40 ఏళ్ల కిందట భార్యను చంపి మృతదేహాన్ని మాయం చేసిన టీచర్ చివరికి ఎలా దొరికిపోయాడంటే..

ఫొటో సోర్స్, EPA
- రచయిత, టిఫానీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ
పాపులర్ పాడ్‌కాస్ట్‌లో ప్రసారమైన కథ కారణంగా ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ డాసన్ తన భార్యను హత్య చేసిన కేసులో దోషిగా తేలారు.
క్రిస్ డాసన్ భార్య లినెట్ 1982 నుంచి కనిపించలేదు. దీంతో ఆమె అదృశ్యంపై అనేక అనుమానాలు, ఊహాగానాలు ఉండేవి.
ఆమె మృతదేహమైనా ఎక్కడా ఎన్నడూ దొరకలేదు. ఆమె ఏమయ్యారు? ఎవరైనా చంపేశారా? చంపితే ఎవరు చంపారు? వంటివన్నీ చాలాకాలం పాటు జవాబు దొరకని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.
అయితే.. లినెట్ అదృశ్యంలో కేసులో 2018లో ఆమె భర్త క్రిస్ డాసన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ క్రైం పాడ్‌కాస్ట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తరువాత లినెట్ కేసులో ఆగిపోయిన దర్యాప్తును మళ్లీ ప్రారంభించి క్రిస్ డాసన్‌పై అభియోగాలు నమోదు చేశారు. సిడ్నీలోని కోర్టు ఈ కేసును విచారించింది.
అయితే, భార్యను చంపినట్లు తనపై వచ్చిన అభియోగాలను 74 ఏళ్ల డాసన్ ఖండించారు. తనను, తమ ఇద్దరు పిల్లలను వదిలి ఆమె వెళ్లిపోయారని.. ఓ మత బృందంలో చేరేందుకే ఆమె తమను వదిలి వెళ్లి ఉంటారని డాసన్ చెప్పుకొచ్చారు.
ఈ కేసులో మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఇయాన్ హారిసన్ తీర్పునిస్తూ.. క్రిస్ డాసన్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయని.. అవన్నీ ఆయన నేరస్థుడని నిర్ధరించేలా ఉన్నాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Supplied
బేబీ సిట్టర్‌పై మోజుతో భార్యను వదిలించుకోవాలని పన్నాగం..
తమ ఇంటికి వచ్చే బేబీ సిటర్ జేసీ(న్యాయపరమైన కారణాలతో అసలు పేరు మార్చాం)పై మోజు పడిన డాసన్ తన భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారని న్యాయమూర్తి జస్టిస్ ఇయాన్ హారిసన్ న్యూ సౌత్ వేల్స్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
భార్యను వదిలేయడానికి డాసన్ గతంలో చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడం.. దాంతో జేసీ కూడా డాసన్‌తో రిలేషన్‌షిప్‌కు ముగింపు పలకాలని అనుకోవడంతో డాసన్ అప్పటికి కొంతకాలంగా విపరీతమైన నిరాశకు గురయ్యారని న్యాయమూర్తి చెప్పారు.
'జేసీని కోల్పోతానేమో అనుకుని డాసన్ ఆందోళనకు, బాధకు గురయ్యారు. ఆ ఆలోచన ఆయన్ను నిరాశకు గురిచేసింది. చివరకు జేసీ కోసం తన భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నారు డాసన్' అని ఆయన కోర్టులో చెప్పారు.
డాసన్‌కు శిక్ష పడడంపై లినెట్ సోదరుడు గ్రెగ్ సిమ్స్ మాట్లాడుతూ.. తమ కుటుంబం చాలాకాలంగా ఏమని అనుకుంటోందో కోర్టు కూడా అదే తేల్చింది అన్నారు.
''ఆమె(లినెట్) తన కుటుంబాన్ని ఇష్టపడ్డారు. తనకు తానుగా ఆమె ఎన్నడూ ఆ కుటుంబాన్ని వీడి వెళ్లాలని అనుకోలేదు. ప్రేమించిన భర్త చేతిలో ఆమె మోసపోయారు'' అంటూ ఉద్వేగానికి లోనయ్యారు గ్రెగ్ సిమ్స్.
