Nasa Artemis: ఆర్టెమిస్ అంటే ఏంటి? చంద్రుడి మీదకు మనుషుల్ని నాసా ఎలా తీసుకెళ్తుంది, ఎలా తీసుకొస్తుంది?

ఫొటో సోర్స్, NASA
- రచయిత, పృథ్వి రాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అర్థ శతాబ్దం కిందట చంద్రుడి మీదకు మనుషులను పంపిన ప్రయోగాలను 'అపోలో మిషన్' అని పిలిచింది. అపోలో 1 నుంచి అపోలో 17 వరకూ ఆ మిషన్లు సాగాయి.
1. నాసా ‘ఆర్టెమిస్’ మిషన్ ఏమిటి?
మళ్లీ యాబై ఏళ్ల తర్వాత తిరిగి చంద్రుడి మీదకు మనుషులను పంపించే ప్రయోగాలకు నాసా శ్రీకారం చుట్టింది. ఈసారి ఈ ప్రయోగాలకు 'ఆర్టెమిస్' అని పేరు పెట్టింది. గ్రీకు పురాణగాథల ప్రకారం ఆర్టెమిస్ ఒక (చంద్ర) దేవత.
అందులో భాగంగా ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి 'ఆర్టెమిస్ 1' ప్రయోగాన్ని ప్రారంభిస్తోంది. ఇందులో మనుషులెవరినీ పంపించకుండా.. కొత్త రాకెట్, కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌ల పనితీరును, వాటి భద్రతను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.
దీని తర్వాత 2024లో.. 'ఆర్టెమిస్-2' ప్రయోగం చేపడతారు. అందులో వ్యోమగాములను స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి పంపిస్తారు. కానీ వారు చంద్రుడి మీద దిగరు. వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణానికి ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎంతవరకూ అనుకూలంగా ఉంది అనే అంశాలను పరిశీలిస్తారు.
ఆ తర్వాత 2025లో 'ఆర్టెమిస్-3' ప్రయోగంలో వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపిస్తారు. ఈసారి తొలి మహిళ కూడా చంద్రుడి మీద అడుగు మోపుతారు.
నాసా.. 2030ల నాటికి అంగారకుడి మీదకు అంతరిక్షయాత్రికులను పంపించటానికి సంసిద్ధమయ్యే క్రమంలో భాగంగా నాసా ఈ మూన్ మిషన్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు కనిపిస్తోంది.
2. ఆర్టెమిస్ 1 ప్రయోగం లక్ష్యాలేమిటి?
నాసా ప్రణాళిక ప్రకారం.. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 29వ తేదీ సోమవారం సాయంత్రం 6:03 గంటలకు (అమెరికాలో స్థానిక కాలమానం - ఈస్ట్రన్ డే టైమ్ ప్రకారం - 29వ తేదీ సోమవారం ఉదయం 8:33 నిమిషాలకు) ఈ ప్రయోగం ప్రారంభం కావాలి. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో చివరి నిమిషంలో సాంకేతిక లోపం వల్ల రాకెట్ ప్రయోగాన్ని నాసా వాయిదా వేసింది.
ఈ ప్రయోగాన్ని మరలా అమెరికా కాలమానం ప్రకారం సెప్టెంబర్ 3వ తేదీ శనివారం మధ్యాహ్నం 2.17 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11 గంటలకు) చేపడుతోంది.
అయితే.. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ చంద్రుడి మీదకు మనుషుల్ని పంపించే దిశగా జరుగుతున్న ఆర్టెమిస్-1 ప్రయోగం.. ప్రపంచమంతా విపరీతమైన ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
ఆర్టెమిస్ మిషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన భారీ రాకెట్ 'స్పేస్ లాంచ్ సిస్టమ్'ను, చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపించేందుకు రూపొందించిన కొత్త స్పేస్ క్యాప్సూల్ 'ఓరియాన్'ను, ఈ మిషన్‌ను నియంత్రించే గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్‌లను యాధార్థ పరిస్థితుల్లో పరీక్షించి చూడటం ఈ 'ఆర్టెమిస్ 1' ప్రయోగం లక్ష్యం.
