ఒబేసిటీ: భారతదేశపు చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయులు, కారణాలు ఇవే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం చాలాకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. నాణేనికి మరోవైపు, ఇటీవల కాలంలో భారతదేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య పిల్లల్లో ఊబకాయం. దీన్ని అరికట్టడానికి అత్యవసరంగా చర్యలు తీసుకోకపోతే పెను ప్రమాదంగా పరిణమించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2017లో 14 ఏళ్ల మిహిర్ జైన్ దిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వీల్ చెయిర్‌లో ఉన్న మిహిర్‌ను చూసి చాలా ఆశ్చర్యపోయానని, అంత చిన్న పిల్లవాడు అంత లావుగా ఉండడం "తన కళ్లను తానే నమ్మలేకపోయానని" బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ చౌబే చెప్పారు.
"మిహిర్ చాలా లావుగా ఉన్నాడు. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. కళ్లు కూడా పూర్తిగా తెరుచుకోవట్లేదు. ముఖం లావుగా, ఉబ్బిపోయినట్టు ఉంది. 237 కేజీల బరువు ఉన్నాడు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 92 ఉంది" అని డాక్టర్ ప్రదీప్ చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల ప్రకారం, బీఎంఐ 25 దాటితే అధిక బరువు కింద లెక్క.
కొన్ని వారాల పాటు చికిత్స, 2018 వేసవిలో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేసిన తరువాత మిహిర్ బరువు 165 కిలోలకు తగ్గింది.
ఆ సమయంలో మిహిర్ "ప్రపంచంలోనే అత్యధిక బరువున్న టీనేజీ కుర్రాడి"గా పేరుపొందాడు. ఇది కొంచం అతిశయోక్తి కావచ్చు. కానీ, భారతదేశంలో అధిక బరువు, ఊబకాయం ఉన్న పిల్లలు 1.8 కోట్ల మంది ఉన్నారు. వీరి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

అయిదేళ్లలోపు పిల్లల్లో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5, 2019-21) చెబుతోంది. 2015-16లో అధిక బరువు ఉన్న పిల్లలు 2.1 శాతం ఉంటే, ఇప్పుడు 3.4 శాతం ఉన్నారు.
భారతదేశ జనాభా పరిణామం దృష్ట్యా, "శాతాల్లో చిన్న పెరుగుదల కూడా భారీ సంఖ్యలను సూచిస్తుందని" భారతదేశంలోని యునిసెఫ్‌లో న్యుట్రిషన్ చీఫ్ డాక్టర్ అర్జన్ డే వాగ్ట్ అన్నారు.
యునిసెఫ్ 'వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2022' ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో 2.7 కోట్ల కంటే ఎక్కువ స్థూలకాయంతో బాధపడుతున్న పిల్లలు ఉంటారని అంచనా. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమంది పిల్లల్లో ఒక్కరన్నమాట.
ఊబకాయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న 183 దేశాల జాబితాలో భారత్ 99వ స్థానంలో ఉంది. అధిక బరువు, ఊబకాయం వలన కలిగే ఆర్థిక ప్రభావం 2109 లో 23 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,82,148 కోట్లు) కాగా, 2060 నాటికి 479 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 37,93,440 కోట్లు) వరకు పెరుగుతుందని అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
'వయసు పెరిగినా ఊబకాయం తగ్గదు'
"భారతదేశంలో చిన్నపిల్లల్లో ఊబకాయం పెద్ద సమస్యగా తయారైంది. చిన్నతనంలోనే ఊబకాయం బారిన పడినవాళ్లకు పెద్దయ్యాక కూడా ఆ శరీర తత్వం కొనసాగుతుంది" అని డాక్టర్ వాగ్ట్ అన్నారు.
ఆరోగ్య నిపుణులు ఈ ట్రెండ్ గురించి ఆందోళనపడుతున్నారు. శరీరంలో కొవ్వు శాతం పెరిగితే తీవ్రమైన జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. 13 రకాల క్యాన్సర్లు, టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తి అకాల మరణాలకు దారి తీయవచ్చని తెలిపింది.
గత ఏడాది, ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం వల్ల 28 లక్షల మంది చనిపోయారు.
