#IndiaAt75: భారతదేశంలో తయారైన మైకుకు ‘చికాగో రేడియో’ అని ఎందుకు పేరు పెట్టారు, గాంధీ దాన్ని ఎందుకు ఉపయోగించారు

1944: పూణె సభలో మాట్లాడుతున్న గాంధీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 1944: పూణె సభలో ‘చికాగో రేడియో’ ద్వారా మాట్లాడుతున్న గాంధీ
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1929

ఒక పెద్ద బహిరంగ సభ...అక్కడ ఉన్న భారీ జనసందోహాన్ని ఉద్దేశించి మహాత్మా గాంధీ మాట్లాడుతున్నారు. కానీ అక్కడి ప్రజల అరుపులు, కేకల మధ్య గాంధీ మాటలు వినపడటమే గగనంగా మారింది.

ఆయన మాటలు వినపడినా సరిగ్గా అర్థమయ్యేవి కావు. ఈ తీరుతో విసిగిపోయారు 27 ఏళ్ల నానిక్ మోట్వానే. 'బలహీనంగా ఉండే గాంధీ గొంతును ఎలాగైనా అందరికీ వినపడేలా చేయాలి' అని నాడు నానిక్ నిర్ణయించుకున్నారు.

మోట్వానే కుటుంబంలో నానిక్ రెండో తరం వ్యాపారవేత్త.

తాను ఎంతగానో అభిమానించే గాంధీ వాయిస్‌ను మరింత మందికి చేరువ చేయడానికి ఏదైనా చేయాలని ఆయన అనుకున్నారు. సుమారు రెండేళ్ల తరువాత, వాయిస్‌ వాల్యూమ్‌ను పెంచే ఒక పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్‌ను ఆయన రూపొందించారు.

కరాచీ (నేడు పాకిస్తాన్‌లో ఉంది)లోని కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ సిస్టంను తొలిసారి ఉపయోగించారు. ఆ సిస్టం పేరు చికాగో రేడియో.

గాంధీతో నానిక్ మోట్వానే

ఫొటో సోర్స్, Chicago Radio/Motwane

ఫొటో క్యాప్షన్, 1931: గాంధీతో నానిక్ మోట్వానే

చికాగో రేడియో సాయంతో మాట్లాడటానికి గాంధీకి నానిక్ మోట్వానే సాయం చేసేవారు. ఆ తరువాత రెండు దశబ్దాలలో బ్రిటిష్ ఇండియాలో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో లౌడ్ స్పీకర్‌ అంటే 'చికాగో రేడియో' అనే అంతగా గుర్తింపు వచ్చింది.

నాడు లౌడ్ స్పీకర్లను 'వాయిస్ ఆఫ్ ఇండియా'గా పిలిచే వాళ్లమని నానిక్ మోట్వానే కుమారుడు కిరణ్ అనేవారు.

1919లో మోట్వానే కుటుంబం బాంబేకు వలస వచ్చింది. బాంబేలో స్థాపించిన ఒక కంపెనీకి చికాగో రేడియో అనే పేరు ఉండటం కాస్త ఆసక్తి కలిగించే అంశం. 'అమెరికాలోని చికాగోకు చెందిన రేడియోలు తయారు చేసే ఒక కంపెనీ పేరును మా నాన్న తీసుకున్నారు. అందుకు ఆ కంపెనీ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు' అని కిరణ్ మోట్వానే తెలిపారు.

చికాగో రేడియో అని పేరు పెట్టడానికి మరొక కారణం కూడా ఉంది. ఇతర దేశాల కంపెనీలతోనే వ్యాపారం చేస్తున్న మోట్వానే కుటుంబానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం కూడా ఇలాంటి పేరు పెట్టారు.

పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్‌కు అవసరమైన లౌడ్ స్పీకర్లు, యాంప్లిఫయర్లు, మైక్రోఫోనులను బ్రిటన్, అమెరికాల నుంచి దిగుమతి చేసుకునే వారు నానిక్ మోట్వానే. ఆ తరువాత ఆయన కంపెనీలోని అయిదుగురుతో కూడిన ఇంజినీరింగ్ బృందం, వాటిని ఇక్కడి అవసరాలకు తగినట్లుగా మార్చేవారు.

