‘ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్‌’ ఇంటర్వ్యూ: పాతికేళ్ల సాయిప్రణీత్ సొంతంగా వాతావరణ సమాచారం ఎలా ఇస్తున్నారు?

సాయిప్రణీత్

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

    • రచయిత, ఎన్.తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

‘‘బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఒడిశా రాష్ట్రం మీదుగా వెళుతుంది. దీంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫలానా, ఫలానా ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది.”

“మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతున్న వాయుగుండం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మరో రెండు గంటల్లో వాన పడనుంది. నంద్యాల, కడప, తిరుపతి, కాకినాడ జిల్లాల్లోని పలు భాగాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. జిల్లా మొత్తం వర్షాలుండవు కానీ ఒకటి రెండు చోట్ల వర్షం పడనుంది.”

ఇలాంటి వాతావరణ సమాచారం మీడియాలో వింటుంటాం. చదువుతుంటాం. ముఖ్యంగా వానా కాలంలో. ఈ సమాచారం చాలా వరకు ప్రభుత్వ యంత్రాంగం నుంచే వస్తుంటుంది. అయితే ఒక పాతికేళ్ల యువకుడు సొంతంగా వాతావరణ అంశాలను విశ్లేషించి, అంచనాలు కట్టి, సోషల్ మీడియాలో అందించి ఎంతో మందికి చేరువయ్యారు.

ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో వాతావరణ సమాచారం తెలుసుకొనే యూజర్లకు ‘ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్‌’‌గా సుపరిచితుడైన ఈ యువకుడి పేరు సాయిప్రణీత్. ఆయన ఊరు తిరుపతి. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన సాయిప్రణీత్, బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

ప్రజలకు ఉపయోగపడేలా వాతావరణ సమాచారం అందించడం తనకు ఎంతో ఇష్టమని ఆయన బీబీసీతో చెప్పారు. వాతావరణ అంచనాలను అందించడానికి తాను చాలా వెబ్‌సైట్లపై ఆధారపడతానని, అయితే చివరికి ఈ పని చాలా గొప్పగా అనిపిస్తుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఖాతాకు ట్విటర్‌లో 55 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఏపీ వెదర్‌మ్యాన్ ట్విటర్ ఖాతాను ఫాలో అవుతున్నారు.

సాయిప్రణీత్

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

బీబీసీ: వెదర్ అప్‌డేట్స్ అసలు ఎందుకు తెలుసుకోవాలనుకుంటారు?

సాయిప్రణీత్: ఇక్కడ భిన్న వర్గాల ప్రజలు ఉంటారు. తుపాను వస్తుందంటే రైతుల వ్యవసాయ పనులు ఆగిపోతాయి. కోతకు వచ్చిన పంట దెబ్బతినే అవకాశముంటుందని వెదర్ అప్‌డేట్ మనం తరచూ చూస్తూ ఉంటాం.

మరికొందరు పట్టణాల్లో ఉండే వాళ్లు.. ఉదాహరణకు విశాఖపట్నంలో విపరీతమైన వరద రావచ్చు.. లేకపోతే తుపాను రావచ్చు.. అంటే ప్రజలు ముందుగానే అప్రమత్తం అవుతారు. వచ్చే రెండు, మూడు రోజులకు ఇచ్చే ఈ అంచనాలతో విశాఖ వాసులు దానికి తగ్గట్టు అప్రమత్తమవుతారు. ఇప్పుడు గోదావరిలో వరదొచ్చింది.. దాని గురించి అప్‌డేట్ ఇచ్చాను. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మన గ్రామం ముంపుకు గురి అయ్యే అవకాశం ఉందా? అనేవి భిన్న వర్గాలకు అర్థమయ్యేలా వివరంగా చెప్తాను.

బీబీసీ: వెదర్ అప్‌డేట్స్ ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది?

సాయిప్రణీత్: నాలో ఒకరు స్ఫూర్తి నింపారు. ప్రదీప్ జాన్.. తమిళనాడు వెదర్ మ్యాన్. ఆయన గతంలో ఈ విధంగా అప్‌డేట్స్ ఇచ్చేవారు. అప్పుడు ఉన్న సామాజిక మధ్యమాలలో ఆయన స్పందించేవారు. ఆయనను గురువుగా తీసుకొని నేను కూడా మన ఆంధ్రప్రదేశ్‌కు ఇలాంటి అప్‌డేట్స్ చేద్దామని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అని పేరు పెట్టుకున్నాను.

సాయిప్రణీత్

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

బీబీసీ: వెదర్ అప్‌డేట్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు.?

