ఏంజలినా జోలీ నాకు హాని చేయాలని చూసింది – బ్రాడ్ పిట్

ఫొటో సోర్స్, PA Media
వైన్‌యార్డ్‌లోని తన వాటాను ఒక రష్యన్ ఓలిగార్క్‌కు విక్రయించడం ద్వారా ఏంజలినా జోలీ తనకు హాని చేయాలని చూసిందని ఆమె మాజీ భర్త బ్రాడ్ పిట్ కోర్టుకు పత్రాలు సమర్పించారు.
జోలీ, బ్రాడ్ పిట్ కలిసి 2008లో ఓ ఫ్రెంచ్ వైన్‌యార్డ్‌ను కొనుగోలు చేశారు. దీనికి ఆరేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే, వైన్‌యార్డ్‌లో వాటాను తన అనుమతి లేకుండా అమ్మేయడంపై పిట్ కోర్టును ఆశ్రయించారు.
ఆమె తన వాటాను అమ్మేయడంతో తాను ఒక రష్యన్ ఓలిగార్క్‌తో కలిసి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకర వ్యాపారం చేయాల్సి వచ్చిందని కోర్టు పత్రాల్లో పిట్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ వైన్‌యార్డ్‌లో వాటాను తన అనుమతి లేకుండా విక్రయించకూడదని జోలీ, తను ఒక అంగీకారం కుదర్చుకున్నట్లు పిట్ వివరించారు.
ఈ పత్రాలను పీఏ వార్తా సంస్థ బయటపెట్టింది. రష్యన్ ఓలిగార్క్ యూరి షెఫ్లెర్‌కు తన అనుమతి లేకుండానే జోలీ ఆ వాటాను విక్రయించారని పిట్ ఆ పత్రాల్లో పేర్కొన్నారు.
‘‘ఆమె చేసిన పనేమీలేదు’’
తను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన వ్యాపార సామ్రాజ్యాన్ని జోలీ ప్రమాదకరంగా వేరే వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూశారని కోర్టుకు బ్రాడ్ పిట్ చెప్పారు.
‘‘పిట్ మార్గ నిర్దేశంలో ఆ వైన్‌యార్డ్ వ్యాపారం కోట్ల డాలర్లకు విస్తరించింది. దీనిలో జోలీ పాత్ర ఏమీ లేదు’’అని పిట్ న్యాయవాది చెప్పారు.
‘‘తన వాటాను అమ్మేయడం ద్వారా పిట్‌కు జోలీ హాని చేయాలని చూశారు’’అని ఆ పత్రాల్లో పేర్కొన్నారు.
‘‘పిట్ ఏళ్లుగా కష్టపడి స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని కావాలనే ఆమె వేరే వాళ్ల చేతుల్లో పెట్టాలని అనుకున్నారు’’అని కూడా పత్రాల్లో పేర్కొన్నారు.
మార్వెల్ ఎస్టేట్‌గా పిలుస్తున్న ఈ వైన్‌యార్డ్ ఆగ్నేయ ఫ్రాన్స్‌లోని కారెన్స్‌లో ఉంది. వీరు 25 మిలియన్ యూరోలకు (రూ. 207.28 కోట్లుకు) దీన్ని కొన్నారు. దీనిలో 60 శాతం నిధులను పిట్ సమకూర్చగా.. మిగిలిన 40 శాతాన్ని జోలీ ఇచ్చారు.
అయితే, 2016లో వీరు విడాకులు తీసుకున్నారు.
జనవరి 2021లో ఈ వైన్‌యార్డ్‌లో తన వాటాను అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లు పిట్‌కు జోలీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
తాజా పత్రాలపై జోలీ న్యాయవాదులను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారు స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులు ఇచ్చే వారి దగ్గరకు ఎలా వెళ్లాయి’
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లి ఏం చేయాలి? ‘సూపర్ మామ్’గా ఉండటం కరెక్టేనా?
- పుతిన్ కాల్పుల విరమణ ప్రకటిస్తారా? యుక్రెయిన్ గెలుస్తుందా
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










