ్మీ

ఫొటో సోర్స్, COURTESY UNIVERSITY OF TARAPACÁ

ఫొటో క్యాప్షన్, ఆరు లేదా ఏడు సంవత్సరాల వయసున్న బాలుడి మమ్మీ

అటకామా పసిఫిక్ సముద్ర తీరంలో నివసించిన చించోరో ప్రజలు.. సముద్ర జీవులను వేటాడుతూ, ఆహారం సేకరిస్తూ జీవించేవారు. ఈ సముదాయానికి చెందిన భద్రపరచిన మృతదేహాలు - అంటే మమ్మీలు ఆరికా, పిరనకోటా ప్రాంతాల్లో వెలుగు చూశాయి. ఈ మమ్మీలు.. సుమారుగా బీసీఈ 5450 నుంచి బీసీఈ 890 సంవత్సరం వరకూ చెందినవిగా గుర్తించారు.

ఈ శ్మశాన వాటికలకు అత్యంత పురాతవ్వకాల విలువ ఉండటంతో.. వీటిని 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చారు.

ఈ శ్మశాన వాటికలు చించోరోల ప్రాచీన సంస్కృతిలో అనుసరించే మరణానంతర, అంత్యక్రియల విధివిధాలను సవివరంగా వెల్లడించటంతో పాటు.. ఆ సముదాయపు సామాజిక, ఆధ్యాత్మిక నిర్మాణాల గురించి కూడా చాలా విషయాలను చాటిచెప్తున్నాయి.

ఉదాహరణకు.. వీరి సంస్కృతిలో మృతులను మమ్మీలుగా మలచి భద్రపరచటం సమాజంలోని ఉన్నతస్థాయి వర్గానికి మాత్రమే పరిమితం కాదు. అది ప్రజలందరి ఆచారంగా ఉండేది. ఈజిప్షియన్లలో కేవలం ఉన్నతవర్గం వారిలోనే మృతులను మమ్మీలుగా చేసేవారు.

చించోరో మమ్మీ

ఫొటో సోర్స్, COURTESY UNIVERSITY OF TARAPACÁ

''చించోరో సంస్కృతిలో చాలా విశేషాలున్నాయి. ఈ ప్రాంతంలో అంత్యక్రియల ఆచారాన్ని పాటించిన తొలి ప్రజలు వీరు. ఇప్పుడు మనకు తెలిసిన చిచిరోల శరీరాలు.. హిస్పానిక్‌ కన్నా నిజంగా ప్రాచీనమైన కళాకృతులు. ఆ ప్రాచీన ప్రజల భావాలు, భావోద్వేగాలకు కళాత్మక వ్యక్తీకరణ'' అని అరియాజా వివరించారు.

ఈ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు ఇటీవలే వచ్చినప్పటికీ.. ఆరికా ప్రాంత నివాసులకు ఇక్కడి విశిష్టమైన పురా శిథిలాలు, మమ్మీలు చాలా కాలంగా తెలుసు. ఎందుకంటే.. ఆ మమ్మీలు భూమి పైన చాలా తక్కువ లోతులోనే పాతిపెట్టి ఉన్నాయి.

నిజానికి.. ఈ మమ్మీలు ఈ పట్టణపు పునాదుల్లో నిజంగానే భాగంగా ఉన్నాయి. ఉదాహరణకు.. అరికాలో అరవై ఏళ్లుగా నివసిస్తున్న జానీ వాస్క్వెజ్‌కు.. తను నివసించే ప్రాంతంలో మురుగునీటి పైపుల కోసం తొలిసారి తవ్వకాలు జరిపినప్పటి సంగతులు ఇంకా గుర్తున్నాయి. ఆ తవ్వకాల్లో.. ''పొరలు పొరలుగా ఉన్న మమ్మీలు బయటపడ్డాయి'' అని ఆయన చెప్పారు.

అలాగే 2004లో ఒక హోటల్ నిర్మాణం కోసం కార్మికులు పునాదులు తవ్వటం మొదలు పెట్టినపుడు.. ఒక మీటరు కూడా తవ్వకముందే మనుషుల ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఆ ప్రాంతాన్ని మ్యూజియంగా మార్చారు.