సాయిప్రణీత్: గత రెండు, మూడేళ్ల నుంచి నుంచి అప్‌డేట్స్ ఇస్తున్నాను. దానికి ముందు బ్లాగింగ్స్ లాంటి ఫ్లాట్ ఫార్మ్స్‌లో చెన్నై వెదర్ బ్లాగర్స్, హైదరాబాద్ వెదర్ బ్లాగర్స్ లాంటి గ్రూపుల్లో ఉండేవాడిని. 2020 నుంచి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌కు ప్రత్యేకంగా అప్‌డేట్స్ ఇద్దామని సోషల్ మీడియాను ఎంచుకున్నాను. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచడానికి దీనికి చాలా రోజులు పట్టింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మొదట బేసిక్ వెదర్ అప్‌డేట్స్ లాంటివి ఇస్తూ వచ్చాను.

బీబీసీ: సమాచారాన్ని ఏయే భాషల్లో ఎలా పెడుతుంటారు?

సాయిప్రణీత్: రెండు విధాలుగా చేస్తున్నాను. ఒకటొచ్చి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఇంగ్లిష్‌లో పెడతాను. అది పట్టణాల్లో ఉండే వారికి ఉపయోగపడుతుంది. రైతులకు, సామాన్య ప్రజలకి ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో తెలుగులో పెడతాను. అది వీడియోలు కావచ్చు.. టైపు చేసి పెట్టడం కావచ్చు. తెలుగులో పెట్టడం వల్ల చదవడానికి తేలిగ్గా ఉంటుందని చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తుంటారు.

సాయిప్రణీత్

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

బీబీసీ: వెదర్ అప్‌డేట్స్ ఇవ్వడానికి మీరు చూసే వెబ్‌సైట్స్ ఏమిటి? మీరు చేసే కసరత్తు ఏమిటి?

సాయిప్రణీత్: వెదర్ అప్‌డేట్స్ ఇచ్చేందుకు నేను చాలా సైట్లపై ఆధారపడుతుంటాను. యూరోపియన్ సమస్త, భారత వాతావరణ శాఖ ఇచ్చే అప్‌డేట్స్, శాటిలైట్ ఇమేజెస్ చూసి అంచనాలు ఇస్తుంటాను. దీంతోపాటు న్యూమరికల్ వెదర్ మోడల్స్ కూడా చూస్తుంటాను. అన్నిటికంటే మించింది అనుభవ శక్తి. మనకు చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా ఉంటుందని తెలుసు. ఉదాహరణకు అన్ని డిఫరెంట్ మోడల్స్ కూడా మార్చి, ఏప్రిల్ నెలలలో అతి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తాయి అని చెబుతాయి. కానీ మార్చి, ఏప్రిల్ నెలలలో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడవు. ఆ విధంగా ఒక అనుభవం ఉంటుంది కాబట్టి వారు ఎలా చూపించినా నాకేం అనిపిస్తుందో అలాగే అప్‌డేట్స్ ఇస్తుంటాను. ఏ ఏరియాలో ఎంత వర్షం చూపిస్తుంది? అంటే నిజంగా వర్షం పడే అవకాశం ఉందా అనేదాన్ని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాను. దాన్నిబట్టే అప్‌డేట్స్ ఇస్తుంటాను. ఏ విధంగా ఉంది అనేదాన్ని బట్టి ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అనేది చెప్పొచ్చు. దాంతోపాటు అనుభవం కూడా చూసుకొని ఇస్తుంటాను.

బీబీసీ: అప్‌డేట్ ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది?

సాయిప్రణీత్: ఎంత సమయం పడుతుందనే దానికంటే ఎంత ఉపయోగపడుతుంది అనేది మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకు తుపాను వస్తుందంటే రోజు మొత్తం వాతావరణం మీదే ఫోకస్ ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్లు ఇస్తూ ఉండాలి. అక్కడక్కడ వర్షాలు లాంటి అప్‌డేట్స్ తీరిక సమయంలో పెట్టొచ్చు. ఈ విధంగా అవకాశాలు చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి కుటుంబంతో సమయం వెచ్చించాల్సి వస్తుంది. నాకు వ్యక్తిగత పనులు ఉంటాయి. బయటకు వెళ్లాల్సి వచ్చిన టైంలో వెదర్ అప్‌డేట్ ఇవ్వడం కష్టం అవుతుంది. ఒక ఫ్లో అనేది మెయింటైన్ చేస్తున్నాను. నెమ్మదిగానే ముందుకు వెళ్తున్నాను. తొందరేం లేకుండా చేస్తున్నాను.

సాయిప్రణీత్

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

బీబీసీ: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాలు గత ఐదేళ్లలో మెరుగుపడ్డాయా?