పెద్దవారిలో ఊబకాయం కూడా భారతదేశంలో ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. ఇప్పటికే, ఊబకాయులు ఎక్కువగా ఉన్న మొదటి అయిదు దేశాల జాబితలో చోటు సంపాదించుకుంది.
2016లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నవారు సుమారు 1.3 కోట్లు ఉన్నారని, వారి సంఖ్య పెరుగుతోందని అంచనా.
భారతదేశంలో అయిదేళ్ల లోపు పిల్లల్లో 36 శాతం ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారని డాక్టర్ వాగ్ట్ అన్నారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడంలో మనం సాధించిన విజయాలను ఊబకాయం మింగేస్తోందని అన్నారు.
"పోషకాహార లోపం, అతి తిండి రెండూ ఒకే సమయంలో సమస్యలుగా ఉన్నాయి. అతిగా తినడం వల్ల అధిక బరువు, ఊబకాయం వస్తుంది. కానీ, అతిగా తింటే శరీరానికి కావలసిన పోషక విలువలు అన్నీ అందుతున్నట్టు కాదు. ఇదొక అపోహ" అని డాక్టర్ వాగ్ట్ అన్నారు.

పోషకాహారం విషయంలో అవగానారాహిత్యం
పోషకాహారం విషయంలో సరైన అవగాన లేకపోవడమే అతి పెద్ద సమస్య అని అని డాక్టర్ వాగ్ట్ అన్నారు.
"కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు అందేలా పండ్లు, కూరగాయలు సహా అన్ని రకాల ఆహార పదార్థాలను సరైన మోతాదులో పిల్లలకు అందిస్తే పౌష్టికాహార లోపం లేదా ఊబకాయం సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అయితే, ఏది మంచి ఆహారం, ఏది కాదు అన్న దానిపై ప్రజలకు సరైన అవగాహన లేదు. కడుపు నిండడానికి తింటారు. అతిగా కొవ్వు పదార్థాలు తీసుకుంటున్నారు" అని డాక్టర్ వాగ్ట్ వివరించారు.
పిల్లల్లో ఊబకాయం సమస్య అన్ని వర్గాల్లోనూ ఉన్నట్టు డాటా చెబుతున్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లోని ధనిక కుటుంబాల్లో అధికంగా ఉందని డాక్టర్ వాగ్ట్ అన్నారు. ఈ పిల్లలు కొవ్వు పదార్థాలు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు, పానీయాలు తీసుకుంటున్నారని చెప్పారు.
2019లో మాక్స్ హెల్త్‌కేర్ దిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిపిన ఒక సర్వేలో కనీసం 40 శాతం పిల్లలు (5-9 ఏళ్లు), టీనేజ్ (10-14 ఏళ్ల వారు), యుక్తవయస్కుల (15-17 ఏళ్ల వారు) వారు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారని వెల్లడైంది.
"యుక్తవయసులో ఉన్నవాళ్లు ఆసలస్యంగా పడుకోవడం, అర్థరాత్రుళ్లు చిరుతిళ్లు తినడం ట్రెండ్‌గా మారింది. రాత్రి ఆహారం తీసుకుంటే, అదంతా కొవ్వుగా మారుతుంది. తిన్న వెంటనే పడుకుంటారు కాబట్టి కొవ్వు కరగదు. పొద్దున్న లేచాక బద్దకంగా ఉంటుంది. అలా ఉంటే ఎక్కువ కేలరీలు కరిగించలేరు. అలాగే, పరిగెత్తే ఆటలు ఆడుకోకుండా ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు, సెల్ ఫోన్లతో గడుపుతున్నారు. దాంతో బరువు పెరుగుతున్నారు" అని డాక్టర్ ప్రదీప్ చౌబే అన్నారు.
ఊబకాయం ఆరోగ్యాన్నే కాక జీవితంలో ప్రతీ అంశాన్ని ప్రభావితం చేస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. మానసిక, సాంఘిక సమస్యలు కొనితెస్తుందని, అధిక బరువు ఉన్న పిల్లలు ఎగతాళికి గురవుతారని, ఒంటరివారి అయిపోతారని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జంక్ ఫుడ్ మీద ప్రకటనలు నిరోధించాలి
తక్షణమే పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోతే, దేశంలో ఊబకాయం సమస్యను పరిష్కరించలేమని చెన్నైకు చెందిన సర్జన్, ఒబేసిటీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ రవీంద్రన్ కుమరన్ అన్నారు.