కనీసం ఇప్పటికైనా లినెట్ విషయంలో మంచిపని చేయాలని.. ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయాలని డాసన్‌ను ఆయన కోరారు.
సిడ్నీ కోర్టు డాసన్‌ను దోషిగా తేల్చినప్పటికీ ఇంకా ఆయనకు శిక్ష విధించే తేదీని ప్రకటించలేదు. మరోవైపు డాసన్ లాయర్ కూడా ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు చెప్పారు.

లినెట్ కుటుంబీకుల కన్నీళ్లు..
ఫిల్ మెర్సర్, బీబీసీ న్యూస్, ఎన్‌ఎస్‌డబ్ల్యూ సుప్రీంకోర్టు
ఈ కేసులో తీర్పు ఇవ్వడానికి ముందు న్యాయమూర్తులు చర్చించుకుంటున్న సమయంలో కోర్టుకు విరామం ఇచ్చినప్పుడు డాసన్ తన అన్న పీటర్, తన లాయర్‌తో కలిసి 13వ అంతస్తులోని లిఫ్ట్‌లోకి వచ్చారు. అప్పడాయన షాక్‌లో ఉన్నట్లు కనిపించారు.
కొదిగంటల్లో నేరస్తుడిగా తేలనున్న ఓ వ్యక్తికి నేను అత్యంత సమీపంలో నిల్చున్నాను అప్పుడు.
లినెట్ అదృశ్యమైన 40 ఏళ్ల తరువాత ఆ మిస్టరీ వీడింది.
న్యాయమూర్తి తీర్పు సమయంలో.... డాసన్ వాదనలు అసంబంద్ధం, అవాస్తవం అని చెప్పారు.
డాసన్‌ను దోషిగా తేల్చినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు నిట్టూర్చారు.. మరోవైపు లినెట్ బంధువులు మాత్రం మౌనంగా రోదిస్తూ అక్కడ కూర్చున్నారు.
తీర్పు తరువాత ఒకప్పటి ఆ ఉపాధ్యాయుడి(డాసన్) చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్లారు.
జర్నలిస్ట్ ఇన్వెస్టిగేట్ చేసి పాడ్‌కాస్ట్‌లో వినిపించడంతో..
'ది టీచర్స్ పెట్' అనే పాడ్‌కాస్ట్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ హెడ్లే థామస్ ఈ కథంతా చెప్పడంతో అది అంతర్జాతీయంగా అనేకమందిని ఆకర్షించింది.
ఆస్ట్రేలియా జర్నలిజంలోని అత్యున్నత పురస్కారాన్ని ఈ పాడ్‌కాస్ట్ సిరీస్ గెలుచుకుంది. అంతేకాదు... 6 కోట్ల సార్లు ఇది డౌన్‌లోడ్ అయింది.
కేసు విచారణలో ఈ పాడ్‌కాస్ట్, దాని ప్రభావం కీలకమయ్యాయి. తీర్పు సమయంలో న్యాయమూర్తి హారిసన్ దీన్ని విమర్శిస్తూ.. కొందరు సాక్షులను ఇది ప్రభావితం చేసిందని అన్నారు.
ఈ పాడ్‌కాస్ట్ వల్ల కలిగిన పబ్లిసిటీ కారణంగా కేసు విచారణ మొదట్లో ఆలస్యమైంది. ఈ పాడ్‌కాస్ట్ సిరీస్ కారణంగా విచారణ సరిగా జరగడం లేదంటూ విచారణను నిలిపేయించడానికి డాసన్ తరఫు లాయర్లు ప్రయత్నించారు.
మొదట ఈ కేసు జ్యూరీ ఎదుట కాకుండా ఏక సభ్య ధర్మాసనంలో విచారించారు.