1940: కాంగ్రెస్ సభలో నెహ్రూ

ఫొటో సోర్స్, Chicago Radio/Motwane

ఫొటో క్యాప్షన్, 1940: కాంగ్రెస్ సభలో నెహ్రూ

జాతీయ కాంగ్రెస్ బహిరంగ సమావేశాలు దూర ప్రాంతాల్లో జరుగుతున్నా సరే... రైలు, ట్రక్కుల్లో ప్రయాణిస్తూ పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్‌ను తీసుకొని వెళ్లేవారు నానిక్ మోట్వానే. కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు, పోలీసులు ఆయనకు సాయం చేసేవారు.

సమావేశానికి ఒక రోజు ముందు నానిక్ వేదిక వద్దకు చేరుకునేవారు. అక్కడ మైకు ఏర్పాటు చేసి, దాన్ని చెక్ చేసే వారు. తగినన్ని బ్యాటరీలు ఉండేలా చూసేవారు. ఆ తరువాత గ్రౌండ్‌లో అక్కడక్కడా వెదురు బొంగులు పాతి, వాటికి మైకులు కట్టేవారు. తద్వారా నాయకుల ప్రసంగాలు అందరికీ చేరేలా చూసేవారు.

ఒక మోస్తరు మైదానంలో సుమారు 12 మైకులు పెట్టేవారు. దాదాపు 10 వేల మంది ప్రజలకు అవి సరిపోయేవి. ఆ తరువాత వాయిస్ బేస్‌ను మరింత పెంచడం కోసం మైకులను ఒకదాని మీద మరొకటి పెట్టి బిగించడం ప్రారంభించారు. నాడు మోట్వానేకు దేశవ్యాప్తంగా సుమారు 100 పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్ ఉండేవి.

'భారత దేశంలో సమావేశాల్లో మైకులను ఉపయోగించే పద్ధతిని తీసుకొచ్చింది నానిక్ మోట్వానే. నాడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కస్టమర్‌గా ఉండేది' అని కిరణ్ మోట్వానే తెలిపారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ నాయకుల ప్రసంగాలన్నీ 'చికాగో రేడియో' లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు చేరేవి.

భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, చికాగో రేడియోకు అతి పెద్ద అభిమాని.

ఒకసారి సమావేశం తరువాత నానిక్ మోట్వానేకు నెహ్రూ ఇలా రాశారు.

'మీ లౌడ్ స్పీకర్లు అద్భుతంగా పని చేస్తున్నాయి. మీరు చేసిన ఏర్పాట్లు అభినందనీయం.'

కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న పటేల్

ఫొటో సోర్స్, Chicago Radio/Motwane

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న పటేల్

అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కోసం రహస్యంగా ఒక రేడియోను కూడా నానిక్ నడిపారు. నాడు ప్రభుత్వ రేడియో ద్వారా బ్రిటిష్ పాలకులు ప్రచారం చేసే అసత్యాలను కౌంటర్ చేయడానికి గాంధీ వంటి నాయకులు ఆ రహస్య రేడియోను ఉపయోగించుకునే వారు.

1942లో ఆ రహస్య రేడియో ప్రారంభం కాగా సుమారు రెండున్నర నెలల తరువాత దాన్ని ఆపేశారు. నానిక్ మోట్వానేను అరెస్టు చేశారు. 'క్విట్ ఇండియా' ఉద్యమానికి గాంధీ పిలుపునిచ్చింది కూడా ఆ సంవత్సరంలోనే.

నానిక్ మోట్వానే మంచి వ్యాపారవేత్త. తన ప్రోడక్ట్‌ను ఎలా సేల్ చేసుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి.

బహిరంగ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటప్పుడు పత్రికల వారు ఫొటోలు తీస్తుండే వారు. నాయకులు 'చికాగో రేడియో' మైకులతో మాట్లాడే ఫొటోలు కావాలని పత్రికల వారిని నానిక్ అడిగేవారు.

అలా ఫొటోలను, న్యూస్ పేపర్ క్లిప్పింగులను సేకరించి బహిరంగ సమావేశాల్లో ఆల్బమ్ రూపంలో ప్రచారం చేసేవారు.

టేప్ రికార్డర్‌ సహాయంతో నాయకుల ప్రసంగాలను రికార్డ్ చేసి, వాటిని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేవారు. నానిక్ వెంట ఎప్పుడూ ఒక ఫొటోగ్రాఫర్ ఉండేవారు. మూవీ కెమెరా, ఫిలిం వారి వద్ద సిద్ధంగా ఉండేది.

