ఎలాన్ మస్క్ కారు చౌకగా హైస్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వనున్నారా? వేలాది ఉపగ్రహాలను అందుకే ప్రయోగిస్తున్నారా

స్టార్‌లింక్ ఉపగ్రహాలతో వెళ్తోన్న స్పేస్‌ఎక్స్ రాకెట్

ఫొటో సోర్స్, STARLINK

ఫొటో క్యాప్షన్, స్టార్‌లింక్ ఉపగ్రహాలతో వెళ్తోన్న స్పేస్‌ఎక్స్ రాకెట్

ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ వేల సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది. ఆకాశంలో ఈ ఉపగ్రహాలను చూసినట్లు చాలామంది చెబుతున్నారు.

స్టార్‌లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది. మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను అందించడమే స్టార్‌లింక్ ప్రాజెక్ట్ లక్ష్యం.

స్టార్‌లింక్ అంటే ఏంటి? ఇది ఎలా పని చేస్తుంది?

స్టార్‌లింక్ భారీ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తుంది.

హైస్పీడ్ ఇంటర్నెట్‌ లభించని మారుమూల ప్రాంతాల్లో నివసించే వారి కోసం ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది.

''ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి'' అని పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీ స్పేస్ ప్రాజెక్ట్స్ మేనేజర్ డాక్టర్ లూసిండా కింగ్ అన్నారు.

స్టార్ లింక్ ఉపగ్రహాలను భూమికి సమీప కక్ష్యల్లో ప్రవేశపెడతారు. ఇలా చేయడం వల్ల ఉపగ్రహాల నుంచి భూమికి అత్యంత వేగంగా సిగ్నల్స్ వస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించాలంటే సమీప కక్ష్యలో ప్రవేశపెట్టే ఇలాంటి ఉపగ్రహాలు భారీ స్థాయిలో అవసరం.

స్టార్‌లింక్ ప్రాజెక్టులో భాగంగా 2018 నుంచి దాదాపు 3000 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు భావిస్తున్నారు. 10 నుంచి 12 వేల వరకు ఉపగ్రహాలు ప్రవేశపెడతారని క్రిస్ హాల్ అన్నారు.

''ఉపగ్రహాలను వాడటం వల్ల ఎడారులు, పర్వతాలు ఉండే మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇలాంటి ప్రాంతాలకు ఇంటర్నెట్‌ను చేర్చడానికి కేబుళ్లు, యాంటెన్నాల వంటి భారీ మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉండదు'' అని హాల్ వివరించారు.

స్టార్ లింక్

స్టార్‌లింక్ ధర ఎంత? దాన్ని ఎవరు వాడతారు?

మామూలు ఇంటర్నెట్ ప్రొవైడర్లతో పోలిస్తే స్టార్‌లింక్ సేవలు చౌక కాదు.

స్టార్‌లింక్, వినియోగదారుల నుంచి నెలకు 99 డాలర్లు (రూ. 7,832) వసూలు చేస్తుంది. ఉపగ్రహాలతో అనుసంధానమయ్యే రూటర్, డిష్ ధర 549 డాలర్లు (రూ. 43,431)గా ఉంది.

అమెరికాలోని 96 శాతం కుటుంబాలకు ఇప్పటికే హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈయూ, అమెరికాలో 90 శాతం కుటుంబాలు వీటిని పొందుతున్నాయి.

''అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఇప్పటికే ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్నాయి. వారు ఆదాయం కోసం చాలా తక్కువ మందిపై ఆధారపడుతున్నారు'' అని లండన్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ పాలసీ అండ్ లా ప్రొఫెసర్ సైద్ మోస్తేషర్ అన్నారు.

36 దేశాల్లో తమకు 4 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారని ఆ కంపెనీ చెబుతోంది. ఇళ్లతో పాటు వ్యాపార కేంద్రాల్లో కూడా ఇది సేవలను అందిస్తుంది. ప్రస్తుతానికి ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాల్లో ఇది ఎక్కువగా విస్తరించింది.

