మార్లిన్ మన్రో: హాలీవుడ్ స్టార్ మరణం వెనుక దాగిన మిస్టరీ ఏమిటి, నాటి అమెరికా అధ్యక్షుడైన కెన్నడీ సోదరుల పేరు ఎందుకు వినిపిస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బియాట్రిజ్ డియేజ్
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
''ఒక జీవిత కథను మనం ఎలా రాస్తాం? నిజాలు వెలుగు చూడటం అరుదు. అబద్ధాలు ప్రచారమవుతూ ఉంటాయి. నిజంతో మొదలు పెట్టకపోతే మరెక్కడి నుంచి మొదలు పెట్టాలనేది తెలుసుకోవటం కష్టం.''
మార్లిన్ మన్రో చనిపోవటానికి ముందు తన చివరి ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. ఆమె చనిపోయి ఆగస్టు 5వ తేదీకి 60 ఏళ్లు నిండాయి.
మార్లిన్ మన్రో అసలు పేరు నార్మా జీన్ బేకర్. చనిపోయేటప్పటికి ఆమె వయసు 36 సంవత్సరాలు. ఆమె జీవితమంతా వివాదాలమయంగానే సాగింది.
ప్రపంచమంతా కోట్లాది మంది అభిమానులు ఆరాధించిన స్టార్ ఆమె. ఎన్నో మానసిక, భావోద్వేగ సమస్యలను ఎదుర్కొన్నారు. ఆ సమస్యలకు తన చిన్నప్పటి పరిస్థితులు కారణమని స్వయంగా చెప్పారు. అసాధారణమైన కీర్తి కూడా ఆ సమస్యలకు కొంత వరకూ కారణం.
ఓ ఉదయం ఆమె ఒంటరిగా చనిపోయారు. 'ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు' అని అధికారికంగా నమోదు చేశారు. ఆమె మరణం చుట్టూ ఎన్నో వదంతులు వ్యాపించాయి. మరెన్నో కుట్ర సిద్ధాంతాలు వినిపించాయి. అవన్నీ ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
ఓ హాలీవుడ్ సినిమా తీయటానికి అవసరమైన అన్ని మసాలాలు ఇందులో ఉన్నాయి: సెక్స్, పాలిటిక్స్, సీక్రెట్ ఏజెంట్లు, మాఫియా.. కెన్నడీల వంటి శక్తివంతమైన కుటుంబం పాత్ర.
ఈ మిస్టరీని ఛేదించటం కోసం బ్రిటిష్ జర్నలిస్ట్ ఆంథొని సమ్మర్స్ 1980లలో లోతైన పరిశోధనలో తలమునకలయ్యారు.

ఫొటో సోర్స్, Netflix
ఆయన ఏం కనుగొన్నారు?
మార్లిన్ మన్రో మరణం మీద దర్యాప్తును పునఃప్రారంభిస్తున్నామని లాస్ ఏంజెలెస్ డిస్ట్రిక్ట్ అటార్నీ ప్రకటించారు. ఆ ప్రకటనను కవర్ చేయటానికి ఈ జర్నలిస్ట్ హాలీవుడ్ వెళ్లారు.
అది 1982. అప్పటికి మార్లిన్ చనిపోయి 20 ఏళ్లయింది.
''నా ఫేవరేట్ నటుల్లో మార్లిన్ లేరు. ఆ కాలంలో నటాలీ వుడ్, ఇతర నటులను నేను ఎక్కువ ఇష్టపడేవాడ్ని'' అని బీబీసీ ముండోతో చెప్పారు ఆంథొని.
''నేను లాస్ ఏంజెలెస్ వెళ్లాను. డిస్ట్రిక్ట్ అటార్నీ ఏం చేస్తున్నారనే అంశాన్ని పరిశీలించటం మొదలుపెట్టాను. అయితే ఈ కథ నేను అనుకున్నదానికన్నా చాలా విస్తారమైనదని, మరింత సంక్లిష్టమైనదని నాకు త్వరగానే అర్థమైంది'' అన్నారాయన.
''అంతేకాదు ఆమె జీవితాన్నంతా పత్రికల్లో పూర్తిగా కవర్ చేయలేదని.. తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉందని కూడా నాకు అవగతమైంది'' అని చెప్పారు.
