పాకిస్తాన్‌లో చైనా పౌరులపై దాడుల వల్ల సీపెక్ ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయా?

సీపెక్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సహర్ బలోచ్
    • హోదా, బీబీసీ ఉర్దూ

వాయువ్య పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో చైనా పౌరులపై బలూచ్ మిలిటెంట్ల దాడుల అనంతరం చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్) పనులపై ప్రభావం పడుతోంది.

వరుస దాడుల అనంతరం చైనా పౌరులను తమ దేశంలోని సొంత ప్రాంతాలకు వెనక్కి పంపింస్తున్నట్లు సీపెక్ కోసం పనిచేస్తున్న ఓ అధికారి బీబీసీతో చెప్పారు. పాకిస్తాన్‌లో చేపడుతున్న ప్రాజెక్టుల సంఖ్యను కూడా చైనా తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు.

అయితే, చైనా పౌరులు వెనక్కి వెళ్లిపోతున్నారనే వార్తలను పాకిస్తాన్ కేంద్ర మంత్రి అహసాన్ ఇక్బాల్ ఖండించారు. తమకు అలాంటి సమాచారమేదీ లేదని చెప్పారు. అయితే, చైనా అధికారులు ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులపై పనిచేయాలని భావిస్తున్నట్లు వివరించారు.

‘‘నిఘా సంస్థలను ఇదివరకటి ప్రభుత్వాలు తమ రాజకీయ లక్ష్యాల కోసం ఉపయోగించుకున్నాయి. ఫలితంగా మిలిటెంట్ సంస్థలకు ఆజ్యం పోసినట్లు అయింది’’అని ఆయన వ్యాఖ్యానించారు. భద్రత విషయంలో చైనా నుంచి తమకు ఎలాంటి ఆందోళన లేదా నిరసన వ్యక్తం కాలేదని చెప్పారు.

పాకిస్తాన్‌లో పనిచేస్తున్న చైనా పౌరుల సంఖ్య తగ్గలేదని ఆయన నొక్కిచెప్పారు.

సీపెక్

ఫొటో సోర్స్, Getty Images

లైన్

చైనా పౌరులపై ఎన్నిసార్లు దాడులు జరిగాయి?

లైన్

ఏప్రిల్ 26, 2022: కరాచీ ఆత్మాహుతి దాడుల్లో ముగ్గురు చైనా పౌరుల మృతి

జులై 14, 2021: ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన బాంబు దాడిలో పది మంది చైనా పౌరులు మరణించారు. మరో 26 మంది చైనా పౌరులు గాయపడ్డారు

జులై 28, 2021: కరాచీలో చైనా పౌరులు ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిగాయి

మే 11, 2019: చైనా ప్రజలు నివాసముంటున్న గ్వాదర్‌లోని 5స్టార్ హోటల్‌పై దాడి

నవంబరు 23, 2018: చైనా దౌత్య కార్యాలయంపై దాడి, నలుగురి మృతి

ఆగస్టు 11, 2018: బలూచిస్తాన్‌లోని దాల్‌బందీన్‌లో ఆత్మాహుతి దాడి, ముగ్గురు చైనా ఇంజినీర్లకు గాయాలు

ఫిబ్రవరి 2018: కరాచీలో ఇద్దరు చైనా పౌరులపై కాల్పులు, ఒకరి మృతి

మే 2017: క్వెట్టాలో చైనా దంపతుల కిడ్నాప్, హత్య

జులై 2007: పెషావర్‌లో ముగ్గురు చైనా పౌరుల హత్య

లైన్
సీపెక్

సీపెక్‌పై ఎలా ప్రభావం పడుతోంది?

చైనా పౌరులపై వరుసగా జరుగుతున్న దాడులు సీపెక్ ప్రాజెక్టులపై మూడు విధాలుగా ప్రభావం చూపుతున్నాయని ఒక సీపెక్ ప్రతినిధి చెప్పారు. ఆయన తన వివరాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు.

మొదటగా చైనా ప్రజల్లో విపరీతమైన భయం నెలకొందని ఆయన చెప్పారు. ఇక్కడున్న చాలా మంది చైనా ప్రజలు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు.