గాంధీ, నెహ్రూ, పటేల్, బోస్ వంటి నాయకుల వీడియోలను, ఫొటోలను వారు తీసేవారు. నాటి ఫొటోలు, ఫుటేజీ నేటికీ ముంబయిలోని మోట్వానే నివాసంలో కనిపిస్తాయి.

'సమావేశాలకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని ఆయన రికార్డ్ చేసేవారు' అని కిరణ్ మోట్వానే అన్నారు.

సుమారు 30 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత, బహిరంగ సమావేశాలకు మైకులను నానిక్ సరఫరా చేశారు.

నాడు రెండు నగరాల్లో 200 మంది ఉద్యోగులు పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్‌ను తయారు చేస్తూ ఉండేవారు. భారత స్వాతంత్ర్యం తరువాతనే 'చికాగో రేడియో' మైకులను నానిక్ అమ్మడం ప్రారంభించారు.

స్వాతంత్ర్య భారత్‌లోనూ 1960 వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకోలేదు. 'ఆ తరువాత డబ్బులు చెల్లించేందుకు నెహ్రూ అంగీకరించారు. ఒక్కో సమావేశానికి సుమారు రూ.6 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది' అని కిరణ్ మోట్వానే తెలిపారు.

సుభాష్ చంద్రబోస్

ఫొటో సోర్స్, chicago radio/motwane

ఫొటో క్యాప్షన్, ‘చికాగో రేడియో’ మైకు ద్వారా ప్రసంగిస్తున్న సుభాష్ చంద్రబోస్
1973లో సోవియట్ యూనియన్ నాయకుడు లియోనిడ్ బ్రేజ్‌నేవ్

ఫొటో సోర్స్, Chicago Radio/Motwane

ఫొటో క్యాప్షన్, 1973: దిల్లీలో ప్రసంగిస్తున్న సోవియట్ యూనియన్ నాయకుడు లియోనిడ్ బ్రేజ్‌నేవ్

ఆ తరువాత 1963లో దిల్లీలోని ఒక గ్రౌండ్‌లో 'చికాగో రేడియో' ద్వారా లతా మంగేష్కర్ 'ఆయే మేరే వతన్‌ కే లోగో' అనే పాటను పాడారు.

సోవియట్ యూనియన్ నాయకులు నికిటా కృశ్చేవ్, , లియోనిడ్ బ్రేజ్‌నేవ్, అమెరికా మాజీ అధ్యక్షుడు డ్వైట్ ఐసన్‌హోవర్ వంటి వారు భారత్‌కు వచ్చినప్పుడు 'చికాగో రేడియో' మైకుల ద్వారా ప్రసంగించారు.

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Chicago Radio/Motwane

ఫొటో క్యాప్షన్, ‘చికాగో రేడియో’ అనే పేరును మార్చాలంటూ ఇందిరా గాంధీ ఆదేశించారు

1970లలో ఇందిరా గాంధీ గెలిచిన తరువాత జరిగిన వేడుకల్లో దిల్లీలోని రాజ్ పథ్ వ్యాప్తంగా సుమారు 3 కిలోమీటర్ల మేర 120 లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు.

ఇందిరా గాంధీ ప్రధాని అయిన తరువాత 'చికాగో రేడియో' కంపెనీ పేరు మార్చాలంటూ ఆదేశించారు. 'మా బ్రాండ్ పేరు మార్చాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం మమ్మల్ని అడిగింది. ఎందుకు విదేశీ పేరు వాడుతున్నారంటూ వారు ప్రశ్నించారు. కానీ ఇలా ఎందుకు జరిగిందో మాకు తెలియలేదు. కానీ పేరు మార్చడానికి ఇష్టపడని మా నాన్న ప్రధానికి లేఖ రాశారు' అని కిరణ్ మోట్వానే అన్నారు.

సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగిన 'చికాగో రేడియో' నేటికీ కార్యకలాపాలు సాగిస్తోంది. కానీ ఇప్పుడు నాటి వైభవం లేదు. మైకులను, ఇంటర్‌కాం సిస్టమ్స్‌ను అది విక్రయిస్తోంది.

వీడియో క్యాప్షన్, కళ్ళు ఎందుకు అదురుతాయి? కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలివే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)