నాసా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్టెమిస్ లాంచ్ మొదలుకుని - ఓరియాన్ కాప్స్యూల్ భూమి మీదకు తిరిగి చేరుకునే వరకూ.. మొత్తం 42 రోజుల 3 గంటల 20 నిమిషాల పాటు ఈ మిషన్ కొనసాగుతుంది.
ఈ ప్రయోగంలో ఓరియాన్ క్యాప్సూల్ (స్పేస్‌క్రాఫ్ట్) మొత్తం 21 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ఫొటో సోర్స్, NASA
3. కొత్త రాకెట్ ఎలా పనిచేస్తుంది?
ఆర్టెమిస్ మిషన్ కోసం నాసా అతి పెద్ద రాకెట్ 'స్పేస్ లాంచ్ సిస్టమ్'ను తయారు చేసింది. దీనిని ఎస్‌ఎల్ఎస్ అని పిలుస్తున్నారు.
ఈ రాకెట్ కింది నుంచి పైకి వంద మీటర్లు పొడవు ఉంటుంది. అంటే దాదాపు 30 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది. చాలా బరువు కూడా ఉంటుంది. కాబట్టి ఇది నింగిలోకి దూసుకెళ్లటానికి చాలా శక్తి అవసరం.
ఈ రాకెట్ కింద నాలుగు ఇంజన్లు ఉంటాయి. ఆ ఇంజన్ల మీద లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంక్, దానిపైన లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఉంటాయి. రాకెట్ ఇంధన ట్యాంకులు ఇవి. ఈ భాగాలన్నిటినీ కలిపి రాకెట్ 'కోర్ స్టేజ్' అంటారు.
రాకెట్‌లో అతి పెద్ద భాగం ఈ కోర్ స్టేజ్. ఇందులోని రెండు ట్యాంకుల నిండా ఇంధనం నింపుతారు. నిజానికి రాకెట్ బరువులో 90 శాతం బరువు ఈ ఇంధనానిదే. ఎస్‌ఎల్ఎస్‌లో మొత్తం 7,50,000 గ్యాలన్ల ఇంధనాన్ని నింపుతారు.
ఈ భారీ రాకెట్ నేల మీద నుంచి పైకి ఎగరటానికి దీని కోర్ స్జేటికి ఉన్న నాలుగు ఇంజన్లు చాలవు. అందుకోసం మరో రెండు బూస్టర్లు (అదనపు రాకెట్లు) అవసరం. రాకెట్‌కు ఇరువైపులా ఈ బూస్టర్లను అమర్చుతారు.

ఈ కోర్ స్టేజ్ మీద 'ఇంటెరిమ్ క్రయోజనిక్ ప్రపొల్షన్ స్టేజ్' ఉంటుంది. దీనికి ఆర్ఎల్10 ఇంజన్ అమర్చి ఉంటుంది. దీనిని రాకెట్ అప్పర్ స్టేజి అని కూడా పిలుస్తారు. కోర్ స్టేజి పని పూర్తయ్యాక ఈ అప్పర్ స్టేజి పని చేస్తుంది.
ఈ అప్పర్ స్టేజి మీద యూరోపియన్ సర్వీస్ మాడ్యూల్, దాని మీద క్రూ మాడ్యూల్ అమర్చి ఉంటాయి. ఈ క్రూ మాడ్యూలే 'ఓరియాన్'. దీనిని స్పేస్ క్యాప్సూల్, స్పేస్‌క్రాఫ్ట్ అని కూడా పిలుస్తారు.
వ్యోమగాములు ఈ క్యాప్సూల్‌లోనే ప్రయాణిస్తారు. వారు చంద్రుడి మీదకు వెళ్లి తిరిగి భూమి మీదకు రావల్సింది ఇందులోనే. అంతరిక్షంలో ఈ స్పేస్ క్యాప్సూల్‌ను.. దాని వెనుక అమర్చిన యూరోపియన్ సర్వీస్ మాడ్యూల్ నడిపిస్తుంది.
అయితే ఇప్పుడు ఈ కొత్త రాకెట్‌ను, కొత్త క్యాప్సూల్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు కాబట్టి.. ఇందులో వ్యోమగాములను పంపించటం లేదు. వారి స్థానంలో వ్యోమగాముల రూపంలోని బొమ్మలను క్యాప్సూల్‌లో పెట్టి పంపిస్తున్నారు.