రెండోది ఇక్కడకు వచ్చేందుకు చాలా మంది ప్రజలు సిద్ధపడటంలేదని అన్నారు. ఇక్కడ రెండో దశ పనులు మొదలు కావాల్సి ఉందని, కానీ, చాలా మంది కార్మికులు ఇక్కడకు రావడంలేదని చెప్పారు.

మూడోది ఇక్కడ ప్రజల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉన్నాయని, ఫలితంగా సకాలంలో పనులు పూర్తి చేయడం కుదరడంలేదని ఆయన తెలిపారు.

సీపెక్

ఫొటో సోర్స్, Getty Images

ఎన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి?

పాకిస్తాన్ ప్రభుత్వ వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. సీపెక్ కింద 21 ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో పది ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయి. మరో ఆరు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతావి పరిశీలనలో ఉన్నాయి.

ప్రస్తుతం నిర్మాణం లేదా పరిశీలన దశల్లో ఉన్న ప్రాజెక్టుల్లో జల, సౌర, పవన, థెర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి.

వీటిలో 70 శాతం నిధులను ఇప్పటికే ఖర్చు చేశారు. అయితే, పనులు మాత్రం అసంపూర్తిగా ఉన్నాయి.

మొత్తం ప్రాజెక్టులపై ఇటీవల పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. 49 బిలియన్ డాలర్ల (రూ.3,88,532 కోట్లు)ను ఇప్పటివరకు సీపెక్ ప్రాజెక్టులపై వెచ్చించినట్లు దీనిలో పేర్కొంది.

ఇదివరకు చాలాసార్లు ఈ మొత్తాన్ని 62 బిలియన్ డాలర్లు (రూ.4,91,612 కోట్లు)గా ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులను తగ్గించడంతో ఇది 49 బిలియన్ డాలర్ల (రూ.3,88,532 కోట్లు)గా మారినట్లు వెల్లడించింది.

సీపెక్

ఫొటో సోర్స్, Getty Images

‘‘గత మూడేళ్లలో ఒక సీపెక్ ప్రాజెక్టూ ప్రారంభం కాలేదు’’

ఇటీవల పాకిస్తాన్ బడ్జెట్‌ గురించి మాట్లాడేటప్పుడు 14 అంశాలను ఇక్కడి కేంద్ర ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావించింది.

సీపెక్ కింద కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెట్టడం కూడా ఆ 14 అంశాల్లో ఒకటి. సీపెక్ ప్రాజెక్టులకు మరిన్ని నిధులు విడుదల చేస్తామని, పనులు కూడా వేగంగా జరిగేలా చూస్తామని ప్రభుత్వం నొక్కి చెప్పింది.

అయితే, ఈ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారి బీబీసీతో భిన్నంగా స్పందించారు. ‘‘ప్రస్తుతం మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే తాము కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తామని చైనా అధికారులు మాకు తెగేసి చెప్పారు’’అని ఆయన వివరించారు.

‘‘గత మూడేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మొదలుకాలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎలాంటి నిధులనూ విడుదల చేయలేదు’’అని ఆయన చెప్పారు.

సీపెక్

ఫొటో సోర్స్, Getty Images

అధికారులు ఏమంటున్నారు?

ఇటీవల కాలంలో చైనా పౌరులపై వరుస దాడుల నడుమ చైనా అధికారులు కూడా ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నట్లు ఆ కేంద్ర ప్రభుత్వ అధికారి చెప్పారు.

గత ఏప్రిల్‌లో కరాచీ యూనివర్సిటీలోని చైనీస్ ఇన్‌స్టిట్యూట్‌పై దాడితో చైనా పౌరుల ఆందోళన మరింత ఎక్కువైందని ఆయన వివరించారు.

‘‘ఈ దాడుల వల్ల సీపెక్ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కొంతమంది ఇంజినీర్లు, నిపుణులను చైనాకు తరలించారు. కొంతమంది చైనా అధికారులు ఇస్లామాబాద్‌కు మాత్రమే పరిమితం అయ్యారు’’అని ఆయన పేర్కొన్నారు.

