బింబిసార రివ్యూ: రాక్షసుడి నుంచి రాముడిగా మారిన ఓ రాజు కథ

ఫొటో సోర్స్, Facebook/Nandamuri Kalyanram
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
టైమ్ ట్రావెల్ కథలు అనగానే ఓ ఆసక్తి మొదలైపోతుంది. ఆదిత్య 369 నుంచి పీకే వరకూ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ జోనర్‌ని పట్టుకోవాలే గానీ, ఎన్ని అద్భుతాలైనా చేసేయొచ్చు.
అయితే చాలా కాలంగా తెలుగులో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమా ఏదీ రాలేదు. టెక్నాలజీ పెరిగింది. బడ్జెట్లు పెరిగాయి. టైమ్ ట్రావెల్ కథలు చెప్పడానికి ఎక్కువ ఆస్కారమున్న కాలమిది. అందుకనేనేమో.. కల్యాణ్ రామ్ ఈ జోనర్‌లో ఓ కథని ఎంచుకున్నారు. అదే.. `బింబిసార`. ప్రతీ టైమ్ ట్రావెల్ కథలోనూ ఈకాలంలోని వ్యక్తి గతంలోకో, భవిష్యత్తులోకో వెళ్లడం చూశాం. ఈసారి అలా కాదు. చరిత్రలోని ఓ రాజు - ఈకాలంలోకి అడుగుపెడతాడు. అదే... `బింబిసార` కథలోని ప్రత్యేకత. మరి ఆ రాజు ఎవరు? ఈకాలనికి ఎందుకొచ్చాడు? కాలంతో సాగించిన ఈ ప్రయాణం రక్తికట్టిందా? లేదా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే!

ఫొటో సోర్స్, Facebook/Nandamuri Kalyanram
రక్తం మరిగిన రాక్షస రాజు
అది 5వ శతాబ్దం. త్రిగర్తల సామ్రాజ్యానికి అధినేత బింబిసార (కల్యాణ్‌రామ్). రక్తం మరిగిన రాజు. అధికార దాహం, అహం, అణువణువుగా పొంగి పొర్లుతుంటాయి. తనకు ఎదురు తిరిగిన సొంత తమ్ముడు దేవదత్తా (కల్యాణ్ రామ్)నే అడ్డు తొలగించుకోవాలని చూస్తాడు. ఓ పసిపాపని కూడా క్రూరంగా చంపేస్తాడు. అలాంటి రాజు, మాయా దర్పణం ద్వారా ఈ కాలానికి వస్తాడు.
5వ శతాబ్దపు రాజు 2022లోకి ఎందుకు వచ్చాడు? వచ్చాక ఏం చేశాడు? అనేదే `బింబిసార` కథ. దీనికి ఓ ఉప కథ కూడా తోడైంది. వైద్య రహస్యాలు తెలిసిన సంజీవని పుస్తకం కోసం కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ఆ పుస్తకం జాడ కేవలం బింబిసారుడికే తెలుసని 5వ శతాబ్దానికి చెందిన బింబిసారుడు ఈకాలానికి వస్తాడని, ఆ పుస్తకం ఇస్తాడని ఓ ముఠా ఎదురు చూస్తుంటుంది. ఇంతకీ సంజీవని పుస్తకం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఆ పుస్తకం బింబిసారుడి దగ్గర ఎందుకు ఉంది? అనేది మరో కథ.
ఆ కాలం నుంచి.. ఈ కాలంలోకి
5వ శతాబ్దపు బింబిసారుడి కథతో సినిమా మొదలవుతుంది. బింబిసారుడి అరాచకాల్ని చూపిస్తూ.. కథని మొదలెట్టారు. ఓ దశలో బింబిసారుడిని చూస్తే భయం వేస్తుంది. ఇంత క్రూరంగా ఉన్నాడేంటి? అనిపిస్తుంది. ఆ పాత్రలోకి దర్శకుడు ప్రేక్షకుడ్ని అంతగా లాక్కెళ్లిపోయాడు. మాయా దర్పణంలో నుంచి బింబిసారుడు ఈ కాలానికి వచ్చాక కథ మరో రూపం దాలుస్తుంది. త్రిగర్తల సామ్రాజ్యం, అక్కడి సెట్టింగులు, బింబిసారుడు చేసే యుద్ధాలు ఇవన్నీచూస్తే బాహుబలి సినిమా గుర్తుకు రాకుండా పోదు.