ఆయన ఒక కారు కొన్నారు. మనుషులను కలవటం, ఫోన్లు చేయటం మొదలుపెట్టారు. కానీ ఆ విషయంలో మాట్లాడటానికి చాలా మంది తిరస్కరించేవారు. ఆయనకు దూరంగా ఉండటానికి ప్రయత్నించేవారు. ఇన్నేళ్లు గడిచినా మార్లిన్ మరణం అంశం భయాలు, అనుమానాలను రేకెత్తిస్తోందని ఆయనకు తెలిసివచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
కానీ ఆంథోని పట్టువిడువలేదు.
చివరికి 700 మందికి పైగా వ్యక్తులను ఇంటర్వ్యూ చేయగలిగారు. వారిలో చాలా మందికి మార్లిన్ చివరి రోజులు, ఆమె జీవితపు చివరి ఘడియల గురించి చాలా కొద్దిగా తెలుసు. ఆమె హౌస్‌కీపర్ యూనిస్ ముర్రే, మార్లిన్‌కు చివరి సైకియాట్రిస్ట్ డాక్టర్ రాల్ఫ్ గ్రీన్సన్ కుటుంబం వంటి వారు వీరిలో ఉన్నారు.
అలా చేసిన పరిశోధనతో ఆంథోని 1985లో.. 'గాడెస్: ద సీక్రెట్ లైవ్స్ ఆఫ్ మార్లిన్ మన్రో (దేవత: మార్లిన్ మన్రో రహస్య జీవితాలు) అనే పేరుతో ఒక పుస్తకం ప్రచురించారు.
ఆ పుస్తకానికి పలుమార్లు అదనపు సమాచారం జోడిస్తూ కొత్తగా ప్రచురణలు తెచ్చారు. ఇటీవలి నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ 'ద మిస్టరీ ఆఫ్ మార్లిన్ మన్రో: ది అన్‌హర్డ్ టేప్స్'కి ఈ పుస్తకమే ఆధారమైంది.
''ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారని నమ్మించే అంశాలేవీ నాకు కనిపించలేదు. కానీ ఆమె మరణానికి దారి తీసిన పరిస్థితులను ఉద్దేశపూర్వకంగా దాచేశారని మాత్రం నేను కనిపెట్టాను. ఆమెకు కెన్నడీ సోదరులతో ఉన్న కనెక్షన్ కారణంగానే ఆ వివరాలను దాచేశారని ఆధారాలు సూచిస్తున్నాయి'' అంటారు ఆంథొని.
ఆయన మాటల అర్థమేమిటి?

ఫొటో సోర్స్, Netflix
మార్లిన్ మన్రో - కెన్నడీ సోదరులు
మార్లిన్ మన్రో మరణం చుట్టూ అల్లుకున్న మిస్టరీకి కేంద్ర బిందువు.. జాన్ కెన్నడీ, రాబర్ట్ 'బాబీ' కెన్నడీలతో ఆమెకు ఉన్నట్లుగా చెప్తున్న సంబంధం. ఆ సమయంలో జాన్ కెన్నడీ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా.. రాబర్ట్ కెన్నడీ అమెరికా అటార్నీ జనరల్‌గా ఉన్నారు.
కెన్నడీల బావ పీటర్ లాఫోర్డ్‌తో మార్లిన్ మన్రోకు పరిచయముంది. మలీబు బీచ్‌లో పీటర్‌కు చెందిన భవనంలో మన్రో, కెన్నడీలు కొంత ఎక్కువగానే కలిశారని రూఢిగా చెప్పగలిగే ప్రత్యక్ష వర్గాలు ఆంథొనితో మాట్లాడాయి.
కెన్నడీ సోదరులు ఇద్దరితోనూ మన్రోకు రొమాంటిక్ సంబంధాలు ఉన్నాయని ఇంకొందరు కూడా ఆయనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తొలుత జాన్ కెన్నడీతోనూ, ఆ తర్వాత బాబీ కెన్నడీతోనూ ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు చెప్పారు. అయితే ఈ వాదనలను కెన్నడీ కుటుంబం కొట్టివేసింది.
ఆంథొని రికార్డు చేసిన ఇంటర్వ్యూల్లో.. ప్రైవేటు డిటెక్టివ్‌ల, ఇన్ఫార్లర్లు, ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ల వాంగ్మూలాలు ఉన్నాయి. కెన్నడీల మీద, మార్లిన్ మన్రో మీద రహస్యంగా నిఘా ఉండేదని వారు బాహాటంగానే చెప్పారు.