రాకెట్ మీద ఓరియాన్ స్పేస్ క్యాప్సూల్ కన్నా పైభాగంలో.. చిట్టచివరిగా లాంచ్ అబోర్ట్ సిస్టమ్ ఉంటుంది. రాకెట్ నేల మీది నుంచి నింగిలోకి దూసుకెళ్లేటపుడు ఏదైనా తేడా జరిగితే వ్యోమగాములు ఉన్న క్యాప్సూల్‌ను సురక్షిత ప్రదేశానికి జరుపుతుంది.

ఫొటో సోర్స్, ©2022 MAXAR TECHNOLOGIES
4. రాకెట్ ప్రయోగం ఎలా జరుగుతుంది?
ఇంతకుముందు అపోలో మిషన్లను ప్రయోగించిన ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌లో.. లాంచ్ ప్యాడ్ 39బి నుంచే ఈ రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే.. ఈ ప్రయోగం మొత్తం 43 రోజుల పాటు కొనసాగుతుంది.
లాంచ్ చేయటానికి 10 సెకన్ల ముందు రాకెట్ కింద అమర్చివున్న నాలుగు ఆర్ఎస్-25 ఇంజన్లు మండుతాయి. కౌంట్‌డౌన్ జీరోకు చేరగానే.. రాకెట్‌కు ఇరువైపులా అమర్చివున్న బూస్టర్లు మండుతాయి. సరిగ్గా అదే సమయంలో రాకెట్‌ను లాంచ్ ప్యాడ్‌లో నిలబెట్టి ఉంచిన బోల్టులు కూడా విడిపోతాయి.
దీంతో.. రాకెట్ తన పైభాగంలో అమర్చిన ఓరియాన్ క్యాప్సూల్ సహా.. నేల మీది నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళుతుంది. కొన్ని క్షణాల్లోనే దాదాపు గంటకు 40,000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
రాకెట్ 2 నిమిషాల 12 సెకన్లు ప్రయాణించిన తర్వాత.. దాదాపు 44 కిలోమీటర్ల ఎత్తులో దాని నుంచి బూస్టర్లు రెండూ విడిపోతాయి. అవి అట్లాంటిక్ సముద్రంలో పడిపోతాయి.
ఆ తర్వాత ఒక నిమిషానికి ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ పైన ఉన్న 'లాంచ్ అబార్ట్ సిస్టమ్' విడిపోయి పడుతుంది.
అనంతరం.. రాకెట్ కింద ఉన్న నాలుగు ఇంజన్లు మరో 6 నిమిషాల పాటు మండుతూ రాకెట్‌ను పైకి తీసుకెళతాయి. అప్పటికి రాకెట్ 140 కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది. అక్కడితో రాకెట్ కోర్ స్టేజ్ ఇంజన్ పని కూడా ముగుస్తుంది. రాకెట్‌లోని కోర్ స్టేజి, అప్పర్ స్టేజి (ఇంటెరిమ్ క్రయోజెనిక్ ప్రొపల్షన్ స్టేజ్) విడిపోతాయి. కోర్ స్టేజి వేరుపడుతుంది.

అక్కడి నుంచి రాకెట్ అప్పర్ స్టేజ్.. ఓరియాన్‌ను ముందుకు తీసుకెళుతుంది. మరో 10 నిమిషాల తర్వాత ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ తన సోలార్ వింగ్స్‌ను విప్పుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి దాదాపు 12 నిమిషాల సమయం పడుతుంది.
ఈ సమయానికి ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్.. ఎస్ఎల్‌ఎస్ రాకెట్‌లోని అప్పర్ స్టేజ్‌కు అనుసంధానమై ఉండి భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది.
మొత్తంగా రాకెట్ భూమి నుంచి నింగిలోకి దూసుకెళ్లిన 51 నిమిషాల తర్వాత.. రాకెట్ అప్పర్ స్టేజ్ ఇంజన్ 22 సెకన్ల పాటు మండి ఓరియాన్‌ను భూమికి మరింత దూరంగా తీసుకెళుతుంది. అంటే.. ఓరియాన్‌ను భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడేసి.. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి నడిపిస్తుంది.
