రోహింజ్యాలు: ‘కావాలంటే మమ్మల్ని చంపేయండి... అంతేకానీ, ఆ నరకంలోకి మాత్రం పంపించొద్దు’

రోహింజ్యాలు
ఫొటో క్యాప్షన్, యాస్మిన్
    • రచయిత, రజినీ వైద్యనాథన్
    • హోదా, బీబీసీ న్యూస్

నాలుగేళ్ల యాస్మిన్ జీవితం ప్రస్తుతం అనిశ్చితిలో పడింది. అసలు తన సొంత ఊరేదో ఆమెకు తెలియడం లేదు.

బంగ్లాదేశ్‌లోని శరణార్థుల శిబిరంలో జన్మించిన ఆమె మియన్మార్‌లోని తన పూర్వీకుల గ్రామానికి వెళ్లేందుకు ప్రస్తుతం ఎలాంటి అవకాశమూ లేదు. ప్రస్తుతం భారత రాజధాని దిల్లీలోని ఓ అధ్వానమైన గదిలో ఆమె జీవిస్తోంది.

మియన్మార్‌లో సైనిక ఊచకోతను తప్పించుకునేందుకు 2017లో అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయిన వచ్చిన మైనారిటీ రోహింజ్యా ముస్లిం కుటుంబాల్లో యాస్మిన్ కుటుంబం ఒకటి.

ఎక్కువ మంది శరణార్థులు పొరుగునున్న బంగ్లాదేశ్, భారత్‌లాంటి దేశాలకు వలసవెళ్లిపోయారు. అక్కడ వారు శరణార్థులుగా జీవిస్తున్నారు.

రోహింజ్యాలు
ఫొటో క్యాప్షన్, రెహమాన్

ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ, ప్రపంచంలో ఏ దేశానికీ చెందని అతిపెద్ద ప్రజల సమూహమైన రోహింజ్యా ముస్లింల సమస్యకు పరిష్కారం దొరకలేదు.

యాస్మిన్ తండ్రి రెహమాన్.. మిమన్మార్‌లో వ్యాపారం చేసేవారు. ప్రజలపై సైన్యం దాడులు మొదలుపెట్టడంతో.. భారీగా అక్కడి నుంచి పారిపోయిన 7,00,000 మంది రోహింజ్యాలలో ఆయన కూడా ఒకరు.

రోజులపాటు నడిచిన తర్వాత, రెహమాన్, ఆయన భార్య మహ్ముదా.. నైరుతి బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ శరణార్థుల శిబిరానికి చేరుకోగలిగారు. ఈ ప్రాంతం మియన్మార్‌కు సరిహద్దుల్లోనే ఉంటుంది.

అయితే, అక్కడ వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆహారం కోసం వారు స్వచ్ఛంద సంస్థలపైనే ఆధారపడేవారు. శరణార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఆహార కొరత నిత్యం వారిని వేధిస్తూ ఉండేది.

రోహింజ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

బంగ్లాదేశ్‌కు చేరుకున్న ఏడాది తర్వాత రెహమాన్ దంపతులకు యాస్మిన్ జన్మించింది.

అయితే, రోహింజ్యా ముస్లింలు మళ్లీ మియన్మార్‌కు వెళ్లిపోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒత్తిడిచేసేది.

మరోవైపు వేల మంది శరణార్థులను ‘‘భాసన్ చార్’’గా పిలిచే ఒక దీవికి తరలించింది. అయితే, ఈ దీవిని ఒక జైలుగా శరణార్థులు చెబుతుంటారు.

అక్కడి నుంచి వెళ్లిపోతే, తమ పాప భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని రెహమాన్ భావించారు.

మొత్తానికి 2020లో యాస్మిన్ పసిపాపగా ఉన్నప్పుడే వీరు బంగ్లాదేశ్ నుంచి పొరుగునున్న భారత్‌లోకి అడుగుపెట్టారు.

భారత్‌లో 10,000 నుంచి 40,000 మంది రోహింజ్యాలు జీవిస్తున్నారని అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ అంచనాలను ఒక్కో సంస్థ ఒక్కోలా చెబుతోంది. అయితే, 2012 నుంచీ చాలా మంది రోహింజ్యాలు భారత్‌లో ఉంటున్నారు.

కొంతకాలం ముందువరకు రోహింజ్యాలు ఎలాంటి వివాదాల్లో ఇరుక్కోకుండా ఇక్కడ జీవించేవారు. అయితే, ఇటీవల దిల్లీలోని ఈ శరణార్థులకు ఇళ్లు, వసతులు, పోలీసుల భద్రత కల్పిస్తామని ఒక కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. దీంతో మళ్లీ రోహింజ్యాల పేరు వార్తల్లోకి వచ్చింది.