ఇటు చట్టం అమలు చేసే సంస్థలు, అటు మాఫియా గ్రూపులు.. మార్లిన్ మన్రో ఇంట్లోనూ, పీటర్ లాఫోర్డ్ భవనంలోనూ మైక్రోఫోన్లు అమర్చాయని మార్లిన్ మృతి కేసు దర్యాప్తులో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న ఫ్రెడ్ ఒటాష్, జాన్ డానాఫ్ వంటి అధికారులు ఆంథోనికి వివరించారు. ఏదైనా స్కాండల్ ఉంటే.. అటార్నీ జనరల్‌గా ఉన్న బాబీ కెన్నడీ మీద ఒత్తిడి తేవటానికి దానిని ఉపయోగించుకోవాలన్నది మాఫియా గ్రూపుల ప్రణాళికగా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, NETFLIX
‘నన్ను వాడుకున్నారు... వంచించారు...’
దీనికితోడు.. మార్లిన్ మన్రో వామపక్ష భావజాలానికి చెందినవారన్న వాదనలు ఉండటంతో పాటు.. దేశాధ్యక్షుడిని, దేశ అటార్నీ జనరల్‌ను ఆమె కలుస్తుండటం 'భద్రతాపరమైన ఆందోళనలకు కారణం' అంటూ.. ఆమె మీద ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తూ ఉండేదని చూపే అధికారిక పత్రాలను కూడా ఆంథొని సంపాదించారు.
ఆంథొని దర్యాప్తు ప్రకారం.. కెన్నడీ సోదరులు ఈ పరిణామం కారణంగా మార్లిన్ మన్రోతో తమ సంబంధాలన్నిటినీ తెంచేసుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ నిపుణుడు రీడ్ విల్సన్ ఎఫ్‌బీఐ, సీఐఏ రెండిటి కోసం పనిచేశారు.
మార్లిన్ మన్రో చనిపోయిన రోజు.. ఆమె పీటర్ లాఫోర్డ్‌తో మాట్లాడిన చివరి సంభాషణలో.. తన మానాన తనను వదిలిపెట్టాలని, తనకు శాంతి కావాలని డిమాండ్ చేసినట్లు ఆంథొనీకి వెల్లడించారు రీడ్ విల్సన్.
''నన్ను వాడుకున్నారని నాకు అనిపిస్తోంది. నాకు నేను మాంసం ముక్కలాగా కనిపిస్తున్నా. ఒకరి నుంచి మరొకరికి నన్ను పంపిస్తున్నారని నాకు అనిపిస్తోంది'' అని మార్లిన్ ఆ సంభాషణలో చెప్పినట్లు రీడ్ విల్సన్ ఉటంకించారు.
''ఆ మాటలు.. ఆమె మనసు గాయపడినట్లు నాకు అనిపించలేదు. తనను వాడుకున్నారని, తనకు అబద్ధం చెప్పారని ఆమె భావించినట్లుగా అనిపిస్తుంది'' అని విల్సన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Netflix
ఆమెను హత్య చేయటానికి కుట్ర జరిగిందా?
కెన్నడీ సోదరులను ఇబ్బందుల పాలు చేయగల వ్యక్తిగా, ఇంకా చెప్తే వారికి ప్రమాదకరమైన వ్యక్తిగా మార్లిన్ మారి ఉండవచ్చుననే భావన.. ఆమెది హత్య అనే వాదనకు ఊపునిచ్చింది.
అయితే.. దానిని బలపరిచే ఆధారాలేవీ లేవని ఆంథొని అంటారు.
''ఆమెను హత్య చేశారనే వాదనలకు వాస్తవాల ప్రాతిపదిక లేదు. ఎవరినైనా హత్య చేశారని చెప్పటానికి కొంత ఆధారం ఉండాలి. ఇక్కడ అలాంటిదేమీ లేదు'' అని ఆయన బీబీసీ ముండోతో పేర్కొన్నారు.