ఆ తర్వాత అప్పర్ స్టేజ్ ఇంజన్.. 18 నిమిషాల పాటు మండుతూ ఓరియాన్‌ను చంద్రుడి వైపు వెళ్లే మార్గంలోకి పంపిస్తుంది.
రాకెట్ భూమి నుంచి నింగిలోకి దూసుకెళ్లిన 2 గంటల 6 నిమిషాల అనంతరం.. రాకెట్ అప్పర్ స్టేజి నుంచి కూడా ఓరియాన్ విడిపోతుంది.
అక్కడి నుంచి ఈ ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను.. దానికి అమర్చివున్న సర్వీస్ మాడ్యూల్ నడిపిస్తుంది.

ఫొటో సోర్స్, NASA
5. చంద్రుడి దగ్గరకు ఓరియాన్ ఎలా ప్రయాణిస్తుంది?
ఈ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి మీదకు చేరుకోవాలంటే 3 లక్షల 80 వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని రోజులు పడుతుంది.
ఓరియాన్ రెండో రోజు నుంచి ఐదో రోజు వరకూ ప్రయాణిస్తుంది. చంద్రుడి సమీపంలోకి వెళ్లిన తర్వాత.. చంద్రుడి చుట్టూ నిర్ణీత కక్ష్యలోకి చేరటానికి ఆరో రోజు నుంచి 9వ రోజు వరకూ సమయం పడుతుంది.
ఆ క్రమంలో.. ఆరో రోజున చంద్రుడికి అతి దగ్గరగా.. అంటే చంద్రుడి ఉపరితలానికి సుమారు 100 కిలోమీటర్ల దూరం వరకూ ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ వెళుతుంది. పదో రోజున చంద్రుడి చుట్టూ నిర్ణీత కక్ష్యలోకి చేరుతుంది.
ఆ తర్వాతి రోజు (11వ రోజు).. ఓరియాన్ చంద్రుడికి ఆవల 65,000 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణిస్తుంది. మనుషులు ప్రయాణించటానికి నిర్మించిన అంతరిక్ష వాహనం ఏదీ ఇప్పటివరకూ అంతదూరం ప్రయాణించలేదు.
ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి చుట్టూ నిర్ధారిత కక్ష్యలో దాదాపు రెండు వారాల పాటు (10వ రోజు నుంచి 23వ రోజు వరరకూ) తిరుగుతుంది. ఈ సమయంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ ఎలా పనిచేస్తోంది అనేది తనిఖీ చేయటంతో పాటు ముఖ్యమైన సాంకేతిక సమాచారాన్ని నాసా సేకరిస్తుంది.

ఫొటో సోర్స్, NASA
ప్రయోగం 24వ రోజున ఓరియాన్ తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుంది. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న కక్ష్య నుంచి బయటకు వస్తుంది. ఆ క్రమంలో 26వ రోజున భూమికి అత్యంత దూరంగా వెళుతుంది.
ప్రయోగంలో 35వ రోజున ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ భూమి మీదకు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో మరోసారి చంద్రుడికి దగ్గరగా వెళుతుంది. చంద్రుడి గురుత్వ శక్తిని వినియోగించుకుని భూమి వైపు ప్రయాణం ప్రారంభిస్తుంది.
6. ఓరియాన్ భూమికి ఎలా తిరిగి వస్తుంది?
ఈ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దగ్గరి నుంచి భూమికి తిరిగి రావటానికి వారం రోజుల సమయం పడుతుంది.
ప్రయోగం 43వ రోజున ఓరియాన్ భూమి సమీపానికి వస్తుంది. ఓరియాన్ క్యాప్సూల్ భూమి గురుత్వ శక్తి పరిధిలోకి వచ్చాక.. దానిని అప్పటివరకూ నడిపించిన సర్వీస్ సిస్టమ్ అవసరం ఉండదు. ఆ సిస్టమ్.. క్యాప్సూల్ నుంచి విడిపోతుంది. దీంతో కేవలం ఓరియాన్ క్యాప్సూల్ మాత్రమే మిగులుతుంది.

