ఈ కృత్రిమ పిండాల్లో గుండె కొట్టుకునేందుకు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే

ఫొటో సోర్స్, Amadei and Handford
- రచయిత, ఫిలిప్పా రాక్స్‌బీ
- హోదా, బీబీసీ న్యూస్
ఎలాంటి అండాలు లేదా వీర్య కణాలు లేకుండా ఎలుక పిండాలను కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిలో మెదడుతోపాటు కొట్టుకుంటున్న గుండె కూడా కనిపిస్తోంది.
మూలకణాలతో (స్టెమ్ సెల్స్‌తో) అభివృద్ధి చేసిన ఈ ఎలుక పిండాలు ఎనిమిది రోజులపాటు సజీవంగానే ఉన్నాయి.
అవయవాల అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుసుకోవడంతోపాటు.. కొంతమంది గర్భిణులకు మొదట్లోనే ఎందుకు గర్భస్రావం అవుతుందో తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి.
ఈ అధ్యయన ఫలితాలు కొత్త ఆశలు చిగురింప చేస్తున్నప్పటికీ, దీనిలో దాటాల్సిన అవరోధాలు చాలా ఉన్నాయని మరికొందరు పరిశోధకులు అంటున్నారు.
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్‌టెక్) నిపుణులు సంయుక్తంగా చేపట్టిన ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి.
ఇలాంటి పరిశోధననే ఇటీవల ఇజ్రాయెల్‌లోనూనిర్వహించారు.

ఫొటో సోర్స్, Amadei and Handford
మొదటి దశ గర్భంలో..
గర్భం మొదట దశలను లోతుగా విశ్లేషించేందుకు పదేళ్ల నుంచి కేంబ్రిడ్జ్ పరిశోధకులు దృష్టిసారిస్తున్నారు. అయితే, ఇప్పటికీ ఈ విషయంలో చాలా విషయాలు అంతుచిక్కడం లేదు.
సహజంగా ప్రకృతిలో జరుగుతున్నట్లే ప్రయోగశాలలోనూ కృత్రిమంగా పిండాన్ని అభివృద్ధి చేసేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. ఎలుకల్లో నుంచి మూడు రకాల మూలకణాలను సేకరించి పిండం లాంటి నిర్మాణాలను వారు అభివృద్ధి చేశారు.
కొన్ని లోపాల వల్ల ఈ పిండాలు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే సజీవంగా ఉన్నాయి. అయితే, వీటిలో అప్పటికే మెదడు, గుండె అభివృద్ధి చెందడం మొదలైంది.
''నిజంగా ఇది మా కలను నిజం చేసిన పరిశోధనగా చెప్పుకోవచ్చు. అసలు అవయవాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో దీని ద్వారా కొంతవరకు అవగాహన వస్తుంది''అని కేంబ్రిడ్జ్‌లోని మమ్మలియన్ డెవలప్‌మెంట్, స్టెమ్ సెల్ బయాలజీ ప్రొఫెసర్ మగ్దలేనా జెర్నికా గోట్జ్ చెప్పారు.
''మానవ జీవితంలో ఈ దశలో ఎన్నో మర్మాలు దాగున్నాయి. అయితే, ఇది ఎలా జరుగుతుందో ప్రయోగశాలలో కొంతవరకు మేం గమనించగలిగాం. ముఖ్యంగా ఎందుకు చాలా గర్భాలు విఫలం అవుతున్నాయి? వీటిని అడ్డుకోవడానికి ఏం చేయాలి? లాంటి అంశాలపై లోతైన అవగాహనకు ఇది ఉపయోగపడుతుంది''అని ఆమె వివరించారు.
మరోవైపు పరిశోధనలకు జంతువులపై ఆధారపడటం, కొత్త ఔషధాల పరీక్షలకు జంతువులను ఉపయోగించడంలోనూ ఈ పరిశోధనతో ముందడుగు పడినట్లు అయిందని పరిశోధకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Amadei and Handford
''తొలి దశ''
జీవం ఊపిరిపోసుకున్న తొలి నాళ్లకు సంబంధించిన ఈ పరిశోధన ఫలితాలు ఎంతో విలువైనవని బార్సిలోనాలోని యూనివర్సిటాట్ పాంపెయూ ఫెబ్రాకు చెందిన ప్రొఫెసర్ అల్ఫోన్సో మార్టినేజ్ అరియాస్ చెప్పారు.
ఈ పిండాలు మరికొన్ని రోజులు మనుగడ సాగించేలా చూడటంపై ప్రస్తుతం పరిశోధకులు దృష్టిసారిస్తున్నాయి. అయితే, కృత్రిమ మావి (ప్లాసెంటా) లేకుండా పిండాల జీవితకాలం పొడిగించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని.
అంతిమంగా ఇదే టెక్నాలజీ సాయంతో మానవ మూలకణాలను ఉపయోగించి పిండాలను తయారుచేయాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఇది చాలా క్లిష్టమైన, నైతిక సవాళ్లతో కూడుకున్న ప్రయోగం.
ప్రస్తుతం బ్రిటన్‌లో మానవ పిండాలు జీవం పోసుకున్నాక 14 రోజుల వరకు మాత్రమే ప్రయోగశాలల్లో అధ్యయనం చేసేందుకు అనుమతులు ఉన్నాయి. అయితే, కృత్రిమ పిండాల విషయంలో ఎలాంటి నిబంధనలూ లేవు.
''ఈ పిండాలు నిజమైన పిండాల్లానే కనిపిస్తున్నాయి. కాబట్టి వీటికీ నిజమైన పిండాలకు వర్తించే నిబంధనలు అమలయ్యేలా చూడాల్సి ఉంటుంది''అని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రఫెసర్ లోవెల్ బ్యాడ్జ్ చెప్పారు.
''ఒకవేళ వీటిని మనుషుల మూలకణాలతో తయారుచేస్తే, వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ గర్భాశయాల్లో ప్రవేశపెట్టకూడదు. ఎందుకంటే ఈ ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు?''అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో 11 కోట్ల ఏళ్ళ నాటి డైనోసార్ల పాద ముద్రలు... కరవు వల్ల బయటపడిన అద్భుతం
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