అయితే.. ''ఆమె మరణానికి సంబంధించి ఓ కథను అల్లారని, ఆమె మరణానికి కారణమైన పరిస్థితులు ఎలా వచ్చాయనేది చెప్పలేదని.. మార్లిన్ చనిపోయిన రాత్రి నాటి సాక్ష్యాలు సూచిస్తున్నాయి'' అని చెప్పారు.
''ఆ సమయంలో చెప్పిన కథనం ప్రకారం.. హౌస్‌కీపర్ (పని మనిషి) యూనీస్ ముర్రే.. ఆగస్టు 5వ తేదీ ఆదివారం తెల్లవారటానికి ముందు మూడు గంటల సమయంలో (మార్లిన్ మన్రో గదిలో) లైటు వెలిగి ఉండటం చూసి, మార్లిన్ సైకియాట్రిస్ట్ రాల్ఫ్ గ్రీన్సన్‌కు ఫోన్ చేశారు. ఆయన వచ్చి కిటికలో నుంచి మార్లిన్ గదిలోకి చూడగా.. ఆమె మంచం మీద చనిపోయి ఉన్నట్లుగా కనిపించారు. అప్పుడు ఆయన కిటికీ అద్దం పగులగొట్టారు. కొంతసేపటి తర్వాత రాల్ఫ్ గ్రీన్సన్, యూనీస్ ముర్రేలు పోలీసులకు ఫోన్ చేశారు'' అని ఆంథొని వివరించారు.
అయితే ఆంథొనితో మాట్లాడిన ఇతర వ్యక్తులు కొందరు తమ వాంగ్మూలంలో భిన్నమైన కథనం వినిపించారు. వారిలో మార్లిన్ మన్రో ప్రెస్ ప్రతినిధి ఆర్థర్ జాకబ్స్ (ఆయన చనిపోయారు) భార్య నథాలీ జాకబ్స్ కూడా ఉన్నారు. ఆగస్టు 4వ తేదీ రాత్రి మార్లిన్ మన్రోకి ఏదో ఎమర్జెన్సీ ఉందంటూ ఆర్థర్ జాకబ్స్‌కు ఎవరో చెప్పారని.. నథాలీ జాకబ్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Netflix
ఆ నాలుగు గంటలు...
అలాగే.. మార్లిన్ మన్రో శనివారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్య చనిపోయి ఉంటారని.. భౌతికకాయానికి శవపరీక్ష నిర్వహించిన థామస్ నొగుచి నిర్ధరించారు. ఆ ప్రకారం చూస్తే.. మార్లిన్ చనిపోయిన తేదీ ఆగస్టు 5 కాకుండా ఆగస్టు 4 అవుతుంది.
అలాంటపుడు.. ఆగస్టు 4వ తేదీ రాత్రి 11 గంటల నుంచి.. అధికారిక కథనమైన ఆగస్టు 5వ తేదీ తెల్లవారుజాము 3 గంటల మధ్య ఉన్న.. ఆ 4 గంటల సమయంలో ఏం జరిగింది?
''ఈ పజిల్‌ను ఛేదించటానికి ఏఏ అంశాలను పరిశీలించాలనేది తెలుసుకోవటానికి, వాటికి పొంతనను సరిపోల్చుకోవటానికి నాకు చాలా కాలం పట్టింది'' అని ఆంథొని చెప్పారు.
''మార్లిన్ ఇంటికి ఒక అంబులెన్స్‌ను పంపించారని నాకు చాలా విశ్వసనీయంగా తెలిసింది. షేఫర్ అంబులెన్స్ కంపెనీ అధినేత స్వయంగా చెప్పారు. మరో ఏడుగురు ఈ విషయాన్ని ధృవీకరించారు. దీంతో ఆ సమయంలో ఏం జరిగిందనే దానిని మరింత వాస్తవికంగా విశ్లేషించగలిగాను'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
''అప్పుడు అక్కడ ఏం జరిగింది అనే దానిని వక్రీకరించారని నేను బలంగా నమ్ముతున్నా. అంటే వారు ఆమెను చంపారని కాదు. శవపరీక్ష నివేదిక ప్రకారం ఆమె శరీరానికి భౌతిక గాయాలేమీ లేవు. ఇంజక్షన్ల గుర్తులు కూడా లేవు'' అని చెప్పారు.
