పార్లమెంటులో సోనియా గాంధీ అభ్యంతరం, గందరగోళం తర్వాత ఆ ప్రశ్నను తొలగించిన CBSE

sonia gandhi

ఫొటో సోర్స్, ANI

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి ఇంగ్లిష్ పరీక్షలో అడిగిన ఓ ప్రశ్న మహిళలను కించపరిచేలా ఉందంటూ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం పార్లమెంటులో ప్రస్తావించారు.

ఆంగ్ల ప్రశ్నాపత్రంలో ఒక పేరా మహిళలకు వ్యతిరేకంగా ఉందని ఆమె ఆరోపించారు. దాంతో, సీబీఎస్ఈ, విద్యా శాఖ ఈ ప్రశ్నను తొలగిస్తూ క్షమాపణలు తెలిపాయి.

విద్యా మంత్రిత్వ శాఖ ఈ మొత్తం వ్యవహారాన్ని పునఃసమీక్షించాలని, మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని సోనియా గాంధీ కోరారు.

ఆంగ్ల సాహిత్యం పరీక్షా పత్రంలో అడిగిన ఒక పేరా తమ మార్గదర్శకాలను అనుగుణంగా లేదని సీబీఎస్ఈ ఓ సర్క్యులర్ జారీ చేసింది.

"ఈ వ్యవహారంపై మాకొచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను నిపుణుల కమిటీ ముందుంచాం. వారి సిఫార్సు మేరకు ఆ పేరాను, దానికి సంబంధించిన ప్రశ్నను తొలగించాలని నిర్ణయించుకున్నాం. తొలగించిన ప్రశ్నకు విద్యార్థులకు పూర్తి మార్కులు ఇస్తాం" అని పేర్కొంది.

సీబీఎస్‌ఈ

ఫొటో సోర్స్, CBSE

ఫొటో క్యాప్షన్, సీబీఎస్‌ఈ

పరీక్షా పత్రంలో ఏముంది?

2021 డిసెంబర్ 11న ఆంగ్ల భాషలో సాహిత్యం పరీక్ష జరిగింది. అందులో ఒక పేరా ఇచ్చి, దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఆ పేరాలో వాక్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మహిళలని కించపరిచేలా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.

ఇదే అంశాన్ని సోనియా గాంధీ పార్లెమెంటులో జీరో అవర్‌లో లేవలెత్తారు.

"సీబీఎస్‌సీ 10వ తరగతి ఆంగ్ల పరీక్షలో అడిగిన పేరా సంప్రదాయ ఆలోచనలను సమర్థిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ పేరాలో కొన్ని వాక్యాలు ఇక్కడ ఉదహరిస్తాను..

'మహిళలకు స్వేచ్ఛ లభించడం వల్లనే అనేక సామాజిక, కుటుంబ సమస్యలు తలెత్తుతున్నాయి.'

'భార్యలు తమ భర్తల మాట వినట్లేదు. అందుకే పిల్లలూ, పనివాళ్లూ క్రమశిక్షణ లేకుండా తయారవుతున్నారు.'

ఆ పేరాలో ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. ఈ ప్రకరణం మొత్తం ఖండించదగ్గది. ఇందులో అడిగే ప్రశ్నలు అర్థరహితం" అంటూ సోనియా గాంధీ వివరించారు.

ఆమె ఈ ఉదాహరణలు చెబుతున్నప్పుడు "షేమ్" "షేమ్" అంటూ మిగతా పార్లమెంటు సభ్యులు నినాదాలు చేశారు.

విద్యా మంత్రిత్వ శాఖ తయారుచేస్తున్న సిలబస్‌లో, పరీక్షా పత్రాల్లో జెండర్ సెన్సివిటీ ప్రమాణాలను పునఃసమీక్షించాలని సోనియా గాంధీ పార్లమెంటును కోరారు.

సోషల్ మీడియాలో విమర్శలు

పదో తరగతి పరీక్షలో అడిగిన ప్రశ్నపై తొలుత ట్విట్టర్‌లో విమర్శలు ప్రారంభమయ్యాయి.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా దీనిపై స్పందించారు.

"ఇది నమ్మశక్యంగా లేదు. నిజంగా మనం పిల్లలకు ఇలాంటి పనికిమాలిక విషయాలు బోధిస్తున్నారా? మహిళలపై ఇలాంటి తిరోగమన భావాలను బీజేపీ ప్రభుత్వం సమర్థిస్తోందని స్పష్టమవుతోంది."

కాంగ్రెస్, డీఎంకే, ఐయుఎంఎల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ కూడా పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తాయి. ఈ ధోరణి మహిళలకు వ్యతిరేకం అంటూ పార్లమెంటు నుంచి వాకవుట్ చేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)