Gig economy: నిరుద్యోగం పెరుగుతున్న వేళ, జీవనోపాధికి భరోసా ఇస్తున్న ‘గిగ్ వర్క్’

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
భారతదేశంలో నిరుద్యోగిత తీవ్రమవుతున్న సమయంలో 'గిగ్ ఎకానమీ' అనే మాట తరచూ వినిపిస్తోంది. చదువుకున్నవారు ఉద్యోగాలు దొరక్క, సరైన ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్నారు.
ఆర్థిక అవసరాల కోసం కొన్ని రోజులు, లేదా రోజులో కొన్ని గంటల సమయం స్విగ్గీ, ర్యాపిడో, వోలా, జోమాటో, అమెజాన్ డెలివరి వర్క్స్, ఫుడ్ పాండా, ఉబర్ ఈట్స్ వంటి సర్వీసుల్లో పని చేస్తున్నారు. ఇలాంటి ఉపాధిని కల్పించే ఆర్థిక వ్యవస్థను గిగ్ ఎకానమీ అంటారు.
గిగ్ ఎకానమిలో పని చేసే వారిని 'గిగ్ వర్కర్స్' అని, చేసే పనిని 'గిగ్ వర్క్' అని అంటారు.
వీలున్నప్పుడు పని చేస్తూ తాత్కాలిక ఆదాయం సంపాదిస్తున్న గిగ్ వర్కర్స్ దేశవ్యాప్తంగా 2020-21 నాటికి 75 లక్షల మంది ఉన్నట్లు నీతి అయోగ్ జూన్ 2022లో విడుదల చేసిన 'India's Booming Gig and Platform Economy' అనే రిపోర్టులో తెలిపింది.

అవసరమైనప్పుడు తన ఆర్థిక అవసరాల కోసం బైక్ రైడ్స్ చేసే విశాఖపట్నానికి చెందిన ప్రసాద్ అనే బైక్ రైడర్ తో బీబీసీ మాట్లాడింది. ప్రసాద్‌తో మాట్లాడుతుంటే తన యాప్ లోవరుసగా రైడ్స్ బుక్ అవుతూనే ఉన్నాయి. ఒకటి, రెండు క్యాన్సిల్ కొట్టిన ప్రసాద్ ఆ తర్వాత యాప్ ని ఆఫ్ చేశారు. అప్పటికే మూడు గంటల నుంచి రైడ్స్ వేస్తున్న ఆయన, 305 రూపాయలు సంపాదించారు.
తాను గత విద్యాసంవత్సరం బీకాం పూర్తి చేసినట్టు ప్రసాద్ చెప్పారు. ఎంబీఏ చేయాలనుకొంటున్నానని, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదని చెప్పారు.
"రోజువారి ఖర్చుల కోసం బైక్ రైడర్ వంటి పనులు చేస్తూ ఇన్‌స్టంట్ మనీ సంపాదిస్తున్నాను. నేను డిగ్రీ సెకండియర్ నుంచి ఇలాంటి పని (గిగ్ వర్క్) చేస్తున్నాను. నేను నా ఫ్రీ టైమ్ లో రైడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాను. నాకు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో యాక్టర్ లేదా డైరెక్టరుగా స్థిరపడాలనే ఆలోచన. దానికి తగ్గ పనులు చేస్తూనే మిగిలిన టైమ్ లో రైడర్ గా పని చేస్తున్నాను.
మా నాన్నగారు ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. మా అమ్మ గృహిణి. డిగ్రీ చదువుతున్నప్పుడే ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ కోసం చూస్తుండేవాడిని. నా ఫ్రీ టైమ్ లో రైడ్స్ కి వెళ్లడం, వెంటనే ఆ డబ్బును కూడా పొందే అవకాశం ఉండటంతో రైడర్ గా జాయిన్ అయ్యాను.
ర్యాపిడోతో పాటు నేను స్విగ్గీ, జోమాట్ కూడా చేసేవాడిని. ఇవన్నీ కూడా ఒక ఫోన్, వెహికల్ ఉంటే అప్పటికప్పుడు డబ్బులు సంపాదించుకునేందుకు అవకాశమున్న పనులు. నాలాంటి వాళ్లకు ఇవి బాగుంటాయి. రోజువారీ టీ, టిఫిన్, పెట్రోలుకు కావలసిన డబ్బులను ఈ రైడ్స్ ద్వారా సంపాదించుకుంటున్నాను. నా ఫ్రీ టైమ్ లో ఆదాయం వస్తుండంతో నాకు కంఫర్ట్ గా ఉంది." అని ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

