పీరియడ్స్ నొప్పులు మగవాళ్ళకు ఎందుకు వస్తున్నాయి?

పీరియడ్స్

ఫొటో సోర్స్, CUP OF LIFE

    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నెలసరి గురించి మాట్లాడడం.. ఆ సమయంలో కలిగే నొప్పి, బాధ బయటకు వ్యక్తం చేయడం ఇప్పటికీ నిషిద్ధమే. అది చేయకూడదని పనిగా చూస్తుంది సమాజం.

ఈ ఆలోచనలను మార్చేందుకు ఓ వినూత్న ప్రయత్నానికి నాంది పలికారు కేరళకు చెందిన కొందరు.

ఎర్నాకుళానికి చెందిన ఒక గ్రూపు.. నెలసరి సమయంలో కలిగే నొప్పిని కృత్రిమంగా అందించే యంత్రాలను (సిమ్యులేటర్లు) మాల్స్, కాలేజీలకు తీసుకెళ్లి పురుషులకు ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.

పీరియడ్స్ గురించి నిస్సంకోచంగా, బహిరంగంగా చర్చించే పరిస్థితి తీసుకురావాలన్నదే వారి ధ్యేయం.

ఈ ప్రచారానికి సంబంధించిన ఒక వీడియోలో పురుషులు నొప్పితో మెలికలు తిరిగుతూ కేకలు పెడుతుంటే, మహిళలు నవ్వుతూ వాళ్లను చూస్తూ నిల్చున్నారు.

"అబ్బా, అదేం నొప్పి! మళ్లీ జీవితంలో అలాంటి నొప్పి వద్దు" అన్నారు శరణ్ నాయర్. సోషల్ మీడియాలో ఇంఫ్లుయెన్సర్ అయిన శరణ్ ఒక మాల్‌లో పీరియడ్ నొప్పుల సిమ్యులేటర్ ప్రయత్నించారు.

కప్ ఆఫ్ లైఫ్ అనే ప్రాజెక్టులో భాగంగా ఈ సిమ్యులేటర్ ప్రయోగాన్ని ముందుకు తీసుకువచ్చారు. మెనుస్ట్రూవల్ కప్స్‌ను పంచుతూ, నెలసరి గురించి అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

స్థానిక కాంగ్రెస్ పార్టీ మంత్రి హిబీ ఈడెన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)తో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.

పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో మహిళల రుతుస్రావానికి సంబంధించిన సమస్యల గురించి చర్చించేది తక్కువ. కొని ప్రాంతాల్లో ఇప్పటికీ దాన్ని అపవిత్రంగా చూస్తారు. ఆ మూడు రోజులు వంటింట్లోకి రానివ్వరు. ఆలయాల్లో ప్రవేశం ఉండదు.

అయితే, పట్టణ ప్రాంతాల్లో కొంత మార్పు వస్తోంది. కానీ, అక్కడ కూడా చాలామంది మహిళలు పీరియడ్స్‌లో వచ్చే నొప్పుల గురించి ఆఫీసులో మగ ఉద్యోగులతో లేదా కుటుంబంలోని పురుషులతో మాట్లాడడానికి సంకోచిస్తారు.

ఈమధ్యే కొన్ని సంస్థలు మహిళా ఉద్యోగులకు పీరియడ్స్ లీవ్‌ను ప్రకటించడం ప్రారంభించాయి. కానీ, ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

కేరళలో ప్రస్తుత ప్రచారం సమాజంలో మార్పు తీసుకురావడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని రూపొందించిన లాయర్ సాండ్రా సన్నీ, "ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి సిమ్యులేటర్ కార్యక్రమం అన్నిటికన్నా సులువైన మార్గం" అంటున్నారు.

"కాలేజీకి వెళ్లే అబ్బాయిలతో పీరియడ్స్ నొప్పుల గురించి అడిగి చూడండి. వాళ్లు దీని గురించి మాట్లాడడానికి సంకోచిస్తారు. కానీ, ఈ సిమ్యులేటర్ వాడిన తరువాత వాళ్లు పీరియడ్స్ గురించి మాట్లాడడానికి ముందుకొస్తున్నారు" అన్నారామె.

పీరియడ్స్

ఫొటో సోర్స్, CUP OF LIFE

ఈ సిమ్యులేటర్‌కు రెండు వైర్లు ఉంటాయి. ఒకేసారి ఇద్దరికి ఇది అమర్చవచ్చు. నొప్పి స్థాయిలను పెంచేందుకు ఒక మీటర్ ఉంటుంది. ఒకటి నుంచి పది వరకు నొప్పి స్థాయిలు ఉంటాయి.

దీన్ని పెట్టుకున్న అమ్మాయిలు ఏ నొప్పి లేదన్నారని, అబ్బాయిలు మాత్రం హాహాకారాలు చేశారని, స్వయంగా తాను కూడా నొప్పి భరించలేకపోయానని నాయర్ చెప్పారు.

ఈ సిమ్యులేటర్ ప్రయోగం కారణంగా ఎర్నాకుళం కాలేజీల్లో మార్పు కనిపిస్తోందన్ని, అందరూ మహిళల పీరియడ్స్ గురించి నిజాయితీగా చర్చిస్తునారని నిర్వాహకులు తెలిపారు.

