National Flag Code: ఇంటిపై జాతీయ జెండా ఎగరేశారా, మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఫ్లాగ్ కోడ్ ఏం చెబుతోంది

జెండా

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆగస్టు 13 నుంచి 15 లోపు మీరు కూడా మీ ఇంటిపై లేదా ఆఫీసులపై జెండాలు ఎగరేసి ఉంటారు. భారతదేశంలో ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం కొత్తేమీ కాదు. కానీ ఈ ఏడాది అందుకోసం ప్రత్యేక ప్రచారం జరగడం విశేషం.

75 ఏళ్ల స్వతంత్ర వార్షికోత్సవాలను పురస్కరించుకుని, ఆగస్టు 13-15 మధ్య ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఈ ప్రచారానికి 'హర్ ఘర్ తిరంగా' అని పేరు పెట్టారు. దీనిలో భాగంగా, 20-25 కోట్ల జెండాలను ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

భారతీయులకు జాతీయ జెండాతో వ్యక్తిగత సంబంధం కంటే ఎక్కువగా అధికారిక, సంస్థాగత సంబంధం ఉందన్నది ప్రభుత్వం వాదన. హర్ ఘర్ తిరంగా ప్రచారం తరువాత పౌరులకు త్రివర్ణ పతాకంతో అనుబంధం మరింత బలపడుతుందని, దేశభక్తి భావనను మరింత పెంపొందుతుందని భారత ప్రభుత్వం భావిస్తోంది.

దేశ ప్రజలు కూడా ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.

వీడియో క్యాప్షన్, భారత ప్రభుత్వ అధికారిక జాతీయ జెండాల తయారీ కేంద్రం ఇదొక్కటే..

ఎంతమంది జెండా ఎగరేశారు?

ఇది హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది. కొంతమంది ఇళ్లు, కార్యాలయాలపై జెండాలు ఎగురవేస్తే, డిజిటల్ జెండా వెనకాల పెట్టుకుని సెల్ఫీలు దిగి అప్‌లోడ్ చేసినవారు మరికొందరు.

కేంద్ర సాంస్కృతిక శాఖ డేటా ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు, 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో ఆరు కోట్ల మంది జెండాతో సెల్ఫీలు తీసుకుని అప్‌లోడ్ చేశారు.

అయితే, మంగళవారం ఉదయం వరకు ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలు, వాహనాలపై ఎంతమంది జెండా ఎగురవేశారనే లెక్కలను సాంస్కృతిక శాఖ అధికారులు సేకరించలేకపోయారు. కానీ, ఈ ప్రచారం జరిగిన తీరు, పౌరుల ఉత్సాహం చూస్తే వీటి సంఖ్య కూడా కోట్లలో ఉండవచ్చు. వ్యాపార వర్గాల డాటా కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోంది.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రకారం, ఆగస్టు 15 వేడుకలను పురస్కరించుకుని, ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా వ్యాపారులు వివిధ పరిమాణాలలో 30 కోట్ల జెండాలను విక్రయించారు. మొత్తంగా దాదాపు 500 కోట్ల వ్యాపారం జరిగింది.

ఇన్ని కోట్ల జెండాలను ఇప్పుడేం చేస్తారన్నది ప్రశ్న. వాటిని సురక్షితంగా ఉంచడం పెద్ద బాధ్యత. త్రివర్ణ పతాకం భారతీయుల గౌరవ పతాక. దాని గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడం ముఖ్యం.

ఇదే ప్రశ్నను ప్రజలు అడుగుతున్నారు. ఆగస్ట్ 15 తరువాత ఈ జెండాలను ఏం చేద్దామని అడుగుతున్నారు.

జెండా

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

జెండాలను సేకరించే పని

జెండాలను ఏం చేస్తారనే ప్రశ్నకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విటర్‌లో ఒక పోస్టర్‌ షేర్ చేస్తూ సమాధానం ఇచ్చారు.

"ఆగస్టు 15 తరువాత జెండాల పరిస్థితి ఏంటి? మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. లక్నోలోని లా మార్టినియర్ బాలికల కళాశాల దగ్గర పరిష్కారం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నగరాల్లోని నివాస ప్రాంతాలు, సంస్థలు, కార్యాలయాలు, రోడ్ల నుంచి జెండాలను సేకరిస్తున్నాం. మీకు కావాలంటే, మీరు ఉపయోగించిన జెండాలను పోస్ట్ ద్వారా పంపవచ్చు లేదా వాటిని కళాశాల గేట్ వద్ద డిపాజిట్ చేయవచ్చు. భారతదేశ ఫ్లాగ్ కోడ్ ప్రకారం, మేము వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తాం" అన్నది ఆ పోస్టరులోని సారాంశం.