అనుకున్న ఉద్యోగం దొరకని వారికి, తనలాంటి వాళ్లకు ఇలాంటి ఉపాధి అవకాశాలు బాగున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
"రైడర్ గా రోజంతా పని చేస్తే పెట్రోలు ఖర్చులు పోనూ రూ.800 వరకు మిగులుతుంది. లేదు రెండు, మూడు గంటలు పని చేసినా మూడు వందల వరకు సంపాదించవచ్చు. అయితే మనం పని చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా రైడ్స్ రావడం ముఖ్యం. అన్నీ కరెక్ట్ గా జరిగితే రూ.1000 కూడా సంపాదించవచ్చు’’ అన్నారు ప్రసాద్.
‘‘రోజువారి అవసరాలకు అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే ఎవర్ని అడగలేక, డబ్బులు కావాలనుకున్నప్పుడు యాప్ అన్ చేసుకుని టార్గెట్ పెట్టుకుని నేను డబ్బులు సంపాదిస్తాను. దీనిపైనే జీవితాంతం ఆధారపడాలని అనుకోవడం లేదు. పైగా కాంపిటీషన్ బాగా పెరిగిపోయి, ఆదాయం కూడా పడిపోయింది. గతంలో ఒక రోజంతా పని చేస్తే రూ.1000 నుంచి రూ.1200 సంపాదించేవాడిని. ఇప్పుడు అదే రూ. 800కి పడిపోయింది. ఇదైతే నా కెరియర్ కాదు. ఇదో తాత్కాలిక ఆదాయ మార్గం మాత్రమే" అంటూ ప్రసాద్ యాప్ అన్ చేశారు. యాప్ ఆన్ చేశాక వచ్చిన రైడ్స్‌లో ఒకదానిని ఓకే చేసి, అవతలి వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడి, హెల్మెట్ పెట్టుకుని బయలుదేరారు.
గిగ్ ఎకానమీ నేడు దేశంలో ఉన్న నిరుద్యోగం తీవ్రతను, మారుతున్న యువత ఆలోచనలను, ప్రజావసరాలను సూచిస్తోందని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రసాదరావు చెప్పారు.
గిగ్ ఎకానమీ పెరుగుతున్న మాట నిజమని, అయితే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాలతో పోలిస్తే మిగతా ప్రాంతాల్లో గిగ్ వర్కర్ల సంఖ్య తక్కువ ఉంటుందని ఆయన అన్నారు. అంటే ఇది అందరికీ అందుబాటులో ఉన్న ఉపాధి మార్గం కాదని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'గిగ్ ఎకానమీ పెరుగుతోంది: నీతి ఆయోగ్'
దేశంలో గిగ్ ఎకానమీ పెరుగుతోందని నీతి ఆయోగ్ నివేదిక చెప్పింది. ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా పని చేసుకునే అవకాశముండటంతో గిగ్ ఎకానమీ అన్ని రంగాల్లో పెరుగుతోందని తెలిపింది.
"గిగ్ వర్కర్లు ప్రస్తుతం దేశంలోని వర్క్ ఫోర్సులో 1.5 శాతం మంది ఉన్నారు. ఇది వర్కర్లకు, సంస్థలకు, వినియోగదారులకు అందరికి ఉపయోగకరంగా ఉంది. ఇందులో తక్కువ వేతనాలు, వర్కర్స్ కి చట్టాలు పెద్దగా లేకపోవడం వంటి సమస్యలున్నాయి. వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది" అని నీతి ఆయోగ్ నివేదిక వ్యాఖ్యానించింది.
దేశంలోని అర్బన్ ప్రాంతాల్లో చేసిన సర్వే ప్రకారం గిగ్ వర్కర్లలో మహిళలు 16 నుంచి 23 శాతం వరకు ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది చదువు పూర్తైన వెంటనే, పెళ్లైన తర్వాత గిగ్ వర్కర్లుగా పని చేస్తున్నారని నీతి ఆయోగ్ రిపోర్టులో చెప్పింది.
నీతి ఆయోగ్ రిపోర్ట్ అంచనాల ప్రకారం 2029-30 నాటికి గిగ్ ఎకానమీ వర్కర్లు 2 కోట్ల 35 లక్షల మంది ఉంటారు. అంటే అది దేశంలోని వర్క్ ఫోర్స్ లో 4.1 శాతం.
ఇవి కూడా చదవండి:
- ఇండియాలో జరగాల్సిన అండర్-17 మహిళల వరల్డ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటు ఆగిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది, పరిష్కారం ఉందా ?
- ఇంటిపై జాతీయ జెండా ఎగరేశారా, మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఫ్లాగ్ కోడ్ ఏం చెబుతోంది
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- చీతా: ఇండియాలో 50 ఏళ్ల కిందట అంతరించిపోయిన మృగం మళ్లీ వస్తోంది
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
- ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్: పాతికేళ్ల యువకుడు సొంతంగా వాతావరణ సమాచారం ఎలా ఇస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