ఒక ప్రయివేటు కాలేజీలో ఇద్దరు అబ్బాయిలు సిమ్యులేటర్ పెట్టుకున్నాక, నొప్పిని భరించలేకపోయామని అన్నారు.

"వాళ్లు నొప్పి భరించలేక, సిమ్యులేటర్ ఆపేయమని కేకలు పెట్టారు" అని జీనత్ అనే విద్యార్థి బీబీసీకి చెప్పారు. విద్యార్థి సమూహానికి చెందిన నిర్వాహకుల్లో జీనత్ ఒకరు.

చాలావరకు ఇలాంటి స్పందనలే వస్తున్నాయని డాక్టర్ అఖిల్ మాన్యుయేల్ చెప్పారు. కప్ ఆఫ్ లైఫ్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారాయన.

"నొప్పి స్థాయి 9 ఉన్నప్పుడు కూడా అమ్మాయిలు కదల్లేదు, మెదల్లేదు. కానీ స్థాయి నాలుగు దాటేసరికే అబ్బాయిలు గగ్గోలు పెట్టేస్తున్నారు. నిజానికి, మహిళలు వాస్తవంలో భరించే నొప్పిలో 10 శాతం మాత్రమే సిమ్యులేటర్ సృష్టిస్తుంది" అని డాక్టర్ అఖిల్ వివరించారు.

దీనివల్ల మహిళలు ఎలాంటినొప్పులు భరిస్తున్నారో పురుషులకు అర్థమవుతుంది అంటున్నారు సన్నీ.

"సిమ్యులేటర్ ఒక యంత్రం. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయొచ్చు. కానీ, నిజ జీవితంలో మహిళలు ఈ నొప్పిని ఆపలేరు. ఈ ప్రయోగం వల్ల మగవాళ్లకు ఈ విషయం బాగా బోధపడుతుంది" అన్నారామె.

అయితే, భారతదేశంలో పీరియడ్ సిమ్యులేటర్ ప్రయోగం నిర్వహించడం ఇదే తొలిసారి కాదు.

గత ఏడాది ఈశాన్య భారతదేశంలో రెండు లాభాపేక్ష ఆశించని సంస్థలు పీరియడ్ థీమ్‌తో నిర్వహించిన కార్నివాల్‌లో సిమ్యులేటర్ ప్రయోగాన్ని చేపట్టాయి. అప్పటి నుంచి వారు పురుషులకు ఈ అంశంలో వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఉన్నారు.

జూలైలో అమెరికాకు చెందిన ఒక పీరియడ్ ప్రోడక్ట్ కంపెనీ 'సమ్‌డేస్' కూడా ఈ సిమ్యులేటర్ ప్రయోగం నిర్వహించింది. మహిళల పట్ల సహానుభూతిని పెంపొందించేందుకు పురుషులు ఈ సిమ్యులేటర్ వాడి చూడాలంటూ ప్రోత్సహించింది.

ఈ ప్రయోగాలపై రూపొందించిన ఎన్నో వీడియోలో టిక్‌టాక్‌లో వైరల్ అయ్యాయి.

పీరియడ్స్

ఫొటో సోర్స్, CUP OF LIFE

కుంబలంగి గ్రామంలో మహిళలకు మెనుస్ట్రువల్ కప్స్ పంపిణీ చేసినప్పుడే జిల్లా వ్యాప్తంగా సిమ్యులేటర్ ప్రయోగం చేపట్టాలనే ఆలోచన వచ్చినట్టు ఈడెన్ తెలిపారు. దాంతో, ఎర్నాకుళంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో మొట్టమొదటి శానిటరీ ప్యాడ్స్ విముక్త గ్రామం కుంబలంగి అని ఈ ఏడాది ప్రారంభంలో కేరళ గవర్నర్ ప్రకటించారు. అక్కడి మహిళలందరూ నెలసరి సమయంలో మెనుస్ట్రువల్ కప్స్ వాడుతున్నారని చెప్పారు.

కప్ ఆఫ్ లైఫ్ ప్రచారంలో భాగంగా లక్ష మెనుస్ట్రువల్ కప్స్‌ను పంపిణీ చేశారు. కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ బుధవారం ముగియనుంది.

దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, మంత్రులు, సంస్థలు ఈ ప్రచారం పట్ల ఆసక్తి చూపించారని, తమ తమ ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించేంకులు సలహాలు, సూచనలు అడిగారని డాక్టర్ మాన్యుయేల్ చెప్పారు. అయితే, అదంత సులభం కాదని ఆయన అన్నారు.

"ముందు, స్థానిక ప్రజలతో కలిసి పనిచేయాలి. వారికి ఈ అంశంలో అవగాహన పెంపొందించేందుకు మార్గాలను అన్వేషించాలి. ఆ తరువాతే ప్రచారం ప్రారంభించాలి" అన్నారు మాన్యుయేల్.

వీడియో క్యాప్షన్, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలకు అద్దం పడుతున్న సరస్వతి సప్కాలే జీవితం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)