''ఆ నిర్ధారణకు వచ్చే ముందు.. మరి ఇంకేం జరిగి ఉండొచ్చు అనే ప్రశ్న వేసుకోవాలి. నిద్ర మాత్రలు కనిపించాయి. నెంబ్యూటల్ ఖాళీ సీసా ఒకటి దొరికింది. అది బార్బిట్యురేట్. ప్రమాదవశాత్తూ అధిక మోతాదు తీసుకోవటం వల్ల ఆమె చనిపోవటానికి పూర్తి ఆస్కారం ఉందని నాకు అనిపించింది. లేదంటే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండాలి. ఆమె గతంలో ఆ ప్రయత్నం చేశారు'' అని ఆంథొని అభిప్రాయపడ్డారు.
''ఈ రెండిటిలో ఏది వాస్తవమై ఉండొచ్చని నేను అనుకుంటున్నానని మీరు అడిగితే.. అది ఒక భయంకరమైన ప్రమాదం అయ్యే అవకాశమే ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లయితే.. ఆమె ఎవరితోనైనా ఆ విషయం చెప్పి ఉండేవారని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కనీసం ఒక నోట్ అయినా రాసిపెట్టేవారని నా అభిప్రాయం. అలాంటిదేమీ జరిగినట్లు కనిపించదు'' అన్నారాయన.
''ఏం జరిగిందనేది మనకు ఎప్పటికీ తెలియదని నేను అనుకుంటున్నా. కానీ ప్రమాదవశాత్తూ చనిపోయారనే వైపే నేను మొగ్గుతాను'' అని ఉద్ఘాటించారు.

ఫొటో సోర్స్, Netflix
మిస్టరీలో మరికొన్ని క్లూలు...
ఈ మిస్టరీలో మిస్సయిన కొన్ని అంశాలను ఆంథొని తన పుస్తకంలో తర్వాత చేర్చారు.
ఆ అంశాల్లో.. మార్లిన్ మన్రోకు కొన్ని సినిమాల్లో హెయిర్‌డ్రెసర్‌గా పనిచేసిన సిడ్నీ గిలారాఫ్ ఒకరు. మార్లిన్‌కు ఆయన నమ్మకస్తుడిగా కూడా ఉండేవారు.
''నేను 80లలో పదే పదే లాస్ ఏంజెలెస్‌లో తిరుగుతున్నపుడు.. అనుకోకుండా ఆయనను కలిశాను. మేం మాట్లాడుకున్నాం'' అని ఆంథొని గుర్తుచేసుకున్నారు.
''ఆయన ఎల్లప్పుడూ చాలా మంచిగా మాట్లాడేవారు. మార్లిన్ మన్రో మరణానికి ముందు సంగతలు గురించి చాలా సహకరించేవారు. కానీ ఆ రోజు రాత్రి సంఘటనల గురించి నేను అడినప్పుడు ఆయన చాలా విచిత్రంగా ప్రవర్తించారు'' అని చెప్పారు.
''ఏళ్లు గడిచిన తర్వాత సిడ్నీ గిలారాఫ్ తన జీవితకథలో మార్లిన్ చనిపోయిన రాత్రి గురించి వివరించారు. శనివారం రాత్రి 9:30 గంటలకు మార్లిన్ మన్రో తనకు ఫోన్ చేశారని, ఆమె నిరాసక్తంగా, కలత చెందినట్లుగా మాట్లాడారని రాశారు.''
''ఆమె నిస్పృహతో మాట్లాడుతూ.. తనను 'ప్రమాదాలు చుట్టుముట్టాయ'ని, 'ఉన్నత స్థానాల్లో ఉన్న మగవాళ్ల వంచనలు చుట్టుముట్టాయ'ని, అదే రోజు రాబర్ట్ తన ఇంటికి వచ్చారని, తనను బెదిరించాడని, తన మీద కేకలు వేశాడని.. ఆయనకు చెప్పారు'' అని ఆంథొని వివరించారు.

ఫొటో సోర్స్, AFP Archive/Getty Images
ఆ రోజు మధ్యాహ్నం రాబర్ట్ కెన్నడీ మార్లిన్ మన్రో ఇంటికి వచ్చాడని, వారి మధ్య పెద్ద వాగ్వాదం జరిగిందని మార్లిన్ మన్రో హౌస్‌కీపర్ కూడా ఆంథొనికి చెప్పారు.