రోహింజ్యాలు
ఫొటో క్యాప్షన్, ముగ్గురు పిల్లలతో కొతీజా

ఆ కేంద్ర మంత్రి ప్రకటనకు గంటల వ్యవధిలోనే కేంద్రంలో అధికారంలోనున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్పందించింది. తాము ఎలాంటి వసతులను రోహింజ్యా ముస్లింలకు కల్పించబోవడంలేదని పేర్కొంది. మరోవైపు వారిని ‘‘అక్రమ వలసదారులు’’గా అభివర్ణించింది. వారిని వారి స్వదేశానికి లేదా నిర్బంధ కేంద్రాలకు పంపిస్తామని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో రెహమాన్ లాంటి రోహింజ్యాల కుటుంబాలు తీవ్రమైన నిరాశలో కూరుకుపోయాయి.

‘‘నా బిడ్డ భవిష్యత్ అంధకారంలో పడింది’’అని రెహమాన్ చెప్పారు. ఎలాంటి పరుపూ లేని దెబ్బతిన్న కర్ర మంచంపై కూర్చుని ఆయన మాతో మాట్లాడారు.

‘‘మేం భారత ప్రభుత్వానికి కూడా అక్కర్లేదు. అయితే, మమ్మల్ని మియన్మార్‌కు పంపించే కంటే, ఇక్కడే చంపేయండి’’అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

రోహింజ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఎవరూ సిద్ధంగా లేరు..

లక్షల సంఖ్యలో ఉన్న రోహింజ్యాలకు ఆశ్రయం ఇచ్చేందుకు ఏ దేశమూ సిద్ధంగా లేదు. ఈ విషయంపై గత వారం బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా.. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ మిషెల్ బాచెలెట్‌తో మాట్లాడారు. తమ దేశంలోని శరణార్థులను మియన్మార్‌కు వెనక్కి పంపించాలని ఆమె అన్నారు.

అయితే, ఇలా వెనక్కి పంపించడం రోహింజ్యా శరణార్థులకు మంచిదికాదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ఎందుకంటే మియన్మార్‌లో ఇంకా ఘర్షణ వాతావరణమే ఉందని వివరిస్తోంది.

ఫిబ్రవరి 2021లో తిరుగుబాటుతో మియన్మార్ సైన్యం మరోసారి దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంది. రోహింజ్యాలపై అరాచకాలకు కూడా ఈ సైన్యమే కారణమని మొదట్నుంచీ ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటికీ వందల మంది శరణార్థులు ప్రమాదకరమైన సముద్ర మార్గాల ద్వారా మలేసియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు పారిపోతున్నారు.

మరోవైపు బంగ్లాదేశ్‌లోని శిబిరాల్లో శరణార్థుల సంఖ్య కూడా దాదాపు పది లక్షలకు పెరిగింది. వీరిలో సగం మంది పిల్లలే ఉన్నారు.

రెహమాన్‌లానే కొతీజా బేగమ్ 2017 ఆగస్టులో మియన్మార్ నుంచి ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోయి వచ్చారు. రోజులపాటు ఆహారం లేకుండా అలా నడుస్తూ ఆమె వచ్చారు.

కాక్స్ బజార్‌లోని ఒక చిన్న గదిలో ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె జీవిస్తున్నారు. ఆమె ఇంటి పైకప్పుగా ప్లాస్టిక్ షీట్ వేశారు. వర్షాలు పడేటప్పుడు నీరు అలా లోపలకు వస్తూనే ఉంటుంది.

రోహింజ్యాలు

తమ సొంతవూరిలో ఎదుర్కొన్న అరాచకాలు ఇప్పటికీ కొతీజాకి గుర్తున్నాయి.

‘‘సైన్యం మా ఇంటిలోకి ప్రవేశించి, మమ్మల్ని చిత్రహింసలు పెట్టింది. వారు మాపై కాల్పులు జరిపారు. దీంతో మేం పరిగెత్తాం. పిల్లలను దగ్గర్లోని నదిలోకి తోసేశారు. తమ దారిలోకి అడ్డుచ్చిన అందరినీ వారు చంపేశారు’’అని ఆమె చెప్పారు.