‘‘భద్రత విషయంలో చైనా పౌరులు చాలా ఆందోళనతో ఉన్నారు. ప్రతి విషయంలోనూ వారికివారే హద్దులు పెట్టుకుంటున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు’’అని అన్నారు.

‘‘తమకు భద్రత కల్పించే విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. అయితే, వారి డిమాండ్లపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు’’అని ఆయన చెప్పారు.

మరో సీపెక్ అధికారి మాట్లాడుతూ.. ‘‘భద్రతకు సంబంధించి పాకిస్తాన్, చైనా అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఎందుకంటే ఇక్కడి చైనా ప్రజలు వెనక్కి వెళ్లిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదు’’అని అన్నారు.

‘‘చాలా మంది ప్రజలు వెనక్కి వెళ్లిపోయారనేది నిజం. ఆ విషయం ప్రాజెక్టుల దగ్గర స్పష్టంగా కనిపిస్తోంది. అశించిన స్థాయిలో ఆ ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు’’అని ఆయన తెలిపారు.

అయితే, బలూచ్ మిలిటెంట్ల దాడుల వల్ల సీపెక్ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం లేదని గ్వాదర్‌ ఎంపీ అసలమ్ భూతానీ అన్నారు.

‘‘ఇప్పటివరకు ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్.. గ్వాదర్‌లో రెండుసార్లు పర్యటించారు. సీపెక్ ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడే చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తవుతాయి’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, కరాచీలోని కోరంగి ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు

ప్రభుత్వం ఏమంటోంది?

పాకిస్తాన్‌లోని ప్రస్తుత ముస్లిం లీగ్ (నవాజ్) ఈ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఎందుకంటే ఈ ప్రభుత్వ హయాంలోనే 2013లో సీపెక్ పనులు మొదలయ్యాయి.

చైనా పౌరులపై దాడుల గురించి మే 6న కేంద్ర మంత్రి అహసన్ ఇక్బాల్ మాట్లాడారు. ‘‘ఈ ప్రాజెక్టులకు సంబంధించిన భద్రతా అంశాలపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జేసీసీ)లో చర్చలు జరగాలి. కానీ గత నాలుగేళ్లలో అలాంటి చర్చలే జరగలేదు. గత ప్రభుత్వం దీన్ని అసలు పట్టించుకోలేదు’’అని ఆయన అన్నారు.

కరాచీ దాడి తర్వాత చైనా పౌరులకు పటిష్ఠమైన భద్రత కల్పిస్తున్నట్లు ఇక్బాల్ చెప్పారు. మరోవైపు బలూచ్ యువతతోనూ తరచూ తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, చాయ్ తాగడం తగ్గిస్తే ఆర్థికవ్యవస్థ మెరుగుపడొచ్చన్న పాకిస్తాన్ మంత్రి

కట్టుదిట్టమైన భద్రత

కరాచీ యూనివర్సీటీలోని చైనీస్ ఇన్‌స్టిట్యూట్‌పై దాడి అనంతరం, పంజాబ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

‘‘ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేయడమంటే అందరినీ అనుమానించడం కాదు. అదే సమయంలో అనుమానం వచ్చిన చోట తనిఖీలు చేపట్టాలి. విద్యార్థులు, టీచర్ల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి’’అని పంజాబ్ యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కల్నల్ ఉబైద్ చెప్పారు.

మరోవైపు సీపెక్ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

‘‘చైనా ప్రజలు ఇక్కడే ఉండాలని మేమేమీ ఒత్తిడి చేయడం లేదు. అదే సమయంలో వారికి పటిష్ఠమైన భద్రత కల్పిస్తున్నాం. దీంతో వారు ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు. పాకిస్తాన్‌తోపాటు చాలా దేశాల్లో చైనా ఇలాంటి ప్రాజెక్టులు చేపడుతోంది. పాక్‌లో వారు ఎక్కడికైనా వెళ్లొచ్చు. అవసరమైతే ఇక్కడ సిబ్బంది సంఖ్యను తగ్గించుకునే హక్కు కూడా వారికి ఉంది. అదే సమయంలో అవసరమైతే సిబ్బందిని పెంచుకోవచ్చు కూడా’’అని ప్రభుత్వ అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)