పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో హింసాత్మక నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్నాయి.
పవర్ కట్‌లు, సర్‌చార్జీలపై నిరసన వ్యక్తంచేస్తూ ధర్నా చేపడదామని కశ్మీరీ జాతీయవాద పార్టీలు జులై 25న పిలుపునిచ్చాయి. అప్పటి నుంచి హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
విద్యుత్ బిల్లులలో కొన్ని పన్నులను అదనంగా కలిపి తమ దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారని, విద్యుత్ కోతలు కూడా పెరిగాయని నిరసనకారులు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో భారీగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, ఇక్కడి వారికి ఎలాంటి ప్రయోజనాలూ దక్కడం లేదని నిరసనకారులు అంటున్నారు.
ఈ నిరసనలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో.. హింసాత్మక పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఆ తర్వాత 20 మందిని అరెస్టు చేశారు.
ఆందోళనకారులను అరెస్టు చేయడంతో నిరసనలు మరింత హింసాత్మకంగా మారాయి. లాయర్లు, వ్యాపారులు, రవాణా సంఘాలు, ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నిరసనకారులకు మద్దతు ప్రకటించాయి.
అసలు కారణం ఏమిటి?
పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని ప్రజల భవిష్యత్‌పై ఆందోళనే ఈ నిరసనలకు మూలమనే విశ్లేషణలు వస్తున్నాయి.
పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు రాజ్యాంగానికి సవరణ చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలు కూడా వస్తున్నాయి.
2018లో ఆర్థిక, పరిపాలన అంశాల్లో ముజఫరాబాద్‌కు పాకిస్తాన్ స్వయంప్రతిపత్తి ఇచ్చింది. అంతకుమందు ‘‘ఆజాద్ జమ్మూకశ్మీర్ కౌన్సిల్’’ నియంత్రణలో ఈ ప్రాంతం ఉండేది. ఈ కౌన్సిల్‌కు పాకిస్తాన్ ప్రధాన మంత్రే అధిపతి. పన్నుల సేకరణ, పర్యటకం, సహజ వనరులు తరదితర విభాగాలపై పరిపాలనా ఆధిపత్యం ఈ కౌన్సిల్‌కు ఉండేది.
అయితే, 2018లో తీసుకొచ్చిన మార్పులను మళ్లీ వెనక్కి తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఇక్కడి కశ్మీరీలు భావిస్తున్నారు.
‘‘జమ్మూకశ్మీర్‌లో 2019లో భారత్ చేసినట్లే.. ఇక్కడ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తే, మేం సర్వం కోల్పోయినట్లే. మాకంటూ ఇక ఏమీ ఉండదు’’అని పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌కు చెందిన ఒక మహిళ వ్యాఖ్యానించారు.
ఆగస్టు 5, 2019న జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దుచేసింది. దీన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు.. జమ్మూ, కశ్మీర్; లద్దాఖ్‌గా విభజించింది.

ఎవరు ఏం అంటున్నారు?
తాజా నిరసనలపై పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌కు చెందిన మాజీ ప్రధాని ఫరూఖ్ హైదర్ స్పందించారు. ‘‘బహుశా భారత్, పాకిస్తాన్‌లు కలిసి తమ దగ్గర ఉన్న భూభాగాన్ని తమ వద్దే ఉంచుకొని, యథాతథ స్థితిని కొనసాగించాలని అనుకోవచ్చు. కాలక్రమేనా నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దుగా కూడా మారిపోవచ్చుని అనుకుంటున్నారు. కానీ, అలా ఎప్పటికీ జరగదు. మాకు ఇచ్చిన హక్కులను వెనక్కి తీసుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. మమ్మల్ని ఏదో ఒక ప్రావిన్స్‌లా మాత్రం చూడొద్దు’’అని వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్‌లో పాక్ పాలిత కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. స్థానిక ప్రభుత్వానికి నేతృత్వం వహించేవారిని ప్రధాన మంత్రిగా పిలుస్తారు. దేశంలోని పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లలో పాక్ పాలిత కశ్మీర్‌ను ఒకటిగా పరిగణించరు.
అయితే, ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజం లేదని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ప్రభుత్వం ఖండిస్తోంది. ప్రణాళిక, విద్యుత్, అభివృద్ధి శాఖల మంత్రి చౌధరి అబ్దుల్ మాట్లాడుతూ.. ‘‘విద్యుత్ సమస్యను పరిష్కరిస్తున్నాం. అరెస్టైన వారిని కూడా విడిచిపెడుతున్నాం’’అని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌కు సొంత జెండా, జాతీయ గీతం, అసెంబ్లీ, అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, హైకోర్టు ఉంటాయి. ఇక్కడ ఎన్నికల కమిషన్, పన్నుల వసూలు వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేస్తాయి. అయితే, రాజకీయంగా, పరిపాలన పరంగా ఇది పాకిస్తాన్‌తో అనుసంధానమై ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- రాజస్థాన్: ‘కుండలో నీళ్లు తాగినందుకు’ దళిత బాలుడిని కొట్టిన టీచర్.. 23 రోజుల తరువాత చనిపోయిన విద్యార్థి.. అసలు ఏం జరిగింది
- చైనా 'గూఢచారి' నౌక శ్రీలంక వెళుతోంది.. భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది?
- ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ వెబ్సైట్లను రెండు, మూడేళ్లుగా అప్డేట్ చేయడం లేదు ఎందుకు?
- ఇండియా@75: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి? - ఎడిటర్స్ కామెంట్
- సల్మాన్ రష్దీ: ఎన్టీఆరే ‘ది సాటానిక్ వెర్సెస్’లో ఫరిస్తా పాత్రకు స్ఫూర్తిగా నిలిచారా-బీబీసీ ఇంటర్వ్యూలో రష్దీ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













