రాడ్‌క్లిఫ్: ఐదు వారాల్లో ఒక్క గీతతో భారత్, పాకిస్తాన్‌లను విభజించిన బ్రిటిష్ లాయర్

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య విభజన రేఖ గీసిన సిరిల్ రాడ్‌క్లిఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఐదు వారాలు.. భారత్, పాకిస్తాన్ మధ్య విభజన రేఖ గీయడానికి న్యాయవాది సిరిల్ రాడ్‌క్లిఫ్‌కు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సమయం ఇది.

రెండో ప్రపంచయుద్ధం చివర్లో 'బ్రిటిష్ ఇండియా'కు స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది బ్రిటన్. 'బ్రిటిష్ ఇండియా' నుంచి ముస్లింలు మెజారిటీగా ఉండే పాకిస్తాన్‌ అనే దేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. అలా 1947 అగస్టు 15న భారత్, పాకిస్తాన్ అవతరించాయి.

రెండు దేశాలను విభజించేందుకు బౌండరీ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ బౌండరీ మిషన్‌కు చైర్మన్‌గా సిరిల్ రాడిక్లిఫ్‌ను నియమించారు. స్వాత్రంత్య్రం ప్రకటించిన రెండు రోజుల తరువాత రెండు దేశాలకు చెందిన భౌగోళిక చిత్రాలను రాడ్‌క్లిఫ్ విడుదల చేశారు.

పంజాబ్ వైపు భారత్, పాకిస్తాన్ మధ్య విభజన గీతను 'రాడ్‌క్లిఫ్ లైన్' అనడానికి కారణం సిరిల్ రాడ్‌క్లిఫ్ 'బ్రిటిష్ ఇండియా'ను భౌగోళికంగా విభజించడమే.

1947 అగస్ట్ 7న దిల్లీ నుంచి పాకిస్తాన్ వెళ్లేందుకు రైలు ఎక్కుతున్న ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1947 అగస్టు 7న దిల్లీ నుంచి పాకిస్తాన్ వెళ్లేందుకు రైలు ఎక్కుతున్న ముస్లింలు

బ్రిటిష్ ఇండియా విడిపోతుందన్న విషయం తెలియగానే లక్షల మంది ఇళ్లు విడిచి పారిపోయారు. భారత్ నుంచి పాకిస్తాన్‌కు పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు ఎంతో మంది వలసలు పోయారు.

విభజన వల్ల చెలరేగిన హింసలో సుమారు 10 లక్షల మంది చనిపోయారు. నాడు దాదాపు 1.20 కోట్ల మంది రెండు దేశాల మధ్య సరిహద్దులు దాటి ఉంటారని అంచనా.

భారత్, పాకిస్తాన్ మధ్య సుమారు 2,900 కిలోమీటర్లు ఉండే రాడ్‌క్లిఫ్ లైన్ నేటికీ వివాదంగా ఉంది.

1947లో రెండు ప్రావిన్సులకు సంబంధించి వివాదం ఏర్పడింది. ఒకటి తూర్పులో ఉండే బెంగాల్, మరొకటి పశ్చిమాన ఉండే పంజాబ్. బెంగాల్లో ముస్లింలు, హిందువులు దాదాపు సమానంగా ఉంటే పంజాబ్‌లో ముస్లింలు, సిక్కులు సమానంగా ఉన్నారు.

ఈ రెండు ప్రావిన్సులను భారత్, పాకిస్తాన్ మధ్య సిరిల్ రాడ్‌క్లిఫ్ విభజించాల్సి వచ్చింది. ఈ విభజన వల్లే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

కశ్మీర్

హిమాలయాల్లో ఉండే అందమైన కశ్మీర్ చుట్టు కూడా వివాదం ముసురుకుంది.

ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం భారత్ లేదా పాకిస్తాన్‌లో చేరే స్వేచ్ఛను కశ్మీర్‌కు ఇచ్చారు.

నాటి కశ్మీర్ పాలకుడు హరి సింగ్, తొలుత కశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు. ఆ తరువాత పాకిస్తాన్ ఆదివాసీలు కశ్మీర్ మీదకు దండెత్తడంతో భారత్‌ సాయం చేసింది. దాంతో భారత్‌లో చేరుతున్నట్లు 1947 అక్టోబరులో హరి సింగ్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఐక్యరాజ్యసమితి సాయాన్ని కోరారు.

ఐక్యరాజ్యసమితి జోక్యంతో రెండు దేశాలు 1949లో కాల్పులు విరమించాయి. అప్పుడు కశ్మీర్ రెండుగా విడిపోయింది. కొంత పాకిస్తాన్‌ అధీనంలోకి వెళ్లగా, మరికొంత భారత్ అధీనంలోకి వచ్చింది.

1965లో మరొకసారి భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చింది. 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది.

నేటికీ ఈ రెండు దేశాల మధ్య కశ్మీర్ సమస్య అలాగే ఉంది.

1947 విభజనకు ముందు బ్రిటిష్ ఇండియా మ్యాప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1947 విభజనకు ముందు బ్రిటిష్ ఇండియా మ్యాప్

తొలి సారి బ్రిటిష్ ఇండియాకు రాక

'బౌండరీ కమిషన్'కు చైర్మన్ అయిన తరువాతే తొలిసారి రాడ్‌క్లిఫ్ బ్రిటిష్ ఇండియాకు వచ్చారు.