లా మార్టినియర్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ ఆశ్రితా దాస్ బీబీసీతో మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా ప్రచారంతో ఈ విధంగా అనుసంధానం కావడం కళాశాల యాజమాన్యం నిర్ణయమని, ఇందులో రాష్ట్ర పాలనా యంత్రాంగం పాత్రేమీ లేదని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ కార్యక్రమం గురించి తాము స్థానిక కార్పొరేషన్ అధికారులకు తెలియజేశామని, దీని గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని కార్పొరేషన్ హామీ ఇచ్చిందని ఆమె తెలిపారు.

ఆగస్టు 15 సాయంత్రం పై పోస్టరును సోషల్ మీడియాలో షేర్ చేశారు.

"మొదట్లో పెద్దగా స్పందన రాలేదు. కానీ, మేము మున్సిపల్ కార్పొరేషన్, మా కాలేజీలో చదువుతున్న విద్యార్థులతో మాట్లాడాం" అని ఆశ్రితా దాస్ చెప్పారు.

లా మార్టినియర్ గర్ల్స్ కాలేజీ లాగ, ఇండియన్ ఆయిల్ ముంబై బ్రాంచ్ కూడా ఆగస్ట్ 16 నుంచి ఫ్లాగ్ కలెక్షన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ముంబైలో నివసించేవారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్‌కు వెళ్లి జెండాలను ఇచ్చి రావచ్చు.

ఇదే బాటలో, మై గ్రీన్ సొసైటీ అనే ఎన్జీవో కూడా జెండా సేకరణకు చొరవ తీసుకుంది.

ఇవన్నీ ప్రయివేటు స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు. అయితే, ప్రచార సమయంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి ఎలాంటి సమాచారం పంచుకోలేదు.

జెండా

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

జెండాను గౌరవించే నియమాలు ఏమిటి?

ఇలా జెండాలు సేకరించే వారి వద్దకే వెళ్లక్కర్లేదు. పౌరులు స్వయంగా జెండాను భద్రపరచవచ్చు.

'హర్ ఘర్ తిరంగా' ప్రచారంపై అనేక అపోహలు ఉన్నాయని ఇండియన్ ఫ్లాగ్ ఫౌండేషన్ సీఈవో అసీం కోహ్లీ అన్నారు.

"ఆగస్టు 13-15 మధ్య మాత్రమే జెండాలను ఎగురవేయాలనే అపోహ ఒకటి ఉంది. ఆ తరువాత జెండాలను దించేయమని కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పలేదు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారతదేశంలో 365 రోజులూ ఇళ్లు, కార్యాలయాలు లేదా బహిరంగ ప్రదేశాలలో జెండా ఎగరవేయడానికి పౌరులకు అనుమతి ఉంది. దీనికి సంబంధించి 2004లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. కాబట్టి ఆగస్టు 15 తరువాత కూడా జెండా ఎగురుతూ ఉండవచ్చు" అని అసీం కోహ్లీ వివరించారు.

జెండా

ఫొటో సోర్స్, EPA

అయితే, గాలి వల్ల జెండా చిరిగిపోయినా, మురికిగా మారినా ఫ్లాగ్ కోడ్ 2022 (ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా) ప్రకారం దాన్ని ధ్వంసం చేయొచ్చు.

2002లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను రూపొందించారు. 2021లో దీనిలో కొన్ని మార్పులు చేశారు.

ఫ్లాగ్ కోడ్ ప్రకారం, జెండా చిరిగిపోయినా లేదా మురికిగా మారినా దానిని ఏకాంతంలో ధ్వంసంచేయవచ్చు. దానిని కాల్చడం లేదా గౌరవప్రదంగా ధ్వంసం చేయవచ్చు.

అయితే, ఈ గౌరవప్రదమైన పద్ధతి ఏమిటో ఫ్లాగ్ కోడ్‌లో వివరంగా రాయలేదు. దీని గురించి అసీం కోహ్లీ కొంత వివరించారు.

"కొంతమందికి గౌరవప్రదమైన పద్ధతి ఖననం చేయడం కావచ్చు. మరికొందరికి గంగానదిలో విడిచిపెట్టడం కావచ్చు. కొందరికి కాల్చేయడం గౌరవప్రదమైన పద్ధతి కావచ్చు. వీటిల్లో మీరు ఏ పద్ధతినైనా ఉపయోగించవచ్చు. కానీ ఏకాంతంలో చేయాలి. వీడియో తీయకూడదు. ఎందుకంటే, తరువాత ఈ వీడియోను తప్పుగా వాడే అవకాశాలు ఉన్నాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం" అని ఆయన చెప్పారు.

"ఈ పనులన్నీ మీరు ఇంటి వద్దే చేయవచ్చు. జెండాలను సేకరించే వాళ్ల దగ్గరకు వెళ్లక్కర్లేదు" అని అసీం కోహ్లీ అన్నారు.

వీడియో క్యాప్షన్, తొలి ప్రధాని నెహ్రూ మొట్టమొదటి టీవీ ఇంటర్వ్యూ ఇదే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)