వేలంలో కొన్న సూట్‌కేసులు, ఇంటికి తెచ్చి చూస్తే అందులో మానవ అవశేషాలు

ఫొటో సోర్స్, Getty Images
వేలంలో కొనుక్కున్న ఓ స్టోర్ రూముల్లో ఉన్న సూట్ కేసుల్లో మానవ అవశేషాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటన న్యూజీలాండ్ లో జరిగింది.
దక్షిణ అక్లాండ్ కు చెందిన ఓ కుటుంబం గత గురువారం ఓ స్టోర్ రూమ్‌ను వేలంలో కొనుక్కుంది.
తాము కొనుగోలు చేసిన స్టోర్ రూమ్ ను ఓపెన్ చేసిన ఆ కుటుంబానికి అందులో అనేక వస్తువులతోపాటు సూట్ కేసులు కనిపించాయి.
వాటిని ఇంటికి తీసుకు వచ్చి తెరిచి చూడగా వాటిలో మానవ అవశేషాలు కనిపించాయి.
ఈ వ్యవహారంపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అవశేషాలు ఎవరివి అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
అయితే, ఈ కుటుంబానికి, ఈ హత్యలకు సంబంధం ఉండకపోవచ్చని అక్కడి పోలీసు అధికారులు భావిస్తున్నారు.
సూట్‌కేసుల్లో ఒకటి కంటే ఎక్కువమంది మనుషుల అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక స్టోరేజ్ యూనిట్ నుంచి ఈ కుటుంబం, ఒక ట్రాలీకి సరిపడా సామాన్లను వేలం ద్వారా కొనుక్కున్నారు. ఇలా కొన్న సరుకులు వీరు ట్రాలీలో ఇంటికి తెచ్చారు.
ఇంటికి తెచ్చినప్పుడే, వాటి నుంచి ఒకరకమైన వాసన వస్తోందంటూ స్థానికులు వారికి ఫిర్యాదు చేశారని స్థానిక మీడియా సంస్థ 'స్టఫ్' పేర్కొంది.

ఫొటో సోర్స్, @nzpolice
ఈ వాసన వచ్చిన వెంటనే నాకు అనుమానం వచ్చిందని స్థానిక స్మశాన వాటికలో పని చేసే ఓ వ్యక్తి వెల్లడించారు.
''ఈ వాసనను వెంటనే గుర్తు పట్టాను. అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్దమైంది'' అంటూ ఆయన ఆ ఇంటిని చూపిస్తూ వెల్లడించారు.
ఒక సూట్ కేసు ఇంట్లోకి తీసుకెళుతుండగా తన కొడుకు చూశాడని, తర్వాత దానిని ఫొరెన్సిక్ టెంట్ కిందకు చేర్చారని ఆ ఇంటికి పొరుగున ఉన్న మరో మహిళ వెల్లడించారు.
‘‘వాళ్లు తెలియక ఈ సామాను కొనుక్కున్నారు. ఇందులో వాళ్ల తప్పేమీ ఉండకపోవచ్చు. కానీ, ఇది చాలా భయానకమైన విషయం’’ అని ఆ కుటుంబం పొరుగున ఉండే మరో వ్యక్తి వ్యాఖ్యానించినట్లు ది గార్డియన్ పత్రిక పేర్కొంది.
‘‘ఈ తప్పు చేసిన వారెవరో ముందుకొచ్చి ఒప్పుకుంటే మంచిది’’అని ఆయన కోరారు.
ప్రస్తుతం ఈ సరుకులు తీసుకొచ్చిన వాహనాన్ని క్లెండన్ పార్క్‌లో ఆ కుటుంబ సభ్యులు నివసించే ఇంటికి దగ్గర్లో పార్క్ చేసి ఉంచారు.
దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారని 'స్టఫ్' మీడియా సంస్థ ఒక వీడియో ఫుటేజ్‌ను ప్రసారం చేసింది.
ఈ వీడియోలో ఆ ఇంటి చుట్టూ పోలీసులు, పీపీఈ కిట్లు ధరించి ఉన్న పోస్టుమార్టం సిబ్బంది ఉన్న దృశ్యాలు కనిపించాయి.
స్పెషల్ సెర్చ్ గ్రూప్ ఈ ఇంటి చుట్టూ టెంట్ వేసి, ఈ సామాన్లను తన ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేస్తోంది.
పోలీసుల సూచన మేరకు తాము మీడియాతో మాట్లాడలేమని ఆ కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
చనిపోయిన వారు ఎవరు అన్నది తెలుసుకోవడానికే మా ప్రాధాన్యత అని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత దీనికి కారకులెవరు అన్న విషయాలు తెలుస్తాయని వారు వెల్లడించారు.
సూట్ కేసుల్లో దొరికిన మానవ అవశేషాలకు పోస్ట్ మార్టం జరుగుతోందని, ఈ కేసు తీవ్రత దృష్ట్యా అనేక కోణాలలో దర్యాప్తు జరపాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
‘‘ఇప్పటికైతే ప్రజలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు’’ అని స్థానిక డిటెక్టివ్ ఫామినియా వాలువా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ వేదిక మీదనే ఆమెను అవమానించారు, 50 ఏళ్ల తర్వాత సారీ చెప్పారు
- పాకిస్తాన్ పాలిత కశ్మీర్లో హింసాత్మక నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