పాడ్‌కాస్ట్‌లో ప్రసారమైన తరువాత విచారణ మళ్లీ మొదలు
1982 జనవరిలో అప్పటికి 33 ఏళ్ల వయసున్న లినెట్ సిడ్నీలోని తన ఇంటికి నుంచి బయటకు వెళ్లిన తరవాత కనిపించకుండాపోయారు. ఆమెకు ఇద్దరు పిల్లలు.
ఆ తరువాత ఆమెకు సంబంధించి ఎలంటి ఆచూకీ పోలీసులకు దొరకలేదు.
ఆమె అదృశ్యంపై జరిగిన రెండు వేర్వేరు విచారణల్లోనూ... ఆమె తనకు తెలిసినవారి చేతిలోనే హత్యకు గురైనట్లు తేలింది. కానీ, అభియోగాలు నమోదు చేయడానికి మాత్రం ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు చెబుతూ వచ్చారు.
పాడ్‌కాస్ట్‌లో ఈ కేసు ప్రసారమైన తరువాత విచారణ మళ్లీ మొదలైంది.
1982 జనవరిలో లినెట్ తనకు ఫోన్ చేసి తనకంటూ సమయం కావాలని చెప్పినట్లు డాసన్ చెబుతూ వచ్చారు.
ఆ తరువాత కూడా ఆమె నుంచి తనకు కాల్స్ వచ్చాయని డాసన్ చెప్పారు.
లినెట్ అదృశ్యమైనట్లుగా చెబుతున్న 1982 జనవరి తరువాత ఆమె తమకు కనిపించారంటూ అయిదుగురు వ్యక్తులు చెప్పినట్లు డాసన్ తరఫు లాయర్లు వాదించారు.
అయితే, లినెట్‌తో వివాహ బంధం నుంచి బయటపడాలని డాసన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఆయన ఆమెను హత్య చేశారని ప్రాసిక్యూటర్లు వాదించారు.
హత్య ప్లాన్ అమలు చేయడానికి ఒక దళారిని నియమించుకోవాలని ఆలోచించడం.. అలాగే జేసీతో కొత్త జీవితం ప్రారంభించేందుకు క్వీన్స్‌లాండ్ వెళ్లడం వంటి అంశాలను ప్రాసిక్యూటర్లు కోర్టు ముందు పెట్టారు.
మర్డర్ ప్లాన్ అమలుకు డాసన్ దళారీని నియమించుకున్నారని.. డాసన్ తన భార్యను శారీరకంగా వేధించారని ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలను న్యాయమూర్తి హారిసన్ తోసిపుచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
‘భర్త, పిల్లలు అంటే ఎంతో ఇష్టం’
అయితే... లినెట్ తన భర్త, పిల్లలను అమితంగా ఇష్టపడ్డారని.. ఆమెకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడే ఉన్నాయని న్యాయమూర్తి గుర్తించారు.
'లినెట్ నీలిరంగు కాంటాక్ట్ లెన్సులు కూడా డాసన్ ఇంట్లోనే ఉన్నాయి' అని జడ్జి చెప్పారు. అంతేకాదు.. లినెట్ కనిపించకుండాపోయిన తరువాత ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు ఎవరికీ ఆమె కాంటాక్ట్ కాలేదు.
అనేక ఇతర ఆధారాలను పరిశీలించిన తరువాత డాసన్ తన భార్య లినెట్‌ను చంపి ఆమె మృతదేహాన్ని మాయం చేశారని న్యాయమూర్తి తన తీర్పులో ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- మనీ లాండరింగ్ అంటే ఏంటి? అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధం ఎలా చేస్తారు?
- ఆలివ్ ఆయిల్: ‘గ్రీన్ గోల్డ్’గా భావించే ఈ నూనె ధర ఎందుకు విపరీతంగా పెరుగుతోంది?
- హార్దిక్ పాండ్యా స్టయిలే వేరు... జీవితాన్ని రాజాలా జీవించాలంటాడు
- ఆఫ్రికా చీతాలను తెచ్చి భారత్‌లో సింహాల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారా
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












