బ్రిటన్‌లో కరవు.. నీటిని రేషన్ విధానంలో సరఫరా చేస్తారా

ఫొటో సోర్స్, PA WIRE
ఇంగ్లండ్, వేల్స్‌లో 1976 తరువాత ఈ ఏడాది అత్యంత పొడి వాతావరణం కొనసాగుతోంది. 1976లో తీవ్రమైన పొడి వాతావరణం కారణంగా ఇంగ్లండ్‍లో నీటిని రేషన్ విధానంలో సరఫరా చేశారు.
ప్రస్తుతం అక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితులు బ్రిటన్ కరవు గుప్పిట చిక్కుకోనుందా అనే భయాలు కలిగిస్తున్నాయి.
2022లో కరవు హెచ్చరికలు ఎందుకు వస్తున్నాయి?
నేషనల్ డ్రాట్ గ్రూప్ ఇటీవల నిర్వహించిన అత్యవసర సమావేశంలో.. ఇంగ్లండ్‌లో ఈ ఏడాది సుదీర్ఘ కాలం పాటు పొడి వాతావరణం కొనసాగినట్లు ప్రకటించింది. కరవు ఏర్పడటానికి ముందు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి.
ఈ ఏడాది తొలి 3 నెలల్లో దేశంలో వర్షపాతం సాధారణం కంటే 26 శాతం తక్కువ నమోదయింది. వేల్స్‌లో ఇది 22 శాతం తక్కువగా ఉంది.
వేసవి మొదలుకావడానికి ముందే నదీ జలాల సగటు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాలలో అయితే సాధారణ స్థాయి కంటే బాగా తక్కువగా ఉన్నాయి.
జులైలో అనేక సార్లు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షపాతం సాధారణం కంటే 76% తక్కువ నమోదయింది.
పొడి, వేడి వాతావరణం మరి కొంత కాలం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
అయితే, పరిమితులను మించిన నీటి వాడకం ఈ పరిస్థితులను మరింత జటిలం చేస్తున్నాయి. భూగర్భ జలాలను అవసరానికి మించి వినియోగించినట్లు ప్రభుత్వం చెబుతోంది.
కరవు అంటే ఏంటి?
దేశంలో కరవును పర్యావరణ ఏజెన్సీ ప్రకటిస్తుంది.
నీరు లేకుండా ఎక్కువ కాలం గడపడాన్ని కరవు అని చాలా మంది నిర్వచిస్తారు.
కానీ, కరవును ప్రకటించడం చెప్పినంత సులభం కాదని రాయల్ మెటీరియోలాజికల్ సొసైటీ చెబుతోంది.
ఉదాహరణకు పంటలు పండించేందుకు తగినంత నీరు లేక వ్యవసాయ కరవు ఏర్పడవచ్చు.
హోస్ పైపుల వాడకాన్ని నిషేధిస్తారా?
నీటి డిమాండ్ తగ్గించేందుకు నీటి సంస్థలు హోస్ పైపుల వాడకం పై నిషేధం విధించేందుకు అనుమతి లభిస్తుంది.
నదీ జలాలు అడుగంటినప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయవచ్చు.
సదరన్ వాటర్ సంస్థ హ్యాంప్ షైర్, ఐల్ ఆఫ్ వైట్‌లో వినియోగదారులకు ఆగస్టు 5 నుంచి హోస్ పైపుల వాడకాన్ని నిషేధిస్తోంది.
ప్రస్తుతానికి ఇతర సంస్థలు ఈ నిషేధాన్ని ప్రకటించలేదు. కానీ, ఇంగ్లండ్ దక్షిణ ప్రాంతాల్లోనూ, మిడ్ ల్యాండ్స్‌లో ప్రజలను నీటిని పొదుపుగా వాడుకోమని సూచించారు.
నేషనల్ డ్రాట్ గ్రూప్ కరవు గురించి ప్రకటన చేసిన తర్వాత కొన్ని సంస్థలు తమ నిర్ణయాలను సమీక్షించుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
కరవు ప్రభావం ఎలా ఉంటుంది?
- మత్స్య సంపద నాశనం కావడంతో నీరు కలుషితమవుతుంది.
- పంటల వైఫల్యం
- కార్చిచ్చులు చెలరేగుతాయి
ఇంగ్లండ్‌లో నెలకొన్న పరిస్థితిని జాతీయ రైతుల సంఘం పరిశీలిస్తోంది. బెర్రీ పళ్ళను పండించే రైతులు ఇప్పటికే చాలా వరకు పంటలను కోల్పోయినట్లు చెబుతున్నారు.