బ్రిటిష్ ఇండియాకు స్వాతంత్ర్యం ప్రకటించడానికి ఒక నెల ముందు మాత్రమే అంటే 1947 జులై 8న రాడ్‌క్లిఫ్ ఇక్కడికి చేరుకున్నారు.

బ్రిటిష్ ఇండియాలోని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక నిర్మాణం గురించి రాడ్‌క్లిఫ్‌కు అవగాహన లేదనేది విమర్శకుల మాట.

భౌగోళిక విభజన కోసం పైగా రాడ్‌క్లిఫ్‌కు ఇచ్చిన సమయం 5 వారాలు మాత్రమే. మరొకవైపు విభజన కోసం ఆయనకిచ్చిన మ్యాపులు పాతవి. జనాభా లెక్కలు కూడా సరైనవి అందుబాటులో లేవు.

ఇలా అరకొర సమాచారంతో అంతకు ముందు బ్రిటిష్ ఇండియాను ఎన్నడూ చూడని రాడ్‌క్లిఫ్ తనకున్న తక్కువ సమయంలోనే భౌగోళిక విభజన పూర్తి చేశారు.

ఈ విషయంలో ఇద్దరు ముస్లిం, ఇద్దరు హిందు జడ్జీలు రాడ్‌క్లిఫ్‌కు సలహాదారులుగా ఉన్నారు. కానీ ఆ సలహాదారులు తరచూ విభేదించుకుంటూ ఉండేవారు.

1912లో లాహోర్
ఫొటో క్యాప్షన్, 1912లో లాహోర్

లాహోర్ రహస్యం

పంజాబ్‌లో ఉండే లాహోర్‌ను పాకిస్తాన్‌కు ఇవ్వడం వెనుక ఒక కారణం ఉంది.

'స్కూప్, ఇన్‌సైడ్ స్టోరీస్ ఫ్రం ది పార్టీషియన్ టు ది ప్రెజెంట్' అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ ప్రస్తావించారు.

పాకిస్తాన్‌లో పెద్ద నగరాలు లేకపోవడం వల్ల లాహోర్‌ను ఆ దేశానికి ఇచ్చినట్లుగా రాడ్‌క్లిఫ్ రాసుకున్నట్లు ఆ పుస్తకంలో రాశారు.

నేడు పాకిస్తాన్‌లోని పెద్ద నగరాల్లో లాహోర్ ఒకటి.

తనకు అప్పగించిన పని అయిపోగానే భారత్ వదలి రాడ్‌క్లిఫ్ వెళ్లిపోయారు. వెళ్లే ముందు అనేక పత్రాలను కాల్చి వేశారు.

ఆ తరువాత ఆయన ఎన్నడూ భారత్ లేదా పాకిస్తాన్‌కు రాలేదు.

తన గురించి ఇటు భారత్‌లోనూ అటు పాకిస్తాన్‌లోనూ ప్రజలు ఏమనుకుంటారో ఆయనకు తెలుసు.

తన కోసం సుమారు 8 కోట్ల మంది వెతుకుతున్నారని, నన్ను కనిపెట్టే అవకాశం వారికి ఇవ్వదలచుకోవడం లేదని రాడ్‌క్లిఫ్ రాసుకున్నారు.

బ్రిటన్‌కు తిరిగి వచ్చిన రాడ్‌క్లిఫ్‌కు బ్రిటిష్ సామ్రాజ్యపు నైట్ ఆఫ్ ది ఆర్డర్ పురస్కారం దక్కింది.

అలాగే తాను చేసిన పనికి బ్రిటిష్ ప్రభుత్వం 3,000 పౌండ్లు ఇస్తానంటే ఆ డబ్బును రాడ్‌క్లిఫ్ తీసుకోలేదనే కథ ఒకటి ప్రచారంలో ఉంది.

1947లో అమృత్‌సర్‌లో చెలరేగిన అల్లర్లు

ఫొటో సోర్స్, Keystone Features

ఫొటో క్యాప్షన్, 1947లో అమృత్‌సర్‌లో చెలరేగిన అల్లర్లు

ఒకసారి రాడ్‌క్లిఫ్‌ను కులదీప్ నయ్యర్ ఇంటర్వ్యూ చేశారు.

భారత్, పాకిస్తాన్ మధ్య గీసిన విభజన రేఖతో మీరు సంతృప్తిగా ఉన్నారా? అని కులదీప్ నయ్యర్ ప్రశ్నించారు.

'మరొక మార్గం లేదు. నాకు వారిచ్చిన సమయం చాలా తక్కువ. అంతకంటే బాగా చేయడం సాధ్యం కాదు' అని రాడ్‌క్లిఫ్ సమాధానం ఇచ్చారు.

రెండు మూడు సంవత్సరాల సమయం ఇచ్చి ఉంటే తాను తప్పకుండా మెరుగైన రీతిలో విభజించే వాడినని ఆయన అన్నారు.

నాడు విభజన జరిగినప్పుడు సుమారు 10 లక్షల మంది చనిపోయారు.

75 ఏళ్ల తరువాత నేటికీ ఆ విభజన రేఖ 'రాడ్‌క్లిఫ్ లైన్', రెండు దేశాల మధ్య వివాదంగా కొనసాగుతోంది.

వీడియో క్యాప్షన్, చైనా సైన్యం టిబెట్ లోకి ప్రవేశించినప్పుడు నెహ్రూ ఏం చేశారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)