వచ్చే ఏడాది దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా వ్యాప్తంగా తమ కవరేజీని విస్తరించాలని స్టార్‌లింక్ యోచిస్తోంది.

అంతరిక్షాన్ని పరిశీలించినప్పుడు నక్షత్రాలు, గ్రహాలకు అడ్డుగా స్టార్‌లింక్ ఉపగ్రహాలు కనబడతాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతరిక్షాన్ని పరిశీలించినప్పుడు నక్షత్రాలు, గ్రహాలకు అడ్డుగా స్టార్‌లింక్ ఉపగ్రహాలు కనబడతాయి

యుక్రెయిన్‌కు స్టార్‌లింక్ ఎలా సహాయపడుతోంది?

యుక్రెయిన్‌పై దాడి చేస్తోన్న రష్యా బలగాలు... అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి సోషల్ మీడియాను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.

రష్యా దాడి ప్రారంభమైన వెంటనే ఎలాన్ మస్క్, యుక్రెయిన్‌లో స్టార్‌లింక్‌ను అందుబాటులోకి తెచ్చారు. దాదాపు 15,000 స్టార్‌లింక్ డిష్‌లు, రూటర్లను యుక్రెయిన్‌కు పంపించారు.

యుద్ధభూమిలో కూడా స్టార్‌లింక్ సేవలు ఉపయోగపడ్డాయి.

''ప్రభుత్వ విభాగాలు తమ విధులను కొనసాగించేందుకు స్టార్‌లింక్ సహాయపడింది. రష్యన్లకు దీన్ని అడ్డుకోలేకపోయారు. కమ్యునికేషన్ కోసం యుక్రెయిన్ బలగాలు కూడా దీన్ని వాడుతున్నాయి. సాధారణ రేడియో సిగ్నల్స్ తరహాలో వీటిని జామ్ చేయలేరు'' అని లండన్ కింగ్స్ కాలేజీ డిఫెన్స్ స్టడీస్ రీసెర్చర్ డాక్టర్ మరీనా మిరోన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, ఎలాన్ మస్క్: ట్విటర్‌ను రూ. 3.37 లక్షల కోట్లకు కొని ఆయన ఏం చేయబోతున్నారు?

స్టార్‌లింక్‌, స్పేస్ గందరగోళాన్ని సృష్టిస్తుందా?

స్టార్‌లింక్‌తో పాటు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందించే వన్‌వెబ్, వయాశాట్ వంటి సంస్థలు కూడా వేలాది ఉపగ్రహాలను భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు.

ఇది సమస్యలకు దారి తీస్తుందని సైద్ మోస్తేషర్ అన్నారు.

''ఈ ఉపగ్రహాలు, ఇతర వాటిని ఢీకొట్టవచ్చు. హై స్పీడ్‌తో తిరుగుతున్నప్పుడు ఇవి చాలా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి'' అని సైద్ చెప్పారు.

స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఇతర వాటికి ఢీకొనబోయి, త్రుటిలో ఆ ప్రమాదం తప్పిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి.

ఖగోళ శాస్త్రవేత్తలకు కూడా ఈ స్టార్‌లింక్ ఉపగ్రహాలు సమస్యలను సృష్టిస్తున్నాయి.

సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో వాటిని మనం ఎలాంటి ఉపకరణాలు లేకుండా కళ్లతో చూడొచ్చు.

ఇవి అడ్డుగా ఉండటంతో టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలు, గ్రహాలను పరిశీలించడం కష్టం అవుతుంది.

ఖగోళ శాస్త్రవేత్తలు ముందుగానే ఈ సమస్యలను గ్రహించి, వాటి గురించి ఫిర్యాదు చేశారని ప్రొఫెసర్ సైద్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, టెస్లా అంటే ఎందుకంత క్రేజ్? దీని విజయ రహస్యం ఏమిటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)