సాయిప్రణీత్: ఐఎండీ వారు కూడా అంచనాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. గత మూడు, నాలుగేళ్లతో పోల్చి చూస్తే, ఐఎండీ అంచనాలు కొంచెం మెరుగ్గానే ఉంటున్నాయి. అంచనాలతోపాటు సైక్లోన్ ట్రాకింగ్ కూడా ఐఎండీ అంచనాలకు దగ్గరగానే ఉంది.

బీబీసీ: అధికారిక యంత్రాంగం ఇవ్వలేనిది మీరు ఇవ్వగలరా? మీరు అంచనాలు చెప్పే విధానం ఎలా ఉంటుంది?

సాయిప్రణీత్: సైంటిఫిక్ టెక్నాలజీ వాడతాను. వెదర్ మోడల్స్ కానీ న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్ గాని లేకపోతే మార్పులు ఎలా ఉంటాయి అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే మోడల్స్ ఒక్కోటి ఒక్కోలా చెబుతాయి. అన్నిటికంటే అనుభవం ముఖ్యం. ఈ మోడల్ సాఫ్ట్‌వేర్ ఈ విధంగా చూపిస్తే కరెక్టా కాదా అని అవగాహన ఉంటే కానీ.. వెదర్ అప్‌డేట్స్ కరెక్ట్‌గా ఇవ్వలేం. రెండు, మూడేళ్లుగా వాతావరణ అంచనాలు ఇస్తున్నాం. నాకు ఏ విధంగా అనిపిస్తుందో అదే చెబుతాను. ఉదాహరణకి అన్ని మోడల్స్ వర్షం వస్తుందని చూపిస్తుంటాయి. కానీ నాకు మాత్రం వర్షం పడకపోవచ్చు ఏమో అనిపిస్తుంటుంది. అప్పుడు పరిస్థితులను జాగ్రత్తగా గమనించి అంచనాలు ఇస్తుంటాను.

బీబీసీ: వెదర్ అప్‌డేట్స్ ఇంతకంటే తేలిగ్గా తెలుసుకోగలిగే మార్గాలు ఏమైనా ఉన్నాయా.?

సాయిప్రణీత్: ఇప్పుడు వాతావరణ అంచనాలు యాప్‌లలో అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో కచ్చితత్వం లోపిస్తుంటుంది. యాప్స్‌కు తర్వాత అడుగుగా నేను స్టార్ట్ చేసిన పేజీని చెప్పుకోవచ్చు. సమాచారాన్ని ఒక వీడియో రూపంలో పెడితే, చాలా మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. కొంతమంది ఫేస్‌బుక్‌లోకి వెళ్లి లాగిన్ అయి వీడియోలు చూడరు. కానీ యూట్యూబ్‌లో మన మాతృభాషలో చెప్తే ప్రజలకు తేలిగ్గా అర్థమవుతుంది. ఈరోజు ఈ విధంగా ఉంది.. రేపు ఈ విధంగా మారచ్చు.. అనే అవగాహన వస్తుంది. దాన్నిబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారు తీసుకుంటారు.

సాయిప్రణీత్

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

బీబీసీ: మీ ఉద్యోగం, వెదర్ అప్‌డేట్స్ ఇవ్వడం.. ఈ రెండు పనులనూ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా?

సాయిప్రణీత్: ఉద్యోగంలో ఖాళీ సమయం అనేది ఉండదు. అయితే, నేను ఉదయం ఒక అప్‌డేట్ పెడతాను. వర్షం ఈ విధంగా ఉంటుంది.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు తప్పవు అని ఒక పోస్ట్ పెడతాను. కానీ మనకు మధ్యాహ్న సమయంలో లేదా సాయంత్రం సమయంలో ఆ పోస్ట్‌కు అదనపు సమాచారం కావాలి. ఎంతసేపు వర్షం పడుతుంది? ఏఏ టైంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది? అనేదానిపై ఆలోచించి, నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇంకొక పోస్టు పెడతాను.

బీబీసీ: “ఈ వెదర్ అప్‌డేట్స్ ఇవన్నీ మనకెందుకు.. చక్కగా ఉద్యోగం చేసుకోక” అని మీ కుటుంబ సభ్యులు అన్న సందర్భాలు ఉన్నాయా?

సాయిప్రణీత్: ప్రతి ఫ్యామిలీలో ఒక థాట్ ఉంటుంది. ఇంట్లో వారు ఉద్యోగం చేసుకోవచ్చు కదా? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అనేవాళ్లు. నేను మొదట్లో అప్‌డేట్స్ ఇచ్చేటప్పుడు తెల్లవారి మూడు, నాలుగు కూడా అయ్యేది. మరుసటి రోజు తొమ్మిది గంటలకు ఆఫీస్‌కి వెళ్లేవాడిని. ఆ టైంలో అమ్మ కూడా తిట్టేది. ఎందుకు ఇంత కష్టపడుతున్నావని. చెప్పాలంటే దీనిపై నాకు అమితమైన ప్రేమ. ఈ సమయంలో చేయాలి.. ఈ సమయంలో చేయకూడదు.. అనేదే ఉండదు. అలానే ఇంతకాలం పనిచేస్తూ వచ్చాను.

