బిల్కిస్ బానో రేప్ కేసు ఖైదీలను సత్ప్రవర్తన మీద విడుదల చేయడంపై గుజరాత్ ఎమ్మెల్యే రౌల్జీ ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, ANI
బిల్కిస్ బానో రేప్ కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం అగస్టు 15న సత్ప్రవర్తన కింద విడుదల చేసింది.
2002 గుజరాత్ అల్లర్లలో వారు బిల్కిస్ బానోను రేప్ చేయడంతో పాటు ఆమె మూడేళ్ల కుమార్తెను చంపినట్లు కోర్టు నిర్ధారించింది.
దోషుల్లో ఒకరైన రాధేశ్యామ్ షా.. తన శిక్షను తగ్గించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను ఇప్పటికే 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవించానని పేర్కొన్నారు. దాంతో అతడి శిక్షను తగ్గించే విషయం మీద నిర్ణయం తీసుకోవాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
సుప్రీంకోర్టు సూచన మేరకు గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బిల్కిస్ బానో కేసులో యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్న 11 మందిని విడుదల చేయాలని ఆ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. కమిటీ సిఫారసుల మేరకు ఆగస్టు 15న సత్ప్రవర్తన కింద ఆ ఖైదీలను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.
గోద్రా జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి, గోద్రా ఎమ్మెల్యే రౌల్జీ ఇతరులు ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రౌల్జీతో బీబీసీ ప్రతినిధి తేజస్ వైద్య మాట్లాడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, ckroulji/fb
బీబీసీ: ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు?
రౌల్జీ: జీవిత ఖైదీల్లో 14 ఏళ్లు జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీ ప్రవర్తన బాగా ఉండి, మంచి పనులు చేసి, వివాదాల్లో చిక్కుకోకుండా ఉంటే ఆ వ్యక్తిని విడుదల చేయవచ్చునని నిబంధనలు ఉన్నాయి.
నిబంధనల ప్రకారం ఆ 11 మంది ప్రవర్తన బాగా ఉంది. కోర్టు వేసిన శిక్షను ఆ నిస్సహాయులు అనుభవిస్తున్నారు. జైలులో వారి నడవడిక బాగుంది. వారికి ఎటువంటి నేరచరిత్ర లేదు. వీటిని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వారిని విడుదల చేయాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
నాతోపాటు జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి, జైలర్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. కమిటీ నాలుగు సార్లు భేటీ అయింది. 11 మంది మీద శిక్ష తగ్గించడంపై గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు 1992 నాటి మార్గదర్శకాలను కూడా పరిగనణలోకి తీసుకున్నాం.
బీబీసీ: ఎవరైనా వ్యతిరేకించారా?
రౌల్జీ: కమిటీలో ఒక్క మెంబర్ కూడా 11 మందిని వదిలిపెట్టాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బీబీసీ: రేప్ దోషులను సత్ప్రవర్తన కింద వదిలి పెట్టొచ్చా?
రౌల్జీ: జైలులో ఉన్న 11 మందిలో కొందరు అమాయకులు. వారు నేరం జరిగిన చోట కూడా లేరు. రెండు వర్గాల మధ్య ఈర్ష్య కూడా తలెత్తింది. 'భట్' అనే వ్యక్తి నేరం జరిగిన సమయంలో అసలు లేరు అనే విషయం నాకు తెలిసింది.
బీబీసీ: కానీ వారిని నేరస్తులుగా కోర్టు ధ్రువీకరించింది కదా? నేరచరిత్ర లేదని శిక్ష తగ్గించొచ్చా?
రౌల్జీ: కోర్టు పత్రాల్లోని మెరిట్స్, డీమెరిట్స్‌ను రీఎగ్జామిన్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వారు ఆ కేసును గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేశారు. చట్టబద్ధంగానే వారిని విడుదల చేయొచ్చని.. గతంలోని బదిలీ, తీర్పు పత్రాలను పరిశీలించిన జడ్జి, కలెక్టర్ తెలిపారు. కాబట్టి ప్రక్రియ అంతా నియమాల ప్రకారమే జరిగింది.
బీబీసీ: వారంతా బ్రాహ్మణులని, మంచి సంస్కారం కలిగిన వారని మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు కదా?
రౌల్జీ: నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేం వ్యక్తుల కులం చూడం. నేను చేసిన వ్యాఖ్యలు బ్రాహ్మణుల కులానికి మొత్తంగా వర్తించవు. రేప్ జరిగిన సమయంలో అక్కడ లేని ఒక బ్రాహ్మణ వ్యక్తి గురించి మాత్రమే నేను అన్నాను. అతను అక్కడ లేకపోయినప్పటికీ అతని మీద నేరం మోపారు. అది నాకు తెలిసింది.
ఇవి కూడా చదవండి:
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- హరియాణా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 30 ఏళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా ఎలా దాక్కున్నాడు? చివరికి ఎలా చిక్కాడు?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