బంగాళాదుంపల లాంటి కాయగూరలను పండించేందుకు ఎక్కువ మొత్తంలో నీరు అవసరం ఉండటంతో ఈ పంటకు కూడా ముప్పు కనిపిస్తోంది. వచ్చే నెలలో ఈ పంట చేతికొస్తుంది.
ఈ ప్రభావం వచ్చే ఏడాది కనిపించొచ్చు. భూమి పొడిగా ఉండటంతో రైతులు రేప్ సీడ్ లాంటి పంటలను వేయడంలో జాప్యం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో నమోదైన రికార్డ్ బ్రేకింగ్ ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం వల్ల అనేక చోట్ల మంటలు చెలరేగాయి.
దీంతో ఇళ్లు, మైదాన ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
నీటి మట్టం స్థాయిలు బాగా పడిపోయినప్పుడు యూకే మత్స్య సంపద నిర్వహణను పర్యవేక్షించే ఎన్విరాన్ మెంట్ ఏజెన్సీ ఇతర నదులకు తరలించే ఏర్పాట్లు చేస్తుంది.
వేసవి మొదలైన ప్రారంభంలోనే ఉత్తర ఇటలీ, పోర్చుగల్ కరవు వల్ల అత్యవసర పరిస్థితులను ప్రకటించాయి. నీటి వాడకం పై నియంత్రణ విధించాయి.
ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్‌లో కూడా పొడి వాతావరణం వల్ల కార్చిచ్చులు చెలరేగాయి.

1976, 2018లో కరవు ఏర్పడినప్పుడు ఏం జరిగింది?
1976, 2018లో యూకేలో ఎక్కువ కాలం పాటు కరవు కొనసాగింది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన పొడి వాతావరణం, అసాధారణ ఉష్ణోగ్రతల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
1976లో గృహ, పారిశ్రామిక నీటి సరఫరాను నిలుపు చేసేందుకు కరవు చట్టం ప్రభుత్వానికి అత్యవసర అధికారాలను ఇచ్చింది.
2018లో ఏర్పడిన తీవ్రమైన కరవు వల్ల పంటలు విఫలమయ్యాయి. దీంతో ఆహార ధరలు పెరిగాయి. నీటి వాడకం పై అనేక రకాల నియంత్రణలు అమలు చేశారు.
ఈ ఏడాది కూడా అతి తక్కువ వర్షపాతం, జులైలో నమోదైన అసాధారణ ఉష్ణోగ్రతలతో 2018 మాదిరి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
యూకేలో కరవు తలెత్తుతుందా లేదా అనేందుకు ఆగస్టులో నెలకొనే వాతావరణ పరిస్థితులు కీలక పాత్ర వహిస్తాయి.
భవిష్యత్తులో మరిన్ని కరవులు చూస్తారా?
జనాభా పెరుగుదల, వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో నీటి కొరత మరింత పెరగవచ్చని ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమీషన్ చెప్పింది.
నీటి వినియోగంలో మార్పులు చేయాలని సూచించి నీటి నష్టాన్ని తగ్గించాలని పిలుపునిచ్చింది.
యూకేలో ప్రతీ రోజు 300 కోట్ల లీటర్ల నీరు వృథా అవుతోంది. ఆ నీరు 2 కోట్ల మంది వినియోగానికి సరిపోతుంది.
ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా గృహాలు, వ్యాపార సంస్థలకు మెరుగైన నీటి సరఫరా చేసి ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం రూపొందించిన 25 సంవత్సరాల పర్యావరణ ప్రణాళిక లక్ష్యంగా చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
- ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా?
- బీజీఎంఐ: పబ్జీకి ప్రత్యామ్నాయంగా మారిన ఈ గేమ్‌ను భారత్ ఎందుకు బ్లాక్ చేసింది?
- ఒబేసిటీ: భారతదేశపు చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయులు, కారణాలు ఇవే
- ఓఆర్ఎస్: డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని ఇది, నిర్లక్ష్యం చేస్తున్నామా
- దేశంలో ఒంటరి మహిళల సంఖ్య ఎందుకు పెరుగుతోంది...వీరికి పెళ్లి మీద మనసు విరగడానికి కారణాలు ఏంటి
- ఆరెస్సెస్‌ను మాయల ఫకీరుతో పోల్చిన 64 పేజీల పుస్తకంలో ఏముంది, బీజేపీ స్పందన ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