''నేను మాట్లాడిన వారందరూ చెప్పిన దానిని బట్టి నా విశ్లేషణ ఏమిటంటే.. ఆ రోజు మార్లిన్ మన్రోను కలవటానికి బాబీ వెళ్లారు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆయన ఊరు విడిచి వెళ్లే వరకూ వారికి సమయం అవసరమైంది'' అని ఆంథొని పేర్కొన్నారు.
''మార్లిన్ చనిపోవటానికి కొన్ని గంటల ముందు రాబర్ట్ కెన్నడీ ఆమె ఇంట్లో ఉన్నాడని తెలిస్తే అది సమస్య అయి ఉండేది. అందువల్ల బాబీ ఊరు విడిచి వెళ్లే వరకూ వేచి ఉన్నారు. ఆమె మరణ సమయాన్ని కొన్ని గంటలు ఆలస్యంగా చెప్పటానికి అదొక కారణం'' అని చెప్పారు.
అదే రాత్రి పీటర్ లాఫోర్డ్ నివాసం నుంచి బయలుదేరిన హెలికాప్టర్ ఫ్లైట్ రికార్డులను ఆంథొని సంపాదించగలిగారు.
అయితే.. మార్లిన్ మన్రో చనిపోయిన రోజు తాను లాస్ ఏంజెలెస్‌లో ఉన్నానన్న విషయాన్ని రాబర్ట్ కెన్నడీ ఎన్నడూ అంగీకరించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆనందంగా ఉండటం ఎంత కష్టమో...
''ఆనందం.. అదేమిటో మనకు తెలుస్తుందా? ఒక మంచి నటిగా ఉండటానికి ప్రయత్నించటం ఎంత కష్టమో.. ఆనందంగా ఉండటానికి ప్రయత్నించటం కూడా అంతే కష్టం.''
మార్లిన్ మన్రో జీవితమంతా అద్భుత క్షణాలు, అంతులేని బాధ, అసంతృప్తులతో నిండి ఉంది. చిన్నప్పుడు తను పడిన కష్టాల గురించి మార్లిన్ తరచుగా చెప్తుండేవారు. తన తండ్రి ఎవరో తెలియకపోవటం, తన తల్లి పిచ్చాసుపత్రికి పరిమితవటం వంటి పరిస్థితులను ఆమె ఎదుర్కొన్నారు.
ఆమె చనిపోయిన 60 ఏళ్ల తర్వాత కూడా ఆమె మీద ఇంకా చాలా ఆసక్తి కనిపిస్తూనే ఉంది. ఆండీ వర్హాల్ గీసిన మార్లిన్ మన్రో పెయింటింగ్‌ను ఈ సంవత్సరం వేలంలో రికార్డు స్థాయిలో 19.5 కోట్ల డాలర్లు పెట్టి కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
1962 జూన్‌లో న్యూయార్క్‌లో నాటి అధ్యక్షుడు జాన్ కెన్నడీకి మార్లిన్ మన్రో 'హ్యాపీ బర్త్‌డే' పాడిన రాత్రి.. ఆమె ధరించిన డ్రెస్‌ను ఇటీవల కిమ్ కర్దాషియన్ ధరించి ఎంఈటీ గాలాకు హాజరయ్యారు.
వచ్చే సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్ 'బ్లాండ్' సినిమాను ప్రదర్శించబోతోంది. అందులో మార్లిన్ మన్రో పాత్రను అనా డి అర్మాస్ పోషించారు.
''మార్లిన్ మన్రో ఓ బ్రిలియంట్ వుమన్. చాలా మంచి నటి. ఆమె చాలా చదివారు. రాజకీయాల గురించి ఆమెకు తెలుసు. భరించలేని ఒత్తిడిని ఎదుర్కొన్న తెలివైన మహిళ ఆమె. చివరికి ఆ ఒత్తిడే ఆమెను కబళించిందని చెప్పొచ్చు'' అంటారు ఆంథొని.
ఇవి కూడా చదవండి:
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- తల్లిపై అత్యాచారం జరిగిన 28 ఏళ్ల తర్వాత నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయించిన కొడుకు
- హరియాణా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 30 ఏళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా ఎలా దాక్కున్నాడు? చివరికి ఎలా చిక్కాడు?
- హమీదా బాను: 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో కనిపించిన భారతీయ మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