సంజీవనీ పురం అని చెప్పగానే ఇటీవల విడుదలైన `ఆచార్య`లోని పాద ఘట్టం రిఫరెన్సులు కనిపిస్తాయి. మాయా ద్వీపం కథ.. ఆదిత్య 369ని జ్ఞప్తికి తెస్తుంది. ఇదో చందమామ కథలా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి, లాజిక్కుల్ని కాసేపు పక్కన పెట్టేస్తే పాత సినిమా ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించడం కాస్త ఇబ్బంది పెట్టే విషయమే.
కాకపోతే, ఓ క్రూరమైన రాజు మాయా దర్పణంలో పడి, ఈకాలానికి వచ్చి మనిషిగా ఎలా మారాడు? అనే పాయింట్‌ని దర్శకుడు చెబుదామని అనుకున్నాడు. ఆ పాయింట్ అయితే నిజంగానే కొత్తగా అనిపిస్తుంది. మాయా దర్పణం నుంచి ఈ కాలంలోకి వచ్చాక ఆ హీరో చేసే విన్యాసాలు కాస్త రొటీన్‌గా అనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Facebook/Nandamuri Kalyanram
తేలిపోయిన పాత్రలు
దర్శకుడు ఎంత ఆలోచించినా లాజిక్‌లు వదిలేసి, మ్యాజిక్ చేసే చాన్స్ ఈ కథలో ఉంది. ఎలాగూ చందమామ టైపు కథ కాబట్టి - ప్రేక్షకులు అందులోని మాయలూ, మంత్రాల్ని ఎంజాయ్ చేస్తారు. ఆ అవకాశాన్ని దర్శకుడు పూర్తిగా వినియోగించుకోలేదనిపిస్తుంది. ద్వితీయార్థంలో కథని నడిపించడానికి చైల్డ్ సెంటిమెంట్‌ని వాడుకున్నాడు. అది కూడా రొటీన్ వ్యవహారమే. యమలీలలో అమ్మ సెంటిమెంట్ కథని నడిపించడానికి బాగా ఉపయోగపడింది. అలాగని అది కథకు దూరంగా వెళ్లలేదు. ఘటోత్కచుడులో కూడా అంతే. అక్కడ కూడా ఛైల్డ్ సెంటిమెంటే. కానీ, ఇక్కడ మాత్రం ఆ తూకం కుదర్లేదు. కేవలం బింబిసారుడిపై దృష్టి పెట్టిన దర్శకుడు మిగిలిన పాత్రల్ని మర్చిపోయాడు. కనీసం ఇద్దరు కథానాయికల పాత్రల్ని సైతం సరిగా ఆవిష్కరించలేకపోయాడు. సంయుక్త మీనన్ ఎందుకు ఉందో అర్థం కాదు. పోలీస్ అయ్యుండి బింబిసారుడి సాయం ఎందుకు కోరిందో తెలీదు. అసలు ఆ పాత్రని ఏమాత్రం పట్టించుకోలేదని అనిపిస్తుంది.
మరో కాలం నుంచి ఈ కాలానికి బింబిసారుడు వస్తాడని గ్రహించిన మాంత్రికుడు, బింబిసారుడు ఎక్కడున్నాడో తెలుసుకోలేడా? అతన్ని పట్టుకోవడానికి ఓ అమాయకపు అతి తెలివి డిటెక్టివ్‌ని నియమించడం మరీ బేలగా ఉంది. పోనీ ఆ డిటెక్టివ్ (బ్రహ్మాజీ) పాత్ర నుంచి ఏమైనా వినోదం పండిందా అంటే అదీ లేదు. బింబిసారకు, పాప కుటుంబానికీ ఉన్న లింకుని వాళ్ల మధ్య ఎమోషన్స్‌నీ మరింత బలంగా చూపించాల్సింది. అప్పుడు పాపకు ఏమైనా అవుతుందేమో? అనే కంగారు ప్రేక్షకుల్లో కలిగేది. క్లైమాక్స్‌కి అది చాలా అవసరం. ఇలాంటి హోం వర్క్ దర్శకుడు ఏమాత్రం చేయలేదు. మాయా దర్పణం నుంచి ఈలోకంలోకి అడుగుపెట్టిన బింబిసారుడు... మళ్లీ మాయా దర్పణం నుంచే తన కాలానికి వెళ్లిపోవడం ఈ కథలో చాలా కీలకమైన మలుపు. దాన్ని అత్యంత పేలవంగా, ఎలాంటి ఆసక్తి లేకుండా తీశాడు. పతాక సన్నివేశాలు మరింతగా తేలిపోయాయి. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌లోనే క్లైమాక్స్ జరిగిపోయింది. పార్ట్ 2 ఉంది కాబట్టి దానికి సంబంధించిన లీడ్‌ని సంజీవని పుష్ఫం రూపంలో ఉంచుకున్నాడు దర్శకుడు. ఆ పుష్పాన్ని చూశాక ఈ కథ పార్ట్ 2లో ఎలా సాగబోతోందో ఈజీగానే అర్థమైపోతుంది.