చించోరోలు పెద్దవాళ్లతో పాటు శిశువులు, చిన్నారుల మృతదేహాలను కూడా మమ్మీలుగా భద్రపరిచారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చించోరోలు పెద్దవాళ్లతో పాటు శిశువులు, చిన్నారుల మృతదేహాలను కూడా మమ్మీలుగా భద్రపరిచారు

ఇప్పటివరకూ వందలాది మమ్మీలను వెలికితీశారు. వీటిలో శిశువులు, చిన్నారుల మమ్మీలు కూడా ఉన్నాయి.

''ఇక్కడి మట్టిలో సహజకంగా ఏర్పడే ఆర్సెనిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడి నివసించిన ప్రజల్లో మరణాల రేటు అధికంగా ఉండటానికి కారణమై ఉండవచ్చు'' అని యూనివర్సిటీ ఆఫ్ టారాపాకాలో బయోఆర్కియాలజిస్ట్‌గా పనిచేస్తున్న వివియెన్ స్టాన్డెన్ వివరించారు.

చించోరో ప్రజలు తమ శరీరాల మీద మాంగనీసుతో రంగు వేసుకునేవారని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వారి సంప్రదాయంలో భాగంగా వేసుకుని ఉంటారని భావిస్తున్నారు. కానీ మాంగనీసు విషపూరితమైనది కావటం వల్ల అది కూడా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఓ భారీ పురాతన శ్మశానం మీద నివసించటం భయం కలిగించే అంశంగా కనిపించవచ్చు. కానీ.. అలాంటిదేమీ లేదని ఆరికా నివాసి మారియానా ఎస్క్వియెరోస్ చెప్తున్నారు. ''నాకు అసలు ఎలాంటి భయమూ లేదు. మా ఇంట్లో మా జీవితం మామూలుగానే ఉంటుంది. కింద చనిపోయిన వారు (శవాలు) ఉన్నారనే ఆలోచనే రాదు'' అని ఆమె పేర్కొన్నారు.

చించోరో మమ్మీల ముఖాలకు మట్టి మాస్కులను అమర్చారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చించోరో మమ్మీల ముఖాలకు మట్టి మాస్కులను అమర్చారు

నిజానికి.. ఇక్కడి స్థానికులు తమ చుట్టూ కనిపించే మృతులను తమ పూర్వీకులుగా పరిగణిస్తారు. వారి బాగోగులను చూసుకోవలసిన కేర్‌టేకర్స్ తామని భావిస్తారు.

''చించోరోల వారసత్వంగా మేం కొనసాగుతున్నామని నేను అనుకుంటాను'' అని ఆరికా మరో నివాసి ఆల్ఫ్రెడో గురేరో చెప్పారు. ''ఈ ప్రాంతం విడిచి వెళ్లేది లేదని నేను ఎప్పుడూ అనుకుంటాను. గత పదేళ్లలో నా కుటుంబానికి కూడా ఇదే మాట చెప్పాను. నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. కాబట్టి నేను ఎప్పుడూ వారిని సందర్శిస్తూనే ఉంటాను'' అని పేర్కొన్నారు.

దీనితో స్థానిక మత్స్యకారుడు జార్జ్ ఆర్డీలిస్ ఏకీభవించారు. ''వాళ్లు కూడా మా లాగే మత్స్యకారులు. వాళ్లు ఈ ప్రాంతంలో నివసించారు. వేల ఏళ్ల తర్వాత ఇక్కడ స్థిరపడటానికి మేం వచ్చాం. మత్స్యకారుల సమాజంలాగా మేం అధికారం స్వీకరించాం. అంటే.. మమ్మల్ని మేం వారి వారసులుగా పరిగణిస్తాం. అందుకే వారు వదిలి వెళ్లిన అవశేషాలను సంరక్షించాలని మేం కోరుకుంటున్నాం. అది మా సమాజానికి గొప్ప వారసత్వ సంపద వంటిది. ఇప్పుడు మేం ఈ కాలపు చించోరో ప్రజలం'' అని ఆయన చెప్పుకొచ్చారు.

వీడియో క్యాప్షన్, ఈ పురాతన మమ్మీ ముఖాన్ని చేతులతో ఎందుకు కప్పేసుకుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)