"ఒక అరగంట టీవీ చూస్తే చిరుతిళ్లు, జంక్ ఫుడ్, రకరకాల శీతల పానీయల మీద అనేక ప్రకటనలు కనబడతాయి. అవి నోరూరిస్తూ ఉంటాయి. వాటి వల్ల ప్రయోజనాలు ఉంటాయని చెబుతుంటారు. ఇది ఆపాలి. అనారోగ్యకరమైన ఆహారం గురించి తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ఈ ప్రకటనలను నిరోధించాలి. ఇది ప్రభుత్వం మాత్రమే చేయగలదు" అని డాక్టర్ రవీంద్రన్ అన్నారు.
అలాగే, పిల్లలు బయటికెళ్లి ఆడుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.
"మన దేశంలో శారీరక వ్యాయామంపై అంత శ్రద్ధ పెట్టం. నగరాల్లో నడిచేందుకు ఫుట్‌పాత్‌లు, సురక్షితంగా సైకిలింగ్ చేసేందుకు ట్రాక్స్ ఉండవు. అలాగే, పిల్లలు ఆడుకోవడానికి అనువైన పార్కులు తక్కువ" అని డాక్టర్ రవీంద్రన్ అన్నారు.
'స్పోర్ట్స్ విలేజ్' అనే యూత్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఈ ట్రెండును మార్చడానికి ప్రయత్నిస్తోందని దాని సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సౌమిల్ మజుందార్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"మన దేశంలోని పాఠశాలల్లో మాత్రమే పిల్లలు ఆడుకోవడానికి సరైన గ్రౌండ్లు ఉన్నాయి. కాబట్టి, ఊబకాయాన్ని ఎదుర్కోవడంలో పాఠశాలలు వాటి పాత్ర కచ్చితంగా పోషించాలి" అని ఆయన అన్నారు.
2,54,000 కంటే ఎక్కువ మంది పిల్లలపై ఈ సంస్థ జరిపిన ఒక సర్వేలో, ప్రతీ ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఆరోగ్యకరమైన బీఎంఐ లేదని తేలింది. చాలామంది పిల్లల్లో చురుకుదనం లోపించిందని, శారీరక దారుఢ్యం తక్కువగా ఉందని వెల్లడైంది.
"ఇది విధాన లోపం కాదు. అన్ని స్కూళ్లల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు ఉంటాయి. కానీ, బాగా ఆటలు ఆడే పిల్లలపై మాత్రమే ఎక్కువ దృష్టి పెడతారు. ఆటలు ఆడడంపై అంత ఆసక్తి లేని పిల్లలకు వ్యాయామం కొరవడుతుంది" అని మజుందార్ అన్నారు.
"స్కూళ్లల్లో పిల్లలకు అన్ని సబ్జెక్టులు బోధించినట్టే ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి కూడా బోధించాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
తమ సంస్థ గత కొన్నేళ్లుగా పలు స్కూళ్లతో కలిసి పనిచేస్తోందని, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని మజుందార్ తెలిపారు.
"కొన్ని కేసుల్లో ఫిట్‌నెస్ స్థాయిలు 5 శాతం నుంచి 17 శాతానికి పెరగడం గమనించాం. అలాగే, ఎక్కువమంది ఆడపిల్లలు క్రీడల్లో పాల్గొనేటట్టు చేశాం. ఆటలు ప్రపంచ సమస్యలను పరిష్కరించగలవని నా నమ్మకం" అన్నారు మజుందార్.
గ్రాఫిక్స్: తాజీన్ పఠాన్
ఇవి కూడా చదవండి:
- ఓఆర్ఎస్: డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని ఇది, నిర్లక్ష్యం చేస్తున్నామా
- వరల్డ్ హెపటైటిస్ డే: సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- కామన్వెల్త్ గేమ్స్ 2022: పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈసారి మెడల్స్ తెస్తారా?
- ‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’
- టెంపెస్ట్: పైలట్ మెదడును చదివేసే విమానం
- రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోల వివాదం మన నైతిక విలువల గందరగోళాన్ని సూచిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