ఫొటో సోర్స్, Facebook/Nandamuri Kalyanram
బింబిసారుడుదే భారం
బింబిసార పాత్రే ఈ కథకు బలం. దర్శకుడు కూడా దానిపైనే బాగా ఫోకస్ చేశాడు. ఆ పాత్రకు కల్యాణ్ రామ్ న్యాయం చేశాడు. బింబిసార పాత్రలోని విభిన్నమైన కోణాల్ని బాగా ఆవిష్కరించాడు. ఓ అహంకారపూరితమైన రాజుగా, తన అహం విడిచిన మామూలు మనిషిగా రెండు పార్శ్వాలనూ చక్కగా పలికించాడు. తన స్టయిలింగ్ కుదిరింది. కాస్ట్యూమ్స్ నప్పాయి. అయితే కేథరిన్, సంయుక్త మీనన్ పాత్రలకు దర్శకుడు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ పాత్రల్ని సరిగా డిజైన్ చేయలేదు. కాస్తలో కాస్త శ్రీనివాసరెడ్డి నవ్విస్తాడు. సెకండాఫ్‌లో చమ్మక్ చంద్ర ఎపిసోడ్ ఒకటి పేలింది. ప్రకాష్‌రాజ్‌ది కూడా రొటీన్ పాత్ర. బలమైన విలన్ లేకపోవడం, ఉన్నా అరవడం, ఫోన్లో బెదిరించడం తప్ప ఏమీ చేయలేకపోవడం మరో మైనస్.
టెక్నికల్ గా ఓకే...!
రెండు కాలాల మధ్య జరిగిన కథ ఇది. 5వ శతాబ్దం నాటి వాతావరణాన్ని, రాజమందిరాల్ని ప్రతిబింబించే సెట్లు చాలానే వేశారు. విజువల్స్ ఓకే అనిపిస్తాయి. కొన్నిసార్లు అయితే మరీ అట్ట ముక్కల్ని పేర్చిన ఫీలింగ్ వస్తుంది. బాహుబలిలోని మహిష్మతీ సామ్రాజ్యాన్ని పోలిన సెట్లు, ఆ ఎఫెక్టు తీసుకురావడానికి ప్రయత్నించారు. ఛోటా కె.నాయుడు లాంటి అనుభవం ఉన్న కెమెరామెన్ తోడవ్వడం వల్ల లుక్ రిచ్‌గా వచ్చింది. కత్తి యుద్ధాలకు కొదవ లేదు. ఫైట్స్ ని బాగా డిజైన్ చేశారు. అయితే ఆ ఫైట్స్‌లో కూడా ఎమోషన్ ఉండేలా చూస్తే బాగుండేది. దర్శకుడు కొత్త వాడు. ఇలాంటి కథని డీల్ చేయడానికి ఇంకా అనుభవం ఉండాల్సింది. తన పరిధి మేర బాగా చేశాడు. ఎత్తుకున్న పాయింట్ బాగున్నా, ఆ కథని నడిపించడానికి ఇంకొన్ని ఆసక్తికరమైన సీన్లు రాసుకొని ఉండాల్సింది. తొలి సగం ఓకే అనిపించినా, ద్వితీయార్థంలో ఎమోషన్ మిస్సవ్వడంతో బింబిసారుడి ప్రయాణం సగమే విజయవంతం అయ్యిందని చెప్పొచ్చు.
చందమామ కథలాంటి సినిమా ఇది. ఆదిత్య 369 తరహాలో కాలాన్ని దాటుకొని వచ్చిన కథానాయకుడి కథ. లాజిక్కులు వెదుక్కోకుండా, టైమ్ పాస్ కోసమైతే సరదాగా చూడొచ్చు. అంతకంటే ఎక్కువ ఆశలు పెట్టుకొంటే మాత్రం కష్టం.
ఇవి కూడా చదవండి:
- ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి, భారత్ వృద్ధి మందగమనంలో ఉందా?
- 'స్పేస్ ఎక్స్ క్యాప్సూల్' శకలం: అంతరిక్షం నుంచి జారింది.. పొలంలో పడింది..
- సీఎంకు ప్రత్యేక గది, హెలీప్యాడ్, దాదాపు 10లక్షల సీసీ కెమెరాల అనుసంధానం....కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలేంటి, దానిపై విమర్శలేంటి?
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- జూ ఎన్‌క్లోజర్‌లో మొసళ్లకు బదులు అందమైన హ్యాండ్‌బ్యాగ్ పెట్టారు, సందర్శకులు దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