ఇతరుల్లానే కొతీజా కూడా ఆహారం కోసం స్వచ్ఛంద సంస్థలపైనే ఆధారపడేవారు. అయితే, ఆ సంస్థల దగ్గర బియ్యం, పప్పు నిల్వలు చాలా తక్కువగా ఉండేవి.

‘‘నా పిల్లలకు కడుపునిండా ఆహారం పెట్టలేకపోతున్నాను. మంచి బట్టలు కూడా ఇవ్వలేకపోతున్నాను. అనారోగ్యం చేసినప్పుడు వారికి మందులు కూడా అందడం లేదు’’అని ఆమె అన్నారు.

కొన్నిసార్లు పిల్లలు చదువుకోవడానికి పెన్నుల కోసం తనకు వచ్చే రేషన్ కూడా అమ్మేస్తున్నట్లు కొతీజా చెప్పారు.

ఇటీవల కాలంలో స్వచ్ఛంద, సహాయక సంస్థలకు అంతర్జాతీయంగా నిధులు నిలిపివేయడంతో పరిస్థితులు మరింత దిగజారాయని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. అయితే, ఇక్కడ శరణార్థులు పూర్తిగా అంతర్జాతీయ సంస్థలు అందించే సాయంపైనే ఆధారపడుతుంటారు.

పోషకాహారం, వసతులు, పారిశుద్ధ్యం, పనిచేయడానికి అవకాశాల కోసం ఇక్కడి శరణార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

మరోవైపు పిల్లల చదువులకు కూడా చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి. పిల్లలు స్కూలుకు వెళ్లకపోవడంతో ఒక జనరేషన్ మొత్తం చదువు కోల్పోయే ముప్పుంది.

‘‘పిల్లలు రోజూ స్కూలుకు వెళ్లడం లేదు. అసలు వారిలో అభివృద్ధి అనేది కనిపించడం లేదు. వారికి మంచి చదువు చెప్పించగలననే ఆశ తగ్గిపోతోంది’’అని కొతీజా అన్నారు.

వీడియో క్యాప్షన్, ‘చనిపోయిన వాళ్లను మా కళ్లెదుటే సముద్రంలో పారేశారు’

కాక్స్ బజార్‌ శిబిరాల్లోని పిల్లలకు మియన్మార్ పాఠ్య ప్రణాళికనే బోధిస్తున్నారు. బంగ్లాదేశ్ పాఠ్య ప్రణాళికను అనుసరించడం లేదు.

అయితే, పిల్లలను ఏదో ఒకరోజు మళ్లీ తమ సొంత ఊళ్లకు పంపించడానికే మియన్మార్ పాఠ్య ప్రణాళికలు అనుసరిస్తున్నారని కొందరు అంటున్నారు. మరికొందరు అయితే, ఈ పిల్లలు బంగ్లాదేశ్ జనాభాలో కలిసిపోకుండా చూసేందుకే ఇలాంటి విధానాలు అనుసరిస్తున్నారని చెబుతున్నారు.

‘‘చదువుకుంటే, వారి జీవితాలు బాగుపడతాయి. సంతోషంగా వారి కాళ్లపై వారే జీవించొచ్చు’’అని కొతీజా అన్నారు.

దిల్లీలోని రెహమాన్ కూడా ఇలానే అభిప్రాయపడుతున్నారు. తన నాలుగేళ్ల కుమార్తెను ఎత్తుకుని.. ‘‘ఈమెకు మంచి చదువు చెప్పించాలని అనుకుంటున్నాను. అప్పుడు ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చినట్లు అవుతుంది. నా జీవితం ఎలానో ఇలా అయిపోయింది’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో ఈ పచ్చబొట్లే ఎంతో మంది ప్రాణాలు కాపాడాయి

మరోవైపు తమపై వేధింపుల విషయంలో తమకు న్యాయం జరుగుతుందని రోహింజ్యా ముస్లింలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఊచకోతపై ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో మియన్మార్ సైన్యానికి వ్యతిరేకంగా ఒక కేసు దాఖలైంది.

అయితే, ఇప్పటికీ తమను మళ్లీ ఆ నరకానికి పంపించేస్తారని రోహింజ్యా ముస్లింలు ఆందోళన చెందుతున్నారు.

అక్కడ పరిస్థితులు సద్దుమణిగేవరకు.. కాస్త సాయం చేయాలని, దయతో వ్యవహరించాలని ప్రపంచ దేశాలను రెహమాన్ వేడుకొంటున్నారు.

‘‘ఇక్కడికి నేను దొంగతనం చేయడానికి రాలేదు. నా ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చాను’’అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)