బీబీసీ: భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారా? ఐటీ ఉద్యోగంలోనే కొనసాగుతారా.?

సాయిప్రణీత్: ఎవరికైనా ఒకటే కామన్ గోల్.. హ్యాపీగా ఉండడం. ఉన్న వనరులతో సంతృప్తిగా జీవించడం అనేది ఎవరికైనా డ్రీమ్. జీవితం అలా ఉంటే చాలు. ఈ పేజీనీ ఇంకా అభివృద్ధి చేయాలి. మెరుగ్గా అప్‌డేట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను.

ఇక్కడ నిర్ణయం అనేది మన చేతుల్లో లేదు. ఒక అవకాశం అనేది వస్తే తప్పకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వెదర్ అప్‌డేట్స్ పేజీని ఉచితంగా అందుబాటులో ఉంచాలి. దీని నుంచి ఎలాంటి డబ్బులు ఆశించడం లేదు. ఎప్పుడైనా ఈ పేజీలో ఫ్రీగానే సమాచారం ఇస్తాను.

వీడియో క్యాప్షన్, ఏడడుగుల వరదలో అన్నీ కొట్టుకుపోయాయి.సమస్య ఏంటని అడిగేవారు లేరు

బీబీసీ: మీరు వెదర్ అప్‌డేట్ చెప్పేటప్పుడు అంచనాలు ఏమైనా తప్పాయా.?

సాయిప్రణీత్: వెదర్ అప్‌డేట్ అంటేనే ఒక ప్రాబబిలిటీ. ఇంత అవకాశం ఉందని చెబుతుంటాం. మొత్తంగా అంచనాలు ఇచ్చానంటే ఫలానా ప్రాంతంలో వర్షం పడుతుందని చెబుతాను. అంటే ఆ పరిధిలోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షం పడొచ్చు. కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడకుండా కూడా పోవచ్చు. ఆ విధంగా చిన్న చిన్న మైనస్‌లు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితులు అనేవి వేగంగా మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కొంత వైఫల్యాన్ని ఎదుర్కొంటుంటాం. కొంతమంది హేట్ కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు.

బీబీసీ: నెగటివ్ కామెంట్స్‌ను ఎలా తీసుకుంటారు?

సాయిప్రణీత్: ఎవరైనా నా గురించి నెగిటివ్‌గా వ్యాఖ్యలు చేస్తే, పట్టించుకోను. ఓకే అని వదిలేస్తాను. కానీ ఒక్కోసారి కొంతమంది బాగా రెచ్చగొట్టే విధంగా.. చెప్పేవన్నీ తప్పు అని అంటారు. అలాంటి వారితో, నాకు ఏ నొప్పి కలగనట్టు మాట్లాడుతుంటాను. అప్పుడు వారే అర్థం చేసుకుంటారు. లేకపోతే ఉన్న వాస్తవం చెబుతాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మీరు సరిగా అప్‌డేట్స్ ఇవ్వటం లేదు.. మా ఊర్లో సరిగా వర్షం పడలేదు అంటారు. అప్పుడు నేను కింద కామెంట్ పెడతాను. అక్కడక్కడ వర్షం పడుతుంది అన్నానే కానీ.. మీ ఊర్లో పలానా వీధిలో వర్షం పడుతుంది అని చెప్పలేదు అని అంటాను. కొందరు మొండిగా వుండే వారిని పట్టించుకోను. ప్రజలే దాని కింద ఒక 50 కామెంట్లు పెట్టి సమాధానం చెప్తారు.

బీబీసీ: సోషల్ మీడియాలో ఎవరైనా విసిగించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?

సాయిప్రణీత్: ఏదైనా ఒకటి ప్రారంభిస్తే మనకి వ్యతిరేకత అనేది తప్పకుండా వస్తుంది. ఒక్కొక్కసారి మనసు బాలేనప్పుడు బాధగా అనిపిస్తుంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుతుంటాను. ఒక్కోసారి ఈ రోజు అప్‌డేట్ ఎందుకు పెట్టామా అనిపిస్తుంది. చివరకు తిట్టే వారిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోతాను. అప్పుడే ఇలాంటివి ఎన్ని వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది.

వీడియో క్యాప్షన్, ఉప్పొంగిన గోదావరి.. ‘వందేళ్లలో ఎప్పుడూ చూడనంత వరద’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)