ఫొటో సోర్స్, NASA
ఈ తిరుగు ప్రయాణంలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉంటాయి. ఈ క్యాప్సూల్ భూమి వాతావరణంలోకి కచ్చితమైన కోణంలో ప్రవేశించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఓరియాన్ క్యాప్సూల్ మంటల్లో మండిపోతుంది.
ఎందుకంటే.. ఓరియాన్ గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. భూమి వాతావరణం ఆ వేగాన్ని చాలా వరకూ తగ్గిస్తుంది. ఓరియాన్ వేగం గంటకు 480 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. ఆ సమయంలో ఈ క్యాప్సూల్ 3,000 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకూ వేడెక్కిపోతుంది. ఆ వేడిని తట్టుకునేలా భారీ హీట్ షీల్డ్ ఈ క్యాప్సూల్‌కు రక్షణ కల్పిస్తుంది.
భూమికి 25,000 అడుగుల దూరానికి వచ్చినపుడు వరుస వెంట పారాచూట్లు తెరుచుకుని.. క్యాప్సూల్ వేగాన్ని చాలా తగ్గిస్తాయి. చివరికి గంటకు 32 కిలోమీటర్ల వేగంతో ఓరియాన్ క్యాప్సూల్.. సాన్ డియాగో సమీపంలో పసిఫిక్ సముద్రంలో.. ముందుగా నిర్దేశించిన ప్రాంతంలోకి వచ్చి పడుతుంది.
ఆ సమయానికి సమీపంలో రీకవరీ నౌక సిద్ధంగా ఉంటుంది. అమెరికా నౌకాదళ, వాయుసేన నిపుణులతో పాటు.. నాసా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అందులో సిద్ధంగా ఉంటారు. వారు ఈ క్యాప్సూల్‌ను క్షేమంగా నౌకలోకి లాగుతారు. నాసా కేంద్రానికి తరలిస్తారు.

ఫొటో సోర్స్, NASA
7. ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని ఎందుకు వాయిదా వేశారు?
నాసా ముందుగా ప్రకటించిన ప్రకారం.. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6:03 గంటలకు ఆర్టిమిస్-1 ప్రయోగాన్ని ప్రారంభించాల్సి ఉంది. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఎస్ఎల్ఎస్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది.
ఇందుకోసం కౌంట్ డౌన్ కూడా చివరి వరకూ వచ్చింది. అయితే.. రాకెట్ ఇంజన్ విపరీతంగా వెడెక్కటం, దానిని సరైన ఆపరేటింగ్ టెంపరేచర్‌కు చల్లబరచటానికి ఇబ్బందులు ఎదురవటంతో చివరి నిమిషంలో రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసింది.
మొదట.. రాకెట్ పైభాగంలో ఏదో పగులు ఉన్నట్లుగా కనిపించటంతో నాసా శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. కానీ.. అది పగులు కాదని, అక్కడ మంచు పేరుకుందని నిర్ధారించారు.
అయితే.. రాకెట్ మీద మరింత ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉండవచ్చునని, అందుకోసం రాకెట్‌ను తిరిగి కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని బిల్డింగ్ విభాగానికి తరలించాల్సివస్తుందని కొందరు నిపుణులు చెప్తున్నారు.
ఈ రాకెట్ ప్రయోగం వాతావరణం అనుకూలించటం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- తెలుగు: భాష ఒకటే.. మాండలికాల సొగసులు అనేకం
- శ్మశానం మీద నిర్మించిన నగరం... అక్కడ పునాదుల కోసం తవ్వితే పురాతన మమ్మీలు బయటపడతాయి
- విజయవాడ ఎయిర్‌పోర్టు: విమానం చార్జీ కన్నా క్యాబ్ చార్జీలు ఎందుకు ఎక్కువ? ఓలా, ఊబర్ ట్యాక్సీలను ఎందుకు అనుమతించట్లేదు?
- ధోని ఎత్తుకున్న పిల్లాడు ఎవరు? గంగూలీకి ముషారఫ్ ఎందుకు ఫోన్ చేశారు
- ‘ఎప్పటికీ తండ్రిని కాకూడదు అనుకుని, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఓ భర్త కథ’
- ఇస్రో: 'గగన్‌యాన్' వ్యోమగాముల ఎంపిక ఎలా జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















