Shantanu Deshpande: కొత్త ఉద్యోగులు రోజుకు 18 గంటలు పనిచేయాలన్న సీఈవో - సోషల్ మీడియాలో విమర్శలు

ఫొటో సోర్స్, Getty Images
ఏదైనా ఉద్యోగంలో కొత్తగా చేరిన వారు తొలి నాలుగైదు ఏళ్లలో రోజుకు 18 గంటలు పని చేయాలని సూచించిన ఒక సీఈవో తీవ్రంగా విమర్శల పాలవుతున్నారు.
బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్‌పాండే ఈ సూచన చేశారు. ఫ్రెషర్లు పనినే దైవంగా భావించాలని, మిగతా వాటన్నింటిని పక్కనబెట్టాలని ఒక ఆన్‌లైన్ పోస్టులో దేశ్‌పాండే పేర్కొన్నారు.
దీంతో సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. తప్పుడు పని సంప్రదాయాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారంటూ యూజర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
భారత్‌లో బలమైన కార్మిక చట్టాలు ఉన్నాయి. కానీ, వాటిని కఠినంగా అమలు చేయడానికి అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అంటున్నారు.
2020లో ఈ తరహా వ్యాఖ్యలే చేసిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా విమర్శల పాలయ్యారు.
కరోనా లాక్‌డౌన్ కారణంగా మందగించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారతీయులంతా రెండు, మూడేళ్ల పాటు వారానికి కనీసం 64 గంటలు పనిచేయాలని నారాయణ మూర్తి సూచించారు.
భారత్‌లోని ప్రతి అయిదుగురు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో ఇద్దరు ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటున్నారని 2020లో విడుదలైన లింక్డ్‌ఇన్ వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ వెల్లడించింది.
శంతను దేశ్‌పాండే మంగళవారం లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ చేశారు. యువత, కెరీర్ తొలినాళ్లలోనే వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను కోరుకోవడాన్ని కాస్త తొందరపాటుగా చెప్పొచ్చు అని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.
భారత స్టార్టప్‌లలో భారీగా తొలగింపులు చేపట్టడం ఒక ఆనవాయితీగా మారిన ఈ సమయంలో.. మిస్టర్ దేశ్‌పాండే ఈ విషపూరిత వర్క్ కల్చర్‌ను సమర్థిస్తున్నారంటూ ఒక ట్విటర్ యూజర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎక్కువ గంటలు పనిచేసే ఉద్యోగులకు ''అదనపు వేతనం చెల్లించాలి'' అనే అంశాన్ని దేశ్‌పాండే అసలు ప్రస్తావించనే లేదని మరో యూజర్ గుర్తు చేశారు.
తన వ్యాఖ్యలపై ఎక్కువగా విమర్శలు రావడంతో దేశ్‌పాండే తన పోస్టుకు మరో సూచనను జోడించారు.
గత 18 గంటల్లో తనపై ఎంతో ద్వేషం కనబడిందని అన్నారు. తన కంపెనీలోని వర్క్ కల్చర్ గురించి ఆందోళన చెందేవారంతా కావాలంటే తన ఉద్యోగులతో మాట్లాడవచ్చని చెప్పారు.
సోషల్ మీడియాలో 'క్వైట్ క్విటింగ్' అనేది ట్రెండింగ్‌లో ఉన్న ఈ సమయంలో దేశ్‌పాండే ఎక్కువ గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించడంతో తీవ్రంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
క్వైట్ క్విటింగ్ అంటే అవసరం మేరకు మాత్రమే పని చేయడం. అదనపు పని చేయకపోవడం. పనిభారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులంతా క్వైట్ క్విటింగ్ బాట పట్టారు.
అమెరికా టిక్ టాక్ యూజర్ ఒకరు 'పని మాత్రమే మీ జీవితం కాదు' అని సూచిస్తూ ఒక వీడియోతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
- ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి, అసలేం జరిగింది?
- భారత్ ఉత్పత్తులపై నిషేధాన్ని పాకిస్తాన్ ఎత్తివేయక తప్పదా?
- మిఖాయిల్ గోర్బచెవ్: సోవియెట్ యూనియన్ చివరి అధినేత మృతి
- అమెరికా డ్రోన్లు పాకిస్తాన్ గగనతలం నుంచి అఫ్గానిస్తాన్‌లోకి ప్రవేశిస్తున్నాయా?
- గోర్బచెవ్ కథ ఎలా ముగిసింది, అమెరికాను సవాలు చేసిన అత్యంత శక్తిమంతమైన దేశం ఎలా పతనమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














